అసెంబ్లీ అభిప్రాయం అత్యంత కీలకం: లక్ష్మణరెడ్డి | Assembly opinion most crucial on bifurcation bill, says Laxman reddy | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ అభిప్రాయం అత్యంత కీలకం: లక్ష్మణరెడ్డి

Published Sun, Dec 8 2013 3:37 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM

అసెంబ్లీ అభిప్రాయం అత్యంత కీలకం: లక్ష్మణరెడ్డి - Sakshi

అసెంబ్లీ అభిప్రాయం అత్యంత కీలకం: లక్ష్మణరెడ్డి

సాక్షి, హైదరాబాద్:  విభజన బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయం అత్యంత కీలక ఘట్టమని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ జస్టిస్ లక్ష్మణరెడ్డి అన్నారు. కొంతమంది అసెంబ్లీ అభిప్రాయం నామమాత్రమని చెబుతున్నా.. ప్రజాస్వామ్యంలో మెజారిటీ శాసనసభ్యుల అభిప్రాయమే చెల్లుబాటవుతుందని చెప్పారు. శనివారం ఇక్కడ పాత ఎమ్మెల్యే క్వార్టర్లలో విలేకరులతో ఆయన మాట్లాడారు. బిల్లు అసెంబ్లీకి వస్తున్న ఈ సమయంలో తమ తమ నియోజక వర్గాల్లో సభలు ఏర్పాటు చేసుకుని ప్రజాభిప్రాయాలను సేకరించి, వాటిని అసెంబ్లీలో ప్రతి బింబించేలా వ్యవహరించాలని ఎమ్మెల్యేలను కోరారు.
 
 దీనికోసం వారికి తగినంత సమయం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని పాలించండి అని ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారు తప్ప, విభజించండని కాదన్నారు. బిల్లు విషయాలు కేంద్ర కేబినెట్‌లో మంత్రులెవరికీ వివరించకుండానే నిర్ణ యం తీసుకున్నారని, అసెంబ్లీలో అలా జరగకుండా చూడాలన్నారు. ఎంపీలు రాజీనామా చేయాల్సిన అ వసరం లేదని, కానీ, బిల్లు సమయంలో యూపీఏ కు మద్దతు ఉపసంహరించి సమైక్యానికి కట్టుబడాలన్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు మాట్లాడుతూ.. సీఎం కిరణ్, జగన్, బాబు వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి, సమైక్య రాష్ట్రం కోసం కృషి చేయాలన్నారు. విశాలాంధ్ర మహాసభ అధ్యక్షులు చేగొండి రామజోగయ్య మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ అసెంబ్లీ అభిప్రాయాన్ని తీసుకోకుండా రాష్ట్రాలను విభజించిన దాఖలాలు లేవన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఐటీ జేఏసీ సభ్యులు శివశంకర్‌రెడ్డి, పంచాయతీరాజ్ జేఏసీ ప్రతినిధి మురళీ కృష్ణంరాజు, సహకార బ్యాంకు మేనేజర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
 
 సోనియా..క్విట్ ఇండియా తీర్మానం
 ఈనెల 9న సోనియా పుట్టినరోజును రాష్ట్ర ప్రజలు సోనియా.. క్విట్ ఇండియా నినాదంతో నిరసనలు చేపట్టాలని వేదిక ఏకగ్రీవంగా తీర్మానించింది. రాష్ట్ర విభజనకు ప్రధాన కారకురాలైన ఆమె ఇటలీకి వెళ్లిపోవాలని ప్రజలు నినదించాలని కోరారు. ఆమె పుట్టిన రోజును తెలుగు ప్రజల చీకటి రోజుగా భావించి ఆమె పోస్టర్లు దహనం చేయాలని, పల్లె పల్లెనా వ్యతిరేకతను పాటించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement