Ramagundam corporations
-
జోరు చల్లారింది
సాక్షి, పెద్దపల్లి : మున్సిపల్ పోరుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు రాజకీయ పార్టీల్లో ఉత్సాహం, పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల వాతావరణం కనిపించింది. ప్రభుత్వ యంత్రాంగం సైతం ఏర్పాట్లపై హడావుడి చేసింది. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటంతో అంతా చల్లబడ్డారు. రేపో మాపో రిజర్వేషన్లు ఖరారవుతాయని ఉత్కంఠగా ఎదురుచూసిన వారు కాస్త నెమ్మదించారు. అభ్యంతరాలు పరిష్కరించే వరకూ ఎన్నికలకు వెళ్లమంటూ తమకు ఈసీ హామీ ఇచ్చిందని, పిటిషన్ల విచారణ సమయంలో హైకోర్టు పేర్కొంది. ఈ పరిణామంతో మున్సిపాలిటీల్లో ఒక్కసారిగా రాజకీయాలు స్తబ్ధుగా మారాయి.. మున్సిపాలిటీల్లో పాలకవర్గాలను ఎన్నుకొనేందుకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గత నెల 21 నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గణన చేపట్టింది. ఇది జరుగుతున్న సమయంలోనే వార్డుల సంఖ్యను ఖరారు చేస్తూ ప్రభుత్వం అర్డినెన్స్ జారీ చేయడంతో వార్డుల పునర్విభజనకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో అధికారులు ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. ఒక్కో అంశానికి మొదట పేర్కొన్న తేదీలను ఎప్పటికప్పుడు కుదిస్తూ తుది జాబితాలను సిద్ధం చేయడంతో ఆయా అంశాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వా టి పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొంటు న్నారు. దీంతో ఎన్నికలకు హడావుడిగా జరుగుతున్న ఏర్పాట్లను చూసి రాజకీయ పార్టీల్లోను వేడిపుట్టింది. వెంటనే సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. అధిష్టానాలు జిల్లా నాయకత్వాలకు మున్సిపల్ పోరుకు సన్నద్ధతపై కొన్ని సూచనలు చేశాయి. టీఆర్ఎస్, బీజేపీలు ఇదే సందర్భంలో సభ్యత్వ కార్యక్రమాలు తెరపైకి తెచ్చాయి. వరుస ఓటమిలతో డీలా పడ్డ కాం గ్రెస్ సైతం వ్యూహాలకు పదును పెడుతోంది. కోర్టు ఉత్తర్వులతో.. వార్డుల విభజనలో గందరగోళంపై స్థానిక అధికారులు తీసుకున్న చర్యలకు సంతృప్తి చెందని వారు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పలుచోట్ల న్యాయస్థానానికి వెళ్లడంతో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు మొదలయ్యాయి. జిల్లాలో సుల్తానాబాద్ మున్సిపాలిటీగా వార్డుల విభజన సక్రమంగా జరుగలేదని, పెద్దపల్లిలో సైతం ముస్లిం ఓటర్లకు అన్యాయం జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఇష్టానుసారంగా వార్డులను విభజించారని మాజీ వార్డు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. 29న కీలక నిర్ణయం.. పలు చోట్ల పిటిషనర్ల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలను సరిచేసే వరకు ఎన్నికలకు వెళ్లమంటూ ఈసీ తమకు తెలిపిందని సోమవారం జరిపిన విచారణ సందర్భంలో హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు విచారణను 29కి వాయిదా వేసింది. 29న హైకోర్టు తీసుకునే నిర్ణయం మున్సిపోల్స్‌పై ప్రభావం చూపనుంది. కొందరు ఇప్పటికే నెల నుంచి రెండునెలలు వాయిదాపడవచ్చని, మరికొందరు 3 నెలలు వాయిదా పడవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణలో కోర్టు నిర్ణయం ఏముంటుంది.. ఎన్నికల ప్రక్రియలో ఎంత ఆలస్యం జరుగనుందనేది 29న తేలనుంది. -
పుర ప్రణాళిక రూ.1766.56కోట్లు
- వార్డుల్లో మూడు పనులు - పట్టణాల్లో అయిదు అవసరాలు - ప్రాధాన్య అంశాలకే పెద్దపీట - పట్టణాలకు రూ.1128.88 కోట్లు - వార్డులకు రూ.637.68 కోట్లు - వివిధ పద్దుల నుంచి సర్దుబాటు సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ప్రణాళికలో భాగంగా కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతోపాటు సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలు, హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, పెద్దపల్లి, వేములవాడ నగర పంచాయతీల్లో వార్డు సభలు నిర్వహించారు. వ్యక్తిగత అర్జీలను పక్కనబెట్టి.. సామాజిక అవసరాలకు గుర్తించిన పనులను ప్రాధాన్య క్రమంలో పరిగణనలోకి తీసుకున్నారు. అత్యధిక వార్డుల్లో సీసీ రోడ్లు, తాగునీటి పైపులైన్లకు సంబంధించిన అర్జీలు వెల్లువెత్తాయి. మొత్తంగా ప్రతీవార్డుకు మూడు పనుల చొప్పున.. అన్ని పట్టణాల్లోని వార్డు ప్రణాళికల అంచనా వ్యయం రూ.637.68 కోట్లకు చేరింది. వీటికితోడుగా నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ పాలకవర్గాలు పట్టణ ప్రణాళికలు సిద్ధం చేశాయి. అందులో పట్టణ ప్రజల మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. తాగునీటి సరఫరా, రోడ్లు, వీధి దీపాలు, డ్రెయినేజీలకు తొలి ప్రాధాన్యమిచ్చారు. పార్కులు, ప్లే గ్రౌండ్లు, కమ్యూనిటీ హాళ్లకు తదుపరి వరుసలో చోటు కల్పించారు. జిల్లాలోని మొత్తం 11 పట్టణాల ప్రణాళికల అంచనా వ్యయం రూ.1128.88 కోట్లుగా లెక్కతేలింది. జిల్లా కేంద్రం కావటంతో కరీంనగర్ కార్పొరేషన్లో అత్యధికంగా రూ.228.30 కోట్ల అంచనా వ్యయమయ్యే పనులను గుర్తించారు. రామగుండంలో రూ.130.15 కోట్ల పనులను ప్రణాళికలో పొందుపరిచారు. మున్సిపాలిటీల్లో అత్యధికంగా కోరుట్లలో రూ.130.21 కోట్లు లెక్కతేల్చారు. ఇంచుమించుగా కార్పొరేషన్లతో పోటీ పడ్డట్లుగా హుస్నాబాద్ నగర పంచాయతీ రూ.167 కోట్లు, జమ్మికుంటలో రూ.136.18 కోట్లతో ప్రణాళిక సమర్పించింది. ఈ ప్రణాళికల ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు వార్డు, పట్టణ ప్రణాళికలకు సంబంధించిన నిధులను వివిధ పద్దుల నుంచి సర్దుబాటు చేసుకోవాలని ఇటీవలే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కమిషనర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 13వ ఆర్థిక సంఘం, బీఆర్జీఎఫ్, ఎంపీ, ఎమ్మెల్యే ల్యాడ్స్, జనరల్ ఫండ్ నుంచి ఈ నిధులను సమకూర్చుకోవాలని సూచించింది. -
ఓటెత్తిన చైతన్యం
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు, కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, సిరిసిల్ల మున్సిపాలిటీలు, జమ్మికుంట, వే ములవాడ, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్ నగర పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. జిల్లావ్యాప్తంగా 7,10,654 మంది ఓటర్లుండగా 41,84,480 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కరీంనగ ర్ కార్పొరేషన్లో తక్కువగా 60 శాతం పోలింగ్ నమోదు కాగా.. హుస్నాబాద్ నగరపంచాయతీలో అత్యధికంగా 85.09 శాతం పోలింగ్ జరిగింది. 5గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో వంద మందికిపైగా కార్మికులు, కూలీలు పని ముగించుకుని సాయంత్రం 4గంటలకు స్థానిక 13వ డివిజన్లో ఉన్న ఆర్సీవో క్లబ్‌కు ఓటేసేందుకు వచ్చారు. దీంతో వారికీ ఓటు వేసే అవకాశం కల్పించడంతో ఈ కేంద్రంలో రాత్రి 7గంటల వరకు పోలింగ్ జరిగింది. 24, 29, 42వ డివిజన్లలో ఈవీఎంలు మొరాయించగా వాటికి మరమ్మతులు చేపట్టి గంట తర్వాత ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈవీఎంలపై పోలింగ్ సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడంతో హుజూరాబాద్‌లోని 15 వార్డులలో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. సిరిసిల్లలో మున్సిపాలిటీ 5వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి యశ్వంత్‌కు నల్లా గుర్తు కేటాయించిన అధికారులు ఈవీఎంలో బోరింగ్ గుర్తు ఇవ్వడంతో అతడు నిరసనకు దిగాాడు. చివరకు 45 నిమిషాల ఆలస్యంతో యశ్వంత్‌కు నల్లాగుర్తు ఇచ్చిపోలింగ్ ప్రారంభించారు. చెదురుమదురు సంఘటనలు కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో స్వల్ప ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు పోలింగ్ కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. 23వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి తాటి ప్రభావతిపై మరో పార్టీకి చెందిన అభ్యర్థి బంధువులు దాడి చేశారు. గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. 39వ డివిజన్లో ఓట్లు గల్లంతవ్వడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. పోలింగ్‌స్టేషన్ వద్దకు చేరుకున్న ఆర్డీవో చంద్రశేఖర్‌ను అడ్డుకున్నారు. డీఎస్పీ రవీందర్ అక్కడికి చేరుకొని అడ్డుగా ఉన్నవారిని తొలగించడంతో ఆర్డీవో వెళ్లిపోయారు. 11వ డివిజన్లో 400 ఓట్లు గల్లంతయ్యాయని ఓటర్లు బాలికల ప్రభుత్వ పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఓటరు స్లిప్పులు ఉన్నా ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడంతో ఓటు వేయలేపోతున్నాయని కార్పొరేషన్ కమిషనర్ కె.రమేశ్‌తో మొరపెట్టుకున్నారు. 35వ డివిజన్లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చారని కొంతమంది యువకులపై కాంగ్రెసేతర అభ్యర్థులు గొడవకు దిగారు. దాడులకు ప్రయత్నించడంతో పోలీసులు పలువురిని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి, ఆ తర్వాత వదిలిపెట్టారు. రామగుండం కార్పొరేషన్లో పరిధిలోని 38వ డివిజన్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా పోలీసులు జోక్యం చేసుకొని లాఠీచార్జీలతో ఇరువర్గాలను చెల్లాచెదురు చేశారు. రామగుండం కార్పొరేషన్ రాంనగర్లో రోడ్లపై టెంట్లు వేసి గుంపులు గుంపులుగా ఉండడంతో పోలీసులు గుంపులను చెదరగొట్టడానికి స్వల్పంగా లాఠీచార్జీ చేశారు. రోడ్ల పక్కన వేసిన టెంట్లను కూల్చివేశారు. హుస్నాబాద్ 3వ వార్డులో పోలైన ఓట్లకు, ఈవీఎంలో నమోదైన ఓట్లకు ఒక్క ఓటు తేడా రావడంతో గందరగోళం నెలకొంది. వార్డులో 735 మంది ఓటర్లు ఉండగా, 634 ఓట్లు పోలైనట్లు అధికారులు చెప్పారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలో 633 ఓట్లే పోలైనట్లు చూపింది. అధికారులు ఒక ఓటరను నమోదు చేసుకునే సందర్భంలో ఎర్రర్ వచ్చిందని, అందుకనే ఓటు నమోదు కాలేదని పోలింగ్ అధికారి నరహరి తెలిపారు. ఈ ఓటు విషయంపై తర్జనభర్జనలు జరిగిన తరువాత ఏజెంట్లు ఈవీఎంల తరలింపునకు ఒప్పుకోవడంతో వివాదం సద్దుమణిగింది. పెద్దపల్లిలో ఓ అభ్యర్థి దొంగ ఓట్లను వేయిస్తున్నాడనే అనుమానంతో ఏజంట్లు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అభ్యర్థి మద్దతుదారుల వచ్చి ఆందోళన చేయడంతో పోలీసులు స్వల్పగా లాఠీచార్జి చేశారు. రామగుండం కార్పొరేషన్ 38వ డివిజన్ వీర్లపల్లిలో కాంగ్రెస్, టీబీజీకేఏస్ మద్దతుదారుల మధ్య తోపులాట జరిగింది. పోలింగ్‌బూత్‌కు కొద్దిదూరంలో కాంగ్రెస్ అభ్యర్థి గూళ్ల వెంకటరమణ బంధువులు, టీఆర్ఎస్ నాయకులు వాగ్వివాదానికి దిగారు. పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. రామగుండం 32వ డివిజన్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతవారణం చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు దాడికి యత్నం చేయగా పోలీసులు చెదరగొట్టారు. కరీంనగర్ 20వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో ఇతర అభ్యర్థులను లోనికి అనుమతించి, తనను అడ్డుకోవడంపై స్వతంత్ర అభ్యర్థి ఆది మల్లేశం పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. జనం గుమిగూడటంతో ఉద్రిక్తత ఏర్పడగా పోలీసులు అందరినీ చెదరగొట్టారు. ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు కరీంనగర్‌లోని 16వ డివిజన్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఓటుహక్కు వినియోగించుకున్నారు. 14వ డివిజన్లో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, 36 డివిజన్లో ఎంపీ పొన్నం ప్రభాకర్ ఓటు వేశారు. మెట్‌పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఓటు వేశారు. వేములవాడలో ఎమ్మెల్యే చెన్నెమనేని రమేశ్‌బాబు, రామగుండంలో 46వ డివిజన్లోని ప్రజా పాఠశాలలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఓటుహక్కు వినియోగించుకున్నారు.