Surya Prakash rao
-
పుస్తకాలు పక్కదారి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: జిల్లా విద్యాశాఖాధికారి అనుమతి లేకుండా అధికారుల కళ్లుగప్పి శుక్రవారం పుస్తకగోదాం అధికారిణి అక్రమంగా తరలించేందుకు యత్నించిన పుస్తకాలను స్థానికుల సమాచారంతో జిల్లా విద్యాశాఖాధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకెళ్తే.. జిల్లా విద్యాశాఖకు సంబంధించిన పుస్తకాలను నిల్వ ఉంచే గోదాంకు ఇన్చార్జిగా భారతి వ్యవహరిస్తున్నారు. దీంతో ఈనెల 17న పశ్చిమబెంగాల్లో చదువుతున్న తెలుగు మీడియం 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయాలని ఆదేశిస్తూ పాఠశాల విద్య కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారి సూర్యప్రకాశ్‌రావు సరఫరా చేయాలని ఆదేశించారు. ఇదిలాఉండగా, సెలవురోజైన శుక్రవారం రోజు పుస్తక గోదాం ఇన్చార్జి భారతి డీఈఓకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పుస్తకాలను తరలించేందుకు లారీలో లోడ్ వేయించింది. ఉత్తర్వుల్లో ఉన్నవి 3,630 మాత్రమే 1వ తరగతి 630, 2వ తరగతి 400, 3వ తరగతి 500, 4వ తరగతి 400, 4వ తరగతి(ఈవీఎస్టీఎం) 700, 5వ తరగతి తెలుగు రీడర్ 600, 5వ తరగతి తెలుగు మాథ్స్ 400 మొత్తం 3,630 పుస్తకాలు సరఫరా చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ గోదాం ఇన్చార్జి మాత్రం ప్రతి సంఖ్యకు చివరన ఁసున్న* చేర్చుతూ మొత్తం 36,300 పుస్తకాలకు ఉత్తర్వులు ఇచ్చినట్లుగా అధికారులు ఇచ్చిన ఉత్తర్వులో దిద్దింది. తరలించేందుకు లారీలో కూడా పుస్తకాలు నింపారు. విషయం తెలుసుకున్న మీడియా, అధికారులు అక్కడికి చేరుకోవడంతో సదరు అధికారిణి అవాక్కైంది. తనకు డెరైక్టర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయని, డీఈఓకు సమాచారం ఇవ్వాలని తనకు తెలియదని డిప్యూటీ ఈఓ గోవిందరాజులు, ఎంఈఓ వెంకట్రాముడుకు తెలిపింది. పరిశీలించి చర్యలు తీసుకుంటాం పుస్తకాలు తరలించే విషయం నాకు ఎలాంటి సమాచారం లేదు. డెరైక్టర్‌తో మాట్లాడాను. తక్కువ పుస్తకాలు ఆర్డర్ ఇస్తే ఎక్కువ తరలిస్తున్నట్లు తెలిసింది. లారీలో నుంచి ఒక్క పుస్తకం కూడా తరలించకుండా అక్కడే ఉంచాలని ఆదేశించాం. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - నాంపల్లి రాజేష్, డీఈఓ, మహబూబ్‌నగర్ -
మోనోక్రోటోపాస్ వల్లే అస్వస్థత
బాధితులను పరామర్శించిన ఎక్సైజ్ డెరైక్టర్ నెల్లూరు(క్రైమ్): మోనోక్రోటోపాస్ కలిసిన కల్లు తాగడం వల్లే కలువాయి మండలానికి చెందిన పలువురు అస్వస్తతకు గురయ్యారని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ డెరైక్టర్ సూర్యప్రకాష్‌రావు స్పష్టం చేశారు. కల్లుతాగి తీవ్ర అస్వస్థతకు గురై నెల్లూరు రామచంద్రారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాపా శీనయ్య, కటారి పెంచలయ్య, కాపా బాబులను ఆయన పరామర్శించారు. కల్తీకల్లు తాగి తొమ్మిది మంది అస్వస్థతకు లోనైన విషయంపై ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ కమిషనర్ ఎస్ ఎస్ రావత్ స్పందించారు. పూర్తి విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆయన డెరైక్టర్ సూర్యప్రకాష్‌రావును ఆదేశించారు. దీంతో డెరైక్టర్ గురువారం చెన్నై నుంచి రోడ్డుమార్గాన నెల్లూరుకు చేరుకున్నారు. తొలుత రామచంద్రారెడ్డి హాస్పిటల్‌లోని ఐసీయూలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారి పరిస్థితిపై స్థానిక వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి మెరుగుగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఆయన అక్కడ నుంచి సంఘటన జరిగిన కలువాయి మండలం దాసరి పల్లికి వెళ్లాడు. కల్లుగీత కార్మికుడిని సంఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకునాన్నారు. కల్లుతాగి అస్వస్థతకు గురైన మిగిలిన వారిని విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుకుండల చుట్టూ ఈగలు, చీమలు, పురుగులు చేరకుండా కల్లుగీత కార్మికుడు మోనోక్రోటోపాస్ పురుగల మందు పూశాడన్నారు. అయితే వర్షం కారణంగా పురుగుల మందు కారి కుండలోని కల్లులో కలిసి పోయిందన్నారు. ఆ కల్లుతాగడం వల్లనే అస్వస్థతకు గురయ్యారన్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని రెండు, మూడురోజుల్లోనే వారు సైతం కోలుకుంటారని తెలిపారు. ఆయన వెంట ఆశాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్యమురళీ, నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీనివాస్ ఉన్నారు. పొదలకూరు: దాసరిపల్లిలో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై పొదలకూరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎక్సై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ సూర్యప్రకాష్విచారించారు. పొదలకూరు మీదుగా దాసరిపల్లి గ్రామానికి వెళ్లి కల్తీ కల్లుపై దర్యాప్తు చేపట్టిన ఆయన తిరుగు ప్రయాణంలో పొదలకూరులో ఆగి బాధితులు కోటేశ్వరరావు, కొమ్మి నారాయణ, ఫకీరయ్యను విచారించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసి మెరుగైన చికిత్సను అందిస్తామన్నారు. నిందితుడిపై కేసు నమోదు దాసరిపల్లి(కలువాయి): దాసరిపల్లిలో కల్తీకల్లు తాగి అస్వస్థతకు గురైన సంఘటనపై ఎక్సైజ్ అధికారులు విచారణ జరిపారు. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డెరైక్టర్ జి.సూర్యప్రకాష్ నెల్లూరు, పొదలకూరులో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం దాసరిపల్లిలో కల్లీకల్లు సంఘటనకు కారణమైన ఈత చెట్టును పరిశీలించారు. కల్లు విక్రేత వెరుబొట్లపల్లికి చెందిన ఆనెం శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
ప్రమాదంలో వైద్య విద్య
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలో ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్ కళాశాల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. కళాశాలలో సౌకర్యాలు సక్రమంగా లేని కారణంగా ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం తరగతులకు అనుమతి ఇవ్వరాదంటూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీ ఐ) బృందం నివేదిక సమర్పించడమే ఇందుకు కారణం. దీంతో వచ్చే ఏడాది మెడికల్ కళాశాల తరగతుల నిర్వహణపై ప్రతిష్టంభన నెలకొంది. ఎంసీఐ నుంచి ఇద్దరు సభ్యులు సూర్యప్రకాశ్రావ్, భరత్షా గత ఫిబ్రవరిలో మెడికల్ కళాశాలను సందర్శించి వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం నివేదికను సమర్పించారు. మంజూరు చేసింది రాజన్నే.. 2008లో పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీని వాస్ షష్టి పూర్తి కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేసిన సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మెడికల్ కళాశాల మంజూరు చేశారు. అనంతరం దీనికి రూ. 100 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2010లో ఖలీల్‌వాడీ గ్రౌండ్లో మెడిక ల్ కళాశాల పనులు ప్రారంభించారు. 2011 డిసెంబర్లో ప్రారంభం కావాల్సి ఉండగా పను లు ఆలస్యంగా జరిగాయి. 2013 మే-16,17 లో ఎంసీఐ బృందం తొలిసారిగా పరిశీలన చేపట్టింది. అప్పుడే ఆ బృందం మొదటి సంవత్సరానికి అనుమతి కోసం కొద్దిగా పేచీ పెట్టింది. దీంతో జిల్లా మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి పలు మా ర్లు ఢిల్లీకి వెళ్లి అనుమతి కోసం కృషి చేశారు. ఎట్టకేలకు జూలైలో ఎంసీఐ మొదటి సంవత్స రం తరగతుల నిర్వహణకు పచ్చజెండా ఊపిం ది. వంద మంది విద్యార్థులతో ఆగస్టు-5న తరగతులు ప్రారంభమయ్యాయి. రెండవ సంవత్సరం కోసం అధికారులు ఎంతో కృషి చేయవల్సి వచ్చింది. సౌకర్యాల లేమితో కళాశాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇవీ అసౌకర్యాలు రెండవసారి పరిశీలనకు వచ్చిన ఇద్దరు సభ్యు ల ఎంసీఐ బృందం కళాశాలలోని అసౌకర్యాలను ఎత్తి చూపింది. ఇంటెన్సీవ్ కార్డియాక్ కేర్ యూనిట్, ఫార్మకాలజీ, పాథలాజికల్ క్లీనిక్‌లు లేవని నివేదికలో పేర్కొంది. మైక్రోబయాలాజీ విభాగంలో పైకప్పు ఉడిపోయే దశలో ఉందంటూ నివేదించింది. సెంట్రల్ ఫొటోగ్రఫీ యూనిట్ లేకపోవడం, విద్యార్థులకు, నర్సింగ్ సిబ్బందికి వసతి గృహాలు లేకపోవడం, గ్రం థాలయంలో సరైన సౌకర్యాలు లేకపోవడం తదితర అంశాలను పే ర్కొంది. ప్రొఫెసర్లు నాలుగురు, అసోసియేషన్ ప్రొఫెసర్లు ఇద్దరు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు నాలుగురు, రెసిడెంట్ వైద్యులు ఏడుగురు, జూ నియర్ రెసిడెంట్ వైద్యులు ఆరుగురు తదితరులతో పాటు మొత్తం కళాశాలకు కేటాయించిన 99 మం ది ప్రొఫెసర్లలో కేవలం 30 మంది మాత్రమే ఉండడం బృందం తప్పుపట్టింది. వివిధ విభాగాలకు సం బంధించిన ఆరోగ్యపరీక్షలకు సరిప డా సౌకర్యాలు సైతం లేవని బృం దం తన నివేదికలో పేర్కొంది. దీని వల్ల 2014-15 విద్యా సంవత్సరానికిగాను రెండవ సంవత్సరం100 సీట్ల ఎంబీబీఎస్ తరగతుల నిర్వహణపై సందిగ్ధం ఏర్పడింది. ఎం సీఐ బృందం ఇచ్చిన ఈ నివేదిక ప్రకారం కళాశాలకు రెండో సంవత్సరానికి అనుమతి రాదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. నేడు అభివృద్ధి కమిటీ సమావేశం నేడు మెడికల్ కళాశాలలో డెవలప్మెంట్ కమిటీ సమావేశం జరుగనుంది. కళాశాలలో సౌకర్యాల ఏర్పాటు, ఎంసీఐ పేర్కొన్న అంశాలను చర్చించనున్నారు. డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ శాంతరా వ్, అడిషనల్ డెరైక్టర్ , కళాశాల ప్రిన్సిపాల్ హాజరుకానున్నారు. -
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం పరిశీలన
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : ఇద్దరు సభ్యులు గల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం శుక్రవారం జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలను పరిశీలించింది. అహ్మదాబాద్ మెడికల్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ భరత్షా, మహారాష్ట్రకు చెందిన ప్రొఫెసర్ సూర్యప్రకాశ్‌రావులు ఉదయం ఆరు గంటలకే కళాశాలకు చేరుకున్నారు. భరత్షా కళాశాలకు అనుబంధమైన ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులకు సేవలు ఎలా అందిస్తున్నారు. వివిధ విభాగాల ఏర్పాటు, వైద్యులు ఎంత మంది ఉన్నారు. వైద్యపరీక్షలు, ఆపరేషన్ థియేటర్లు, వైద్య పరికరాల ఏర్పాటుకు సంబంధించి విడివిడిగా పరిశీలన చేశారు. నూతన భవనంలో విభాగాల ఏర్పాటు సంతృప్తి కరంగా ఉందంటూ తెలియజేశారు.అయితే రోగులకు వైద్యసేవలు అందించడంలో వైద్యుల ఏర్పాటుపై ప్రశ్నించినట్లు తెలిసింది. మెడికల్ కళాశాలలో డాక్టర్ సూర్యప్రకాశ్‌రావు లెక్చరర్ గ్యాలరీ, తరగతి గదులు, ఆడిటోరియం, శవపరీక్ష గదులు, ల్యాబ్స్, గ్రంథాలయం తదితర విభాగాలను పరిశీలించారు. ప్రొఫెసర్ల నియామకంపై మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొదటి సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య, వారికి ఇప్పటి వరకు బోధించిన విద్యావిధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఈ పరిశీలన జరిగింది.అనంతరం రాత్రి ఏడు గంటల నుంచి 10.30 గంటల వరకు నివేదికల పరిశీలించారు. శనివారం కూడా ఎంసీఐ బృంద సభ్యులు పరిశీలనలు చేస్తారు. అనంతరం నివేదికలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు (ఎంసీఐ) సమర్పిస్తారు. రెండవ సంవత్సరం ఎంబీబీఎస్ తరగతుల అనుమతి కోసం ఈ పరిశీలన సాగింది. -
సమస్యలుంటే మా దృష్టికి తెండి: కలెక్టర్
ఖాజీపేట, న్యూస్‌లైన్ : ‘మీ గ్రామానికి జిల్లా అధికారులమంతా వచ్చాం. మీ సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. వాటిని ఇక్కడే, ఇప్పుడే పరిష్కరిస్తాం’ అని కలెక్టర్ కోన శశిదర్ అన్నారు. ఖాజీపేట మండలం కొమ్మలూరు దళితవాడలో గురువారం నిర్వహించిన ‘పల్లె పిలుపు’ కార్యక్రమాన్నుద్దేశించి ఆయన మాట్లాడారు. 18 శాఖల పని తీరుపై గ్రామస్తులతో చర్చించారు. చౌక ధాన్యపు డిపో డీలర్ తమకు సక్రమంగా సరుకులు ఇవ్వడం లేదని, రెండు, మూడు నెలలకోసారి మాత్రమే ఇస్తున్నాడని స్థానికులు ఆరోపించారు. తూకాలు కూడా తక్కువగా ఇస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ సిబ్బందిపైనా వారు ఆరోపణలు చేశారు. పశు వైద్యాధికారి అందుబాటులో లేడని, ఉపాధి సిబ్బందిపైనా గ్రామస్తులు అనేక ఆరోపణలు చేశారు. వీటిపై కలెక్టర్ స్పందిస్తూ... వెంటనే డీలర్‌ను తొలగించాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. అతని నుంచి సక్రమంగా సరుకులు ఇవ్వని నెలలకు సంబంధించి రికవరీ చేయాలని చెప్పారు. ప్రజలు చైతన్యవంతులై లింగ నిర్ధరణ చేసే వైద్యులను పట్టించాలని కలెక్టర్ కోరారు. జాయింట్ కలెక్టర్ నిర్మల, స్పెషల్ ఆఫీసర్ సూర్యప్రకాశ్‌రావు, సర్పంచ్ మేరి, హౌసింగ్ పీడీ సాయినాథ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వినయ్‌కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రభుదాస్, డీఆర్డీఏ పీడీ వెంకట సుబ్బయ్య, డీఈఓ అంజయ్య, ఐసీడీఎస్ పీడీ లీలావతి, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఖాదర్‌బాషా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
మునిసిపల్ ఉద్యోగులతో అధికారుల చర్చలు విఫలం
సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ ఉద్యోగులు ఈనెల 17నుంచి తలపెట్టిన సమ్మెను విరమింప జేసేందుకు కార్మిక శాఖ అధికారులు బుధవారం ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. 20 డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర మునిసిపల్ కార్మిక, ఉద్యోగ ఐక్య సంఘాల కార్యాచరణ సమితి ఇటీవల సమ్మె నోటీసు ఇచ్చింది. దీంతో అడిషినల్ లేబర్ కమిషనర్ సూర్యప్రకాశ్‌రావు కార్యాలయంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఒక్కదానిపైనా ఉద్యోగులకు స్పష్టమైన హామీ లభించలేదు. కాంట్రాక్ట్ కార్మికులకు డీఏతో కూడిన మూల వేతనాన్ని చెల్లించాలని, చట్టపరంగా 71 రోజుల సెలవులు ఇవ్వాలని, పర్మినెంట్ కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని ఉద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. చర్చలు ఫలితమివ్వకపోవడంతో తిరిగి ఈనెల 15న సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ చర్చల్లో కార్మిక సంఘా ల నేతలు కిర్ల కృష్ణారావు, కె.ఏసురత్నం, టి.నర్సయ్య (ఏఐటీయూసీ), పాలడగు భాస్కర్‌రావు, వెంకటేశ్ (సీఐటీయూ), కృష్ణా (ఐఎఫ్టీయూ), శంకర్ (బీఎంఎస్), మారుతీరావు (టీఆర్ఎస్ టీయూ), శ్రీనివాస్ (టీఎన్టీయూసీ), వైద్య శాఖ జాయింట్ డెరైక్టర్ వై.సత్యనారాయణ, ఇతర అధికారులు రఘుప్రసాద్, పాండురంగరాజు తదితరులు పాల్గొన్నారు.