exercise department
-
ఆన్లైన్ గుబులు
ఆన్లైన్ బిల్లింగ్ విధానం మద్యం వ్యాపారుల్లో గుబులు రేపుతోంది. ఇష్టారాజ్యంగా విక్రయాలు సాగించి భారీగా లాభపడొచ్చన్న ఆశతో లెసైన్స్‌లు దక్కించుకున్న వ్యాపారులు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. లిక్కర్ బాటిళ్లపై హోలోగ్రామ్‌ను అమర్చి.. సూపర్ మార్కెట్ల తరహాలో ఆన్లైన్ కంప్యూటర్ బిల్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఎక్సైజ్ కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి మద్యం దుకాణంలో బిల్లింగ్‌ను కమిషనర్ కార్యాలయంతో అనుసంధానం చేయనున్నారు. ఆగస్టు నుంచి ఈ విధానాన్ని అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు. దీనివల్ల ఇటు వ్యాపారులు, అటు ఎక్సైజ్ అధికారుల అక్రమార్జనకు చెక్ పడనుంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం : మద్యం అమ్మకాల్లో సరికొత్త విధానానికి ఎక్సైజ్‌శాఖ రెండేళ్ల కిందటే శ్రీకారం చుట్టింది. అయితే.. అది అమల్లోకి రాలేదు. ప్రస్తుతం ఆ విధానాన్ని అమలు చేసేందుకు ఎక్సైజ్ కమిషనర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నకిలీ మద్యాన్ని నివారించి, నాణ్యతతో పాటు మద్యం తయారీ, అమ్మకాలపై పారదర్శకత పాటించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మద్యం సీసాలపై హోలోగ్రామ్ వేసి.. నూతన కంప్యూటర్ బిల్లింగ్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానం ఆగస్టు నుంచి అమల్లోకి రానుంది. ప్రతి మద్యం దుకాణంలో ఆన్లైన్ కంప్యూటర్ బిల్లింగ్‌కు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేస్తారు. సూపర్ మార్కెట్ తరహాలో మద్యం విక్రయించగానే కంప్యూటర్ స్క్రాచ్ ద్వారా బిల్లు వేయాలి. దాని ప్రతిని కొనుగోలుదారుడికి అందజేయాలి. ఈ బిల్లు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయానికి చేరుతుంటాయి. అలాగే ప్రతి మద్యం సీసాపై హోల్‌గ్రామ్ వేస్తారు. దానిపై సీరియల్ నెంబర్‌ను ముద్రిస్తారు. ఆ నెంబర్ ఆధారంగా సీసాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. బాటిల్‌పై ఓ టోల్‌ఫ్రీ నెంబరును కూడా ముద్రిస్తారు. తాను కొన్న మద్యం సీసా గురించి తెలుసుకోవాలనుకునే కొనుగోలుదారుడు సీసాపై ఉన్న టోల్‌ఫ్రీ నెంబరుకు ఎస్ఎంఎస్ పంపితే చాలు. క్షణాల్లో ఆ సీసా ఎప్పుడు, ఎక్కడ తయారు చేశారు? ఏ మద్యం గోదాము నుంచి వచ్చింది? ఏ దుకాణానికి అమ్మారు? అనే వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో అందుతాయి. అక్రమ ప్రవాహానికి అడ్డుకట్ట ప్రస్తుతం మద్యం సీసాలపై లేబుల్స్ ఉన్నాయి. కొందరు మాఫియా అవతారమెత్తి నకిలీ లేబుళ్లను తయారు చేస్తున్నారు. తద్వారా నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. కర్ణాటక నుంచి అక్కడి మద్యాన్ని భారీగా దిగుమతి చేస్తున్నారు. అక్కడ మద్యం ధరలు తక్కువ. పైగా ట్యాక్స్ వెసులుబాటు ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని మద్యం వ్యాపారులు భారీగా ఆర్జిస్తున్నారు. ఈ చర్యలతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. కొత్త విధానం ద్వారా దీన్ని పూర్తిగా నివారించే అవకాశముంది. అలాగే నకిలీ మద్యం తాగిన వారు అనారోగ్యాలకు గురవుతున్నారు. కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. హోల్‌గ్రామ్ విధానం అమలైతే మద్యం సీసాలపై ఉండే నెంబరు ఆధారంగా అది ఎక్కడ తయారైందనే విషయం స్పష్టమవుతుంది. దీనివల్ల నకిలీ మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసే అవకాశముంది. జిల్లాలో ప్రస్తుతం ప్రతి నెలా రూ.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. కొత్త విధానం అమలైతే ఎక్సైజ్ ఆదాయం మరింత పెరిగే అవకాశముంది. వ్యాపారుల వెనకడుగు ఆన్లైన్ విధానం అమలుపై మద్యం వ్యాపారుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దుకాణాలు కొత్తగా ప్రారంభమైనా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్నారు. బాటిల్‌పై బ్రాండ్‌ను బట్టి రూ.10-30 అధికంగా వసూలు చేస్తున్నారు. ఆన్లైన్ బిల్లింగ్ పెడితే ఎమ్మార్పీకే విక్రయించాలి. పైగా కంప్యూటర్ల కోసం రూ.90 వేలు చెల్లించాలి. దీంతో వ్యాపారులు వెనకడుగు వేస్తున్నారు. అయితే.. ఆబ్కారీ అధికారులు మాత్రం ‘కార్వే’ సంస్థ ద్వారా సాఫ్ట్‌వేర్‌తో పాటు మిషనరీ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రతినెలా రూ.5వేలు అద్దె చెలిస్తే మిషనరీ అమరుస్తారు. లేదంటే రూ.90 వేలు పెట్టి కొనాల్సి ఉంటుంది. గతేడాది కూడా వ్యాపారుల నుంచి రూ.90వేల చొప్పున వసూలు చేశారు. మిషనరీ మాత్రం అమర్చలేదు. దీంతో వారు డబ్బు తిరిగివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త దుకాణాలు దక్కించుకున్నవారితో ఆ డబ్బు ఇప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందరూ అద్దెకు తీసుకుంటామంటున్నారు ఆన్లైన్ బిల్లింగ్ ఆగస్టు నుంచి అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కార్వే సంస్థ సాఫ్ట్వేర్ అందిస్తోంది. అందరూ అద్దె ప్రాతిపదికర మిషనరీ కొనుగోలు చేస్తామంటున్నారు. గతేడాది డబ్బు చెల్లించిన వారికి కొత్త వ్యాపారుల నుంచి ఇప్పిస్తాం. ఇది పెద్ద సమస్య కాబోదు. - జీవన్‌సింగ్, డిప్యూటీ కమిషనర్, ఎకై ్సజ్‌శాఖ -
కల్తీ కిక్కు
సాక్షి, కర్నూలు: జిల్లాలో కొందరు మద్యం వ్యాపారులు అక్రమార్జనకు తెరతీశారు. కొన్నేళ్లుగా కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకే పరిమితమైన ఈ బాగోతం జిల్లాలోనూ ఊపందుకుంది. మద్యం సీసా బిరాడాను తొలగించి అందులోని మద్యాన్ని సగం తీసి నీళ్లు కలుపుతున్నారు. మరికొందరు నాసి రకం మద్యం కలిపి మందుబాబుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాలో కల్తీమద్యం తీవ్రత అధికంగా ఉన్నట్లు గుర్తించినప్పటికీ చర్యలకు వెనుకంజ వేస్తోంది. ఇక జిల్లా విషయానికొస్తే ఎమ్మిగనూరు, మిగతా 2వ పేజీలో ఠ కల్తీ కిక్కు ఆదోని, నంద్యాల, కర్నూలు, డోన్ తదితర ప్రాంతాల్లో ఈ తరహా దందా జోరందుకుంది. జిల్లాలోని రెండు ఎక్సైజ్ డివిజన్ల పరిధిలో 194 మద్యం దుకాణాలు, 36 బార్లు ఉన్నాయి. 2001 సంవత్సరంలో జిల్లాలో మద్యం అమ్మకాలు రూ.75 కోట్లు కాగా.. 2015కు వచ్చే సరికి అమ్మకాలు రూ.840 కోట్లకు చేరుకున్నాయి. ప్రతినెలా జిల్లాలో రూ.70 కోట్ల నుంచి రూ. 75 కోట్ల మద్యం అమ్మకాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు వక్రమార్గం ఎంచుకున్నారు. సీసాల మూతలను నిపుణులతో చాకచక్యంగా తీయించి కల్తీ చేస్తున్నారు. ఫలితంగా ఒక సీసాకు రెండు సీసాల ధర లభిస్తోంది. ఇలా కల్తీ మద్యం అమ్మకాతో జిల్లా వ్యాప్తంగా నెలకు రూ.10 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. ఏం చేస్తున్నారు? సీసాల సీల్ తొలగింపు.. కల్తీ మద్యం తయారీ చీకటి వేళ జరిగిపోతోంది. ఇందుకోసం ప్రత్యేక నిపుణులను నియమించుకుంటున్నారు. అయితే ఈవేవీ ఎక్సైజ్ శాఖ దృష్టికి రాకపోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 14 ఎక్సైజ్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. కల్తీ మద్యం తయారీ వ్యవహారం వెలుగుచూస్తే.. సాంకేతికంగా పరిశీలించాల్సి ఉంది. అయితే అలాంటివేవీ అధికారులు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మద్యం అమ్మకాలు పెంచాలని ఆదేశాలు ఉండడం, ఇతరత్రా బహిరంగ విషయాలు ఉండడంతో సదరు అధికారులు కొందరు సందర్భోచితంగా స్పందించడం లేదని తెలుస్తోంది. కేసుల నమోదు కూడా నామమాత్రంగా ఉండడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. జిల్లాలో ఎమ్మిగనూరు, డోన్, నంద్యాల ప్రాంతాలు కల్తీకి కేంద్రంగా మారినట్లు సమాచారం. అమ్మకాలను పెంచుకోవాలని చూస్తున్న క్రమంలో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ కల్తీ మద్యం తయారీ విచ్చలవిడిగా సాగుతున్నా అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. రోజుకు రూ.500 కూలి సీసాల సీల్ ఎవరికీ అనుమానం రాకుండా తొలగించి.. కల్తీ మద్యం తయారు చేయడానికి ఎమ్మిగనూరుకు చెందిన ఓ వ్యాపారి హైదరాబాద్ నుంచి నిపుణులను ప్రత్యేకంగా రప్పించినట్లు సమాచారం. ఇందుకోసం ఒక్కొక్కరికి రోజుకు రూ.500 చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి మద్యం దుకాణాల నుంచి కేసులు అందజేసి.. వాటితో తాగి పడేసిన ఖాళీ సీసాల ద్వారా కల్తీ మద్యం తయారీ చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తంతు డోన్, నంద్యాల పరిసరాల్లోనూ సాగుతోంది. విషయం ఉన్నతాధికారులకు తెలిసినా.. చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. -
‘బార్ కోడ్’ మరిచారు!
మెట్పల్లి : జిల్లాలో మద్యం విక్రయాల్లో బార్కోడ్ విధానం అమలు ప్రకటనలకే పరిమితమైంది. కల్తీ, పన్ను చెల్లించని మద్యాన్ని అరికట్టడంతో పాటు ఎమార్పీకే మద్యం విక్రయించేలా చూడటానికి ప్రభుత్వం బార్కోడ్ విధానాన్ని అమలు చేయాలని ఎక్సైజ్ శాఖకు సూచించింది. కానీ ఆ శాఖ అధికారులు ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. బార్కోడ్ సామగ్రిని సమకూర్చడానికి వ్యాపారుల నుంచి డబ్బును వసూలు చేసిన అధికారులు.. దుకాణాలకు ఇచ్చిన లెసైన్స్ గడువులో ఐదునెలలు పూర్తయినా ఇంతవరకు సామగ్రిని వారికి అందజేయలేదు. దీనివల్ల బార్కోడ్ అమలు ప్రశ్నార్థకంగా మారింది. జూలై నుంచే అమలు చేయాల్సి ఉన్నా... ప్రస్తుతం జిల్లాలో 301 మద్యం దుకాణాలు, 44 బార్లు ఉన్నాయి. ఇందులో దుకాణాలకు జూన్‌తోనే లెసైన్స్ గడువు ముగియగా, టెండర్లు నిర్వహించి జూలై ఒకటి నుంచి తిరిగి వాటిని పునరుద్ధరించారు. వీటి కాల పరిమితి 2015 జూన్ 30తో ముగుస్తుంది. అధికారులు జూలై నుంచే దుకాణాల్లో బార్ కోడ్ విధానం అమలు చేస్తామని ప్రకటించారు. కానీ లెసైన్స్ గడువులో ఐదు నెలలు పూర్తయినా ఇంతవరకు దానిని అమలు చేయకపోవడం గమనార్హం. ముక్కుపిండి వసూలు.. బార్కోడ్ సామగ్రిని సమకూర్చడానికి ఎక్సైజ్ అధికారులు మద్యం వ్యాపారుల నుంచి రూ.92వేలు, బార్ల నిర్వాహకుల నుంచి రూ.80వేల చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. వ్యాపారుల్లో చాలా మంది సామగ్రి కొనుగోలు చేయడానికి మొదట్లో మొండికేశారు. దీంతో అధికారులు వారికి మద్యం సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో గత్యంతర ం లేక ఈ సొమ్మును చెల్లించారు. ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సామగ్రిని సమకూరుస్తున్న ఎక్సైజ్ శాఖ మార్కెట్ ధర కంటే ఎక్కువ మొత్తాన్ని వ్యాపారుల నుంచి వసూలు చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి కాని సాఫ్ట్వేర్ అనుసంధానం.. బార్కోడ్ విధానం అమలును పర్యవేక్షించే బాధ్యతను రాష్ర్ట స్థాయిలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి అప్పజెప్పారు. ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు మద్యం డిపోతో పాటు ఎక్సైజ్ స్టేషన్లు, కొన్ని మద్యం దుకాణాలకు మాత్రమే సామగ్రి అందింది. పూర్తి స్థాయిలో అన్ని దుకాణాలకు సామగ్రి చేరితేనే సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేయడానికి అవకాశముంటుంది. వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసిన అధికారులు సామగ్రిని సమకూర్చే విషయంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నారు. దీనివల్లనే బార్కోడ్ అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అమలు ఎప్పుడన్నది చెప్పలేం - సుధీర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ అన్ని దుకాణాలకు ఇంకా సామగ్రి అందలేదు. వీటిని సమకూర్చే ప్రైవేట్ సంస్థ జాప్యం చేస్తోంది. అందువల్ల బార్కోడ్ విధానాన్ని ఎప్పటినుంచి అమలు చేస్తామన్నది చెప్పలేం. -
మోనోక్రోటోపాస్ వల్లే అస్వస్థత
బాధితులను పరామర్శించిన ఎక్సైజ్ డెరైక్టర్ నెల్లూరు(క్రైమ్): మోనోక్రోటోపాస్ కలిసిన కల్లు తాగడం వల్లే కలువాయి మండలానికి చెందిన పలువురు అస్వస్తతకు గురయ్యారని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ డెరైక్టర్ సూర్యప్రకాష్‌రావు స్పష్టం చేశారు. కల్లుతాగి తీవ్ర అస్వస్థతకు గురై నెల్లూరు రామచంద్రారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాపా శీనయ్య, కటారి పెంచలయ్య, కాపా బాబులను ఆయన పరామర్శించారు. కల్తీకల్లు తాగి తొమ్మిది మంది అస్వస్థతకు లోనైన విషయంపై ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ కమిషనర్ ఎస్ ఎస్ రావత్ స్పందించారు. పూర్తి విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆయన డెరైక్టర్ సూర్యప్రకాష్‌రావును ఆదేశించారు. దీంతో డెరైక్టర్ గురువారం చెన్నై నుంచి రోడ్డుమార్గాన నెల్లూరుకు చేరుకున్నారు. తొలుత రామచంద్రారెడ్డి హాస్పిటల్‌లోని ఐసీయూలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారి పరిస్థితిపై స్థానిక వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి మెరుగుగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఆయన అక్కడ నుంచి సంఘటన జరిగిన కలువాయి మండలం దాసరి పల్లికి వెళ్లాడు. కల్లుగీత కార్మికుడిని సంఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకునాన్నారు. కల్లుతాగి అస్వస్థతకు గురైన మిగిలిన వారిని విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుకుండల చుట్టూ ఈగలు, చీమలు, పురుగులు చేరకుండా కల్లుగీత కార్మికుడు మోనోక్రోటోపాస్ పురుగల మందు పూశాడన్నారు. అయితే వర్షం కారణంగా పురుగుల మందు కారి కుండలోని కల్లులో కలిసి పోయిందన్నారు. ఆ కల్లుతాగడం వల్లనే అస్వస్థతకు గురయ్యారన్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని రెండు, మూడురోజుల్లోనే వారు సైతం కోలుకుంటారని తెలిపారు. ఆయన వెంట ఆశాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్యమురళీ, నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీనివాస్ ఉన్నారు. పొదలకూరు: దాసరిపల్లిలో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై పొదలకూరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎక్సై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ సూర్యప్రకాష్విచారించారు. పొదలకూరు మీదుగా దాసరిపల్లి గ్రామానికి వెళ్లి కల్తీ కల్లుపై దర్యాప్తు చేపట్టిన ఆయన తిరుగు ప్రయాణంలో పొదలకూరులో ఆగి బాధితులు కోటేశ్వరరావు, కొమ్మి నారాయణ, ఫకీరయ్యను విచారించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసి మెరుగైన చికిత్సను అందిస్తామన్నారు. నిందితుడిపై కేసు నమోదు దాసరిపల్లి(కలువాయి): దాసరిపల్లిలో కల్తీకల్లు తాగి అస్వస్థతకు గురైన సంఘటనపై ఎక్సైజ్ అధికారులు విచారణ జరిపారు. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డెరైక్టర్ జి.సూర్యప్రకాష్ నెల్లూరు, పొదలకూరులో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం దాసరిపల్లిలో కల్లీకల్లు సంఘటనకు కారణమైన ఈత చెట్టును పరిశీలించారు. కల్లు విక్రేత వెరుబొట్లపల్లికి చెందిన ఆనెం శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
లిక్కర్.. నో ఫికర్!
సిద్దిపేట: పెద్దపెద్ద మాల్స్, సూపర్మార్కెట్లకే పరిమితమైన బార్కోడ్ బిల్లింగ్ సిస్టమ్ ఇక మద్యం దుకాణాల్లోనూ కానరానుంది. మద్యం బాటిల్‌ను స్కాన్‌చేసి వినియోగదారులకు బిల్లులు చేతికి అందేలా ఎక్సైజ్‌శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం హెడానిక్ పాత్ ఫైన్డర్ సిస్టమ్(హెచ్‌పీఎఫ్‌ఎస్)కు శ్రీకారం చుట్టనుంది. హెచ్‌పీఎఫ్‌ఎస్ అమలుతో నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌కు అడ్డుకట్ట వేయటంతోపాటు ఎంఆర్పీకే మద్యం అమ్మకాలు జరిగేలా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. త్వరలో జిల్లాలోని 162 దుకాణాల్లో మద్యం వ్యాపారులు తప్పనిసరిగా వినియోగదారు కోరిన మద్యం బ్రాండ్ సీసాను స్కాన్ చేసి కంప్యూటర్ బిల్లు ఇవ్వా ల్సి ఉంటుంది. ఇందుకోసం ఎక్సైజ్ శాఖ.. ప్రతి మద్యం బాటిల్‌పై బార్‌కోడింగ్ కూడుకున్న 2డీ హోల్గ్రామ్ను ఏరాఠ956?టు చేయనుంది. 2డీ హోలోగ్రామ్‌ను స్కాన్ చేసిన వెంటనే మద్యంబాటిల్ ఎప్పుడు ఉత్త అయ్యింది?అక్కడి నుంచి ప్రభుత్వ మద్యం నిల్వకేంద్రానికి ఎప్పుడు చేరుకుంది? ఆతర్వాత మద్యం షాపునకు ఎప్పుడువచ్చింది? తదితర వివరాలను కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. స్కాన్ పూర్తయిన వెంటనే మద్యం బాటిల్ హిస్టరీతోపాటు మినిమమ్ రిటైల్ ప్రైస్(ఎంఆర్పీ)తో కంప్యూటర్ బిల్లు వస్తుంది. ఈబిల్లును వ్యాపారులు వినియోగదారులకు తపసరిగా అందజేయాల్సిఉంటుంది. జిల్లాలో నాన్డ్యూటీపెయిడ్లిక్కర్ పెద్ద ఎత్తున అమ్ముడవుతున్నట్టుతెలుస్తోంది. లాభాల కోసం మద్యంవ్యాపారులు పొరుగునే ఉన్న కర్ణాటక,మహారాష్ట్ర నుంచి అక్రమంగా నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్(ఎన్డీపీ) తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు కొంతకాలంగాఆరోపణలున్నాయి. దీనివల్ల ప్రభుత్వఆదాయానికి పెద్ద ఎత్తున గండిపడుతోంది. దీనికితోడు మద్యం వ్యాపారులుఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యంఅమ్ముతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలో ఎక్సైజ్‌శాఖ ఎన్డీపీకి చెక్‌పెట్టడంతోపాటు ఎంఆర్పీ అమలుకుహెచ్పీఎఫ్ఎస్కు శ్రీకారం చుట్టినట్లుతెలుస్తోంది. రెండు నెలల్లో జిల్లా అంతటా అమలుజిల్లాలో రాబోయే రెండు మాసాల్లోపూర్తిస్థాయిలో హెచ్‌పీఎఫ్‌ఎస్ అమలుకు ఎక్సైజ్‌శాఖ చర్యలు చేపడుతోంది.ఇందుకోసం ఇటీవలే జిల్లాలోని మద్యంవ్యాపారులతో అవగాహన సదస్సులునిర్వహించింది. ఈ అవగాహన సదస్సులలో హెచ్‌పీఎఫ్‌ఎస్ నిర్వహణకు అవసరమయ్యే కంప్యూటర్, స్కానర్,ప్రింటర్లు తదితర పరికరాలు అందజేసేమూడు సంస్థలు పరికరాల పనితీరునుపవర్పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారావివరించారు. హెచ్‌పీఎఫ్‌ఎస్ కోసంమద్యం వ్యాపారులు తమ దుకాణాల్లోఒక కంప్యూటర్, బార్‌కోడింగ్ స్కానర్,ప్రింటర్ తపసరిగా ఏరాఠ956?టు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా మద్యం వ్యాపారులు హెచ్పీఎఫ్ఎస్ను తీవ్రంగావ్యతిరేకిస్తున్నారు. ఇపికే 13 శాతంపన్నులు చెల్లించటంతోపాటు పర్మిట్‌రూమ్ అనుమతులకు అదనపుడబ్బులు చెల్లించామని ఈ తరుణంలోఎక్సైజ్శాఖ తమపై మరింత భారంవేయటాన్ని అంగీకరించబోమని కరాఖండిగా చెబుతున్నారు. ఒక్కోమద్యంషాపులో కంప్యూటర్, బార్ కోడ్స్కానర్, ప్రింటర్ ఏరాు రూ.40నుంచి 50 వేలు ఖర్చు అవుతుందన్నారు. దీనికితోడు కంప్యూటర్ ఆపరేటర్‌కు కోరిన వేతనం చెల్లించాల్సిఉంటుందని ఈ భారం భరించటం తమవల్ల కాదని మద్యం వ్యాపారులుచేతులు ఎత్తివేస్తున్నారు. దీంతో జిల్లాలోఎక్సైజ్శాఖ ప్రతిష్టాత్మకంగా అమలుచేయాలనుకుంటున్న హెచ్పీఎఫ్సీవిజయవంతం అవుతుందా లేదాఅన్నది వేచి చూడాల్సిందే. -
బోణీయే కాలేదు
సాక్షి, గుంటూరు: మద్యం దుకాణాలకు కొత్త లెసైన్సులు పొందేందుకు ఎక్సయిజ్ శాఖ చేపట్టిన దరఖాస్తుల స్వీకరణకు వ్యాపారుల నుంచి స్పందన కరువైంది. నూతన మద్యం విధానం ఖరారు కాగానే సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు నోటిఫికేషన్ జరీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం దరఖాస్తులు స్వీకరించేందుకు ఎక్సయిజ్ అధికారులు గుంటూరులోని ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం సాయంత్రం వరకూ ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. గత ఏడాది దరఖాస్తులు స్వీకరిస్తున్న ప్రకటించగానే ఎక్సయిజ్ డీసీ కార్యాలయం ముందు బారులు తీరిని వ్యాపారులు ఈసారి ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఆశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం 342 మద్యం దుకాణాలు, 187 బార్లు ఉన్నాయి. గతేడాది నిర్వహించిన లాటరీల్లో 34 మద్యం దుకాణాలకు లెసైన్స్ ఫీజులు చెల్లించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. గతేడాది పోటీ అధికంగా ఉంటేనే పరిస్థితి అలా ఉంటే ఈ ఏడాది పరిస్థితి చూస్తుంటే జిల్లాలో ఎన్ని మద్యం దుకాణాలు ఖాళీగా ఉంటాయో అర్ధం కావడంలేదని ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతున్నారు. మూడు శ్లాబుల్లో మద్యం దుకాణాలకు గతేడాది కంటే మూడు, నాలుగు లక్షల రూపాయాలు లెసైన్స్ ఫీజులు పెంచడం, బెల్టు షాపులను రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వంటి కారణాలతో మద్యం వ్యాపారుల్లో తీవ్ర నైరాస్యం నెలకొంది. గతేడాది బెల్టు షాపులు ఏర్పాటుచేసి వ్యాపారాలు చేస్తేనే నష్టపోకుండా బయటపడగలిగామని, ఈసారి అవి కూడా లేకుండా వ్యాపారం ఎలా నిర్వహించాలని వీరంతా తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మంగళవారం మంచి రోజు కాకపోవడంతో వ్యాపారులు ఎవరూ రాలేదని, బుధవారం నుంచి భారీగానే దరఖాస్తులు వస్తాయని మరికొందరు చెబుతున్నారు. -
మందు చూపు
కర్నూలు, న్యూస్‌లైన్: జిల్లాలో ఒకే రోజు రూ.6 కోట్ల మధ్య కొనుగోలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎన్నికలు మిగిసిన తర్వాత ఇంత భారీ స్థాయిలో మద్యం కొనుగోలు చేయడం వెనుక వ్యాపారుల ‘మందు’చూపు కనిపిస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో మద్యం డిపోలు 14 రోజుల పాటు మూతపడనుండటమే ఇందుకు కారణం. ఈ నెల 24 నుంచి వచ్చే 6వ తేదీ వరకు డిపోల నుంచి మద్యం స్టాక్ పంపిణీ నిలిపేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. 24వ తేదీ వరకు చలానాలు కట్టిన వారికి 27వ తేదీ వరకు స్టాక్ అందిస్తామని.. ఆ తర్వాత 6వ తేదీ వరకు ఎలాంటి లావాదేవీలు ఉండబోవమని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు శివారులోని పందిపాడు గ్రామం వద్ద హంద్రీనది ఒడ్డున ఉన్న ఐఎంఎల్ డిపోకు దుకాణాలు, బార్ల ప్రతినిధులు మంగళవారం క్యూకట్టారు. ప్రస్తుతం జిల్లాలో 170 దుకాణాలు, రెండు క్లబ్‌లు, ఏడు ప్రభుత్వ దుకాణాలు, 35 బార్లు నిర్వహిస్తున్నారు. ఆదోని, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, నంద్యాల, కోవెలకుంట్ల, కోడుమూరు, ఎమ్మిగనూరు ప్రాంతాలకు చెందిన దాదాపు 120 మద్యం దుకాణాల వ్యాపారులు ఒక్క రోజులో రూ.6 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేశారు. ఈనెల 1వ తేదీ నుంచి 19 రోజుల్లో రూ.46.92 కోట్ల మద్యం వ్యాపారం జరగ్గా.. 20వ తేదీన ఒక్క రోజే రూ.6 కోట్ల విలువ చేసే 9,922 కేసుల బీర్లు.. 13,309 కేసుల లిక్కర్ కొనుగోలు చేయడం గమనార్హం. రన్నింగ్ బ్రాండ్స్ కొరత రాష్ట్ర విభజన నేపథ్యంలో మద్యం సరఫరా నిలిపివేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాలో మద్యం కొరత ఏర్పడింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు వినియోగిస్తున్న రన్నింగ్ బ్రాండ్స్ దొరక్కపోవడంతో డిపో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీఎస్పీ, రాయల్ ఎగ్జిక్యూటివ్, ఇంపీరియర్ బ్లూ, బ్యాగ్ పైపర్, ఓల్డ్ టావెర్న్ తదితర బ్రాండ్స్ దొరకని పరిస్థితి నెలకొంది. ప్రీమియం బ్రాండ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ వాటి కొనుగోలుపై వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రంలోని వివిధ డిస్టిలరీల నుంచి కర్నూలు ఐఎంఎల్ డిపోకు మద్యం సరఫరా కావాల్సి ఉంది. ముఖ్యంగా మల్కాజ్గిరి,తిరుపతి, హైదరాబాద్‌లోని నాచారం డిస్టలరీల నుంచి కర్నూలు ఐఎంఎల్ డిపోకు మద్యం సరఫరా అవుతోంది. రన్నింగ్ బ్రాండ్స్ ఒక్కొక్కటి ప్రతి నెలా 17వేల కేసులకు పైగా అవసరం కాగా.. ఈనెలలో వారం రోజుల నుంచి ఆయా బ్రాండ్ల సరఫరాను నిలిపివేయడంతో పూర్తిగా కొరత ఏర్పడింది. ట్రెజరీ సర్వర్‌తో సతమతం స్టాక్ కొనుగోళ్లపై ఒత్తిడి కారణంగా ఐఎంఎల్ డిపోలో సర్వర్ పని చేయక సిబ్బంది సతమతమవుతున్నారు. గతంలో వ్యాపారులు డీడీలు చెల్లించి మద్యం కొనుగోలు చేస్తుండగా.. ప్రస్తుతం డిపో వద్దనే చలానా రూపంలో చెల్లించాల్సి ఉన్నందున ఏపీ ట్రెజరీ సర్వర్‌కు సంబంధించిన సైట్ మొరాయించింది. చలానా కట్టడంలో ఆలస్యమవుతున్నందున రాత్రి పొద్దుపోయే వరకు వేచి చూసి చలానాలు పూర్తయిన తర్వాతనే వ్యాపారులకు మద్యం సరఫరా చేశారు. రన్నింగ్ బ్రాండ్స్ మద్యం కూడా రెండు, మూడు రోజుల్లో సరఫరా అయ్యే అవకాశం ఉందని డిపో మేనేజర్ షేక్ మునీర్ తెలిపారు. -
ఆదాయమే పరమావధి..!
ఆదాయం కోసం ఎక్సైజ్‌శాఖ అధికారుల ఆరాటం చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిందే.. జిల్లాలో ఇప్పటికే ఉన్న మద్యం దుకాణాల ద్వారా ప్రజల నుంచి లాగేస్తున్న ఆదాయం సరిపోలేదు కాబోలు.. ఇతర జిల్లాల్లో టెండర్లు రాని దుకాణాలకు మన జిల్లాలో అనుమతి ఇచ్చి ఏర్పాటు చేశారు. ఇక.. వైన్స్ యజమానులు కనీస నిబంధనలు పాటించడం లేదు. బడి, గుడికి అతి సమీపంలో దుకాణాలు ఏర్పాటు చేస్తూ ఇష్టారాజ్యంగా విక్రయాలు జరుపుతున్నారు.!! - న్యూస్‌లైన్, మిర్యాలగూడ ఆదాయమే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా మద్యం దుకాణాలు తెరుస్తున్నారు. వీరి అండతో దుకాణదారులు మద్యం విక్రయాలకు ఉండాల్సిన నిబంధనలు కూడా పాటించకుండా వ్యాపారాలు సాగిస్తున్నారు. జిల్లాలో 245 మద్యం దుకాణాలు ఉండగా ఇటీవల మరో 14దుకాణాలకు టెండర్లు పిలిచి అనుమతి ఇచ్చారు. 20వేల జనాభా ఉంటేనే ఒక మద్యం దుకాణం ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాల్సి ఉన్నా, ఎక్సైజ్ అధికారులు ఆదాయమే లక్ష్యంగా ఇష్టానుసారంగా అనుమతి ఇస్తున్నారు. మిర్యాలగూడ పట్టణంలో 1.05లక్షల జనాభా ఉండగా 7మద్యం దుకాణాలున్నాయి. ఇప్పటికే అదనంగా ఒక దుకాణం ఉండగా ఇటీవల మరో మద్యం దుకాణాన్ని ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటు చేయాల్సిన మద్యం దుకాణాలకు మూడు మాసాల క్రితం టెండర్లు పిలిచి 15రోజుల క్రితం ప్రారంభించారు. అదనంగా 14దుకాణాలు ఏర్పాటు జిల్లాలోమొదటగా 245మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చారు. వాటికి మాత్రమే టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఏర్పాటు చేశారు. కానీ ఇటీవల ఇతర జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సిన దుకాణాలకు అక్కడ టెండర్లు రాకపోవడం వల్ల వాటిని కూడా నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో కొత్తగా 14 వైన్స్‌లు ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలోని దుకాణాల సంఖ్య 259కి చేరింది. వీటితో పాటు 20బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఊరూరా బెల్ట్‌షాపులు మిర్యాలగూడ నియోజకవర్గంలో గతంలో మొత్తం 16వైన్స్‌లు ఉండగా ఇటీవల మరో రెండు దుకాణాలు అదనంగా ప్రారంభించారు. మిర్యాలగూడ పట్టణంతో పాటు మండలంలో 12, దామరచర్ల మండలంలో నాలుగు, వేములపల్లి మండలంలో రెండు మద్యం దుకాణాలు ఉన్నాయి. ప్రతి దుకాణం వద్ద అక్రమ సిట్టింగ్‌లు, గ్రామాల్లో బెల్ట్‌షాపులు జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గంలోని మిర్యాలగూడ పట్టణం, మండలంలో 120, దామరచర్లలో 60, వేములపల్లిలో 80 బెల్ట్‌షాపులు ఉన్నాయి. ఎక్సైజ్ అధికారులు వీటిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రాత పూర్వకంగా ఫిర్యాదులు వస్తే పరిశీలిస్తా : అనసూయాదేవి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, నల్లగొండ వైన్స్ దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసినట్టు ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. నిబంధనలు పాటించని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లపై ఆయా ఎక్సైజ్ సూపరింటెండెంట్లు చర్యలు తీసుకుంటారు. -
‘బిల్లు’ పడుద్ది!
సాక్షి, కడప: మద్యం అమ్మకాల్లో సరికొత్త విధానానికి ఎక్సైజ్‌శాఖ శ్రీకారం చుట్టింది. నకిలీ మద్యాన్ని నివారించే చర్యలకు ఉపక్రమించింది. సర్కారీ మద్యంలో నాణ్యతతో పాటు మద్యం తయారీ, అమ్మకాలపై పారదర్శకత పాటించేందుకు ప్రయత్నాలు మొదలెట్టింది. మద్యం సీసాలపై హాలోగ్రామ్‌లు వేయడంతో పాటు కొనుగోలుదారుడు ఒక్క ఎస్ఎంఎస్తో తాను కొన్న సీసా తాలూకూ సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా టోల్‌ఫ్రీ నెంబరును ప్రారంభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తె చ్చిపెడుతున్న ఎక్సైజ్‌శాఖలో సరికొత్త విధానాలను అవలంబించడం ద్వారా సేవలను విస్తృతం చేయడంతో పాటు అక్రమాల నివారణకు అడ్డుకట్ట వే యొచ్చనేది ఈ కొత్త పంథా ప్రధాన ఉద్దేశం. జనవరి నుంచి కొత్త పంథా?: ప్రభుత్వం ప్రవేశపెట్టే కొత్త కంప్యూటర్ బిల్లింగ్, హాలోగ్రామ్ విధానం జనవరి నుంచి అమలు చేసేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ప్రతి మద్యం సీసాపై హాలోగ్రాము ఏర్పాటు చేస్తారు. దానిపై ఒక సీరియల్ నెంబర్‌ను ముద్రిస్తారు. ఆ నెంబర్‌తో సీసాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నమోదు చేస్తారు. కొనుగోలుదారులకు సమాచారం ఇచ్చేందుకు ఒక టోల్‌ఫ్రీ నెంబరును ఏర్పాటు చేస్తారు. తాను కొన్న మద్యం సీసా గురించి తెలుసుకోవాలనుకునే కొనుగోలుదారుడు సీసాపై ఉన్న టోల్‌ఫ్రీ నెంబరుకు ఎస్ఎంఎస్ పంపితే చాలు...క్షణాల్లో ఆ సీసా ఎప్పుడు? ఎక్కడ తయారు చేశారు? ఏ మద్యం గోదాము నుంచి వచ్చింది? ఏ దుకాణానికి అమ్మకం జరిగింది? అనే వివరాలు అతని ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి. అలాగే ప్రతి మద్యం దుకాణంలో ఆన్లైన్ కంప్యూటర్ బిల్లులు ఇచ్చేందుకు పరికరాలను ఏర్పాటు చేస్తారు. మద్యం కొన్న తర్వాత సూపర్‌మార్కెట్ తరహాలో కంప్యూటర్ స్క్రాచ్ద్వారా బిల్లు వేసి, బిల్లు ప్రతిని కొనుగోలుదారుడికి అందజేయాలి. ఈ బిల్లు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఎక్సైజ్‌కమిషనర్ కార్యాలయానికి చేరుతుంటాయి. అక్రమ ప్రవాహానికి అడ్డుకట్ట: ప్రస్తుతం మద్యం సీసాలపై లేబుల్స్ ఉన్నాయి. కొందరు మాఫియా అవతారమెత్తి నకిలీ లేబుళ్లను తయారుచేసి, నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. అలాగే కర్నాటక రాష్ట్రం నుంచి అక్కడి మద్యాన్ని భారీగా దిగుమతి చేస్తున్నారు. ట్యాక్స్‌తో పాటు అక్కడి మద్యం ధరలు తక్కువ. దీని ద్వారా కూడా మద్యం వ్యాపారులు భారీగా ఆర్జిస్తున్నారు. ఈ చర్యలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. కొత్త విధానం ద్వారా వీటిని పూర్తిగా నివారించే అవకాశం ఉంది. అలాగే నకిలీ మద్యంలో ప్రమాదకర రసాయనాల కారణంగా దాన్ని తాగిన వారు అనారోగ్యాలకు గురవుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. హాలోగ్రామ్ విధానం అమలైతే మద్యం సీసాలపై ఉండే నెంబరు ఆధారంగా అది ఎక్కడ తయారైందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. దీంతో నకిలీ మద్యానికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. త్వరలోనే కొత్త విధానం: నాగలక్ష్మి, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్‌శాఖ. ఆన్లైన్, హాలోగ్రామ్ విధానం త్వరలో అమలు కానుంది. మద్యం దుకాణాలకు ఆన్లైన్ బిల్లింగ్ సామగ్రి ఏర్పాటు, మద్యం దుకాణాల నుంచి ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి సాఫ్ట్వేర్ అనుసంధానం పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయిన వెంటనే కొత్త విధానం అమల్లోకి వస్తుంది. జనవరి నుంచి కొత్త విధానం అమలయ్యే అవకాశం ఉంది. -
సీసా గుట్టు.. ఎస్ఎంఎస్తో రట్టు
సాక్షి, కర్నూలు: నకిలీ మద్యం బెడద తప్పబోతోంది. దుకాణాల్లో విక్రయిస్తున్న మద్యం అసలుదా? నకిలీదా? ఎక్కడ తయారైంది? ఎవరు కొనుగోలు చేశారు? అనే వివరాలను ఒక్క సంక్షిప్త సందేశం(ఎస్ఎంఎస్)తో ఇట్టే తెలుసుకునే వీలు త్వరలో అమల్లోకి రానుంది. సర్కారీ మద్యంలో నాణ్యతను వెల్లడించడంతో పాటు నకిలీ మద్యాన్ని నిలువరించే దిశగా ఎక్సైజ్‌శాఖ సరికొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగానే మద్యం సీసాలపై హోలోగ్రామ్‌లు వేయడంతో పాటు, ఒక్క ఎస్ఎంఎస్తో మందుబాబులు తాము కొన్న సీసా తాలూకు సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చి పెడుతున్న ఎక్సైజ్‌శాఖలో సరికొత్త విధానాల అమలుకు సర్కారు ప్రయత్నిస్తోంది. పర్మిట్ రూములు, ఔట్లెట్లతో ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటున్న ప్రభుత్వం.. మద్యంలో నాణ్యత ప్రమాణాలను పెంచే దిశగా చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో తయారవుతున్న మద్యం సీసాలపై లేబుల్స్ ఉంటున్నాయి. అయితే అక్రమార్కులు నకిలీ లేబుళ్లతో నాసిరకం మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఈ కారణంగా ఖజానాకు భారీగా గండిపడుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నివారణ చర్యల్లో భాగంగా ప్రతి మద్యం సీసాపై హోలోగ్రామ్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇదే సమయంలో సీసాపై ఒక సీరియల్ నెంబర్‌ను ముద్రించనున్నారు. ఈ నెంబర్ ఆ సీసాకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని వెల్లడించనుంది. కొనుగోలుదారులకు సమాచారం ఇచ్చేందుకు ఒక టోల్‌ఫ్రీ నెంబర్‌ను సైతం ఏర్పాటు చేయనున్నారు. సీసా సమాచారం తెలుసుకోదలిస్తే దానిపైనున్న ప్రత్యేక సీరియల్ నెంబర్‌ను టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే చాలు.. క్షణాల్లో ఆ సీసా ఎప్పుడు, ఎక్కడ తయారైంది. ఏ మద్యం గోదాము నుంచి వచ్చింది. ఏ దుకాణానికి అమ్మకం చేశారు. ఇతరత్రా వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చేస్తాయి. ఈ నూతన విధానంతో నకిలీ మద్యానికి చెక్ పడనుంది. అక్రమాలకు అడ్డుకట్ట: కర్నూలు జిల్లాకు 150 కిలోమీటర్ల మేర కర్ణాటక సరిహద్దు ఉంది. రాయచూర్ నుంచి బళ్లారి వరకు జిల్లాకు చెందిన ప్రాంతం ఆనుకుని ఉండడంతో జిల్లాకు గుట్టుచప్పుడు కాకుండా భారీ స్థాయిలో మద్యం నిల్వలు వచ్చి చేరుతున్నాయి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. నకిలీ మద్యంలో ప్రమాదకర రసాయనాల కారణంగా మందుబాబులు అనారోగ్యం బారిన పడుతున్నారు. తాజా విధానంతో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందనే చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రేమ్‌ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా.. శాఖాపరంగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్నారు. అయితే తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు అందలేదని తెలిపారు. -
నకిలీ మద్యం విక్రయిస్తే లెసైన్స్ రద్దు
మహానంది, న్యూస్‌లైన్: మద్యం దుకాణాల్లో నకిలీలు విక్రయిస్తే లెసైన్స్ రద్దు చేస్తామని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రేమ్‌ప్రసాద్ హెచ్చరించారు. మహానందీశ్వరుడిని దర్శించుకునేందుకు శనివారం ఆయన మహానంది వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాకు కొత్తగా 84 మంది ఎక్సైజ్ కానిస్టేబుళ్లను నియమించారని, వారు శిక్షణలో ఉన్నారన్నారు. జిల్లాలో కొత్తగా మంజూరైన ఆరు ఔట్లెట్లను బుక్కాపురంలో 1, కోవెలకుంట్లలో 2, ఆత్మకూరులో 1, సున్నిపెంటలో 2 ఏర్పాటు చేస్తామని చెప్పారు. అక్రమ నిల్వలపై దాడులు విస్తృతం చేశామన్నారు. ఇటీవల బేతంచర్ల, మహానంది మండలాల్లో అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పత్తికొండ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ, ఎస్ఐల మధ్య జరిగిన గొడవలో బాధ్యులపై క్రమశిక్షణా రాహిత్య చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆయన శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట నంద్యాల ఎక్సైజ్ సీఐ కేశవులు ఉన్నారు. -
ఎమ్మార్పీ గాలికి.. ధరలు పైపైకి
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: మద్యం వ్యాపారంలో నిబంధనల అమలు సాధ్యం కానిపనిలా మారింది. సిండికేట్లను అరికట్టేందుకు మద్యం పాలసీలో ఎన్ని మార్పులు తెచ్చినా ఫలితం కరువవుతోంది. ఎమార్పీ ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. వ్యాపారులు సిండికేట్‌గా మారి మద్యం ధరలకు రెక్కలు తెచ్చేస్తున్నారు. మరోవైపు 24 గంటలూ మద్యం విక్రయిస్తున్నారు. నిర్ణీత వేళల్లోనే మద్యం అమ్మకాలు జరిగేలా పోలీసులు చర్యలు చేపట్టినా ఎక్సైజ్ శాఖ మాత్రం ఇంకా మేలుకోలేదు. జిల్లాలో 348 మద్యం దుకాణాలు, 56 బార్లు ఉన్నాయి. ఒక్క నెల్లూరులోనే పెద్దసంఖ్యలో బార్లు ఏర్పాటైవున్నాయి. బార్లలో మినహా షాపుల్లో ఎమ్మార్పీకే మద్యాన్ని విక్రయించాల్సి ఉంది. ఇది కేవలం నిబంధనలకే పరిమితమవుతోంది. మద్యాన్ని ఎమ్మార్పీకే విక్రయించాలని, ఒక్క రూపాయి అదనంగా విక్రయించినా కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు మూణ్నాళ్ల ముచ్చటయ్యాయి. ఆబ్కారీ సంవత్సరం మొదట్లో ఎక్సైజ్ అధికారులు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి ఎమ్మార్పీ నిబంధనను ఉల్లంఘిస్తున్న పలు మద్యం షాపులను సీజ్ చేశారు. అప్పట్లో కొద్ది రోజులు ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు జరిగాయి. అనంతరం కమిషనర్ మారడంతో ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. వ్యాపారులు సిండికేట్‌గా మారి ఇష్టారాజ్యంగా మద్యం విక్రయాలు సాగిస్తూ మందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. నిర్ణీత రేటు కంటే అదనంగా రూ.10 నుంచి రూ.15 వరకు వసూలు చేస్తున్నారు. ఈవిషయాన్ని ప్రశ్నిస్తే తాము అమ్మేది ఇంతే...ఎవ్వరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ మందుబాబులను బెదిరిస్తున్నారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. మద్యం వ్యాపారులతో వారు కుదుర్చుకున్న ఒప్పందాలే ఇందుకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా విక్రయాలు నిబంధనల ప్రకారం ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరవాలి. బార్లో విక్రయాలకు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతి ఉంది. మద్యం దుకాణాల ఎదుట బహిరంగంగా తాగేందుకు అనుమతించరాదు. మద్యం వ్యాపారులు ఈ నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏ సమయంలోనైనా మందుబాబులకు మద్యం అందుబాటులో ఉంచుతున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఎస్పీ రామకృష్ణ ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఎక్సైజ్ అధికారుల్లో మాత్రం ఇంకా కదలిక రాలేదు. అనధికారిక బార్లుగా దాబాలు గతంలో జాతీయ రహదారులకే పరిమితమైన దాబాలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా వెలిశాయి. జిల్లాలోని 90 శాతం దాబాలు అనధికారిక బార్లుగా కొనసాగుతున్నాయి. వీటిలో 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంచడంతో పాటు తాగేందుకూ సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరోవైపు బెల్ట్‌షాపులు సైతం పల్లెల్లో పుట్టగొడుగుల్లా వెలిసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. నిబంధనల అమలుపట్టని అధికారులు మద్యం వ్యాపారంలో నిబంధనలు కచ్చితంగా అమలు జరిగేలా పర్యవేక్షించాల్సిన అధికారులు ఆ విషయాన్ని విస్మరించారు. నెలానెలా అందుతున్న మామూళ్లే ఆ మౌనం వెనుక ఉన్న కారణమని ఆరోపణలున్నాయి. నెల్లూరులో ఒక్కో మద్యం దుకాణం నిర్వాహకులు సంబంధిత పోలీసుస్టేషన్‌కు రూ.10 వేల నుంచి రూ.15 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.5 నుంచి రూ.10 వేల వరకు నెల మామూలు సమర్పిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారులకు ఇంకా ఎక్కువ మొత్తంలో చేరుతున్నట్లు సమాచారం. -
గూడుపుఠాణి
లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్లు...ఎక్సైజ్‌శాఖలో ఏం జరుగుతోందో ఎవరికీ అంతుపట్టడం లేదు. రెన్యువల్ కాకుండా మిగిలిపోయిన మద్యం దుకాణాలను అధికారులే నడపాలని ఎక్సైజ్ కమిషనర్ ఆదేశించారు. దీంతో అధికారులు లెసైన్స్‌దారుల వేటలో పడ్డారు. అయితే ప్రభుత్వ మద్యం దుకాణాలకు గదులు లభించకుండా ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే మద్యం దుకాణాలు నడుతున్నవారు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త దుకాణాలు తెరవడం అధికారులకు తలనొప్పిగా మారింది. కాగా ఇదంతా ఎక్సైజ్, మద్యం వ్యాపారుల ఎత్తుగడలో భాగమే అనే వాదన విన్పిస్తోంది. సాక్షి, కడప: గతేడాది జిల్లా వ్యాప్తంగా 269 మద్యం దుకాణాలు నడిచాయి. ఈఏడాది జూన్‌తో వాటి లెసైన్స్ గడువు ముగిసింది. అయితే 185 దుకాణాలు రెన్యువల్ అయ్యాయి. తక్కిన 84 దుకాణాను రెన్యువల్ చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆబ్కారీ ఆదాయం బాగా తగ్గింది. దుకాణాలను ఎక్సైజ్ ఆధ్వర్యంలోనే నడపాలని, అందుకు అధికారులు చొరవ చూపాలని ఎక్సైజ్ కమిషనర్ మూన్నెళ్ల కిందటే ఆదేశించారు. ఈ విషయంలో జిల్లా అధికారులు నిర్లిప్తత వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఇటీవల డిప్యూటీ కమిషనర్లతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో రెన్యువల్ కాకుండా మిగిలిన దుకాణాలన్నీ కచ్చితంగా తెరవాల్సిందేనని, రిటైర్డ్ ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి వారికి లెసైన్స్ జారీ చేయాలని ఆదేశించారు. ప్రతి మద్యం దుకాణంలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఇద్దరు సేల్స్బాయ్స్ను నియమించాలని, వీరికి వేతనాలతో పాటు దుకాణగదికి అద్దెను అధికారులు చెల్లించాలని సూచించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కమిషనర్ ఆదేశాల మేరకు 14 దుకాణాలను నడిపేందుకు రిటైర్డ్ ఉద్యోగులను అధికారులు సిద్ధం చేశారు. తక్కిన 70 దుకాణాలకు గదులు దొరకడం లేదని చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే నడుస్తున్న మద్యం షాపుల యజమానులు కొత్తదుకాణాలకు గదులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. ఒకవేళ ఎవరైనా గది అద్దెకు ఇస్తున్నారని తెలిస్తే వారి వద్దకు వెళ్లి ఎట్టి పరిస్థితుల్లో అలా ఇవ్వొద్దని హుకుం జారీ చేస్తున్నారని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి రాజంపేట డివిజన్లో అధికంగా ఉంది. ఇక్కడ పట్టణంలోనే 13 దుకాణాలు నడపాల్సి ఉంది. రూరల్‌లో మరో 6 దుకాణాలు తెరవాలి. రాజంపేటలో ఇప్పటికే 10 దుకాణాలు నడుస్తున్నాయి. వీరంతా ఏకమై కొత్త దుకాణాలు నడవకుండా, వాటికి గదులు దొరక్కుండా అడ్డుపడుతున్నారు. అవసరమైతే అధికారపార్టీనేతలతో హెచ్చరికలు పంపిస్తున్నారు. అయితే ఈ సలహాను ఎక్సైజ్ అధికారులే ఇచ్చారని, పాతదుకాణదారులతో చేయి కలిపి కొత్తవి తెరవకుండా చూస్తున్నాన్నారని ఆశాఖలోని కొందరు అధికారులు చెబుతున్నారు. మద్యం వ్యాపారుల నుంచి ప్రతి నెలా అందే మామూళ్ల ఆశతోనే కొత్తవాటికి అడ్డుపడి ప్రభుత్వ ఆదాయానికి గండిపెడుతున్నట్లు సమాచారం. సిండికేట్‌కు గ్రీన్‌సిగ్నల్!: మద్యాన్ని ఎమ్మార్పీ కంటే 5-10 రూపాయల ఎక్కువకు విక్రయించేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారు. అంతా సిండికేట్‌గా ఏర్పడి ధరలను పెంచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్ల తెలుస్తోంది. ఈ తతంగానికి ఎక్సైజ్ అధికారులు కూడా మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రతి నెలా ఇచ్చే మామూళ్ల మొత్తాన్ని కూడా వ్యాపారులు పెంచినట్లు తెలిసింది. రెన్యువల్ కష్టంగా ఉంది: నాగలక్ష్మి, డిప్యూటీ కమిషనర్. ఎక్సైజ్. డిసెంబరు ఒకటి నుంచి దుకాణాలు తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 84లో ఇప్పటికి 14 వాటికి లెసైన్స్‌లు ఇచ్చాం. కొత్తవాటికి గదులు దొరకడం లేదు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరిపితే ఊరుకునే ప్రసక్తే లేదు. కేసులు నమోదు చేస్తాం. -
మందు, విందులకు ఖర్చు ఎక్కువే..
కోల్‌సిటీ, న్యూస్‌లైన్ : దసరా పండగంటేనే మద్యం కిక్కు గుర్తుకొస్తుంది. ప్రతీ ఏడాది ఎక్సైజ్ శాఖ కూడా ప్రజలకు దిగనంత కిక్కెకించాలని ఎదురుచూస్తుంది. దీంతో ఈ నెలలో మద్యం అమ్మకాలు భారీగా పెరగనున్నాయి. వ్యాపారులు పెద్ద ఎత్తున స్టాక్ తెచ్చి సిద్ధంగా ఉంచారు. విద్యాసంస్థలకు సెలవులు రావడంతో ఇప్పటికే మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దసరాకు నాలుగైదు రోజుల ముందు నుంచి విక్రయాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో దసరా సందర్భంగా జిల్లాలో మద్యం అమ్మకాలు రూ.70 కోట్ల వరకు జరగనుంది. ఇక దసరా పండగకు మటన్, చికెన్ వంటి మాంసాహార వ్యాపారం భారీగానే జరుగుతుంది. ఇప్పటినుంచే మాంసాహారం అమ్మకాలు పెరగగా, దసరాకు రెండు మూడు రోజుల ముందు నుంచి భారీ ఎత్తున వ్యాపారం జరగనుంది. చికెన్, మటన్ ధరలు భగభగ మండుతుండగా, పండగకు మరింత పెరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా మేకలు, గొర్రెలు, కోళ్లపై రూ.60 కోట్లకు పైగా ఖర్చుచేస్తారని అంచనా. పిండివంటలు.. పిండివంటలు, సత్తుపిండి, భోజనాలు తదితర వాటికోసం కూడా భారీగా ఖర్చయ్యే అవకాశముంది. పెరిగిన వంటనూనె ధరలు, పప్పులు, ఇతర నిత్యావసర సరుకులు, వస్తువుల కోసం సుమారు రూ.60 కోట్లు ఖర్చు చేయాల్సిందే. కల్తీ వస్తువుల హాల్చల్ దసరా ధమాకాలో కల్తీ, నకిలీ వస్తువులను కొందరు అంటగడుతున్నారు. నిత్యావసరాలతోపాటు బట్టలు, కాస్మోటిక్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు నకిలీవి వస్తుండడంతో ప్రజలు ఏది అసలుదో... ఏది నకిలీయో తేల్చుకోలేక అయోమయానికి గురవుతున్నారు. నకిలీ, కల్తీ మద్యం విక్రయాలు సైతం జోరందుకుంటున్నాయి. -
మాతోపెట్టుకోవద్దు..!
సాక్షి ప్రతినిధి, కడప: ‘ఇదిగో పుల్లగూర... అంటే ఇదిగో తియ్యగూర’ అన్నట్లుగా ఇచ్చిపుచ్చుకునే అలవాటుతో ఇంతకాలం నెట్టుకొస్తున్న మద్యం షాపుల యజమానులు, ఎక్చైజ్ శాఖ మధ్య తేడా వచ్చిపడింది. నిబంధనలు అతిక్రమిస్తున్నారంటూ ఎక్సైజ్ వేధింపులు ఉత్పన్నం కాగా, మునపటి లాగే విక్రయాలు చేస్తున్నామని మద్యం వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చెప్పినట్లు వినడం లేదు... ‘మాతోపెట్టుకోవద్దు’ అంటూ ఎక్సైజ్ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. ఈతతంగం వెనుక రెన్యువల్ మామూళ్ల భాగోతం గుప్పుమంటోంది. జిల్లాలో 269 మద్యం షాపులున్నాయి. వీటిని రెన్యువల్ చేసి మునపటి వేలం పాటల మేరకు అక్కడి యజమానులకు కట్టబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు రెన్యువల్ చేయించుకునేందుకు యజమానులు ముందుకొచ్చారు. జూలై 1వతేదీ నుంచి నూతన షాపులకు గడువు ప్రారంభం కాగా, ఇప్పటికీ 88 షాపులకు రెన్యువల్ చేయించుకోలేదు. విక్రయాలపై లాభాలు లేకపోవడంతో మద్యం వ్యాపారులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. జిల్లాలో 181 మద్యం షాఫులు రెన్యువల్ చేయించుకుని వ్యాపార క్రయ విక్రయాలు చేస్తున్నారు. రెండున్నర నెలల గడువు పూర్తయ్యాక వారికి కొత్త చిక్కు వచ్చి పడింది. ప్రతిరోజు తనిఖీల పేరుతో వే ధింపులు అధికమైనట్లు సమాచారం. నిబంధనలు అతిక్రమిస్తున్నారంటూనే..... ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన మద్యం యజమానులను గాడీలో పెట్టేందుకు చర్యలుంటే అందరూ హర్షించాల్సిందే. అలా కాకుండా క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తూ యజమానులను వేధించేందుకు మాత్రమే పరిమితమయ్యారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఉదయం 10 గంటలకు ముందు మద్యం షాపు తెరవకూడదు. రాత్రి 10 గంటలకు మూసేయాలనేది నిబంధనల్లో ఒక భాగం. అలాగే ఎమ్మార్పీ రేటుకు అధికంగా విక్రమించరాదు. వీటిని ఉల్లంఘిస్తే యంత్రాంగం చర్యలు చేపట్టాలి. ఇంతకాలం ఇవేవీ పట్టించుకోని ఎక్సైజ్ శాఖకు ఒక్కమారుగా నిబంధనలు గుర్తుకొస్తున్నాయని మద్యం యజమానులు పేర్కొంటున్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకున్నారా అంటే అదీ లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కేవలం ప్రతిరోజు షాపులు తనిఖీలు చేయడం చెప్పినట్లు వినండి, అందరికీ ఉపయోగం అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న తతంగం ఇటీవల కాలంలో అధికమైనట్లు సమాచారం. రెన్యువల్ మామూళ్లు కోసమే.... మద్యం వ్యాపారులకు వేలం పాటలు లేకుండా మరో అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. గతంలో చెల్లించిన లెసైన్సు ఫీజు చెల్లించేందుకు ఆసక్తి చూపించే వ్యాపారుల షాపులను రెన్యువల్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి ఇబ్బందులు, ఉత్కంఠత లేకుండా షాపులను అప్పగిస్తున్నాం కదా...రెన్యువల్ మామూళ్లు కింద ఒక్కోక్క షాపు రూ.లక్ష చెల్లించాలని ఎక్సైజ్ యంత్రాంగం ధర నిర్ణయించినట్లు ఆరోపణలున్నాయి. దీనిని వ్యాపారులు బహిరంగంగానే వ్యతిరేకించినట్లు సమాచారం. తుదకు వ్యాపారంలో అపార అనుభవం ఉన్న కొందరు అటు యజమానులు, ఇటు ఎక్సైజ్ అధికారులతో చర్చలు నిర్వహించినట్లు సమాచారం. తీవ్ర చర్చల అనంతరం రూ.50వేలు ఇవ్వాల్సిందేనని ఎక్సైజ్ అధికారులు గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బాగా వ్యాపారం చేపట్టే కొందరు మినహా, ఈ ప్రతిపాదనకు కూడా మద్యం వ్యాపారులు అధిక శాతం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రూ.20వేలు రెన్యువల్ మామూళ్లు ఇవ్వాలని వ్యాపారులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. మీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తామంటే కుదరదంటూ ఎక్సైజ్ అధికారులు భీష్మించుకున్నట్లు తెలుస్తోంది. అందుబాటులోకి రాని అధికారులు ఈవిషయాలపై ఎక్సైజ్ సూపరిండెండెంటు వరప్రసాద్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన హలో హలో అంటూ ఫోన్ పెట్టేశారు. ఆపై పలుమార్లు ప్రయత్నించినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇదే విషయాన్ని అసిస్టెంటు కమిషనర్ విజయకుమారి వివరణ కోరేందుకు ప్రయత్నిస్తే ఆవిషయం ఈఎస్నే అడగండని చెప్పారు. దండోపాయం ప్రయోగం.... ఆశించిన మేరకు మామూళ్లు కట్టబెట్టని మద్యం షాపులపై సామ, దాన, దండోపాయాలు ప్రయోగించే పనిలో ఎక్సైజ్ శాఖ నిమగ్నమైనట్లు సమాచారం. ప్రతిరోజూ తనిఖీలు చేస్తూ మద్యం ప్రియుల ఎదుట వ్యాపారులను అభాసుపాలు చేసే చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. గురువారం కూడా కడప నగరంలో ఓ మద్యం షాపునకు చెందిన బెల్టుషాపుల విక్రయదారులపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 15 బెల్టుషాపుల పరిధిలో విక్రేతలను అదుపులోకి తీసుకొని కేసులు లేకుండా వదిలేసినట్లు సమాచారం. అందుకు కారణం సెటిల్మెంటేనని తెలుస్తోంది. ఎమ్మార్పీ రేటు కంటే అధికంగా విక్రయిస్తున్నారని గ్రామీణ ప్రాంతాలలో కొన్ని షాపులపై కేసుల ఉదంతం కూడా మామూళ్ల కోవలో భాగమేనని పలువురు ఆరోపిస్తున్నారు. -
ఆభ్కారీ ఆదాయం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎక్సైజ్ శాఖ అవినీతిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి నామమాత్రమే అవుతున్నాయి. శాఖ అవినీతిని బట్టబయలు చేసిన ఏసీబీ కేసులు ఏ మాత్రమూ ప్రభావం చూపలేదు. జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతున్న మామూళ్ల వ్యవహారం నివ్వెరపరుస్తోంది. మార్చిన ఎక్సైజ్ పాలసీ మేరకు ప్రభుత్వం గత ఏడాది కొత్త షాపులకు మొదటి సంవత్సరం లెసైన్సులు జారీ చేసింది. ఏడాది గడువు ముగిశాఖ కొత్త టెండర్లు నిర్వహించకుండా రెండో ఏడాదికి కూడా పాత లెసైన్సుదారులనే కొనసాగించాలని నిర్ణయించి ఆ మేరకు లెసైన్సులను రెన్యూవల్ చేసింది. అయితే, ఈ సారి రూ.2లక్షలు అదనంగా చెల్లించి పర్మిట్ రూము తీసుకుంటేనే రెన్యూవల్ చేస్తామని కొత్త కండీషన్ పెట్టింది. ఈ మేరకు అర్హతలున్న ప్రతి వైన్‌షాపు యజమాని పర్మిట్ రూము తీసుకున్నారు. ఈ సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరేదే. అయితే, రెన్యూవల్ సమయంలో ఎక్సైజ్ శాఖ అనధికారికంగా వైన్సు యజమానుల నుంచి ముక్కు పిండి మరీ మామూళ్లు వసూలు చేసింది. రెన్యూవల్స్‌కు వసూళ్లు.. రెండో సంవత్సరం వైన్‌షాపు లెసైన్సులను రెన్యూవల్ చేసుకున్న యజమానులు ఒక్కొ క్కరి నుంచి రూ.37,500 వసూలు చేశారు. ఇలా జిల్లాలోని 241 షాపుల నుంచి వీరు వసూలు చేసిన మొత్తం అక్షరాల రూ.90లక్షల 37వేల 500. ఒక్కో షాపు నుంచి వసూలు చేసిన రూ.37,500లో కార్యాలయ ఖర్చుల పేర రూ.10వేలు, ఓ అధికారికి రూ.20వేలు, ఆయన కింది స్థాయి అధికారికి రూ.7500 వాటాలు పంచారు. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడెం ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలోని స్టేషన్ల సంఖ్యను బట్టి ఈ రెండు డివిజన్లలో వాటాల పంపకాలు జరిగాయి. రెగ్యులర్ మామూళ్ల దందా.. రెన్యువల్స్ ద్వారా ఒక్కసారే వచ్చి పడిన సొమ్ములతో సంతృప్తి చెందని కొందరు అధికారులు రెగ్యులర్ మామూళ్ల దందాను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రతి వైన్‌షాప్‌కు ఓ రేటు నిర్ణయించి వసూలు చేసి పంచుకుతింటున్నారు. ఆయాఈఎస్ల పరిధిలో సర్కిళ్ల వారీగా వసూళ్లు జరుగుతున్నాయి. వీరు ఒక్కో షాపు నుంచి ప్రతి నెలా రూ.7500 వసూలు చేస్తున్నారు. (ఈ లెక్కన నెలకు వసూలవుతున్న మొత్తం రూ.18,07,500.) ఇందులో సీఐ స్థాయి అధికారికి నెలకు రూ.2500, ఎస్‌ఐస్థాయి అధికారికి రూ.2500, కార్యాలయ సిబ్బందికి రూ.2500 చొప్పున వాటాలున్నాయని శాఖా వర్గాల వారి సమాచారం. ఇది కాకుండా, సూపరింటెండెంట్ పరిధిలోని స్పెషల్ టీమూ మామూళ్ల రేటును నిర్ణయించింది. ఒక్కో ఈఎస్ పరిధిలో ఎక్కువ సంఖ్యలో షాపులు ఉంటాయి కనుక వీరు కొంత కనికరించి ఒక్కో షాపు నుంచి రూ.2500 వసూలు చేస్తున్నారు. ( నెలకు వసూలయ్యే మొత్తం రూ.6,02,500) ఇందులో నుంచి ఓ అధికారికి రూ.1000, ఆయన కింది స్థాయి అధికారికి రూ.750, ఆఫీసు స్టాఫ్‌కు రూ.750 చొప్పున వాటాలు తీసుకుని జేబులో వేసుకుంటున్నారు. అయితే, ఓ ఈఎస్ పరిధిలోని ఏఈఎస్ పోస్టు ఖాళీగా ఉంది. లెక్క ప్రకారం ఏఈఎస్ వాటా కూడా తనకే ఇవ్వాలని ఓ అధికారి మంకు పట్టుపడుతుండడంతో మామూళ్ల వ్యవహారం బయటకు పొక్కింది. మొత్తంగా పరిస్థితిని విశ్లేషిస్తే.. ఆబ్కారీ శాఖ పూర్తిగా అవినీతి మత్తులో మునిగిపోయిందన్న విమర్ళలు నిజం అనిపించడంలో వింతేమీ లేదు. -
ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీఐ
సూర్యాపేట, న్యూస్‌లైన్: ఎక్సైజ్ శాఖలో అతడిది ఉన్నత ఉద్యోగమే.. వేతనం కూడా ఐదు అంకెల్లో ఉంటుం ది.. అది కూడా చాలదని రెండు చేతులా సంపాదించాలని అనుకున్నాడు.. చివరకు లం చం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కా డు.. ఇదీ సూర్యాపేటలో బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఎక్సైజ్ సీఐ స్టోరీ.. ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని జాగృతి వైన్స్ యజమాని ఢిల్లీ జంగారెడ్డిని ఎక్సైజ్ సీఐ జి.ప్రభాకర్ మూడు నెలలుగా డబ్బుల కోసం వేధిస్తున్నాడు. ప్రతి నెలా రూ.10వేలతో పాటు నాలుగు మద్యం బాటిళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. అంతేకాకుండా గతజూలైలో వైన్స్ రెన్యూవల్ చేసేందుకు గుడ్‌విల్‌గా రూ.40వేలు తీసుకున్నాడు. దీంతో పాటు స్థానిక ఎన్నికల సమయంలో మద్యం దొరకకపోవడంతో ఉన్న మద్యాన్ని ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముకోమ్మని సీఐ సలహా ఇచ్చాడు. కొంత మంది వైన్స్ యజమానులతో కుమ్మక్కై కావాలనే జాగృతి వైన్స్‌పై కేసు నమోదు చేయిం చాడు. ఈ కేసుతో వైన్స్ యజమానులకు సుమారు రూ.లక్షన్నర నష్టం వాటిల్లింది. అంతేగాక కేసును సరి చేయించినందుకు అదనంగా సీఐ మరో రూ.30వేలు తీసుకున్నాడు. వైన్స్ సీజ్ చేసిన సమయంలో యజమానికి సంబంధించిన పాన్‌కార్డు వైన్స్‌లో ఉంది. దానిని తీసుకుంటామని యజమాని సీఐని అడగ్గా రూ.3వేల విలువ చేసే రెండు మద్యం బాటిళ్లు కావాలని డిమాండ్ చేశాడు. ప్రతినెలా మామూళ్లు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో యజమాని జంగారెడ్డి మూడు నెలల మాముళ్లు రూ.30వేలను వారం రోజుల్లో ఇస్తానని సీఐతో నమ్మబలికాడు. పట్టించాడు ఇలా.. డబ్బుల కోసం వేధిస్తున్న సీఐ ప్రభాకర్‌ను ఏసీబీ అధికారులకు పట్టించాలని వైన్స్ యజ మాని జంగారెడ్డి నిర్ణయించుకున్నాడు. అందు లో భాగంగా ఇటీవల ఏసీబీ అధికారులను సంప్రదించాడు. శనివారం వారు సూర్యాపేటకు వచ్చి ఎక్సైజ్ సీఐ ప్రభాకర్‌కు జంగారెడ్డి డబ్బులు ఇచ్చేందుకు సిద్ధం చేశారు. కాగా సీఐ ప్రభాకర్ సెలవులో ఉండటంతో అప్పుడు వీలు పడలేదు. తిరిగి బుధవారం వచ్చి ఎక్సైజ్ కార్యాలయంలో సమీపంలో అద్దెకు నివాసముండే సీఐ ఇంటికి జంగారెడ్డి వెళ్లి వెయ్యి రూపాయల నోట్లు గల రూ.30వేలను సీఐకి అందజేశాడు. వాటిని సీఐ తన టేబుల్ డెస్క్‌లో భద్రపరుచుకున్నాడు. అప్పటికే సీఐ నివాసం చుట్టూ కాపు గాసిన ఏసీబీ అధికారులు వెంటనే సీఐ నివాసంలోకి వెళ్లి తనిఖీలు చేయగా జంగారెడ్డి ఇచ్చిన రూ.30 వేలు లభించాయి. దీంతో వైన్స్ యజమానిని నుంచి లంచం తీసుకున్న సీఐపై కేసు నమోదు చేసుకొని అతడిని అరెస్టు చేశారు. ఈ దాడిలో హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ ఎం.ప్రభాకర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ఏసీబీ ఇన్స్పెక్టర్లు ముత్తిలింగం, సి.రాజు, ఇతర సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే సెల్ నెంబర్లు 9440446140, 9440446142లలో ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ కోరారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా.. సూర్యాపేట ఎక్సైజ్ సీఐ జి.ప్రభాకర్ విధుల్లో చేరినప్పటి నుంచి అక్రమ సంపాదన వైపే మొగ్గు చూపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నా యి. మే 2వ తేదీన సూర్యాపేట ఎక్సైజ్సీఐగా ప్రభాకర్ బాధ్యతలు చేపట్టారు. ఆనాటి నుంచి అక్రమంగా సంపాదించేందుకు ఎక్కువ ఆసక్తి కనబరిచినట్టు పలువురు మద్యం దుకాణ దారులు ఆరోపిస్తున్నారు. గత నాలుగు నెల లుగా సుమారు రూ.30లక్షలు అక్రమంగా సంపాదించాడని ఆరోపణలున్నాయి. ఇటీవల మ ద్యం దుకాణాల లెసైన్స్‌లను రెన్యూవల్ చేసినందుకు గాను సుమారు రూ.15లక్షలు మద్యం దుకాణాల యజమానుల నుంచి వసూళు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా సూర్యాపేట నియోజకవర్గంలోని పలు మద్యం దుకాణాల్లో సదరు ఎక్సైజ్ సీఐ పెట్టుబడులు పెట్టినట్టు స్వయాన మద్యం దుకాణ దారులే పేర్కొం టుండడం గమనార్హం. -
మరో నకిలీ మద్యం డంప్ స్వాధీనం
నాగర్‌కర్నూల్, న్యూస్‌లైన్: నకిలీ మద్యం వేటలో ఎక్సైజ్ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. గు రువారం తాడూరు మండలం చర్లతిర్మలాపూర్‌లో నకిలీ మద్యం తయారు చేస్తూ ప ట్టుబడిన నిందితులను విచారించగా... వారిచ్చిన సమాచారంతో మరో డంప్ బ యటపడింది. పెద్దకొత్తపల్లి మండలం పె రుమాళ్లపల్లి గ్రామ సమీపంలోని ఓ మొ క్కజొన్న చేనులో దాచి ఉంచిన రూ. 1.50 లక్షల విలువైన 35 కాటన్ల ఆఫీసర్స్ ఛా యిస్ విస్కీ కాటన్లను ఎక్సైజ్ అధికారులు స్వా ధీనం చేసుకున్నారు. గురువారం తిర్మలాపూర్ లో రూ. 2 లక్షల విలువై న మద్యం బాటిళ్లు, స్పిరిట్, సారా తయారీ సామగ్రి, స్టిక్కర్లు, డక్కన్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. స్థానిక ఎక్సైజ్ స్టేషన్లో నాగర్‌కర్నూల్ ఎ క్సైజ్ సూ పరింటెండెంట్ కె.రఘురాం వివరాలు వెల్లడించారు. ‘కోడేరు మండలం కదిరెపహాడ్కి చెంది న బాదగోని నాగరాజు చర్లతిర్మలాపూర్లోని తన అత్తగారింట్లో ఉంటూ నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ఏ ర్పాటు చేశాడు. ఇందుకుగాను నకిలీ మద్యం తయారీ లో సిద్ధహస్తుడైన మానవపాడు మండలం అమరవాయికి చెంది న బాలగోని శ్రీనివాస్‌గౌడ్‌ను, అతనికి సహకరించేందుకు తమ సమీప బంధువులు పెబ్బేర్‌కు చెందిన పట్టపర్ల కిరణ్‌కుమార్‌గౌడ్, పట్టపర్ల శివప్రసాద్గౌడ్లను రప్పించాడు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ముందు నుంచే వీరు మద్యం తయారీని ప్రారంభించారు. తయారైన మద్యాన్ని నాగరాజుగౌడ్, అతని అనుచరులు మార్కెటింగ్ చేస్తూ వచ్చారు. తిర్మలాపూర్‌లో అదుపులోకి తీసుకున్న వారు ఇచ్చిన సమాచారం మే రకు శుక్రవారం పెరుమాళ్లపల్లిలో దాడులు నిర్వహిం చగా బయ్యపు మహేశ్వర్‌రెడ్డికి చెందిన మొక్కజొన్న చే నులో దాచి ఉంచి నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని’ ఈఎస్ తెలిపారు. నిందితులు శ్రీనివాస్‌గౌడ్, నాగరాజుగౌడ్, కిరణ్‌కుమార్, శివప్రసాద్, మహేశ్వర్‌రెడ్డిలను అరెస్టు చేసి, కేసు నమోదు చే శామన్నారు. స మావేశంలో ఏసీ అశోక్‌కుమార్, డీసీ గోపాలకృష్ణ, ఇన్చార్జి ఏఈఎస్ ఎస్.సైదులు పాల్గొన్నారు.