సమైక్యాంధ్ర జేఏసీ ఆవిర్భావం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించడమే లక్ష్యంగా సమైక్యాంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆవిర్భవించింది. మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లో సమైక్యవాదులు నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఈ జేఏసీని ఏర్పాటు చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి’గా వ్యవహరించే ఈ జేఏసీ రాష్ట్ర సమన్వయకర్తగా జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డిని ఎన్నుకున్నారు. పలువురు మేధావులతో జేఏసీకి రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించారు. త్వరలోనే అన్ని జిల్లాలకు విభాగాలను ఏర్పాటు చేస్తామని, విద్యార్థులు, ఉద్యోగులు, కర్షకులు, కార్మికులు సహా అన్ని వర్గాలవారినీ కలుపుకొని ఉద్యమిస్తామని జేఏసీ తెలిపింది. రాష్ట్రం సమైక్య, విభజన వాదాలతో అట్టుడుకుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చొరవ తీసుకుని అసెంబ్లీని సమావేశపరచి సమైక్యాంధ్రప్రదేశ్‌ను కోరుతూ తీర్మానం చేయించాలని కమిటీ సమావేశం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగితే ఉద్యమాలు వస్తాయని, కొత్త రాష్ట్రాల డిమాండ్‌లు వస్తాయని శ్రీకృష్ణ కమిటీ చెప్పినా పట్టించుకోకుండా కేంద్రం నిర్ణయం తీసుకోవడం దారుణమని అన్నారు. విడిపోతే వచ్చే నష్టంపై కరపత్రాలు, పుస్తకాలు ముద్రించి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తామన్నారు. రెండు ప్రాంతాల్లోనూ యువత ఆత్మహత్యలకు పాల్పడకుండా నివారించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
సభ పెట్టుకునే హక్కూ లేదా?
మంగళవారం కూకట్‌పల్లిలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించాలని చూస్తే విభజన వాదులు, పోలీసులు భగ్నం చేయడం దురదృష్టకరమని వి.లక్ష్మణరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో సభలు పెట్టుకునే హక్కు కూడా లేకుండా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్లుగా సమైక్యంగా ఉన్న రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న నేపథ్యంలో విభజించాలనుకోవడం దురదృష్టకరమన్నారు.
జేఏసీ రాష్ట్ర కార్యవర్గం..
జేఏసీ రాష్ట్ర సమన్వయకర్తగా వి.లక్ష్మణరెడ్డి, సభ్యులుగా జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి (హైకోర్టు మాజీ న్యాయమూర్తి), ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి (మాజీ ఉపాధ్యక్షులు ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయం), ఎం.ఎల్. కాంతారావు (ఆర్థిక వేత్త), రామనారాయణరెడ్డి(రిటైర్డ్ ఐఏఎస్), గోపాల్‌రెడ్డి (ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షులు), జంధ్యాల రవిశంకర్ (హైకోర్టు న్యాయవాది), వి.రామకృష్ణ (హైకోర్టు న్యాయవాది), ఎర్నేని నాగేంద్రనాథ్ (రైతు సంఘం నాయకులు), అక్కినేని భవానీ ప్రసాద్ (వ్యవసాయ రంగ నిపుణులు), జి.పూర్ణచంద్రరావు (ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షులు), ఆరవేటి జ్యోతి (సాఫ్ట్‌వేర్ నిపుణులు), పుత్తా శివశంకర్‌రెడ్డి (సాఫ్ట్‌వేర్ నిపుణులు), డి.గోపాలకృష్ణ (హైకోర్టు మాజీ న్యాయమూర్తి), పోతుల శివ (సాఫ్ట్‌వేర్ నిపుణులు), కమలకూరి సుధీర్‌కుమార్ (పారిశ్రామికవేత్త), బి.కాంతారావు (ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థి జేఏసీ కన్వీనర్) ఉన్నారు.
సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు
తొలుత కూకట్‌పల్లిలో నిర్వహించాలనుకున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని పేర్కొంటూ వి.లక్ష్మణరెడ్డి సహా సమైక్యవాదులను అదుపులోకి తీసుకొని మియాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సమైక్యాంధ్ర జేఏసీ భేటీ జరుగుతుందని తెలుసుకున్న తెలంగాణవాదులు ఆ ప్రాంగణం వద్దకు వచ్చారు. అప్పటికే సమైక్యవాదులను తరలించిన పోలీసులు.. తెలంగాణవాదులను కూడా అక్కడి నుంచి పంపించారు. తర్వాత సొంత పూచీకత్తుపై పోలీసులు సమైక్యవాదులను విడుదల చేయగా.. వారు బంజారాహిల్స్‌లో సమావేశం నిర్వహించారు.
సమైక్యాంధ్ర జేఏసీ తీర్మానాలు
కేంద్ర మంత్రులు రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వాములు కావాలి.
రాజకీయ పార్టీలు గతంలో తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించి సమైక్య వాదాన్ని బలపర్చాలి.
శ్రీకృష్ణ కమిటీ సూచనల మేరకు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలి.
విభజన వల్ల కలిగే నష్టాలను, సమైక్యం వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి.
హైదరాబాద్ నగరంలో సభలు, సమావేశాలకు పోలీసులు అనుమతి ఇచ్చి, తగిన భద్రత కల్పించాలి.
మంగళవారం కూకట్‌పల్లిలో జరుపతలపెట్టిన రౌండ్‌టేబుల్ సమావేశాన్ని అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నాం.