సాక్షి, గుంటూరు: టీడీపీ నేతల బరితెగింపునకు అడ్డూ అదుపూ ఉండటం లేదు. అధికార మదంతో రెచ్చిపోతున్న వారి ఆగడాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. తాజాగా వారు.. మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసినవారిపై దౌర్జన్యకాండకు దిగారు. ఎక్సైజ్ అధికారులు వీరికి సహకరిస్తుండటం విస్మయం కలిగిస్తోంది.
‘ఫలానా మద్యం షాపులు మాకే కావాలి. వాటికసలు దరఖాస్తే చేయొద్దు.. ఒకవేళ దరఖాస్తు చేసినా, లాటరీలో మద్యం దుకాణం మీకొస్తే అందులో సగం వాటా మాకివ్వాల్సిందే. మా మాట కాదని ఎక్కువ చేస్తే వ్యాపారం ఎలా చేస్తారో మేమూ చూస్తాం..’ అని దరఖాస్తుదారులను బెదిరిస్తున్నారు. మద్యం దుకాణాల లెసైన్సుల మంజూరుకు దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ స్పందిస్తూ ఎంతోమంది వ్యాపారులు డీడీలు తీసి దరఖాస్తు చేసుకునేందుకు ముందుకొచ్చారు. వీరి స్థాయిని బట్టి మండల స్థాయి టీడీపీ నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు నేరుగా ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతున్నారు.
ఆయా నియోజకవర్గాల్లో లాభాలు ఎక్కువగా వచ్చే దుకాణాలను గుర్తించి వాటికెవరూ పోటీ పడొద్దంటూ హుకుం జారీ చేస్తున్నారు. ముఖ్యంగా నరసరావుపేట, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, పత్తిపాడు, సత్తెనపల్లి, తెనాలి నియోజకవర్గాల్లో గిరాకీ ఉన్న మద్యం దుకాణాలకు ఎక్కువ దరఖాస్తులు రాకుండా చూసేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించాయనే చెప్పవచ్చు.
గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం నడికుడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఓ దుకాణం రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైనదిగా పేరొందింది. గతంలో ఈ దుకాాణాన్ని రూ.5.2 కోట్లకు అక్కడి వ్యాపారులు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ దుకాణాన్ని దక్కించుకునేందుకు టీడీపీ నేతలు అక్కడి వ్యాపారులపై తీవ్రస్థారుులో ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొందరైతే ఒకడగు ముందుకేసి ఎక్సయిజ్ అధికారుల ద్వారా రాయబారాలు నడుపుతున్నారు.
ఎక్కడైనా టీడీపీ సిండికేట్లే ఉండాలట...
జిల్లాలోని ఏ మండలంలో ఎవరికి షాపులు వచ్చినా వాటిలో పార్టీవారికి వాటాలు ఇచ్చి తీరాలని, తమ ఆధ్వర్యంలో మాత్రమే సిండికేట్‌లు ఏర్పాటవ్వాలన్నది టీడీపీ నేతల లక్ష్యం. ఏ పార్టీకి చెందినవారైనా స్లీపింగ్ పార్టనర్లుగా మాత్రమే ఉండాలని.. పెత్తనమంతా తమవారే చేస్తారని.. లేదంటే ఎక్సైజ్ అధికారులతో దాడులు చేయించి కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో చాలామంది వ్యాపారులు అసలు దరఖాస్తే చేయలేదని సమాచారం. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది. ఎప్పటినుంచో మద్యం వ్యాపారం చేస్తున్న తాము ఎవరి దయాదాక్షిణ్యాలపైనో బతకాల్సిన అవసరం లేదంటూ టీడీపీ నేతలపై వ్యాపారులు మండిపడుతున్నారు.
అధికారులపై పెరుగుతున్న ఒత్తిళ్లు..
తమకు కావాల్సిన దుకాణాలకు దరఖాస్తు చేసినవారి వివరాలను వెంటవెంటనే చెప్పాలంటూ టీడీపీ నేతలు ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు దరఖాస్తుదారుల అడ్రస్ తెలుసుకుని వారిని నయానో భయానో ఒప్పించి లాటరీ తగిలినా ఆ షాపును తమకు అమ్మే విధంగా మంతనాలు సాగిస్తున్నారు. మద్యం దుకాణాలన్నీ టీడీపీ నేతలకే దక్కితే భవిష్యత్తులో వారు అక్రమాల పాల్పడినా తామేం చేయలేని పరిస్థితి ఎదురవుతుందని కొందరు అధికారులు ఆందోళన చెందుతున్నారు.
షాపు మీదైనా.. వాటా మాదే!
Published Fri, Jun 27 2014 11:55 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement