ఓటెత్తిన చైతన్యం | Polling stations, voters | Sakshi
Sakshi News home page

ఓటెత్తిన చైతన్యం

Published Mon, Mar 31 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM

ఓటెత్తిన చైతన్యం

ఓటెత్తిన చైతన్యం

 సాక్షి, కరీంనగర్ :  జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, సిరిసిల్ల మున్సిపాలిటీలు, జమ్మికుంట, వే ములవాడ, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్ నగర పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. జిల్లావ్యాప్తంగా 7,10,654 మంది ఓటర్లుండగా 41,84,480 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కరీంనగ ర్ కార్పొరేషన్‌లో తక్కువగా 60 శాతం పోలింగ్ నమోదు కాగా.. హుస్నాబాద్ నగరపంచాయతీలో అత్యధికంగా 85.09 శాతం పోలింగ్ జరిగింది. 5గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.


రామగుండం కార్పొరేషన్ పరిధిలో వంద మందికిపైగా కార్మికులు, కూలీలు పని ముగించుకుని సాయంత్రం 4గంటలకు స్థానిక 13వ డివిజన్‌లో ఉన్న ఆర్‌సీవో క్లబ్‌కు ఓటేసేందుకు వచ్చారు. దీంతో వారికీ ఓటు వేసే అవకాశం కల్పించడంతో ఈ కేంద్రంలో రాత్రి 7గంటల వరకు పోలింగ్ జరిగింది. 24, 29, 42వ డివిజన్లలో ఈవీఎంలు మొరాయించగా వాటికి మరమ్మతులు చేపట్టి గంట తర్వాత ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈవీఎంలపై పోలింగ్ సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడంతో హుజూరాబాద్‌లోని 15 వార్డులలో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.

 సిరిసిల్లలో మున్సిపాలిటీ 5వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి యశ్వంత్‌కు నల్లా గుర్తు కేటాయించిన అధికారులు ఈవీఎంలో బోరింగ్ గుర్తు ఇవ్వడంతో అతడు నిరసనకు దిగాాడు. చివరకు 45 నిమిషాల ఆలస్యంతో యశ్వంత్‌కు నల్లాగుర్తు ఇచ్చిపోలింగ్ ప్రారంభించారు.

 చెదురుమదురు సంఘటనలు

 కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో స్వల్ప ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు పోలింగ్ కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. 23వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి తాటి ప్రభావతిపై మరో పార్టీకి చెందిన అభ్యర్థి బంధువులు దాడి చేశారు. గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. 39వ డివిజన్‌లో ఓట్లు గల్లంతవ్వడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. పోలింగ్‌స్టేషన్ వద్దకు చేరుకున్న ఆర్డీవో చంద్రశేఖర్‌ను అడ్డుకున్నారు. డీఎస్పీ రవీందర్ అక్కడికి చేరుకొని అడ్డుగా ఉన్నవారిని తొలగించడంతో ఆర్డీవో వెళ్లిపోయారు.


11వ డివిజన్‌లో 400 ఓట్లు గల్లంతయ్యాయని ఓటర్లు బాలికల ప్రభుత్వ పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఓటరు స్లిప్పులు ఉన్నా ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడంతో ఓటు వేయలేపోతున్నాయని కార్పొరేషన్ కమిషనర్ కె.రమేశ్‌తో మొరపెట్టుకున్నారు. 35వ డివిజన్‌లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చారని కొంతమంది యువకులపై కాంగ్రెసేతర అభ్యర్థులు గొడవకు దిగారు. దాడులకు ప్రయత్నించడంతో పోలీసులు పలువురిని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి, ఆ తర్వాత వదిలిపెట్టారు. రామగుండం కార్పొరేషన్‌లో పరిధిలోని 38వ డివిజన్‌లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా పోలీసులు జోక్యం చేసుకొని లాఠీచార్జీలతో ఇరువర్గాలను చెల్లాచెదురు చేశారు.


 రామగుండం కార్పొరేషన్ రాంనగర్‌లో రోడ్లపై టెంట్లు వేసి గుంపులు గుంపులుగా ఉండడంతో పోలీసులు గుంపులను చెదరగొట్టడానికి స్వల్పంగా లాఠీచార్జీ చేశారు. రోడ్ల పక్కన వేసిన టెంట్లను కూల్చివేశారు. హుస్నాబాద్ 3వ వార్డులో పోలైన ఓట్లకు, ఈవీఎంలో నమోదైన ఓట్లకు ఒక్క ఓటు తేడా రావడంతో గందరగోళం నెలకొంది. వార్డులో 735 మంది ఓటర్లు ఉండగా, 634 ఓట్లు పోలైనట్లు అధికారులు చెప్పారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలో 633 ఓట్లే పోలైనట్లు చూపింది. అధికారులు ఒక ఓటరను నమోదు చేసుకునే సందర్భంలో ఎర్రర్ వచ్చిందని, అందుకనే ఓటు నమోదు కాలేదని పోలింగ్ అధికారి నరహరి తెలిపారు.


 ఈ ఓటు విషయంపై తర్జనభర్జనలు జరిగిన తరువాత ఏజెంట్లు ఈవీఎంల తరలింపునకు ఒప్పుకోవడంతో వివాదం సద్దుమణిగింది. పెద్దపల్లిలో ఓ అభ్యర్థి దొంగ ఓట్లను వేయిస్తున్నాడనే అనుమానంతో ఏజంట్లు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అభ్యర్థి మద్దతుదారుల వచ్చి ఆందోళన చేయడంతో పోలీసులు స్వల్పగా లాఠీచార్జి చేశారు. రామగుండం కార్పొరేషన్ 38వ డివిజన్ వీర్లపల్లిలో కాంగ్రెస్, టీబీజీకేఏస్ మద్దతుదారుల మధ్య తోపులాట జరిగింది.

పోలింగ్‌బూత్‌కు కొద్దిదూరంలో కాంగ్రెస్ అభ్యర్థి గూళ్ల వెంకటరమణ బంధువులు, టీఆర్‌ఎస్ నాయకులు వాగ్వివాదానికి దిగారు. పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. రామగుండం 32వ డివిజన్‌లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతవారణం చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు దాడికి యత్నం చేయగా పోలీసులు చెదరగొట్టారు. కరీంనగర్ 20వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో ఇతర అభ్యర్థులను లోనికి అనుమతించి, తనను అడ్డుకోవడంపై స్వతంత్ర అభ్యర్థి ఆది మల్లేశం పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. జనం గుమిగూడటంతో ఉద్రిక్తత ఏర్పడగా పోలీసులు అందరినీ చెదరగొట్టారు.

 ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు

 కరీంనగర్‌లోని 16వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఓటుహక్కు వినియోగించుకున్నారు. 14వ డివిజన్‌లో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, 36 డివిజన్‌లో ఎంపీ పొన్నం ప్రభాకర్ ఓటు వేశారు.

మెట్‌పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఓటు వేశారు. వేములవాడలో ఎమ్మెల్యే చెన్నెమనేని రమేశ్‌బాబు, రామగుండంలో 46వ డివిజన్‌లోని ప్రజా పాఠశాలలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement