సభా వేదికపై కాంగ్రెస్ నాయకుల అభివాదం
సాక్షి, జగిత్యాల/మెట్‌పల్లి: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవితకు, ఆయన బంధువైన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు ఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కు లేదు. జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ మూతపడి రెండున్నరేళ్లు దాటినా దాని పునరుద్ధరణ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఇద్దరూ విఫలమయ్యారు. రాబోయే ఎన్నికల్లో వీరికి బుద్ధిచెప్పాల్సింది మీరే’ అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రజా చైతన్య యాత్ర మంగళవారం సాయంత్రం నిర్మల్ జిల్లా మీదుగా మెట్‌పల్లికి చేరుకుంది.
ఈ సందర్భంగా స్థానిక ఖాదీ ప్రతిష్ఠాన్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉత్తంకుమార్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ వస్తే ఈ ప్రాంత ప్రజలు, రైతులు తమ బతుకులు బాగుపడతాయని భావించారన్నారు. నాలుగేళ్లు కుంభకర్ణుడిలా మొద్దునిద్రపోయిన సీఎం కేసీఆర్ ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలుండడంతో రైతుల గురించి ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న సీఎం ఆంధ్రా కాంట్రాక్టర్లకు వేల కోట్లు బిల్లులు చెల్లించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
ఎన్నికల ఏడాది కావడంతో ఇప్పుడు రైతులపై కపటప్రేమ ప్రదర్శిస్తున్నాడని పేర్కొన్నారు. ఈ ప్రాంత రైతుల సమస్యల పరిష్కారం కోసం ఎంపీ కవిత, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు చొరవ తీసుకోలేదన్నారు. ‘సమైక్య రాష్ట్రంలో తాను గృహనిర్మాణశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏటా లక్ష ఇళ్లు నిర్మించామని, ఆ సమయంలో మేం కట్టిన ఇళ్లను అగ్గిపెట్టెలా ఉన్నాయని ఎద్దేవా చేసిన సీఎం కేసీఆర్ పెద్ద వరండా, గొర్లు, బర్లు కట్టుకునేలా ఖాళీ స్థలంతో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని ఇప్పటి వరకు ఎంతమందికి కట్టించి ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ‘దళితులకు ఇస్తామన్న మూడెకరాలైనా ఇచ్చారా?’ అని ప్రజలను అడిగారు.తెలంగాణ సమాజాన్ని మోసం చేసిన కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. దేశంలో సెక్యులర్ పాలన రావాలంటే ఢిల్లీలో మోదీని గద్దె దింపాలని.. దానికి ముందు చిన్న మోదీ కేసీఆర్‌ను ఎన్నికల్లో ఓడించాలన్నారు.
శాసన మండలిలో విపక్ష నేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. నాలుగేళ్లు దున్నపోతులా నిద్రపోయిన కేసీఆర్ ఇప్పుడు లేచి రైతు సమస్యలంటూ నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ అంటూ కొత్త నాటకం ఆడుతున్న కేసీఆర్ నాలుగేళ్ల కాలంలో తెలంగాణ అభివృద్ధిపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వంద రోజుల్లోనే షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేసుకుంటామని చెప్పిన ఎంపీ కవిత హామీని నిలబెట్టుకోకపోగా నడిచే ఫ్యాక్టరీని మూసేసి రైతులను మోసం చేసిందన్నారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారి ఒడిలో కూర్చునే రకమన్నారు. మతం పేరిట రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపడం ఆయన నైజం అని విమర్శించారు.
రాష్ట్రంలో కేటీఆర్ లేడు.. ఫీటీఆర్ లేడు.. అసద్ లేడు.. ఫసద్ లేడు’ అని ఎద్దేవా చేశారు.
ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు మాట్లాడుతూ... సర్వే చేయించుకుని వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 106 సీట్లు వస్తాయని చెబుతున్న కేసీఆర్ మళ్లీ బస్సు యాత్రకు ఎందుకు సిద్ధమవుతున్నారని ప్రశ్నించారు. అవన్నీ బోగస్ సర్వేలు కావడం.. కాంగ్రెస్ బస్సు యాత్రకు విశేష స్పందనకు భయపడే మళ్లీ కొత్త యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు విమర్శించారు. ఎంపీ కవిత.. అన్ని పండగలను అయ్య జాగీరుగా భావిస్తుందన్నారు. బతుకమ్మ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని దుయ్యబట్టారు. ఈ ప్రాంతానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తోన్న కవిత షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశాన్ని ఎందుకు లేవనెత్తడం లేదన్నారు.
ఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే కష్టాలు పోతాయనుకుంటే ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు గుండె పగిలి చనిపోతోన్నా.. ఏమీ పట్టనట్లు సీఎం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ అభివృద్ధి చేయలేదని చెబుతున్న టీఆర్‌ఎస్ నేతలు నాగార్జున సాగర్, వరద కాలువలు, ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎవరు స్థాపించారో సమాధానం చెప్పాలన్నారు. ఎస్సారెస్పీ నుంచి 14 టీఎంసీల నీటిని అక్రమంగా మిడ్‌మానేరుకు తరలించి పెద్దపల్లి జిల్లా రైతులకు నీరందకుండా చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలను కచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్పారు.
మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో రేషన్ షాపుల ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు సరఫరా చేశామన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం బియ్యం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే అన్నిరకాల నిత్యావసర వస్తువులు అందిస్తామని చెప్పారు. అంతకు ముందు.. మెట్‌పల్లి ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద బస్సు యాత్రకు స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యేలు కొమొరెడ్డి రాములు, జ్యోతక్కల ఆధ్వర్యంలో కార్యకర్తలు సభా ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అ«ధ్యక్షుడు కటుకం మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ అ«ధ్యక్షురాలు నేరెళ్ల శారద, రాష్ట్ర అధికార ప్రతినిధి రమ్యారావు, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు విజయరమణారావు, బొమ్మ వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్, నాయకులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment