సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ ఉద్యోగులు ఈనెల 17నుంచి తలపెట్టిన సమ్మెను విరమింప జేసేందుకు కార్మిక శాఖ అధికారులు బుధవారం ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. 20 డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర మునిసిపల్ కార్మిక, ఉద్యోగ ఐక్య సంఘాల కార్యాచరణ సమితి ఇటీవల సమ్మె నోటీసు ఇచ్చింది. దీంతో అడిషినల్ లేబర్ కమిషనర్ సూర్యప్రకాశ్‌రావు కార్యాలయంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఒక్కదానిపైనా ఉద్యోగులకు స్పష్టమైన హామీ లభించలేదు.
కాంట్రాక్ట్ కార్మికులకు డీఏతో కూడిన మూల వేతనాన్ని చెల్లించాలని, చట్టపరంగా 71 రోజుల సెలవులు ఇవ్వాలని, పర్మినెంట్ కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని ఉద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. చర్చలు ఫలితమివ్వకపోవడంతో తిరిగి ఈనెల 15న సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ చర్చల్లో కార్మిక సంఘా ల నేతలు కిర్ల కృష్ణారావు, కె.ఏసురత్నం, టి.నర్సయ్య (ఏఐటీయూసీ), పాలడగు భాస్కర్‌రావు, వెంకటేశ్ (సీఐటీయూ), కృష్ణా (ఐఎఫ్‌టీయూ), శంకర్ (బీఎంఎస్), మారుతీరావు (టీఆర్‌ఎస్ టీయూ), శ్రీనివాస్ (టీఎన్‌టీయూసీ), వైద్య శాఖ జాయింట్ డెరైక్టర్ వై.సత్యనారాయణ, ఇతర అధికారులు రఘుప్రసాద్, పాండురంగరాజు తదితరులు పాల్గొన్నారు.