ఉల్లంఘన!
సాక్షి, గుంటూరు: జిల్లాలో మద్యం ధరలు మండిపోతున్నాయి. కొత్త పాలసీ ద్వారా దుకాణాలు కేటాయించి వారం గడవకముందే ఎమ్మార్పీ కంటే అధికంగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. ఎమ్మార్పీ ధరలకు మద్యం విక్రయాలు జరపాలని, బెల్టుషాపులు ఉండకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ దుకాణాల నిర్వాహకులకు ఇవేమీ పట్టడం లేదు.
పగటి వేళ క్వార్టర్‌పై ఎమ్మార్పీ కంటే రూ. 15 నుంచి రూ. 20 వరకు, రాత్రి సమయాల్లో రూ. 20 నుంచి రూ. 40 వరకు ధర పెంచి విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఎక్సయిజ్ అధికారులు నామమాత్రంగా కేసులు నమోదు చేస్తుండటం నిర్వాహకులకు వరంగా మారింది. అధిక ధరలు ఏమిటని ప్రశ్నించిన మందుబాబులకు అధికారులకు నెలవారి ముడుపులు చెల్లిస్తున్నామని దుకాణదారులు బహిరంగానే చెబుతుండటం ఇందుకు నిదర్శనం.
బలహీనతను క్యాష్ చేసుకుంటున్న
వ్యాపారులు
జిల్లా వ్యాప్తంగా మొత్తం 342 మద్యం దుకాణాలకు 313 దుకాణాలు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచి విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు జరపాలంటూ మందుబాబులు ఎక్కడైనా హడావిడి చేస్తే వెంటనే ప్రధాన బ్రాండ్‌లన్నీ పక్కనబెట్టి ఎవ్వరికీ తెలియని బ్రాండ్లను కౌంటర్లలో పెట్టి అమ్మకాలు జరుపుతున్నారు. మందుబాబులు వారికి కావాల్సిన బ్రాండ్లను మాత్రమే తాగుతారని తెలిసిన మద్యం వ్యాపారులు వారి బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సయిజ్ అధికారులు మాత్రం ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
మారుమూల గ్రామాల్లో బెల్టు షాపులు...
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వేదికపైనే బెల్టుషాపులు రద్దుచేస్తూ ఫైలుపై సంతకం చేసినప్పటికీ ఇంకా మారుమూల గ్రామాల్లో బెల్టుషాపులు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ నేతలు బలంగా ఉన్న గ్రామాల్లో బెల్టులను తొలగించడం ఎక్సైజ్ అధికారులకు కత్తిమీద సాములా మారింది. మనకెందుకొచ్చిన గొడవలే అంటూ చూసీ చూడనట్లు ఊరుకుంటున్నారు. దీనికితోడు అనేక ప్రాంతాల్లో మద్యం సిండికేట్లు టీడీపీ నేతలకు సంబంధించినవి కావడంతో ఇక్కడ వారు ఆడిందేఆట.. పాడిందేపాటగా మద్యం వ్యాపారం నడుస్తోంది.
అర్ధరాత్రి వరకూ అమ్మకాలు...
మద్యం దుకాణాల నిర్వాహకులు రాత్రి 10 గంటలకు దాటితే షట్టర్లకు తాళాలు వేసి దొడ్డిదారిన మద్యం విక్రయాలు జరుపుతున్నారు. చిన్నచిన్న బడ్డీ బంకులను రాత్రి 10 గంటలకల్లా మూసివేయించే పోలీసులు మద్యం విక్రయాలను మాత్రం పట్టించుకోవడంలేదు. రాత్రి సమయాల్లో అక్రమంగా మద్యం వ్యాపారం కొనసాగించేందుకు పోలీసులకు జీపు డ్రైవర్ నుంచి అధికారి స్థాయి వరకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ప్రతినెలా అందజేస్తున్నట్లు సమాచారం.