రికార్డు వర్షం
-
మెట్‌పల్లిలో 22 సెంటీమీటర్లు నమోదు
-
17 మండలాల్లో అధిక వర్షాలు
కరీంనగర్ అగ్రికల్చర్ : జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. జగిత్యాల, సిరిసిల్ల డివిజన్లలో భారీ వర్షాలు నమోదయ్యాయి. వర్షాకాలం ప్రారంభమయ్యాక రికార్డు స్థాయిలో మెట్‌పల్లిలో 22.4సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే 11 శాతం అధికంగా కురిసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఖరీఫ్ ప్రారంభమైన జూన్ నుంచి ఇప్పటివరకు 444 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి 491 మి.మీ. నమోదైంది. 36 మండలాల్లో సాధారణ వర్షాలు కురియగా.. 17 మండలాల్లో అధిక వర్షం కురిసింది. 4 మండలాల్లో లోటు కనిపిస్తోంది. ఆదివారం ఇబ్రహీంపట్నంలో 19 సెంటీమీటర్లు, కోరుట్లలో 12 సెం.మీ వర్షం కురిసింది. కాటారంలో 3.5, వెల్గటూర్ 2, జూలపల్లి 1.4, ధర్మారం 2.4, ఎలిగేడు 2.1, సుల్తానాబాద్ 1, కోనరావుపేట 3.1, ఎల్లారెడ్డిపేట 3.7, చందుర్తి 4.1, బోయినిపల్లి 1.8, గంభీరావుపేట 4.2, వేములవాడ 3.9, ముస్తాబాద్ 4.6, సిరిసిల్ల 2.8, పెగడపల్లి 2.5, కొడిమ్యాల 3, మల్యాల 2.9, మేడిపల్లి 8.9, గొల్లపల్లి 6, కథలాపూర్ 8.4, రాయికల్ 6.4, కోరుట్ల 12, జగిత్యాల 8, మల్లాపూర్ 5.7, మానకొండూర్ 1, గంగాధర 1.9, చొప్పదండి, కరీంనగర్‌లో 1.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారుపోసుకుని వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వానలు ఊపిరినిచ్చాయి. నాట్లు వేసుకునేందుకు అదును దాటే సమయంలో వర్షాల రాక రైతులకు ఆనందం కలిగించింది. అన్ని చోట్ల ఒకేస్థాయిలో వర్షాలు లేకపోవడం ప్రధానంగా రైతులను కలిచివేస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు మంథని, కమాన్‌పూర్, కాటారం, పెద్దపల్లి, సిరిసిల్ల, ముస్తాబాద్, వేములవాడ, గంభీరావుపేట, మల్లాపూర్, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, జమ్మికుంట, కరీంనగర్, హుజూరాబాద్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాల్లో అధిక వర్షాలు కురిశాయి. మహాముత్తారం, పెగడపల్లి, చిగురుమామిడి, రామడుగు మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది.