ప్రాణాలతో ‘సెల్’గాటం | Survivors 'cell' game | Sakshi
Sakshi News home page

ప్రాణాలతో ‘సెల్’గాటం

Published Thu, Jan 16 2014 3:39 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

Survivors 'cell' game

 కోల్‌సిటీ, న్యూస్‌లైన్ : 2014 జనవరి 15 : మెట్‌పల్లి మండలం రంగరావుపేటలో వాగ్మేరా జయప్రకాశ్(30) అనే ఇటుకబట్టి కార్మికుడు చార్జింగ్‌లో ఉన్న సెల్‌ఫోన్‌ను ఆపరేట్ చే స్తుండగా విద్యుత్‌షాక్ వచ్చి చనిపోయాడు. మృతుడు ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్‌లోని గుండాల వాస్తవ్యుడు.
 
 2014 జనవరి 10 : ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం మాలన్‌గొంది గోండుగూడకు చెందిన చాకటి బాపురావు(35) రాత్రి సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుత్‌షాక్‌తో మరణించాడు. ఇతడికి భార్య, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. అంతకు ఒకరోజు ముందు ఉట్నూర్ మండలం హీరాపూర్‌లో పదో తరగతి విద్యార్థి మెస్రం ప్రభాకర్ చార్జింగ్‌కు పెట్టిన సెల్‌ఫోన్ తీస్తూ విద్యుదాఘాతానికి గురై కనుమూశాడు.
 
 2013 జనవరి 20 : గోదావరిఖని ఐబీ కాలనీ సమీపంలో తుడిచర్ల వినీత్‌కుమార్ అనే 9వ తరగతి విద్యార్థి ఇంట్లోని సెల్‌ఫోన్‌లో బ్యాటరీ మార్చుతుండగా, బాంబ్ తరహాలో పేలింది. బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
 
 ఇలా... సెల్‌ఫోన్‌తో నిత్యం ఏదో ఒక ప్రమాదం... ఈ సంఘటనలన్నింటికీ సెల్‌ఫోన్ల వినియోగంపై అవగాహన లేకపోవడం... నాసిరకం చార్జర్లు, బ్యాటరీలు, నకిలీ సెల్‌ఫోన్ల వినియోగమే కారణం.
 
 సెల్‌ఫోన్ల వినియోగంపై అవగాహన కొరవడుతుండడంతో రోజుకోచోట ప్రమాదాలు జరుగుతున్నాయి. మార్కెట్లోకి నకిలీ మొబైల్‌ఫోన్లు, బ్యాటరీలు, చార్జర్లు తదితర విడిభాగాలు పుట్టగొడుగుల్లా వస్తున్నాయి. తక్కువ ధరకు అన్ని ఫీచర్లు కలిగిన ఫోన్ కావడంతో ప్రజలు ఇలాంటి వాటినే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రోజుకోచోట నకిలీ సెల్‌ఫోన్లు, బ్యాటరీలు పేలుతున్నాయి. కొందరు తీవ్రంగా గాయపడుతుండగా... మరికొందరు ప్రాణాలే కోల్పోతున్నారు. జిల్లాలో కోట్లలో నకిలీ మొబైల్ ఫోన్ల విక్రయాలు బహిరంగంగా సాగుతున్నా... సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు. నోకియా, సామ్‌సాంగ్, ఎల్జీ, సోనీ, మైక్రోమ్యాక్స్, ఆపిల్, హెచ్‌టీసీ తదితర ప్రముఖ కంపెనీల మోడల్ ఫోన్ల తరహాలో ఉండే... నకిలీ ఫోన్లు మార్కెట్‌లో హాల్‌చల్ చేస్తున్నాయి. జిల్లాలోని ఏ మొబైల్‌షాపు చూసినా... నకిలీలు దర్శనమిస్తున్నాయి.
 
 పముఖ కంపెనీ పేర్లతో ఉండే నకిలీ సెల్‌ఫోన్లు, బ్యాటరీలు, చార్జర్లు, విడిభాగాలను విక్రయించే వ్యాపారులు వాటికి రశీదులు కూడా ఇవ్వరు. బ్రాండెడ్ కంపెనీలకు కూడా దుకాణం పేరు లేని ఎస్టిమేట్ బిల్ ఇచ్చి తప్పించుకుంటున్నారు. ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆర్థిక నష్టం జరుగుతుండగా ఈ ఫోన్లు వినియోగదారులకు ప్రమాదకరంగానూ మారుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement