బోణీయే కాలేదు
సాక్షి, గుంటూరు: మద్యం దుకాణాలకు కొత్త లెసైన్సులు పొందేందుకు ఎక్సయిజ్ శాఖ చేపట్టిన దరఖాస్తుల స్వీకరణకు వ్యాపారుల నుంచి స్పందన కరువైంది. నూతన మద్యం విధానం ఖరారు కాగానే సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు నోటిఫికేషన్ జరీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం దరఖాస్తులు స్వీకరించేందుకు ఎక్సయిజ్ అధికారులు గుంటూరులోని ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మంగళవారం సాయంత్రం వరకూ ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. గత ఏడాది దరఖాస్తులు స్వీకరిస్తున్న ప్రకటించగానే ఎక్సయిజ్ డీసీ కార్యాలయం ముందు బారులు తీరిని వ్యాపారులు ఈసారి ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఆశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో మొత్తం 342 మద్యం దుకాణాలు, 187 బార్‌లు ఉన్నాయి. గతేడాది నిర్వహించిన లాటరీల్లో 34 మద్యం దుకాణాలకు లెసైన్స్ ఫీజులు చెల్లించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. గతేడాది పోటీ అధికంగా ఉంటేనే పరిస్థితి అలా ఉంటే ఈ ఏడాది పరిస్థితి చూస్తుంటే జిల్లాలో ఎన్ని మద్యం దుకాణాలు ఖాళీగా ఉంటాయో అర్ధం కావడంలేదని ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతున్నారు.
మూడు శ్లాబుల్లో మద్యం దుకాణాలకు గతేడాది కంటే మూడు, నాలుగు లక్షల రూపాయాలు లెసైన్స్ ఫీజులు పెంచడం, బెల్టు షాపులను రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వంటి కారణాలతో మద్యం వ్యాపారుల్లో తీవ్ర నైరాస్యం నెలకొంది. గతేడాది బెల్టు షాపులు ఏర్పాటుచేసి వ్యాపారాలు చేస్తేనే నష్టపోకుండా బయటపడగలిగామని, ఈసారి అవి కూడా లేకుండా వ్యాపారం ఎలా నిర్వహించాలని వీరంతా తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మంగళవారం మంచి రోజు కాకపోవడంతో వ్యాపారులు ఎవరూ రాలేదని, బుధవారం నుంచి భారీగానే దరఖాస్తులు వస్తాయని మరికొందరు చెబుతున్నారు.