- వార్డుల్లో మూడు పనులు
- పట్టణాల్లో అయిదు అవసరాలు
- ప్రాధాన్య అంశాలకే పెద్దపీట
- పట్టణాలకు రూ.1128.88 కోట్లు
- వార్డులకు రూ.637.68 కోట్లు
- వివిధ పద్దుల నుంచి సర్దుబాటు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ప్రణాళికలో భాగంగా కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతోపాటు సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలు, హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, పెద్దపల్లి, వేములవాడ నగర పంచాయతీల్లో వార్డు సభలు నిర్వహించారు. వ్యక్తిగత అర్జీలను పక్కనబెట్టి.. సామాజిక అవసరాలకు గుర్తించిన పనులను ప్రాధాన్య క్రమంలో పరిగణనలోకి తీసుకున్నారు. అత్యధిక వార్డుల్లో సీసీ రోడ్లు, తాగునీటి పైపులైన్లకు సంబంధించిన అర్జీలు వెల్లువెత్తాయి. మొత్తంగా ప్రతీవార్డుకు మూడు పనుల చొప్పున.. అన్ని పట్టణాల్లోని వార్డు ప్రణాళికల అంచనా వ్యయం రూ.637.68 కోట్లకు చేరింది.
వీటికితోడుగా నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ పాలకవర్గాలు పట్టణ ప్రణాళికలు సిద్ధం చేశాయి. అందులో పట్టణ ప్రజల మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. తాగునీటి సరఫరా, రోడ్లు, వీధి దీపాలు, డ్రెయినేజీలకు తొలి ప్రాధాన్యమిచ్చారు. పార్కులు, ప్లే గ్రౌండ్‌లు, కమ్యూనిటీ హాళ్లకు తదుపరి వరుసలో చోటు కల్పించారు. జిల్లాలోని మొత్తం 11 పట్టణాల ప్రణాళికల అంచనా వ్యయం రూ.1128.88 కోట్లుగా లెక్కతేలింది. జిల్లా కేంద్రం కావటంతో కరీంనగర్ కార్పొరేషన్‌లో అత్యధికంగా రూ.228.30 కోట్ల అంచనా వ్యయమయ్యే పనులను గుర్తించారు.
రామగుండంలో రూ.130.15 కోట్ల పనులను ప్రణాళికలో పొందుపరిచారు. మున్సిపాలిటీల్లో అత్యధికంగా కోరుట్లలో రూ.130.21 కోట్లు లెక్కతేల్చారు. ఇంచుమించుగా కార్పొరేషన్లతో పోటీ పడ్డట్లుగా హుస్నాబాద్ నగర పంచాయతీ రూ.167 కోట్లు, జమ్మికుంటలో రూ.136.18 కోట్లతో ప్రణాళిక సమర్పించింది. ఈ ప్రణాళికల ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు వార్డు, పట్టణ ప్రణాళికలకు సంబంధించిన నిధులను వివిధ పద్దుల నుంచి సర్దుబాటు చేసుకోవాలని ఇటీవలే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 13వ ఆర్థిక సంఘం, బీఆర్‌జీఎఫ్, ఎంపీ, ఎమ్మెల్యే ల్యాడ్స్, జనరల్ ఫండ్ నుంచి ఈ నిధులను సమకూర్చుకోవాలని సూచించింది.
పుర ప్రణాళిక రూ.1766.56కోట్లు
Published Wed, Aug 13 2014 4:01 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement