బాధితులను పరామర్శించిన ఎక్సైజ్ డెరైక్టర్
నెల్లూరు(క్రైమ్): మోనోక్రోటోపాస్ కలిసిన కల్లు తాగడం వల్లే కలువాయి మండలానికి చెందిన పలువురు అస్వస్తతకు గురయ్యారని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ డెరైక్టర్ సూర్యప్రకాష్‌రావు స్పష్టం చేశారు.
కల్లుతాగి తీవ్ర అస్వస్థతకు గురై నెల్లూరు రామచంద్రారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాపా శీనయ్య, కటారి పెంచలయ్య, కాపా బాబులను ఆయన పరామర్శించారు. కల్తీకల్లు తాగి తొమ్మిది మంది అస్వస్థతకు లోనైన విషయంపై ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ కమిషనర్ ఎస్ ఎస్ రావత్ స్పందించారు. పూర్తి విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆయన డెరైక్టర్ సూర్యప్రకాష్‌రావును ఆదేశించారు. దీంతో డెరైక్టర్ గురువారం చెన్నై నుంచి రోడ్డుమార్గాన నెల్లూరుకు చేరుకున్నారు.
తొలుత రామచంద్రారెడ్డి హాస్పిటల్‌లోని ఐసీయూలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారి పరిస్థితిపై స్థానిక వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి మెరుగుగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఆయన అక్కడ నుంచి సంఘటన జరిగిన కలువాయి మండలం దాసరి పల్లికి వెళ్లాడు. కల్లుగీత కార్మికుడిని సంఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకునాన్నారు. కల్లుతాగి అస్వస్థతకు గురైన మిగిలిన వారిని విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుకుండల చుట్టూ ఈగలు, చీమలు, పురుగులు చేరకుండా కల్లుగీత కార్మికుడు మోనోక్రోటోపాస్ పురుగల మందు పూశాడన్నారు. అయితే వర్షం కారణంగా పురుగుల మందు కారి కుండలోని కల్లులో కలిసి పోయిందన్నారు.
ఆ కల్లుతాగడం వల్లనే అస్వస్థతకు గురయ్యారన్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని రెండు, మూడురోజుల్లోనే వారు సైతం కోలుకుంటారని తెలిపారు. ఆయన వెంట ఆశాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్యమురళీ, నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీనివాస్ ఉన్నారు.
పొదలకూరు: దాసరిపల్లిలో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై పొదలకూరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎక్సై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ సూర్యప్రకాష్‌విచారించారు. పొదలకూరు మీదుగా దాసరిపల్లి గ్రామానికి వెళ్లి కల్తీ కల్లుపై దర్యాప్తు చేపట్టిన ఆయన తిరుగు ప్రయాణంలో పొదలకూరులో ఆగి బాధితులు కోటేశ్వరరావు, కొమ్మి నారాయణ, ఫకీరయ్యను విచారించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసి మెరుగైన చికిత్సను అందిస్తామన్నారు.
నిందితుడిపై కేసు నమోదు
దాసరిపల్లి(కలువాయి): దాసరిపల్లిలో కల్తీకల్లు తాగి అస్వస్థతకు గురైన సంఘటనపై ఎక్సైజ్ అధికారులు విచారణ జరిపారు. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డెరైక్టర్ జి.సూర్యప్రకాష్ నెల్లూరు, పొదలకూరులో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం దాసరిపల్లిలో కల్లీకల్లు సంఘటనకు కారణమైన ఈత చెట్టును పరిశీలించారు. కల్లు విక్రేత వెరుబొట్లపల్లికి చెందిన ఆనెం శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
మోనోక్రోటోపాస్ వల్లే అస్వస్థత
Published Fri, Dec 12 2014 2:23 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement