
- మిర్చి రైతుల కష్టాలపై చంద్రబాబు నాటకాలు
- దిగుబడి తగ్గి... రేటు లేక కుదేలైన మిర్చి రైతు
- కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్న చంద్రబాబు
- కేంద్రం ఎప్పుడైనా మిర్చి కొనుగోళ్ళు చేసిందా?
- మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం
గుంటూరు రాష్ట్రంలో ధరలు పతనమై తీవ్రంగా నష్టపోతున్న మిర్చిరైతులను ఆదుకోకుండా సీఎం చంద్రబాబు డ్రామాలతో కాలం గడుపుతున్నారని వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పరిధిలోని మార్క్ ఫైడ్ నుంచి మిర్చి కొనుగోళ్ళు చేయించకుండా, కేంద్రప్రభుత్వం కొనుగోళ్ళు చేయాలని చంద్రబాబు కోరడం అర్థరహితమని అన్నారు. ఇప్పటి వరకు ఒక్క క్వింటా కూడా కూటమి ప్రభుత్వం మద్దతుధరకు కొనుగోలు చేయలేదని, దీనిని బట్టే మిర్చి రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం తెట్టతెల్లమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే...
రాష్ట్రంలో మిర్చి ధర దారుణంగా పతనమైంది. జనవరిలో హార్టీకల్చర్ విభాగం మిర్చి పంటకు సంబంధించిన నివేదికను ముందుగానే ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో మిర్చిరైతులు సంక్షోభంలో ఉన్నారు, పెట్టుబడి వ్యయాలు పెరిగాయి, దిగుబడి తగ్గుతోంది, మిర్చి రేటు కూడా పడిపోతోంది, మార్కెట్ ఇంట్రవెన్షన్ లేకపోతే రైతులు దెబ్బతింటారు అని చాలా స్పష్టంగా ప్రభుత్వానికి నివేదించింది. అయినా కూడా సీఎం చంద్రబాబు స్పందించలేదు. చివరికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ గారు మిర్చి రైతుల బాధలను తెలుసుకుని, వారికి భరోసా కల్పించేందుకు గుంటూరు మిర్చియార్డ్ కు వెళ్ళడంతో రాష్ట్ర ప్రభుత్వం గత్యంతరం లేని స్థితిలో స్పందించింది. కనీసం ఇప్పటికైనా మిర్చిరైతుల సమస్యను గుర్తించి మద్దతుధరకు కొనుగోళ్ళు చేస్తుందని అందరూ భావించారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం తరుఫున ఒక్క క్వింటా మిర్చి కూడా కొనుగోలు చేయలేదు. పైగా మిర్చి రైతులను ఆదుకుంటున్నామంటూ సీఎం చంద్రబాబు డ్రామాలు ప్రారంభించారు.
నాఫెడ్ ఎప్పుడైనా మిర్చికొనుగోళ్ళు చేసిందా?
శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం రాసిన లేఖలో గత ప్రభుత్వంలో క్వింటా మిర్చి రూ.27వేల వరకు అమ్ముడుపోయింది. నేడు మిర్చిధర దారుణంగా పతనమైంది. వెంటనే కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీఎం కోరారు. అసలు మిర్చి కొనుగోళ్ళకు కేంద్రప్రభుత్వానికి ఏం సంబంధం? నాఫెడ్ ఎప్పుడైనా కొనుగోళ్ళు చేసిందా? మార్క్ ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోళ్ళు చేయించడానికి ఉన్నా కూడా సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఒకవేళ కేంద్రం స్పందించి ముందుకు వస్తే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మిర్చీని వారికి విక్రయించండి.
వైఎస్సార్‌సీపీ హయాంలో మార్కెట్ ఇంట్రవెన్షన్
2021లో వైఎస్సార్‌సీపీ హయాంలో మిర్చిరేటు పడిపోయినప్పుడు క్వింటాకు రూ.7వేలు మద్దతుధర ప్రకటించాం. ఈ రోజు ఉన్న రేట్ల ప్రకారం మిర్చికి కనీసం రూ.14 నుంచి 15వేల రూపాయల వరకు మద్దతుధరను ప్రకటించాల్సి ఉంది. ఆనాడు వైయస్ జగన్ గారు రైతులపక్షన నిలబడి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్ళు చేయించారు. రూ. 65వేల కోట్లను వెచ్చించి ధాన్యంను కొనుగోలు చేశాం. ఇతర పంటలకు సంబంధించి రూ.7800 కోట్లతో కొనుగోలు చేశాం. రూ.3000 కోట్లు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. కరోనా సమయంలో అరటి, గుమ్మడికాయలను కూడా కొనుగోలు చేశాం. వ్యవసాయరంగంలో వైయస్ జగన్ గారు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఉండేలా రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఆర్బీకే వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారు. రైతుల పట్ల నిర్లక్ష్యదోరణితో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
చంద్రబాబు, లోకేష్ చేతుల్లో కీలుబొమ్మల్లా ఐపీఎస్ అధికారులు
రేటులేక నష్టపోతున్న రైతులను పరామర్శించడానికి వెళ్ళిన మాజీ సీఎం వైయస్ జగన్ గారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పోలీసులు కుంటిసాకులు చెబుతున్నారు. కష్టాల్లో ఉన్న మిర్చి రైతులను పరామర్శించేందుకు సీఎం, వ్యవసాయ మంత్రులకు ఎన్నికల కోడ్ అడ్డం వస్తే, కనీసం ఎందుకు అధికారులను అయినా పంపించలేదు? రైతుల పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? రైతుల పక్షనా వారి బాధను అర్థం చేసుకునేందుకు వైయస్ జగన్ గారు గుంటూరు వెడితే ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేశారు. ఇదే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విజయవాడలో మ్యూజికల్ నైట్ నిర్వహిస్తే దానికి సీఎం చంద్రబాబు, మంత్రులు హాజరైనా దానికి కోడ్ వర్తించదా? రైతుల కోసం వెళ్ళిన వైయస్ జగన్, ఇతర వైయస్ఆర్సీపీ నేతలపైనా కేసులు పెట్టడం కక్షసాధింపు కాదా? భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఒక మాజీ సీఎంకు ఉన్న జెడ ప్లస్ కేటగిరి సెక్యూరిటీని రైతులను పరామర్శించేందుకు వెళ్ళిన రోజున ఉపసంహరించారు. కుట్రపూరితంగానే భద్రతను తొలగించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. ఇందుకు రాష్ట్ర డీజీపీ బాధ్యత వహించాలి. చంద్రబాబు, లోకేష్ చేతుల్లో కీలుబొమ్మలా ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తున్నారు. రైతుల కోసం ఎన్ని కేసులు పెట్టినా భరించడానికి మేం సిద్దంగా ఉన్నాం.’అని అంబటి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment