‘బార్ కోడ్’ మరిచారు!
మెట్‌పల్లి : జిల్లాలో మద్యం విక్రయాల్లో బార్‌కోడ్ విధానం అమలు ప్రకటనలకే పరిమితమైంది. కల్తీ, పన్ను చెల్లించని మద్యాన్ని అరికట్టడంతో పాటు ఎమార్పీకే మద్యం విక్రయించేలా చూడటానికి ప్రభుత్వం బార్‌కోడ్ విధానాన్ని అమలు చేయాలని ఎక్సైజ్ శాఖకు సూచించింది. కానీ ఆ శాఖ అధికారులు ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. బార్‌కోడ్ సామగ్రిని సమకూర్చడానికి వ్యాపారుల నుంచి డబ్బును వసూలు చేసిన అధికారులు.. దుకాణాలకు ఇచ్చిన లెసైన్స్ గడువులో ఐదునెలలు పూర్తయినా ఇంతవరకు సామగ్రిని వారికి అందజేయలేదు. దీనివల్ల బార్‌కోడ్ అమలు ప్రశ్నార్థకంగా మారింది.
జూలై నుంచే అమలు చేయాల్సి ఉన్నా...
ప్రస్తుతం జిల్లాలో 301 మద్యం దుకాణాలు, 44 బార్లు ఉన్నాయి. ఇందులో దుకాణాలకు జూన్‌తోనే లెసైన్స్ గడువు ముగియగా, టెండర్లు నిర్వహించి జూలై ఒకటి నుంచి తిరిగి వాటిని పునరుద్ధరించారు. వీటి కాల పరిమితి 2015 జూన్ 30తో ముగుస్తుంది. అధికారులు జూలై నుంచే దుకాణాల్లో బార్ కోడ్ విధానం అమలు చేస్తామని ప్రకటించారు. కానీ లెసైన్స్ గడువులో ఐదు నెలలు పూర్తయినా ఇంతవరకు దానిని అమలు చేయకపోవడం గమనార్హం.
ముక్కుపిండి వసూలు..
బార్‌కోడ్ సామగ్రిని సమకూర్చడానికి ఎక్సైజ్ అధికారులు మద్యం వ్యాపారుల నుంచి రూ.92వేలు, బార్ల నిర్వాహకుల నుంచి రూ.80వేల చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. వ్యాపారుల్లో చాలా మంది సామగ్రి కొనుగోలు చేయడానికి మొదట్లో మొండికేశారు. దీంతో అధికారులు వారికి మద్యం సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో గత్యంతర ం లేక ఈ సొమ్మును చెల్లించారు. ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సామగ్రిని సమకూరుస్తున్న ఎక్సైజ్ శాఖ మార్కెట్ ధర కంటే ఎక్కువ మొత్తాన్ని వ్యాపారుల నుంచి వసూలు చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పూర్తి కాని సాఫ్ట్‌వేర్ అనుసంధానం..
బార్‌కోడ్ విధానం అమలును పర్యవేక్షించే బాధ్యతను రాష్ర్ట స్థాయిలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి అప్పజెప్పారు. ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు మద్యం డిపోతో పాటు ఎక్సైజ్ స్టేషన్లు, కొన్ని మద్యం దుకాణాలకు మాత్రమే సామగ్రి అందింది. పూర్తి స్థాయిలో అన్ని దుకాణాలకు సామగ్రి చేరితేనే సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేయడానికి అవకాశముంటుంది. వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసిన అధికారులు సామగ్రిని సమకూర్చే విషయంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నారు. దీనివల్లనే బార్‌కోడ్ అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
అమలు ఎప్పుడన్నది చెప్పలేం
- సుధీర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్
అన్ని దుకాణాలకు ఇంకా సామగ్రి అందలేదు. వీటిని సమకూర్చే ప్రైవేట్ సంస్థ జాప్యం చేస్తోంది. అందువల్ల బార్‌కోడ్ విధానాన్ని ఎప్పటినుంచి అమలు చేస్తామన్నది చెప్పలేం.