ఎస్‌ఈబీ సత్తా చాటుతోంది: లక్ష్మణరెడ్డి | Laxman Reddy Comments On Special Enforcement Bureau Liquor Ban Policy AP | Sakshi
Sakshi News home page

‘అందుకే ప్రభుత్వం ఎస్‌ఈబీ ఏర్పాటు చేసింది’

Published Wed, Jul 15 2020 7:53 PM | Last Updated on Wed, Jul 15 2020 8:20 PM

Laxman Reddy Comments On Special Enforcement Bureau Liquor Ban Policy AP - Sakshi

సాక్షి, గుంటూరు: మద్యం అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్ఈబీ) సత్తా చాటుతోందని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎస్ఈబీ ఏర్పాటుతో రెండు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోన్న దాడులకు సంబంధించిన నివేదికలోని అంశాలను బుధవారం ఆయన వివరించారు. ఎస్ఈబీ కమిషనర్‌, సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజాల్ నేతృత్వంలో యువ ఐపీఎస్‌లు కదనరంగంలో దూసుకుపోతున్నారని ఈ సందర్భంగా ప్రశంసించారు. మద్యానికి సంబంధించిన అక్రమాలపై కొరడా ఝళిపిస్తున్నారని పేర్కొన్నారు. 

అదే విధంగా రాష్ట్రంలో మద్య నిషేధం దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని ఎస్ఈబీ ఎక్కడికక్కడ అడ్డుకుంటోందని కొనియాడారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా సీఎం జగన్‌ ప్రభుత్వం ఇప్పటికే మద్యవిమోచన ప్రచార కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. మద్యపాన నిషేధాన్ని అమలు చేసే తరుణంలో రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే విషయాన్ని ప్రభుత్వం ముందుగానే అంచనా వేసినట్లు తెలిపారు. అక్రమ మద్యం ప్రవాహంలా ముంచెత్తే ప్రమాదం ఉందని.. అలాంటి పరిస్థితులు ఖచ్చితంగా తలెత్తి తీరుతాయనే నిర్ణయానికి వచ్చిందన్నారు. (ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు)

అందుకే ఎస్‌ఈబీ ఏర్పాటు
ఈ నేపథ్యంలో అక్రమ మద్యం విక్రయాన్ని నిరోధించడం, అక్రమ మద్యం తయారీని అరికట్టడానికి విప్లవాత్మక చర్యలను ప్రభుత్వం తీసుకుందని తెలియజేశారు. ఇందులో భాగంగానే స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్ఈబీ) పేరుతో ప్రభుత్వం కొత్త శాఖను సృష్టించిందని వివరించారు. పొరుగు రాష్ట్రాల నుంచి సరిహద్దులను దాటుకుని రాష్ట్రంలోనికి ప్రవేశించే అక్రమ మద్యాన్ని నిరోధించడం.. రాష్ట్రం లోపల అక్రమ మద్యం తయారీని అణచివేయడం, అక్రమ మద్యం తయారీదారులపై ఉక్కు పాదాన్ని మోపడం వంటి చర్యలను ఈ కొత్తశాఖకు అప్పగించినట్లు తెలిపారు. ఎస్‌ఈబీకి పని విభజనను సైతం ప్రభుత్వం ఇప్పటికే కేటాయించిందని తెలియజేశారు. 

అక్రమ మద్యం తయారీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, ఆకస్మిక దాడులను నిర్వహించడం,ఎఫ్ఐఆర్ ను నమోదు చేయడం, నిందితులను న్యాయస్థానంలోకి ప్రవేశ పెట్టడం, కేసు దర్యాప్తు, ఛార్జిషీట్లను రూపొందించడం, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు కూడా జారీ చేసే అధికారాలను సైతం ప్రభుత్వం ఈ కొత్త శాఖకు బదలాయించినట్టు లక్ష్మణరెడ్డి వివరించారు. సాధారణ పోలీసులకు వర్తించే అన్ని అధికారాలనూ దీనికి అప్పగించిందని తెలిపారు.

ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్ల పర్యవేక్షణలో ఎస్ఈబీ బాధ్యులైన యువ ఐపీఎస్ లు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారని.. ఏపీకి అనుసంధానమైన రాష్ట్ర సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలతో అక్రమ రవాణాకు ఎస్ఈబీ అడ్డుకట్ట వేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు సాంకేతికతను జోడించి దూసుకుపోతున్నారని కితాబిచ్చారు. రాత్రివేళ గస్తీని ముమ్మరం చేస్తూ.. ప్రత్యేక నిఘా వ్యవస్థతో మెరుపుదాడులు చేయడం, సీసీ కెమెరాలు, మొబైల్ చెక్ పోస్టులతో పాటు ఇన్ఫార్మర్ల వ్యవస్థ కూడా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో రెండు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అక్రమ మద్యం తరలిస్తున్న, తయారుచేస్తున్న వేలాది మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

మే నెల 16 నుంచి జూలై 13 వరకు నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.

  • నాటుసారా కేంద్రాలపై దాడులు నిర్వహించి మొత్తం 9,536 కేసులు నమోదు చేయగా, 10,918 మందిని అరెస్టు చేశారు. 
  • 1,20,225 లీటర్ల నాటుసారాను సీజ్ చేశారు. 
  • 22,06,159 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 
  • 1,399 వాహనాలు సీజ్ చేశారు. 
  • అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో తయారై (నాన్ డ్యూటీ పేయిడ్) ఏపీ సరిహద్దుల్లోకొచ్చిన మద్యానికి సంబంధించి 8,994 కేసులు నమోదు చేసి 14,140 మందిపై కేసులు నమోదు చేశారు. 
  • 98,830 లీటర్ల లిక్కరు, 4,996 లీటర్ల బీర్లు సీజ్ చేశారు. 
  • 5,597 వాహనాలు సీజ్ అయ్యాయి. 
  • రాష్ట్రంలో తయారైన మద్యం (డ్యూటీ పేయిడ్) అక్రమంగా విక్రయించే వారిపై 4,063 కేసులు నమోదు చేసి.. ,715 మందిని అరెస్టు చేశారు. 32,845 లీటర్ల లిక్కర్, 1,203 లీటర్ల బీరు సీజ్ చేశారు.
  •  883 వాహనాలు సీజ్ చేశారు

అక్రమాలను కూకటివేళ్లతో సహా పెకలించి..
గత ప్రభుత్వం హయాంలో మద్యం మాఫియాలు రాష్ట్రవ్యాప్తంగా చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గుర్తుచేశారు. అప్పటి అధికార టీడీపీ నేతలే దగ్గరుండి అక్రమాలను ప్రోత్సహించి వందల, వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. అటువంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయడానికి ప్రస్తుత సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండా మద్యం, ఇసుక అక్రమాలను పూర్తిగా రూపుమాపడానికి స్వయం ప్రతిపత్తి గల స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్ఈబీ)ను ఏర్పాటు చేసి, అనుకున్నదే తడువుగా యువ ఐపీఎస్‌లను నియమించారని తెలిపారు. మద్యం అక్రమ రవాణాలో పట్టుబడే వారిపై కఠిన చర్యలు చేపట్టేందుకు చట్టాలకు మరింత పదును పెట్టినట్లు తెలిపారు. 

కఠిన చర్యలు తప్పవు
ఈ మేరకు ఇటీవల ప్రభుత్వ గెజిట్ కూడా విడుదలైనట్లు తెలిపారు. మద్యం అక్రమ తయరీ, రవాణా చేస్తూ పలుమార్లు నేరాలకు పాల్పడిన వారి పై నా బెయిలబుల్ కేసులు నమోదు తో పాటు 8 ఏళ్ల జైలు శిక్ష వరకు కేసులు నమోదు ఉంటుందని తెలిపారు. పాత నేరస్తులైతే పీడీ యాక్టు ప్రయోగిస్తున్నారని.. నిబంధనలు ఉల్లంఘించే వారిపై రౌడీషీటర్లు తెరవడానికి, ఆస్తులు జప్తు చేసేందుకు కూడా ఎస్ఈబీ వెనకాడటం లేదని లక్ష్మణరెడ్డి స్పష్టంచేశారు. గత టీడీపీ హయాంలో పోల్చితే డ్రంకెన్ డ్రైవ్ కేసులు ప్రస్తుత ప్రభుత్వంలో గణనీయంగా తగ్గాయని గుర్తుచేశారు.

ప్రజారోగ్యాన్నిదృష్టిలో పెట్టుకుని మద్యంతో ఎదురయ్యే దుష్ఫలితాలపై ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో అవగాహన, చైతన్య కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నట్లు లక్ష్మణరెడ్డి స్పష్టంచేశారు. ఎన్నికల ముందు చెప్పిన విధంగానే సీఎం జగన్ ముందుకెళ్తున్నారని, ప్రతి ఏటా 20 శాతం మద్యం షాపులను తగ్గించుకుంటూ వెళ్లి, ఐదో ఏటా కేవలం త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే మద్యం పరిమితం చేసేలానే అడుగులు వేస్తున్నట్లు లక్ష్మణరెడ్డి వివరించారు. రాష్ట్రంలో 90 లక్షల మంది డ్వాక్రా మహిళలు, 4 లక్షల మంది వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహకారంతో 2024 నాటికి మద్యరహిత ఆంధ్రప్రదేశ్ ను సాధించడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement