laxmana reddy
-
ఎస్ఈబీ సత్తా చాటుతోంది: లక్ష్మణరెడ్డి
సాక్షి, గుంటూరు: మద్యం అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) సత్తా చాటుతోందని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎస్ఈబీ ఏర్పాటుతో రెండు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోన్న దాడులకు సంబంధించిన నివేదికలోని అంశాలను బుధవారం ఆయన వివరించారు. ఎస్ఈబీ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజాల్ నేతృత్వంలో యువ ఐపీఎస్‌లు కదనరంగంలో దూసుకుపోతున్నారని ఈ సందర్భంగా ప్రశంసించారు. మద్యానికి సంబంధించిన అక్రమాలపై కొరడా ఝళిపిస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రంలో మద్య నిషేధం దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని ఎస్ఈబీ ఎక్కడికక్కడ అడ్డుకుంటోందని కొనియాడారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటికే మద్యవిమోచన ప్రచార కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. మద్యపాన నిషేధాన్ని అమలు చేసే తరుణంలో రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే విషయాన్ని ప్రభుత్వం ముందుగానే అంచనా వేసినట్లు తెలిపారు. అక్రమ మద్యం ప్రవాహంలా ముంచెత్తే ప్రమాదం ఉందని.. అలాంటి పరిస్థితులు ఖచ్చితంగా తలెత్తి తీరుతాయనే నిర్ణయానికి వచ్చిందన్నారు. (ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు) అందుకే ఎస్ఈబీ ఏర్పాటు ఈ నేపథ్యంలో అక్రమ మద్యం విక్రయాన్ని నిరోధించడం, అక్రమ మద్యం తయారీని అరికట్టడానికి విప్లవాత్మక చర్యలను ప్రభుత్వం తీసుకుందని తెలియజేశారు. ఇందులో భాగంగానే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) పేరుతో ప్రభుత్వం కొత్త శాఖను సృష్టించిందని వివరించారు. పొరుగు రాష్ట్రాల నుంచి సరిహద్దులను దాటుకుని రాష్ట్రంలోనికి ప్రవేశించే అక్రమ మద్యాన్ని నిరోధించడం.. రాష్ట్రం లోపల అక్రమ మద్యం తయారీని అణచివేయడం, అక్రమ మద్యం తయారీదారులపై ఉక్కు పాదాన్ని మోపడం వంటి చర్యలను ఈ కొత్తశాఖకు అప్పగించినట్లు తెలిపారు. ఎస్ఈబీకి పని విభజనను సైతం ప్రభుత్వం ఇప్పటికే కేటాయించిందని తెలియజేశారు. అక్రమ మద్యం తయారీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, ఆకస్మిక దాడులను నిర్వహించడం,ఎఫ్ఐఆర్ ను నమోదు చేయడం, నిందితులను న్యాయస్థానంలోకి ప్రవేశ పెట్టడం, కేసు దర్యాప్తు, ఛార్జిషీట్లను రూపొందించడం, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు కూడా జారీ చేసే అధికారాలను సైతం ప్రభుత్వం ఈ కొత్త శాఖకు బదలాయించినట్టు లక్ష్మణరెడ్డి వివరించారు. సాధారణ పోలీసులకు వర్తించే అన్ని అధికారాలనూ దీనికి అప్పగించిందని తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్ల పర్యవేక్షణలో ఎస్ఈబీ బాధ్యులైన యువ ఐపీఎస్ లు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారని.. ఏపీకి అనుసంధానమైన రాష్ట్ర సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలతో అక్రమ రవాణాకు ఎస్ఈబీ అడ్డుకట్ట వేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు సాంకేతికతను జోడించి దూసుకుపోతున్నారని కితాబిచ్చారు. రాత్రివేళ గస్తీని ముమ్మరం చేస్తూ.. ప్రత్యేక నిఘా వ్యవస్థతో మెరుపుదాడులు చేయడం, సీసీ కెమెరాలు, మొబైల్ చెక్ పోస్టులతో పాటు ఇన్ఫార్మర్ల వ్యవస్థ కూడా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో రెండు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అక్రమ మద్యం తరలిస్తున్న, తయారుచేస్తున్న వేలాది మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మే నెల 16 నుంచి జూలై 13 వరకు నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. నాటుసారా కేంద్రాలపై దాడులు నిర్వహించి మొత్తం 9,536 కేసులు నమోదు చేయగా, 10,918 మందిని అరెస్టు చేశారు. 1,20,225 లీటర్ల నాటుసారాను సీజ్ చేశారు. 22,06,159 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 1,399 వాహనాలు సీజ్ చేశారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో తయారై (నాన్ డ్యూటీ పేయిడ్) ఏపీ సరిహద్దుల్లోకొచ్చిన మద్యానికి సంబంధించి 8,994 కేసులు నమోదు చేసి 14,140 మందిపై కేసులు నమోదు చేశారు. 98,830 లీటర్ల లిక్కరు, 4,996 లీటర్ల బీర్లు సీజ్ చేశారు. 5,597 వాహనాలు సీజ్ అయ్యాయి. రాష్ట్రంలో తయారైన మద్యం (డ్యూటీ పేయిడ్) అక్రమంగా విక్రయించే వారిపై 4,063 కేసులు నమోదు చేసి.. ,715 మందిని అరెస్టు చేశారు. 32,845 లీటర్ల లిక్కర్, 1,203 లీటర్ల బీరు సీజ్ చేశారు. 883 వాహనాలు సీజ్ చేశారు అక్రమాలను కూకటివేళ్లతో సహా పెకలించి.. గత ప్రభుత్వం హయాంలో మద్యం మాఫియాలు రాష్ట్రవ్యాప్తంగా చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గుర్తుచేశారు. అప్పటి అధికార టీడీపీ నేతలే దగ్గరుండి అక్రమాలను ప్రోత్సహించి వందల, వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. అటువంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయడానికి ప్రస్తుత సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండా మద్యం, ఇసుక అక్రమాలను పూర్తిగా రూపుమాపడానికి స్వయం ప్రతిపత్తి గల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ను ఏర్పాటు చేసి, అనుకున్నదే తడువుగా యువ ఐపీఎస్‌లను నియమించారని తెలిపారు. మద్యం అక్రమ రవాణాలో పట్టుబడే వారిపై కఠిన చర్యలు చేపట్టేందుకు చట్టాలకు మరింత పదును పెట్టినట్లు తెలిపారు. కఠిన చర్యలు తప్పవు ఈ మేరకు ఇటీవల ప్రభుత్వ గెజిట్ కూడా విడుదలైనట్లు తెలిపారు. మద్యం అక్రమ తయరీ, రవాణా చేస్తూ పలుమార్లు నేరాలకు పాల్పడిన వారి పై నా బెయిలబుల్ కేసులు నమోదు తో పాటు 8 ఏళ్ల జైలు శిక్ష వరకు కేసులు నమోదు ఉంటుందని తెలిపారు. పాత నేరస్తులైతే పీడీ యాక్టు ప్రయోగిస్తున్నారని.. నిబంధనలు ఉల్లంఘించే వారిపై రౌడీషీటర్లు తెరవడానికి, ఆస్తులు జప్తు చేసేందుకు కూడా ఎస్ఈబీ వెనకాడటం లేదని లక్ష్మణరెడ్డి స్పష్టంచేశారు. గత టీడీపీ హయాంలో పోల్చితే డ్రంకెన్ డ్రైవ్ కేసులు ప్రస్తుత ప్రభుత్వంలో గణనీయంగా తగ్గాయని గుర్తుచేశారు. ప్రజారోగ్యాన్నిదృష్టిలో పెట్టుకుని మద్యంతో ఎదురయ్యే దుష్ఫలితాలపై ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో అవగాహన, చైతన్య కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నట్లు లక్ష్మణరెడ్డి స్పష్టంచేశారు. ఎన్నికల ముందు చెప్పిన విధంగానే సీఎం జగన్ ముందుకెళ్తున్నారని, ప్రతి ఏటా 20 శాతం మద్యం షాపులను తగ్గించుకుంటూ వెళ్లి, ఐదో ఏటా కేవలం త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే మద్యం పరిమితం చేసేలానే అడుగులు వేస్తున్నట్లు లక్ష్మణరెడ్డి వివరించారు. రాష్ట్రంలో 90 లక్షల మంది డ్వాక్రా మహిళలు, 4 లక్షల మంది వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహకారంతో 2024 నాటికి మద్యరహిత ఆంధ్రప్రదేశ్ ను సాధించడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. -
ఉద్యమాన్ని తాకట్టు పెట్టే కుట్ర
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆగ్రహం * ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబుకు వేదిక కన్వీనర్ లక్ష్మణరెడ్డి సూటి ప్రశ్నలు * విభజనకు మద్దతిచ్చిన పార్టీలను ఏపీఎన్జీవో ‘వేదిక’కు ఆహ్వానించడమేంటి? * ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని నిర్ణయం తీసుకున్నది అధికార కాంగ్రెస్సే కదా? * తెలంగాణకు అనుకూలమని ఇచ్చిన లేఖను చంద్రబాబు వెనక్కు తీసుకున్నారా? * తీర్మానం తర్వాతే బిల్లు వస్తుందని మభ్యపెట్టిన సీఎం కిరణ్‌ను ఎలా విశ్వసిస్తాం? * మీ స్వార్థం కోసం కుట్రలు, కుతంత్రాల్లో సీమాంధ్ర ప్రజలు బలైపోవాలా? సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా ముందుకెళుతున్న సమయంలో మరింత ఉధృతంగా జరగాల్సిన సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చడానికి కుట్రలు జరుగుతున్నాయని.. కొందరి రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చటానికి ఉద్యమకారులే తోడ్పాటు అందిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆందోళన వ్యక్తంచేసింది. సమైక్య ఉద్యమం కోసం ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వివిధ రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంపై రాష్ట్ర పరిరక్షణ వేదిక స్టేట్ కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు అంగీకరించిన పార్టీలను అఖిలపక్ష సమావేశానికి పిలవడంలోని ఆంతర్యమేమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈమేరకు లక్ష్మణరెడ్డి ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకోగా.. అంతకుముందే రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ‘‘అలాంటి పార్టీలను ఆహ్వానించడం వల్ల సమైక్యోద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నామా? లేక అలాంటి పార్టీలను కలుపుకుని విభజనకు సహకరిస్తున్నామా?’’ అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. సీమాంధ్రలో ముఖం చెల్లని పార్టీలను పిలవడం వెనుక ఎవరినో చాంపియన్ చేయాలన్న దురుద్దేశాలున్నాయని విమర్శించారు. ‘‘ఎవరి స్వార్థం కోసమో సీమాంధ్ర ప్రజలు తలదించుకోవాలా? మీ కుట్రలు, కుతంత్రాలకు సమైక్యోద్యమం బలైపోవాలా?’’ అని నిలదీశారు. ఉవ్వెత్తున ఎగసిన సీమాంధ్ర ప్రజల భావోద్వేగ ఉద్యమాన్ని చూసి తోక ముడవాల్సిన రాజకీయ పార్టీల ముందు మోకరిల్లాల్సిన అవసరం ఎందుకొచ్చింద న్నారు. సమైక్యవాదులందరినీ కలుపుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఈ కీలక సమయంలో ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు నిర్వహించిన అఖిలపక్షం సమావేశం తీరును ఎండగట్టారు. విభజనపై కేంద్రం చకచకా ముందుకు పోతున్న తరుణంలో సమైక్యవాదులను అదీ చిత్తశుద్ధితో సమైక్యం కోసం పనిచేస్తున్న రాజకీయ పార్టీలను మాత్రమే కలుపుకుని పోరాటం చేయాలే తప్ప.. ఎవరి ప్రయోజనాలనో నెరవేర్చడానికి ఐక్య వేదికలు ఏర్పాటు చేస్తే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతారని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక హెచ్చరించింది. సీమాంధ్రలోనే కాదు.. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకునే ప్రతి వ్యక్తీ అప్రమత్తం కావలసిన సమయమని, తెరవెనుక జరిగే కుట్రలు సాగనివ్వమని శపథం చేయాల్సిన తరుణమని పిలుపునిచ్చింది. అశోక్‌బాబు నిర్వహించిన సమావేశాన్ని ఉద్దేశించి.. దాని నిర్వాహకులను ఉద్దేశించి లక్ష్మణరెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. 1. రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకున్నదే కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ తరఫున ప్రతినిధులను సమైక్యాంధ్ర వేదికకు ఆహ్వానించడంలోని ఆంతర్యమేంటి? 2. ఆ వేదిక సమావేశంలో పాల్గొన్న మరో రాజకీయ పార్టీ టీడీపీ. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణకు కట్టుబడి ఉన్నామని కేంద్రానికి లేఖ ఇచ్చారు. ఇప్పటికీ ఆ లేఖకు కట్టుబడి ఉన్నామనే చెప్తున్నారు. అధికార పార్టీకి తోడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీ లేఖ ఇవ్వటంతో కేంద్రం విభజనపై ముందుకెళ్లిందనటంలో సందేహం లేదు. అలాంటి పార్టీని వేదిక సమావేశానికి ఎందుకు పిలిచినట్టు? 3. తెలంగాణకు అనుకూలమని చెప్తూ ఆ(టీడీపీ) పార్టీ ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకున్నారా? లేదే! ఆ లేఖ వెనక్కి తీసుకోకుండా.. తమ పార్టీ సమైక్యంకోసం కట్టుబడి ఉందని ఆ తర్వాతైనా ప్రకటించిందా? అలా చేయకుండానే ప్రాంతానికో వైఖరి ప్రదర్శిస్తున్న టీడీపీకి సమైక్య ఉద్యమంలో భాగస్వామ్యమయ్యే అర్హత లేదు. అలాంటప్పుడు అఖిలపక్ష భేటీకి ఎందుకు ఆహ్వానించారు? ముందు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసి ఆ పని పూర్తి చేశాకే చేర్చుకోవాలి. 4. ప్రాంతానికో మాట.. ప్రాంతానికో తీరుగా వ్యవహరించే పార్టీల బండారం బయటపడాలంటే అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను ఇలాంటి వేదికలకు ఆహ్వానించాలి. అలా కాకుండా ఆయా పార్టీలకు చెందిన ఒక ప్రాంత నాయకులను సమావేశానికి పిలవడం వల్ల సమైక్య ఉద్యమానికి ఏ రకంగా లాభం? 5. రెండు నాల్కల ధోరణితో వ్యవహరించే పార్టీలను ఆహ్వానించడం వల్ల ఉద్యమం చులకన కాదా? దీనివల్ల ఏం సాధించినట్టు? సీమాంధ్ర ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బకొట్టిన వాళ్లు కాదా? 6. చంద్రబాబునాయుడు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోరు. సమైక్యానికి అనుకూలంగా లేఖ రాయరు. పార్లమెంటులో నలుగురు ఎంపీలు అవిశ్వాస తీర్మానం ఇస్తారు. అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు అందుకు దూరంగా ఉంటారు. ఆ వైఖరిని నిలదీయాల్సిన అవసరం లేదా? అసెంబ్లీలో కూడా అదే పద్ధతి. కొందరు సభ్యులు తెలంగాణ కావాలంటారు. మరికొందరు సమైక్యమంటారు. మీ వైఖరేంటని పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబును ఎందుకు నిలదీయలేకపోయారు? 7. ఇంతచేసీ విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు స్పీకర్‌ను సభలోకి వెళ్లకుండా టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుకుంటే.. తెలంగాణకు చెందిన డిప్యూటీ స్పీకర్ సభలోకి వెళ్లడం, దానిపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి చర్చను ప్రారంభించడం.. ఇవన్నీ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను అడ్డుకోవడం వల్లే కదా సాధ్యమైంది. ఇలాంటి నేతలను సమావేశానికి ఆహ్వానించడంలో ఆంతర్యమేంటి? 8. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లోనే సమైక్యవాద పార్టీలైన సీపీఎం, ఎంఐఎం, వైఎస్సార్ కాంగ్రెస్‌లను కలుపుకుని ముందుకుపోయి ఉంటే.. ఆ ఉద్యమ తాకిడికి భయపడి మిగిలిన పార్టీలూ సమైక్యం బాట పట్టేవే కదా? అలా కాకుండా విభజన వాదాన్ని అంగీకరించిన పార్టీలను భుజాలకెత్తుకోవడం వల్ల ఎవరికి ప్రయోజనం? 9. విభజన బిల్లును పార్లమెంటులో అడ్డుకోవాలని దేశవ్యాప్తంగా పర్యటిస్తూ కీలకమైన అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపాదించినట్టు అన్ని పార్టీల అధ్యక్షులను పిలిచి చర్చిస్తే ఎవరేమిటన్నది బయటపడేది. ఆ పని ఎందుకు చేయలేకపోయినట్టు? 10. అసెంబ్లీ తీర్మానం చేసి పంపితేనే బిల్లు రూపొందుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పుకుంటూ వచ్చారే..! ముఖ్యమంత్రి చెప్పింది శుద్ధ అబద్ధమని ఇప్పుడు తేలిపోయింది కదా. విభజనపై అసెంబ్లీ తీర్మానం కోరకుండా కేంద్రం ముందుకు పోదని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడేం సమాధానమిస్తారు? తీర్మానం చేయకుండానే ముసాయిదా బిల్లు అసెంబ్లీకి పంపారు కదా? ఇంకా సీఎంను ఎలా విశ్వసిస్తాం? 11. అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు బీఏసీ మీటింగ్‌కు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఎందుకు రాలేదు? అసెంబ్లీకి వచ్చీ చంద్రబాబు బీఏసీ భేటీకి రాకపోవడంలోని ఆంతర్యమేంటి? 12. సీమాంధ్ర ప్రజల్లో.. వారికి తోడు అన్ని ఉద్యోగ సంఘాలు ఒక్కతాటిపై ఉద్యమం చేస్తున్న సమయంలో ఏం చెప్పారు? ఈ ఉద్యమంలోకి రాజకీయ పార్టీలు రావొద్దన్నారు. కానీ ఇప్పుడు.. అది కూడా విభజనకు అనుకూలంగా ఉన్న పార్టీలను పిలిచి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలనే ప్రయత్నాల వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? 13. సీమాంధ్ర ప్రజల ముందు ముఖాలు చూపించే స్థాయి లేక.. ముఖం చెల్లకుండా పోయిన పార్టీలను, నాయకులను ఆహ్వానించి.. రేపటి రోజున వారిని సీమాంధ్ర ప్రజల్లో తిరిగేట్టు చేయడానికే ఈ రకంగా చేస్తున్నారన్న అనుమానాలున్నాయి. దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? 14. వారేమైనా తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చారా? లేక వారేమైనా విభజనకు అనుకూలంగా ఉన్న వారి సొంత పార్టీలకు రాజీనామాలు చేసి మీ ముందుకు వచ్చారా? లేదే..! మరలాంటప్పుడు వారినెందుకు భుజాన మోస్తున్నారు? ఏమిటీ పద్ధతి? 15. సీమాంధ్ర ప్రజల్లో ముఖం చెల్లకుండా పోయిన నేతల రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వేదిక ద్వారా ఎందుకు అవకాశం కల్పిస్తున్నట్టు? దీని వెనుక ఉన్న మతలబేంటి? -
అసెంబ్లీ అభిప్రాయం అత్యంత కీలకం: లక్ష్మణరెడ్డి
సాక్షి, హైదరాబాద్: విభజన బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయం అత్యంత కీలక ఘట్టమని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ జస్టిస్ లక్ష్మణరెడ్డి అన్నారు. కొంతమంది అసెంబ్లీ అభిప్రాయం నామమాత్రమని చెబుతున్నా.. ప్రజాస్వామ్యంలో మెజారిటీ శాసనసభ్యుల అభిప్రాయమే చెల్లుబాటవుతుందని చెప్పారు. శనివారం ఇక్కడ పాత ఎమ్మెల్యే క్వార్టర్లలో విలేకరులతో ఆయన మాట్లాడారు. బిల్లు అసెంబ్లీకి వస్తున్న ఈ సమయంలో తమ తమ నియోజక వర్గాల్లో సభలు ఏర్పాటు చేసుకుని ప్రజాభిప్రాయాలను సేకరించి, వాటిని అసెంబ్లీలో ప్రతి బింబించేలా వ్యవహరించాలని ఎమ్మెల్యేలను కోరారు. దీనికోసం వారికి తగినంత సమయం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని పాలించండి అని ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారు తప్ప, విభజించండని కాదన్నారు. బిల్లు విషయాలు కేంద్ర కేబినెట్లో మంత్రులెవరికీ వివరించకుండానే నిర్ణ యం తీసుకున్నారని, అసెంబ్లీలో అలా జరగకుండా చూడాలన్నారు. ఎంపీలు రాజీనామా చేయాల్సిన అ వసరం లేదని, కానీ, బిల్లు సమయంలో యూపీఏ కు మద్దతు ఉపసంహరించి సమైక్యానికి కట్టుబడాలన్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు మాట్లాడుతూ.. సీఎం కిరణ్, జగన్, బాబు వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి, సమైక్య రాష్ట్రం కోసం కృషి చేయాలన్నారు. విశాలాంధ్ర మహాసభ అధ్యక్షులు చేగొండి రామజోగయ్య మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ అసెంబ్లీ అభిప్రాయాన్ని తీసుకోకుండా రాష్ట్రాలను విభజించిన దాఖలాలు లేవన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఐటీ జేఏసీ సభ్యులు శివశంకర్‌రెడ్డి, పంచాయతీరాజ్ జేఏసీ ప్రతినిధి మురళీ కృష్ణంరాజు, సహకార బ్యాంకు మేనేజర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. సోనియా..క్విట్ ఇండియా తీర్మానం ఈనెల 9న సోనియా పుట్టినరోజును రాష్ట్ర ప్రజలు సోనియా.. క్విట్ ఇండియా నినాదంతో నిరసనలు చేపట్టాలని వేదిక ఏకగ్రీవంగా తీర్మానించింది. రాష్ట్ర విభజనకు ప్రధాన కారకురాలైన ఆమె ఇటలీకి వెళ్లిపోవాలని ప్రజలు నినదించాలని కోరారు. ఆమె పుట్టిన రోజును తెలుగు ప్రజల చీకటి రోజుగా భావించి ఆమె పోస్టర్లు దహనం చేయాలని, పల్లె పల్లెనా వ్యతిరేకతను పాటించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. -
సమైక్యాంధ్ర జేఏసీ ఆవిర్భావం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించడమే లక్ష్యంగా సమైక్యాంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆవిర్భవించింది. మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లో సమైక్యవాదులు నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఈ జేఏసీని ఏర్పాటు చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి’గా వ్యవహరించే ఈ జేఏసీ రాష్ట్ర సమన్వయకర్తగా జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డిని ఎన్నుకున్నారు. పలువురు మేధావులతో జేఏసీకి రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించారు. త్వరలోనే అన్ని జిల్లాలకు విభాగాలను ఏర్పాటు చేస్తామని, విద్యార్థులు, ఉద్యోగులు, కర్షకులు, కార్మికులు సహా అన్ని వర్గాలవారినీ కలుపుకొని ఉద్యమిస్తామని జేఏసీ తెలిపింది. రాష్ట్రం సమైక్య, విభజన వాదాలతో అట్టుడుకుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చొరవ తీసుకుని అసెంబ్లీని సమావేశపరచి సమైక్యాంధ్రప్రదేశ్‌ను కోరుతూ తీర్మానం చేయించాలని కమిటీ సమావేశం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగితే ఉద్యమాలు వస్తాయని, కొత్త రాష్ట్రాల డిమాండ్లు వస్తాయని శ్రీకృష్ణ కమిటీ చెప్పినా పట్టించుకోకుండా కేంద్రం నిర్ణయం తీసుకోవడం దారుణమని అన్నారు. విడిపోతే వచ్చే నష్టంపై కరపత్రాలు, పుస్తకాలు ముద్రించి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తామన్నారు. రెండు ప్రాంతాల్లోనూ యువత ఆత్మహత్యలకు పాల్పడకుండా నివారించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. సభ పెట్టుకునే హక్కూ లేదా? మంగళవారం కూకట్‌పల్లిలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించాలని చూస్తే విభజన వాదులు, పోలీసులు భగ్నం చేయడం దురదృష్టకరమని వి.లక్ష్మణరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో సభలు పెట్టుకునే హక్కు కూడా లేకుండా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్లుగా సమైక్యంగా ఉన్న రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న నేపథ్యంలో విభజించాలనుకోవడం దురదృష్టకరమన్నారు. జేఏసీ రాష్ట్ర కార్యవర్గం.. జేఏసీ రాష్ట్ర సమన్వయకర్తగా వి.లక్ష్మణరెడ్డి, సభ్యులుగా జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి (హైకోర్టు మాజీ న్యాయమూర్తి), ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి (మాజీ ఉపాధ్యక్షులు ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయం), ఎం.ఎల్. కాంతారావు (ఆర్థిక వేత్త), రామనారాయణరెడ్డి(రిటైర్డ్ ఐఏఎస్), గోపాల్‌రెడ్డి (ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షులు), జంధ్యాల రవిశంకర్ (హైకోర్టు న్యాయవాది), వి.రామకృష్ణ (హైకోర్టు న్యాయవాది), ఎర్నేని నాగేంద్రనాథ్ (రైతు సంఘం నాయకులు), అక్కినేని భవానీ ప్రసాద్ (వ్యవసాయ రంగ నిపుణులు), జి.పూర్ణచంద్రరావు (ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షులు), ఆరవేటి జ్యోతి (సాఫ్ట్వేర్ నిపుణులు), పుత్తా శివశంకర్‌రెడ్డి (సాఫ్ట్వేర్ నిపుణులు), డి.గోపాలకృష్ణ (హైకోర్టు మాజీ న్యాయమూర్తి), పోతుల శివ (సాఫ్ట్వేర్ నిపుణులు), కమలకూరి సుధీర్‌కుమార్ (పారిశ్రామికవేత్త), బి.కాంతారావు (ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థి జేఏసీ కన్వీనర్) ఉన్నారు. సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు తొలుత కూకట్‌పల్లిలో నిర్వహించాలనుకున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని పేర్కొంటూ వి.లక్ష్మణరెడ్డి సహా సమైక్యవాదులను అదుపులోకి తీసుకొని మియాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సమైక్యాంధ్ర జేఏసీ భేటీ జరుగుతుందని తెలుసుకున్న తెలంగాణవాదులు ఆ ప్రాంగణం వద్దకు వచ్చారు. అప్పటికే సమైక్యవాదులను తరలించిన పోలీసులు.. తెలంగాణవాదులను కూడా అక్కడి నుంచి పంపించారు. తర్వాత సొంత పూచీకత్తుపై పోలీసులు సమైక్యవాదులను విడుదల చేయగా.. వారు బంజారాహిల్స్‌లో సమావేశం నిర్వహించారు. సమైక్యాంధ్ర జేఏసీ తీర్మానాలు కేంద్ర మంత్రులు రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వాములు కావాలి. రాజకీయ పార్టీలు గతంలో తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించి సమైక్య వాదాన్ని బలపర్చాలి. శ్రీకృష్ణ కమిటీ సూచనల మేరకు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలి. విభజన వల్ల కలిగే నష్టాలను, సమైక్యం వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి. హైదరాబాద్ నగరంలో సభలు, సమావేశాలకు పోలీసులు అనుమతి ఇచ్చి, తగిన భద్రత కల్పించాలి. మంగళవారం కూకట్‌పల్లిలో జరుపతలపెట్టిన రౌండ్‌టేబుల్ సమావేశాన్ని అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నాం.