ఆన్‌లైన్ గుబులు | online problems | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ గుబులు

Published Fri, Jul 10 2015 2:47 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

online problems

ఆన్‌లైన్ బిల్లింగ్ విధానం మద్యం వ్యాపారుల్లో గుబులు రేపుతోంది. ఇష్టారాజ్యంగా విక్రయాలు సాగించి భారీగా లాభపడొచ్చన్న ఆశతో లెసైన్స్‌లు దక్కించుకున్న వ్యాపారులు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. లిక్కర్ బాటిళ్లపై హోలోగ్రామ్‌ను అమర్చి.. సూపర్ మార్కెట్ల తరహాలో ఆన్‌లైన్ కంప్యూటర్ బిల్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఎక్సైజ్ కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి మద్యం దుకాణంలో బిల్లింగ్‌ను కమిషనర్ కార్యాలయంతో అనుసంధానం చేయనున్నారు. ఆగస్టు నుంచి ఈ విధానాన్ని అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు. దీనివల్ల ఇటు వ్యాపారులు, అటు ఎక్సైజ్ అధికారుల అక్రమార్జనకు చెక్ పడనుంది.
 
 సాక్షి ప్రతినిధి, అనంతపురం : మద్యం అమ్మకాల్లో సరికొత్త విధానానికి ఎక్సైజ్‌శాఖ రెండేళ్ల కిందటే శ్రీకారం చుట్టింది. అయితే.. అది అమల్లోకి రాలేదు. ప్రస్తుతం ఆ విధానాన్ని అమలు చేసేందుకు  ఎక్సైజ్ కమిషనర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నకిలీ మద్యాన్ని నివారించి, నాణ్యతతో పాటు మద్యం తయారీ, అమ్మకాలపై పారదర్శకత పాటించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మద్యం సీసాలపై హోలోగ్రామ్ వేసి.. నూతన కంప్యూటర్ బిల్లింగ్‌ను ప్రవేశపెట్టనున్నారు.
 
 ఈ విధానం ఆగస్టు నుంచి అమల్లోకి రానుంది. ప్రతి మద్యం దుకాణంలో ఆన్‌లైన్ కంప్యూటర్ బిల్లింగ్‌కు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేస్తారు. సూపర్ మార్కెట్ తరహాలో మద్యం విక్రయించగానే కంప్యూటర్ స్క్రాచ్ ద్వారా బిల్లు వేయాలి. దాని ప్రతిని కొనుగోలుదారుడికి అందజేయాలి. ఈ బిల్లు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయానికి చేరుతుంటాయి.
 
 అలాగే ప్రతి మద్యం సీసాపై హోల్‌గ్రామ్ వేస్తారు. దానిపై సీరియల్ నెంబర్‌ను ముద్రిస్తారు. ఆ నెంబర్ ఆధారంగా సీసాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశారు. బాటిల్‌పై ఓ టోల్‌ఫ్రీ నెంబరును కూడా ముద్రిస్తారు. తాను కొన్న మద్యం సీసా గురించి తెలుసుకోవాలనుకునే కొనుగోలుదారుడు సీసాపై ఉన్న టోల్‌ఫ్రీ నెంబరుకు ఎస్‌ఎంఎస్ పంపితే చాలు.  క్షణాల్లో ఆ సీసా ఎప్పుడు, ఎక్కడ తయారు చేశారు? ఏ మద్యం గోదాము నుంచి వచ్చింది? ఏ దుకాణానికి అమ్మారు? అనే వివరాలు ఎస్‌ఎంఎస్ రూపంలో అందుతాయి.
 
 అక్రమ ప్రవాహానికి అడ్డుకట్ట
 ప్రస్తుతం మద్యం సీసాలపై లేబుల్స్ ఉన్నాయి. కొందరు మాఫియా అవతారమెత్తి నకిలీ లేబుళ్లను తయారు చేస్తున్నారు. తద్వారా నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. కర్ణాటక నుంచి అక్కడి మద్యాన్ని భారీగా దిగుమతి చేస్తున్నారు. అక్కడ మద్యం ధరలు తక్కువ. పైగా ట్యాక్స్ వెసులుబాటు ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని మద్యం వ్యాపారులు భారీగా ఆర్జిస్తున్నారు. ఈ చర్యలతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. కొత్త విధానం ద్వారా దీన్ని పూర్తిగా నివారించే అవకాశముంది.
 
 అలాగే నకిలీ మద్యం తాగిన వారు అనారోగ్యాలకు గురవుతున్నారు. కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. హోల్‌గ్రామ్ విధానం అమలైతే మద్యం సీసాలపై ఉండే నెంబరు ఆధారంగా అది ఎక్కడ తయారైందనే విషయం స్పష్టమవుతుంది. దీనివల్ల నకిలీ మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసే అవకాశముంది. జిల్లాలో ప్రస్తుతం ప్రతి నెలా రూ.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. కొత్త విధానం అమలైతే ఎక్సైజ్ ఆదాయం మరింత పెరిగే అవకాశముంది.  
 
 వ్యాపారుల వెనకడుగు
 ఆన్‌లైన్ విధానం అమలుపై మద్యం వ్యాపారుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దుకాణాలు కొత్తగా ప్రారంభమైనా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్నారు. బాటిల్‌పై బ్రాండ్‌ను బట్టి రూ.10-30 అధికంగా వసూలు చేస్తున్నారు. ఆన్‌లైన్ బిల్లింగ్ పెడితే ఎమ్మార్పీకే విక్రయించాలి. పైగా కంప్యూటర్ల కోసం రూ.90 వేలు చెల్లించాలి. దీంతో వ్యాపారులు వెనకడుగు వేస్తున్నారు.
 
  అయితే.. ఆబ్కారీ అధికారులు మాత్రం ‘కార్వే’ సంస్థ ద్వారా సాఫ్ట్‌వేర్‌తో పాటు మిషనరీ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రతినెలా రూ.5వేలు అద్దె చెలిస్తే మిషనరీ అమరుస్తారు. లేదంటే రూ.90 వేలు పెట్టి కొనాల్సి ఉంటుంది. గతేడాది కూడా వ్యాపారుల నుంచి రూ.90వేల చొప్పున వసూలు చేశారు. మిషనరీ మాత్రం అమర్చలేదు. దీంతో వారు డబ్బు తిరిగివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త దుకాణాలు దక్కించుకున్నవారితో ఆ డబ్బు ఇప్పించేందుకు  అధికారులు ప్రయత్నిస్తున్నారు.
 
 అందరూ అద్దెకు తీసుకుంటామంటున్నారు
 ఆన్‌లైన్ బిల్లింగ్ ఆగస్టు నుంచి అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కార్వే సంస్థ సాఫ్ట్‌వేర్ అందిస్తోంది. అందరూ అద్దె ప్రాతిపదికర మిషనరీ కొనుగోలు చేస్తామంటున్నారు. గతేడాది డబ్బు  చెల్లించిన వారికి కొత్త వ్యాపారుల నుంచి ఇప్పిస్తాం. ఇది పెద్ద సమస్య కాబోదు.
 - జీవన్‌సింగ్,
 డిప్యూటీ కమిషనర్, ఎకై ్సజ్‌శాఖ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement