metpally
-
గురుకుల పాఠశాలలో పాముకాటుకు గురైన మరో విద్యార్థి
-
Sagubadi: మనసుపెట్టి ఇష్టంగా.. ఏడాదికి మూడు పంటలు!
భూతల్లి కన్న తల్లితో సమానమని భావించే ఈ రైతు దంపతులు తమ సొంత భూమిలో మనసుపెట్టి ఇష్టంగా వ్యవసాయం చేస్తూ ఏడాదికి మూడు పంటలు పండిస్తున్నారు. దీంతో వీరి పొలాలు ప్రదర్శన క్షేత్రాలుగా మారిపోయాయి. పశువులు, గొర్రెలు, కోళ్ల ఎరువులు, జీవామృతంతో పంటలు పండిస్తున్నారు. మంచి దిగుబడులతో పాటు చక్కని ఆదాయం పొందుతున్నారు. మిట్టపెల్లి రాజేష్ రెడ్డి, భారతి ఆదర్శ రైతు దంపతులు. చదివించి పదో తరగతే అయినా తమ 12 ఎకరాల భూమిలో మనసుపెట్టి సేంద్రియ వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఇంటికి అవసరమైన అన్నింటినీ సేంద్రియంగా పండించుకొని తింటూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వీరిది జగిత్యాల జిల్లాలో మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామం. 3 కి.మీ.ల పైపులైను.. ఆ రైతు దంపతులకు వ్యవసాయం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు పంచప్రాణాలు! వీరికి పన్నెండు ఎకరాల భూమి ఉంది. బావులే ఆధారం. 3 కి.మీ. దూరంలో వున్న ఎస్సారెస్పీ వరద కాల్వ నుంచి పైపులైన్లు వేసుకొని డ్రిప్‌తో సాగు చేస్తున్నారు. 20 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నప్పటికీ దిగుబడులు అంతంతే కాని, ఖర్చులు మాత్రం పెరిగాయి. ఇష్టారీతిన రసాయన ఎరువులు వేయడంతో ప్రతి పంటలో పురుగులు, తెగుళ్ల బెడద ఎక్కువై, వాటికి రసాయన మందులు పిచికారీ చేసేందుకు వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కుటుంబ అదాయం పిల్లల చదువుకు కూడా సరిపోయేది కాదు. ఈ నేపథ్యంలో పాలేకర్ పద్ధతిలో తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయవచ్చని తెలసుకొని సాగు పద్ధతిని మార్చుకున్నారు. ఈ దంపతులు ప్రతి ఏడాదీ మూడు పంటలు పండిస్తున్నారు. మేలో తప్ప మిగతా 11 నెలలూ వీరి పొలాల్లో పంటలతో ఉంటాయి. వర్షాలతో సంబంధం లేకుండా, వ్యవసాయ భావుల్లో ఉన్న కొద్దిపాటి నీటితోనే, జూన్ రెండో వారంలోనే విత్తనాలు వేస్తుంటారు. వానాకాలం సీజన్లో ఆరు ఎకరాల్లో సన్న రకం వరి, రెండెకరాల్లో పసుపు, మూడెకరాల్లో మొక్కజొన్న, ఒక ఎకరంలో మిర్చి పంట సాగు చేశారు. యాసంగి సీజన్లో ఆరెకరాల్లో లావు రకం వరి, ఎకరంలో జొన్న, 3 ఎకరాల్లో మొక్కజొన్న, రెండెకరాల్లో నువ్వు సాగు చేస్తున్నారు. ఖర్చు తగ్గించే సాగు పద్ధతులతో మేలు! మా భూమిలో రకరకాల పంటలు పండించి, ఆ పంటల్లో అధిక దిగుబడులు తీసినప్పుడు మాకు కష్టం గుర్తుకురాదు. ప్రధానంగా భూతల్లిని కాపాడేందుకు రసాయనాలను పూర్తిగా తగ్గించి, పశువులు, కోళ్లు, గొర్రెల ఎరువు వాడుతున్నాం. వ్యవసాయంతో చాలా మంది ఇబ్బందిగా ఫీలవుతుంటే, మేం మాత్రం ఇష్టంగా చేస్తున్నాం.. సంతృప్తిని, ఆదాయాన్ని పొందుతున్నాం. ప్రతి రైతు ఖర్చు తగ్గించే పద్ధతులపై దృష్టి పెట్టాలి. మేం అలాగే చేస్తున్నాం. మా పద్ధతిలోకి రావాలని తోటి రైతులను ప్రోత్సహిస్తున్నాం. – మిట్టపెల్లి భారతి, రాజేష్ రెడ్డి (9618809924, 9618111367) వెద వరి.. 30 క్వింటాళ్ల దిగుబడి వరి సాగు చేయబోయే పొలంలో జూన్‌లో మొక్కజొన్న సాగు చేసి, కంకులు కోసిన తర్వాత మొక్కజొన్న మొక్కలను రోటోవేటర్‌తో పొలంలో కలియ దున్నేస్తారు. ఆ తర్వాత, వరి నారు పోసి, నాటు వేసే బదులు, నేరుగా వెదజల్లి ఎకరానికి 30 క్వింటాళ్లకు పైగా దిగుబడి సాధిస్తున్నారు. అలాగే, పసుపు, మొక్కజొన్న సాగు చేసే భూమిలో రెండు లారీల గొర్రెల ఎరువు, ఒక లారీ మాగిన కోళ్ల ఎరువు వేసి భూసారం పెంచుకుంటూ ఉంటారు. పంటకాలంలో ప్రతి పంటకు జీవామృతాన్ని మూడు సార్లు ఇస్తున్నారు. నాలుగు ఆవులు, మూడు గేదేలను పెంచుతున్నారు. సగటున ఎకరానికి సజ్జలు 12–15, పసుపు 30, మొక్కజొన్నలు 40–45, నువ్వులు 4–6 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. భారతి, రాజేష్ రెడ్డి దంపతులు తెల్లవారుఝామున 3 గంటలకే వీరి దిన చర్య ప్రారంభం అవుతుంది. ఆవులు, గేదేల నుంచి పాలు పిండి 30 మందికి పాలు పోస్తారు. ఇంట్లో వంట పనులు పూర్తి చేసుకొని ఇద్దరూ తెల్లారేసరికే పొలంలో అడుగుపెడతారు. సా. ఆరు గంటలైతే కానీ ఇంటికి రారు. ఏ ఫంక్షన్‌కు వెళ్లినా సాయంత్రం ఇంటికి రావాల్సిందే! విలువ జోడించే అమ్ముతారు భారతి, రాజేష్ రెడ్డి దంపతులు తాము పండించిన పంటలను విలువ జోడించి అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్నారు. సన్న వరి ధాన్యాన్ని మర ఆడించి బియ్యం క్వింటాకు రూ. 6,500కు విక్రయిస్తున్నారు. మిరపకాయలను ఎండబెట్టి కారం పొడిని కిలో రూ. 280కి వినియోగదారులకు అమ్ముతున్నారు. సజ్జలను బై బ్యాక్ పద్ధతిలో కంపెనీలకు క్వింటా రూ.7 వేలకు, పసుపును క్వింటా రూ.11 వేలకు, మొక్కజొన్నను క్వింటా రూ.2,100కు నువ్వులను క్వింటా రూ.14 వేల చొప్పున విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. తమ పిల్లలిద్దరినీ హైద్రాబాద్‌లో ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. ఫార్మ్ అండ్ రూరల్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌లో పూర్వ ఉపకులపతి దివంగత జె. రఘోత్తమరెడ్డి స్మాకరకోపన్యాస సభలో భారతి ఉత్తమ సేంద్రియ రైతు పురస్కారాన్ని అందుకోవటం విశేషం. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ -
తండ్రి దహన సంస్కారాలు..అడ్డుకున్న కొడుకు అప్పులోళ్లు
సాక్షి,జగిత్యాల జిల్లా: కొడుకు అప్పుకట్టలేదని తండ్రి దహన సంస్కారాన్ని అప్పులోళ్లు అడ్డుకున్నారు. ఈ ఘటన మెట్ పల్లి పట్టణంలోని చైతన్య నగర్లో జరిగింది. కొంతకాలం నుంచి పలువురి వద్ద 1 కోటి 70 లక్షల రూపాయల దాకా పుల్లూరి శ్రీకాంత్ అనే వ్యక్తి అప్పు చేశాడు. అప్పు చెల్లించలేక శ్రీకాంత్ హైదరాబాద్ పారిపోయాడు. శ్రీకాంత్ తండ్రి పుల్లూరి నారాయణ శనివారం మృతి చెందాడు. అయితే తండ్రి దహన సంస్కారాల కోసం శ్రీకాంత్ తన స్వస్థలం మెట్‌పల్లికి ఆదివారం వచ్చాడు. విషయం తెలుసుకున్న శ్రీకాంత్ అప్పులోళ్లు దహన సంస్కారాలు జరిగే చోటికి వచ్చారు. అప్పు తీర్చేవరకు తండ్రి శవానికి దహన సంస్కారాలు జరగనివ్వబోమని అడ్డుకున్నారు. దీంతో దహన కార్యక్రమం గంట పాటు నిలిచిపోయింది. చివరకు ఆస్తి అమ్మి అప్పులు చెల్లిస్తానని శ్రీకాంత్ హామీ ఇవ్వడంతో అప్పుల వాళ్లు వెనుదిరిగారు. తర్వాత తండ్రి నారాయణ దహన సంస్కారాలు జరిగాయి. ఇదీచదవండి..గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా -
మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: మెట్పల్లి(ప్రస్తుత కోరుట్ల నియోజకవర్గం) మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన.. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. కొమిరెడ్డి రాములు 2004-2009లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ అనుబంధ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగారు. కాగా మెట్పల్లి నియోజకవర్గం ఆ తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కోరుట్ల అసెంబ్లీ స్థానంలో కలిసిపోయింది. కొమిరెడ్డి మృతిపట్ల స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సంతాపం తెలియజేశారు. -
గంటల వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరూ గుండెపోటుతో మృతి
సాక్షి, మెట్పల్లి (కోరుట్ల): గంటల వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరూ మృతి చెందిన విషాదకర ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో చోటుచేసుకుంది. తమ్ముడు గుండెపోటుతో మృతి చెందగా, అంత్యక్రియలకు హాజరైన అన్నకూడా గుండెపోటుకు గురై మరణించాడు. మెట్పల్లి పట్టణంలోని చైతన్యనగర్‌కు చెందిన బోగ భూషణ్, లత దంపతులకు ముగ్గురు కుమారులు. ఇందులో రెండో కుమారుడు శ్రీనివాస్ (30) హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఏడాది వయసుగల పాప ఉంది. శనివారం రాత్రి ఇంట్లో ఉన్న శ్రీనివాస్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఆదివారం ఉదయం మెట్‌పల్లికి తీసుకొచ్చారు. అంత్యక్రియలు జరపడానికి మృతదేహాన్ని శ్మశానికి తరలిస్తుండగా, అప్పటికే అక్కడికి వెళ్లిన శ్రీనివాస్ అన్న సచిన్ (33) ఒక్కసారిగి కూప్పకూలాడు. ఇది గమనించిన బంధువులు మొదట ప్రైవేట్ ఆస్పత్రికి.. ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సచిన్ మృతి చెందినట్లు తెలిపారు. గంటల వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాద ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పలువురు ప్రముఖులు ఆ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. చదవండి: (Hyderabad: ఇంటర్ విద్యార్థులకు టెన్షన్ టెన్షన్!) -
కాళ్లు మొక్కుతం, కనికరించండన్నా.. పట్టించుకోలేదు!
‘సారూ..బిడ్డ పురిటినొప్పులతో బాధపడ్తోంది..ఆ గోస సూడలేకపోతున్నం.. బాంచెన్.. ఆపరేషన్ జేయుండ్రి.. మీ కాళ్లు మొక్కుతం..కనికరం సూపుండ్రి..’అని కాళ్లుపట్టుకుని వేడుకున్నా వైద్యులు, సిబ్బంది పట్టించుకోలేదు. పండంటి బిడ్డ పుట్టబోతుందని ఆశపడ్డ ఆ తల్లికి వైద్యులు సిజేరియన్ చేసి చనిపోయిన శిశువును చేతిలో పెట్టడంతో నిరాశ ఎదురైంది. మెట్పల్లి(కోరుట్ల): జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన ఎర్రబోయిన అశోక్ భార్య సుజాత(22)కు ఇటీవలే నెలలు నిండాయి. తొలికాన్పు కావడంతో ఈనెల 19న మెట్‌పల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు పురిటినొప్పులు మొదలయ్యాయి. అయితే, సాధారణ ప్రసవం కోసం మరుసటిరోజు సాయంత్రం వరకూ వైద్యసిబ్బంది ప్రయత్నం చేశారు. ప్రసవం కాకపోవడంతో సిజేరియన్ చేయాలని, లేదంటే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తామని కుటుంబసభ్యులు వేడుకున్నారు. సిబ్బంది అంగీకరించకపోగా, కుటుంబసభ్యులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం వరకూ పురిటినొప్పులతో బాధపడ్తున్న సుజాతకు చివరికి వైద్యులు సిజేరియన్ చేశారు. అయితే.. అప్పటికే కడుపులో బిడ్డ చనిపోయింది. దీంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే బిడ్డ చనిపోయిందని కుటుంబసభ్యులు ఆపరేషన్ థియేటర్ వద్ద ఆందోళనకు దిగారు. తర్వాత జాతీయ రహదారిపై బైఠాయించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని బాధ్యులైన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు. ఈ విషయంపై ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ సాజిద్‌ను¯ ఆరాతీయగా..సుజాతకు ఈనెల 21న ప్రసవం చేయాల్సి ఉందన్నారు. అప్పటిదాకా సాధారణ ప్రసవం కోసం యత్నించామని తెలిపారు. వీలుకాకపోవడంతో సిజేరియన్ చేశామని, మృతశిశువు జన్మించిందని, ఇందులో సిబ్బంది పొరపాటు ఏమీలేదని స్పష్టం చేశారు. -
ఆ ఇద్దరికి ఏం తెలుసు?: కేటీఆర్ ఫైర్
సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ఎంపీ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జగిత్యాలలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఆ ఇద్దరి మీద విమర్శలు సంధించారు. ‘‘మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ చలిమంట కాచుకుంటోంది. యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధి ఏంటి? రాహుల్ గాంధీకి పబ్‌లు తప్ప ఎడ్లు, వడ్లు గురించి ఏం తెలుసు? రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తప్ప బండి సంజయ్ చేసిందేంటి? అని కేటీఆర్ మండిపడ్డారు. ‘‘జన్‌ధన్ ఖాతాలో నగదు వేస్తామన్నారు? ఇప్పటివరకు వేశారా? తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమీ లేదు. బండి సంజయ్ విచిత్రమైన మనిషి.. మసీదులు తవ్వాలంటారు. అసలు ఆయనకు సిగ్గు శరం ఉందా?’’ అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. -
ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్
సాక్షి, జగిత్యాల: మెట్‌పల్లిలోని రేగుంటలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. సుమన్ తండ్రి బాల్క సురేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. రోడ్డు మార్గాన మెట్పల్లి చేరుకున్న సీఎం రేగుంటలో సుమన్‌ను పరామర్శించి సురేష్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం సుమన్ కుటుంబ సభ్యులను కలిసి సురేష్ మృతికి గల కారణాలు అడిగి తెలుసుకుని ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు. అక్కటి నుంచి సీఎం హైదరాబాద్ బయల్దేరారు. కాగా మెట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్క సురేష్(62) కరోనాతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఇటీవల కన్నుమూశారు. -
ప్రేమ వ్యవహారంలో యువకుడి హత్య
మెట్పల్లి (కోరుట్ల): ప్రేమ వ్యవహారం ఓ యువకుడి హత్యకు దారితీసింది. సీఐ శ్రీను కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పరిధి లోని వెంకట్రావ్‌పేటకు చెందిన గోపి (26), అదే కాలనీకి చెందిన బెదుగం నరేందర్ (35) సోదరుని కూతురును ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతనిపై కేసు నమోదైంది. అయినప్పటికీ గోపి వైఖరిలో మార్పు రాకపోవడంతో నరేందర్ సోదరుని కుటుంబం వెంకట్రావ్పేట నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆ యువతితో తనకు వివాహం జరిపించాలని స్థానికంగా ఉంటున్న నరేందర్‌ను గోపి తరచూ వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం మద్యం మత్తులో ఉన్న గోపి, నరేందర్ ఇంటికెళ్లి గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరగ్గా.. నరేందర్ మొదట కత్తెరతో ఆ తర్వాత గొడ్డలి తో గోపిపై దాడి చేయగా అతను ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీను, ఎస్సై సధాకర్ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. యువతిని వేధించిన కేసుతోపాటు మరో రెండు దొంగతనాల కేసుల్లో గోపి నిందితుడని పేర్కొన్నారు. కాగా నరేందర్ నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. చదవండి: రూ.30 లక్షల అప్పు.. సర్పంచ్ ఆత్మహత్య -
క్వింటాల్‌కు రూ. 10 వేలు: రైతుల సంబరం!
సాక్షి, జగిత్యాల: పసుపు పంట క్వింటాల్‌కు రూ.10 వేల వరకు పలుకుతుండటంతో రైతులు సంబరపడి పోతున్నారు. వర్షాలు, చీడ పురుగుల కారణంగా పసుపు దిగుబడి సగానికి తగ్గినప్పటికీ ధర ఆశాజనకంగా ఉంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మార్కెట్ యార్డుకు రోజుకు సుమారు 200 క్వింటాళ్ల పసుపు వస్తోంది. సోమవారం మెట్పల్లి మార్కెట్లో అత్యధికంగా క్వింటాల్‌కు రూ.8,800 ధర పలికింది. మరోవైపు నిజామాబాద్ మార్కెట్ యార్డుకు నిత్యం 25 వేల క్వింటాళ్ల వరకు పసుపు వస్తుండగా సోమవారం అత్యధికంగా 50 వేల క్వింటాళ్లకు పైగా పంటను రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చారు. క్వింటాల్ పసుపునకు అత్యధికంగా రూ.10,555 ధర పలకడం విశేషం. రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతం కంటే రెట్టింపయ్యింది ఈసారి పసుపు ధర గతం కంటే రెట్టింపు పలుకుతోంది. రైతులు మార్కెట్లో అమ్ముకునేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ప్రస్తుతం రూ.10 వేలకు చేరువైంది. ధర మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం. -
కరోనా : ఆస్పత్రిలో బెడ్స్ ఖాళీ లేకపోవడంతో..
సాక్షి, జగిత్యాల : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కరోనా సోకిన వ్యక్తిని ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ లేకపోవడంతో.. ఇంటికి పంపించారు. వివరాల్లోకి వెళితే.. మెట్పల్లిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే జిల్లా ఆస్పత్రిలో బెడ్స్ ఖాళీ లేకపోవడంతో వైద్యులు అతని తిరిగి ఇంటికి పంపించారు. అయితే ఆ వ్యక్తి ఉంటున్నది అద్దె ఇళ్లు కావడంతో ఆ ఇంటి యజమాని లోనికి అనుమతించలేదు. దీంతో ఆ కరోనా పేషెంట్ రోడ్డున పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. కరోనా పేషెంట్‌ను మెట్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తితోపాటు, అతని భార్య, ఇద్దరు కూతుళ్లను ఆస్పత్రిలోని గదిలో క్వారంటైన్ చేశారు. అయితే కరోనా సోకిన వ్యక్తి యమమాని మాజీ కౌన్సిలర్ కావడం గమనార్హం. -
ఎంత పని చేశావు దేవుడా!
సాక్షి, మెట్పల్లి : పాపం..విధి కరెంట్ షాక్ రూపంలో ఆ కుటుంబం పై కన్నెర్ర చేసింది. ఇంటికి పెద్ద దిక్కైనా తల్లిదండ్రులను కబలించి పిల్లలకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. మండలంలోని వెల్లుల్ల గ్రామానికి చెందిన అసరి గంగాధర్, లక్ష్మీ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు మమత(22), మాధురి(20), కుమారుడు మధు(17)ఉన్నారు. పెద్ద కుమార్తె మమతకు కొంతకాలం క్రితమే వివాహం చేశారు.మాధురి ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, మధు ఇంటర్ చదువుతున్నాడు. గంగాధర్ శుక్రవారం రాత్రి వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చి స్నానానికి వెళ్లాడు. ఆ తర్వాత దుస్తులను ఇంటి ఆవరణలో ఉన్న తీగపై ఆరవేస్తుండగా, ఒక్కసారి కరెంట్ షాక్ తగిలి కిందపడిపోయాడు. అదే సమయంలో ఇంట్లో ఉన్న లక్ష్మీ వెంటనే అక్కడకు వచ్చి గంగాధర్‌ను పట్టుకోగా, ఆమెకు కూడా షాక్ తగలడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.విషయం తెలుసుకున్న కుమార్తెలు, కుమారుడు ఇంటికి వచ్చి తల్లిదండ్రులు విగత జీవులుగా పడి ఉండడాన్ని చూసి బోరున విలపించారు. ‘ఎంత పని చేశావు దేవుడా..ఇక మాకు దిక్కెవరూ’ అంటూ మృతదేహాలపై పడి గుండెలవిసేలా రోదించారు. రెండో కుమార్తెకు వివాహం, కుమారుడి చదువు బాధ్యతలు చూడాల్సిన సమయంలో ఆ పిల్లలకు తల్లిదండ్రులు దూరమైన పరిస్థితి చూసి గ్రామస్తులు సైతం కంటతడిపెట్టారు. శనివారం ఉదయం గంగాధర్, లక్ష్మీ మృతదేహాలకు ఆశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భారమైన హృదయాలతో ఒకే చోట అంత్యక్రియలు పూర్తి చేశారు. కుటుంబాన్ని ఎంపీపీ మారు సాయిరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పరామర్శించారు. -
మధుయాష్కీకి నిరసన సెగ
మెట్పల్లి (కోరుట్ల): కాంగ్రెస్ నేత మధుయాష్కీకి నిరసన సెగ తగిలింది. ఆ పార్టీకి చెందిన కొమురెడ్డి రాములు వర్గీయులు, టీఆర్ఎస్ కార్యకర్తలు గురువారం రాత్రి ఆయన వాహనాలను ధ్వంసం చేశారు. తమ నాయకుడికి టికె ట్ రాకుండా చేశారని రాములు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. డబ్బులు పంచేందు కు ఇక్కడికి వచ్చారని టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చోటుచేసుకుంది. మధుయాష్కీ కొందరితో కలసి రెండు వాహనాల్లో పట్టణంలోని చైతన్యనగర్లోని ఓ ఇంటికి వ చ్చారు. విషయం తెలుసుకున్న రాములు వర్గీయులు తమ నాయకుడికి టికెట్ రాకుండా చేశారని నిలదీశారు. మధుయాష్కీ వచ్చిన విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రావడమే కాకుండా పెద్దఎత్తున డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ అ క్కడ బైఠాయించి ఆందోళనకు దిగారు. మధుయాష్కీతో వాగ్వాదానికి దిగారు. అయినా ఆయన పట్టించుకోకుండా వెళ్లిపోతుండటంతో ఆగ్రహించిన టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. తర్వాత వాహనం దిగి మరో వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వాహనాలను డ్రైవర్లు తీసుకువెళ్తుండగా.. వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు వాహనాలను అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిని ఖండించిన ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ గౌడ్‌పై గురువారం రాత్రి మెట్పల్లిలో జరిగిన దాడిని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఖండించారు. ఈ దాడి అనాగరికమైన చర్య అని, ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు పక్షపాతధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. -
లారీ ఢీకొని నవవరుడు మృతి
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): మండలంలోని మారుతినగర్ సమీపంలో 63వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవరుడు మృతిచెందాడు. పెళ్లై నెలరోజులైనా గడవకముందే వారింట విషాదం చోటుచేసుకుంది. ఓదెల మండలం పొత్కపల్లికి చెందిన మొండెద్దుల రాజశేఖర్(24)కు మెట్పల్లి పట్టణంలోని బీడీకాలనీకి చెందిన సంధ్యతో గతనెల 30న వివాహం అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం అత్తగారిళ్లయిన మెట్‌పల్లికి వచ్చాడు. అక్కడి నుంచి తన భార్య సంధ్యతో సోమవారం సాయంత్రం మోటార్‌సైకిల్‌పై కోరుట్ల వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలో పైపులు తీసుకెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంధ్య గాయాలపాలైంది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బేరం కుదిరితే పరీక్షంతా ఓపెనే..
సాక్షి, మెట్పల్లి(కోరుట్ల): కాసులిస్తే చాలు.. ఆ పరీక్ష కేంద్రంలో సిబ్బంది కాపీయింగ్‌కే కాదు ఏకంగా అభ్యర్థులకు బదులు వారిస్థానంలో ఇతరులు వచ్చి పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. బేరం కుదిరితే దగ్గరుండి చిట్టీలు అందించి ఉత్తీర్ణతకు సహకరిస్తారు. మెట్‌పల్లిలోని ఓపెన్ డిగ్రీ పరీక్ష కేంద్రాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ‘ఓపెన్’గా అక్రమాలు జరుగుతున్నాయి. మాస్‌కాపీయింగ్‌కు ప్రత్యేకం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు పేరొందిన మెట్పల్లి కేంద్రంలో కొత్త అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకాలం కేవలం చిట్టీలతో కాపీయింగ్‌కు పాల్పడుతున్నారనే ప్రచారం ఉన్న ఈ కేంద్రంలో తాజాగా ఒకరికి బదులు ఇతరులు పరీక్ష రాస్తున్న విషయం బయటపడింది. సిబ్బంది అండతో బహిరంగంగా సాగుతున్న ఈ వ్యవహారంలో బుధవారం కథలాపూర్ ఎంపీపీ తొట్ల నర్సు భర్త తొట్ల అంజయ్యకు బదులు మరో యువకుడు పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు. ఇదీ జరిగింది... పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత సోమవారం నుంచి ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక్కడ విద్యార్థుల స్థానంలో ఇతరులు పరీక్ష రాస్తున్నారని కొందరు ప్రిన్సిపాల్ ఆబిద్ అలీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పట్టించుకోలేదు. అబ్జర్వర్ హరిశంకర్‌కు తెలుపగా ఆయన విద్యార్థుల వద్దకు వెళ్లి హాల్ టిక్కెట్లు పరిశీలించారు. తోట్ల అంజయ్య అనే పేరుతో పరీక్ష రాస్తున్న ఓ వ్యక్తిపై అనుమానం వచ్చి ఆన్లైన్లో పరిశీలించారు. అందులో మరో వ్యక్తి ఫొటో ఉండడంతో పరీక్ష రాస్తున్న వ్యక్తి నకిలీ అని తేలింది. అసలు వ్యక్తి కథలాపూర్ ఎంపీపీ భర్త కాగా, అతని స్థానంలో కోరుట్లకు చెందిన ఓ యువకుడి ఫొటోను మార్పింగ్ చేసి హాల్ టిక్కెట్ సృష్టించారు. దాంతో యువకుడు పరీక్షకు హాజరై పట్టుబడ్డాడు. కొద్దిసేపటికి అక్కడి వచ్చిన పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. సిబ్బంది అండతో పరీక్షకు వచ్చినట్లు ఆ యువకుడు చెప్పడం కొసమెరుపు. దీంతో ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ కూతురిని వదిలేసిన వైనం ? కేంద్రంలో ఓ కానిస్టేబుల్ కూతురు కూడా తన సోదరి స్థానంలో మూడ్రోజులుగా పరీక్షకు హాజరవుతున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా సిబ్బంది సహకారంతోనే సాగుతున్నట్లు తెలిసింది. యువకుడు పట్టుబడిన వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఆమెను పరీక్ష మధ్యలోనే కేంద్రం ఉంచి బయటకు పంపడం గమనార్హం. -
మీకు ఓట్లడిగే హక్కులేదు!
సాక్షి, జగిత్యాల/మెట్పల్లి: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవితకు, ఆయన బంధువైన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు ఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కు లేదు. జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ మూతపడి రెండున్నరేళ్లు దాటినా దాని పునరుద్ధరణ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఇద్దరూ విఫలమయ్యారు. రాబోయే ఎన్నికల్లో వీరికి బుద్ధిచెప్పాల్సింది మీరే’ అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రజా చైతన్య యాత్ర మంగళవారం సాయంత్రం నిర్మల్ జిల్లా మీదుగా మెట్‌పల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక ఖాదీ ప్రతిష్ఠాన్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉత్తంకుమార్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ వస్తే ఈ ప్రాంత ప్రజలు, రైతులు తమ బతుకులు బాగుపడతాయని భావించారన్నారు. నాలుగేళ్లు కుంభకర్ణుడిలా మొద్దునిద్రపోయిన సీఎం కేసీఆర్ ఈ ఏడాది డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశాలుండడంతో రైతుల గురించి ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న సీఎం ఆంధ్రా కాంట్రాక్టర్లకు వేల కోట్లు బిల్లులు చెల్లించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఎన్నికల ఏడాది కావడంతో ఇప్పుడు రైతులపై కపటప్రేమ ప్రదర్శిస్తున్నాడని పేర్కొన్నారు. ఈ ప్రాంత రైతుల సమస్యల పరిష్కారం కోసం ఎంపీ కవిత, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు చొరవ తీసుకోలేదన్నారు. ‘సమైక్య రాష్ట్రంలో తాను గృహనిర్మాణశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏటా లక్ష ఇళ్లు నిర్మించామని, ఆ సమయంలో మేం కట్టిన ఇళ్లను అగ్గిపెట్టెలా ఉన్నాయని ఎద్దేవా చేసిన సీఎం కేసీఆర్ పెద్ద వరండా, గొర్లు, బర్లు కట్టుకునేలా ఖాళీ స్థలంతో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని ఇప్పటి వరకు ఎంతమందికి కట్టించి ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ‘దళితులకు ఇస్తామన్న మూడెకరాలైనా ఇచ్చారా?’ అని ప్రజలను అడిగారు.తెలంగాణ సమాజాన్ని మోసం చేసిన కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. దేశంలో సెక్యులర్ పాలన రావాలంటే ఢిల్లీలో మోదీని గద్దె దింపాలని.. దానికి ముందు చిన్న మోదీ కేసీఆర్‌ను ఎన్నికల్లో ఓడించాలన్నారు. శాసన మండలిలో విపక్ష నేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. నాలుగేళ్లు దున్నపోతులా నిద్రపోయిన కేసీఆర్ ఇప్పుడు లేచి రైతు సమస్యలంటూ నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ అంటూ కొత్త నాటకం ఆడుతున్న కేసీఆర్ నాలుగేళ్ల కాలంలో తెలంగాణ అభివృద్ధిపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వంద రోజుల్లోనే షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేసుకుంటామని చెప్పిన ఎంపీ కవిత హామీని నిలబెట్టుకోకపోగా నడిచే ఫ్యాక్టరీని మూసేసి రైతులను మోసం చేసిందన్నారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారి ఒడిలో కూర్చునే రకమన్నారు. మతం పేరిట రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపడం ఆయన నైజం అని విమర్శించారు. రాష్ట్రంలో కేటీఆర్ లేడు.. ఫీటీఆర్ లేడు.. అసద్ లేడు.. ఫసద్ లేడు’ అని ఎద్దేవా చేశారు. ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు మాట్లాడుతూ... సర్వే చేయించుకుని వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు 106 సీట్లు వస్తాయని చెబుతున్న కేసీఆర్ మళ్లీ బస్సు యాత్రకు ఎందుకు సిద్ధమవుతున్నారని ప్రశ్నించారు. అవన్నీ బోగస్ సర్వేలు కావడం.. కాంగ్రెస్ బస్సు యాత్రకు విశేష స్పందనకు భయపడే మళ్లీ కొత్త యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు విమర్శించారు. ఎంపీ కవిత.. అన్ని పండగలను అయ్య జాగీరుగా భావిస్తుందన్నారు. బతుకమ్మ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని దుయ్యబట్టారు. ఈ ప్రాంతానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తోన్న కవిత షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశాన్ని ఎందుకు లేవనెత్తడం లేదన్నారు. ఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే కష్టాలు పోతాయనుకుంటే ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు గుండె పగిలి చనిపోతోన్నా.. ఏమీ పట్టనట్లు సీఎం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ అభివృద్ధి చేయలేదని చెబుతున్న టీఆర్ఎస్ నేతలు నాగార్జున సాగర్, వరద కాలువలు, ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎవరు స్థాపించారో సమాధానం చెప్పాలన్నారు. ఎస్సారెస్పీ నుంచి 14 టీఎంసీల నీటిని అక్రమంగా మిడ్‌మానేరుకు తరలించి పెద్దపల్లి జిల్లా రైతులకు నీరందకుండా చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలను కచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో రేషన్ షాపుల ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు సరఫరా చేశామన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం బియ్యం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే అన్నిరకాల నిత్యావసర వస్తువులు అందిస్తామని చెప్పారు. అంతకు ముందు.. మెట్పల్లి ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద బస్సు యాత్రకు స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యేలు కొమొరెడ్డి రాములు, జ్యోతక్కల ఆధ్వర్యంలో కార్యకర్తలు సభా ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అ«ధ్యక్షుడు కటుకం మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ అ«ధ్యక్షురాలు నేరెళ్ల శారద, రాష్ట్ర అధికార ప్రతినిధి రమ్యారావు, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు విజయరమణారావు, బొమ్మ వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్, నాయకులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వేధింపులు తట్టుకోలేక యువకుడి ఆత్మహత్యాయత్నం
మెట్పల్లి: తనకు ఎదురవుతున్న వేధింపులను తట్టుకోలేని ఓ యువకుడు పోలీసు స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జరిగింది. క్రషర్ యాజమాని వేధిస్తున్నాడంటూ మెట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట వెంకటేష్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. దీన్ని గమనించిన పోలీసులు అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. -
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
మెట్పల్లి : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడిన షేక్Sఉస్మాన్(45)ను మెట్పల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సీఐ సురేందర్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని బీడీ కాలనీకి చెందిన ఉస్మాన్ మెట్‌పల్లితోపాటు హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల్లో దొంగతనాలు చేశాడు. గత మార్చిలో స్థానిక చైతన్యనగర్లోని ఓ ఇంట్లో చొరబడి బంగారం ఎత్తుకెళ్లాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై ఏడు అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. అప్పటి నుంచి పరారీలో ఉన్న ఉస్మాన్‌ను స్థానిక బస్‌స్టేషన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి రెండు తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై అశోక్ పాల్గొన్నారు. -
రికార్డు వర్షం
మెట్పల్లిలో 22 సెంటీమీటర్లు నమోదు 17 మండలాల్లో అధిక వర్షాలు కరీంనగర్ అగ్రికల్చర్ : జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. జగిత్యాల, సిరిసిల్ల డివిజన్లలో భారీ వర్షాలు నమోదయ్యాయి. వర్షాకాలం ప్రారంభమయ్యాక రికార్డు స్థాయిలో మెట్పల్లిలో 22.4సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే 11 శాతం అధికంగా కురిసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఖరీఫ్ ప్రారంభమైన జూన్ నుంచి ఇప్పటివరకు 444 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి 491 మి.మీ. నమోదైంది. 36 మండలాల్లో సాధారణ వర్షాలు కురియగా.. 17 మండలాల్లో అధిక వర్షం కురిసింది. 4 మండలాల్లో లోటు కనిపిస్తోంది. ఆదివారం ఇబ్రహీంపట్నంలో 19 సెంటీమీటర్లు, కోరుట్లలో 12 సెం.మీ వర్షం కురిసింది. కాటారంలో 3.5, వెల్గటూర్ 2, జూలపల్లి 1.4, ధర్మారం 2.4, ఎలిగేడు 2.1, సుల్తానాబాద్ 1, కోనరావుపేట 3.1, ఎల్లారెడ్డిపేట 3.7, చందుర్తి 4.1, బోయినిపల్లి 1.8, గంభీరావుపేట 4.2, వేములవాడ 3.9, ముస్తాబాద్ 4.6, సిరిసిల్ల 2.8, పెగడపల్లి 2.5, కొడిమ్యాల 3, మల్యాల 2.9, మేడిపల్లి 8.9, గొల్లపల్లి 6, కథలాపూర్ 8.4, రాయికల్ 6.4, కోరుట్ల 12, జగిత్యాల 8, మల్లాపూర్ 5.7, మానకొండూర్ 1, గంగాధర 1.9, చొప్పదండి, కరీంనగర్లో 1.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారుపోసుకుని వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వానలు ఊపిరినిచ్చాయి. నాట్లు వేసుకునేందుకు అదును దాటే సమయంలో వర్షాల రాక రైతులకు ఆనందం కలిగించింది. అన్ని చోట్ల ఒకేస్థాయిలో వర్షాలు లేకపోవడం ప్రధానంగా రైతులను కలిచివేస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు మంథని, కమాన్‌పూర్, కాటారం, పెద్దపల్లి, సిరిసిల్ల, ముస్తాబాద్, వేములవాడ, గంభీరావుపేట, మల్లాపూర్, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, జమ్మికుంట, కరీంనగర్, హుజూరాబాద్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాల్లో అధిక వర్షాలు కురిశాయి. మహాముత్తారం, పెగడపల్లి, చిగురుమామిడి, రామడుగు మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
మెట్పల్లి (కరీంనగర్ జిల్లా) : మెట్పల్లిలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. చైతన్యనగర్‌లో ఉండే ఉడుత భవాని (16) శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే కటుంబ సభ్యులు మంటలను ఆర్పి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఇంటర్లో మార్కులు తక్కువ వచ్చాయని ఈ పనికి పాల్పడినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో చోరీ
మెట్పల్లి (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి రమేష్ రాజు ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. ఊరి నుంచి మంగళవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన రమేష్‌రాజు చోరీ జరిగిన విషయం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 40 తులాల వెండి, 6 తులాల బంగారు నగలు, ల్యాప్‌టాప్, టీవీ తదితర వస్తువులను తీసుకెళ్లారు. చోరీ జరిగిన ఇంటిని మెట్పల్లి ఎస్ఐ రాజేష్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వెయ్యి క్వింటాళ్ల మొక్కజొన్న అగ్నికి ఆహుతి
ఆదిలాబాద్ జిల్లా : ఆదిలాబాద్ జిల్లా మెట్పల్లి స్థానిక వ్యవసాయ మార్కెట్లోని గోదాంలో శనివారం ప్రమాదవశాత్తు నిప్పులు చెలరేగి సుమారు 2 వేల మొక్కజొన్న బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. విషయాన్ని గమనించిన మార్కెట్ వాచ్మెన్ అధికారులకు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే బస్తాలు దగ్ధమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా మార్క్‌ఫెడ్ సంస్థకు చెందిన 22వేల 153 క్వింటాళ్ళ మొక్కజొన్న బస్తాలను ఇక్కడి గోదాంలో 6 నెలల క్రితం 8 లాట్లుగా నిల్వ చేశారు. కాగా ఈ అగ్ని ప్రమాదంలో సుమారు వెయ్యి క్వింటాళ్ల మొక్కజొన్న అగ్నికి ఆహుతైనట్లు, రూ.16లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు ఆదిలాబాద్ మార్క్‌ఫెడ్ డిఎం ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రవీణ్ రెడ్డి తెలిపారు. -
లైంగికదాడి.. ఆపై హత్య
మెట్పల్లి రూరల్ : గుర్తు తెలియన మహిళపై లైంగికదాడి చేసి, హతమార్చిన కేసును పోలీసులు ఛేదించారు. జగిత్యాల డీఎస్పీ రాజేం ద్రప్రసాద్ తెలిపిన వివరాలు.. ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ శివారు 63వ జాతీయ రహదారి సమీపంలో నిర్మిస్తున్న సుందర చైతన్యానంద స్వామి ఆశ్రమంలో ఈనెల 15న ఓ మహిళ హత్యకు గురైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు..ఆమెను నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన దండుగుల లక్ష్మి (38)గా తేల్చారు. అయితే, ఆమె మద్యానికి బా నిసై భర్తతో విడిపోరుు ఒంటరిగా ఉంటోంది. ఈక్రమంలో ఇటీవల మెట్‌పల్లికి చేరింది. స్థానిక గాజులపేటకు చెందిన గుండుగుల రాజన్న, మెట్పల్లిలో నివాసం ఉండే రాయికల్ మండలం బో ర్నపెల్లి శివారు చెలుకుగూడేనికి చెందిన షడ్మకే గంగారాం ఆమెను మున్సిపల్ కార్యాలయ సమీపంలోని కల్లు దుకాణం లో పరిచయం చేసుకున్నారు. కమ్మర్‌పల్లిలోని ఆమె బంధువుల ఇంటివద్ద దిం పుతామని నమ్మించి ఆటోలో ఎక్కించుకుని వెళ్లారు. గండిహనుమాన్ ఆలయం వద్ద ఆటో ఆపి దేవుని దర్శనం చేసుకున్నారు. తర్వాత ముగ్గురూ కలిసి సుంద ర చైతన్యానందస్వామి ఆశ్రమంలో భోజనం చేశారు. ఆతర్వాత ఇద్దరూ మహిళపై బలవంతంగా లైంగికాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితురాలు బెదిరించగా, అక్కడే ఉన్న కర్రచెక్కతో తలపై బాదారు, కొంగుతో మెడకు గట్టిగా చుట్టి చంపేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. బుధవారం మెట్పల్లి శివారులోని వెంకట్రావుపేట మల్లన్న గుట్టవద్ద పెట్రోలింగ్ చేపట్టారు. అక్కడ గుండగుల రాజన్న, షడ్మకే గంగారాం పట్టుబడ్డారు. హత్య మిస్టరీని ఛేదిం చిన మెట్పల్లి సీఐ రాజశేఖర్‌రాజు, ఇబ్రహీంపట్నం ఎస్సై రాజరెడ్డి, పోలీసులు నజీర్, మల్లేశ్, రమేశ్‌ను డీఎస్పీ అభినందించారు. -
‘బార్ కోడ్’ మరిచారు!
మెట్పల్లి : జిల్లాలో మద్యం విక్రయాల్లో బార్కోడ్ విధానం అమలు ప్రకటనలకే పరిమితమైంది. కల్తీ, పన్ను చెల్లించని మద్యాన్ని అరికట్టడంతో పాటు ఎమార్పీకే మద్యం విక్రయించేలా చూడటానికి ప్రభుత్వం బార్కోడ్ విధానాన్ని అమలు చేయాలని ఎక్సైజ్ శాఖకు సూచించింది. కానీ ఆ శాఖ అధికారులు ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. బార్కోడ్ సామగ్రిని సమకూర్చడానికి వ్యాపారుల నుంచి డబ్బును వసూలు చేసిన అధికారులు.. దుకాణాలకు ఇచ్చిన లెసైన్స్ గడువులో ఐదునెలలు పూర్తయినా ఇంతవరకు సామగ్రిని వారికి అందజేయలేదు. దీనివల్ల బార్కోడ్ అమలు ప్రశ్నార్థకంగా మారింది. జూలై నుంచే అమలు చేయాల్సి ఉన్నా... ప్రస్తుతం జిల్లాలో 301 మద్యం దుకాణాలు, 44 బార్లు ఉన్నాయి. ఇందులో దుకాణాలకు జూన్‌తోనే లెసైన్స్ గడువు ముగియగా, టెండర్లు నిర్వహించి జూలై ఒకటి నుంచి తిరిగి వాటిని పునరుద్ధరించారు. వీటి కాల పరిమితి 2015 జూన్ 30తో ముగుస్తుంది. అధికారులు జూలై నుంచే దుకాణాల్లో బార్ కోడ్ విధానం అమలు చేస్తామని ప్రకటించారు. కానీ లెసైన్స్ గడువులో ఐదు నెలలు పూర్తయినా ఇంతవరకు దానిని అమలు చేయకపోవడం గమనార్హం. ముక్కుపిండి వసూలు.. బార్కోడ్ సామగ్రిని సమకూర్చడానికి ఎక్సైజ్ అధికారులు మద్యం వ్యాపారుల నుంచి రూ.92వేలు, బార్ల నిర్వాహకుల నుంచి రూ.80వేల చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. వ్యాపారుల్లో చాలా మంది సామగ్రి కొనుగోలు చేయడానికి మొదట్లో మొండికేశారు. దీంతో అధికారులు వారికి మద్యం సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో గత్యంతర ం లేక ఈ సొమ్మును చెల్లించారు. ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సామగ్రిని సమకూరుస్తున్న ఎక్సైజ్ శాఖ మార్కెట్ ధర కంటే ఎక్కువ మొత్తాన్ని వ్యాపారుల నుంచి వసూలు చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి కాని సాఫ్ట్వేర్ అనుసంధానం.. బార్కోడ్ విధానం అమలును పర్యవేక్షించే బాధ్యతను రాష్ర్ట స్థాయిలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి అప్పజెప్పారు. ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు మద్యం డిపోతో పాటు ఎక్సైజ్ స్టేషన్లు, కొన్ని మద్యం దుకాణాలకు మాత్రమే సామగ్రి అందింది. పూర్తి స్థాయిలో అన్ని దుకాణాలకు సామగ్రి చేరితేనే సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేయడానికి అవకాశముంటుంది. వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసిన అధికారులు సామగ్రిని సమకూర్చే విషయంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నారు. దీనివల్లనే బార్కోడ్ అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అమలు ఎప్పుడన్నది చెప్పలేం - సుధీర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ అన్ని దుకాణాలకు ఇంకా సామగ్రి అందలేదు. వీటిని సమకూర్చే ప్రైవేట్ సంస్థ జాప్యం చేస్తోంది. అందువల్ల బార్కోడ్ విధానాన్ని ఎప్పటినుంచి అమలు చేస్తామన్నది చెప్పలేం. -
ఎమ్మెల్యేలు ఎస్సంటేనే..
మెట్పల్లి రూరల్ : జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వారు ఔనంటేనే తహసీల్దార్లను, ఎంపీడీవోలను బదిలీ చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం నుంచి మౌఖికంగా ఆదేశాలు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల సమయంలో నియమావళి మేరకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో జిల్లాలోని దాదాపు అన్ని మండలాల తహసీల్దార్లను, ఎంపీడీవోలను వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలకు బదిలీ చేశారు. వారందరిని తిరిగి పాత స్థానాలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పలువురు తహసీల్దార్లు, ఎంపీడీవోలు తమకు అనుకూలమైన, గతంలో పనిచేసిన మండలాల్లో తిరిగి పోస్టింగ్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించే క్రమంలో తమ ఎమ్మెల్యేలకు సహకరించే వారిని మాత్రమే తిరిగి బదిలీ చేయాలని సూచిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయినట్టు తెలిసింది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎంపీడీవోలు, తహసీల్దార్ల బదిలీలకు అనుకూలంగా కాన్సెంట్ లెటర్లు కలెక్టర్‌కు అందిస్తేనే బదిలీ ఉత్తర్వులు ఇస్తున్నట్లు వినికిడి. దీంతో తమకు అనుకూలమైన స్థానాల కోసం తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.