మహబూబ్‌నగర్ విద్యావిభాగం: జిల్లా విద్యాశాఖాధికారి అనుమతి లేకుండా అధికారుల కళ్లుగప్పి శుక్రవారం పుస్తకగోదాం అధికారిణి అక్రమంగా తరలించేందుకు యత్నించిన పుస్తకాలను స్థానికుల సమాచారంతో జిల్లా విద్యాశాఖాధికారులు పట్టుకున్నారు.
వివరాల్లోకెళ్తే.. జిల్లా విద్యాశాఖకు సంబంధించిన పుస్తకాలను నిల్వ ఉంచే గోదాంకు ఇన్‌చార్జిగా భారతి వ్యవహరిస్తున్నారు. దీంతో ఈనెల 17న పశ్చిమబెంగాల్‌లో చదువుతున్న తెలుగు మీడియం 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయాలని ఆదేశిస్తూ పాఠశాల విద్య కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారి సూర్యప్రకాశ్‌రావు సరఫరా చేయాలని ఆదేశించారు. ఇదిలాఉండగా, సెలవురోజైన శుక్రవారం రోజు పుస్తక గోదాం ఇన్‌చార్జి భారతి డీఈఓకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పుస్తకాలను తరలించేందుకు లారీలో లోడ్ వేయించింది.
ఉత్తర్వుల్లో ఉన్నవి 3,630 మాత్రమే
1వ తరగతి 630, 2వ తరగతి 400, 3వ తరగతి 500, 4వ తరగతి 400, 4వ తరగతి(ఈవీఎస్‌టీఎం) 700, 5వ తరగతి తెలుగు రీడర్ 600, 5వ తరగతి తెలుగు మాథ్స్ 400 మొత్తం 3,630 పుస్తకాలు సరఫరా చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కానీ గోదాం ఇన్‌చార్జి మాత్రం ప్రతి సంఖ్యకు చివరన ఁసున్న* చేర్చుతూ మొత్తం 36,300 పుస్తకాలకు ఉత్తర్వులు ఇచ్చినట్లుగా అధికారులు ఇచ్చిన ఉత్తర్వులో దిద్దింది. తరలించేందుకు లారీలో కూడా పుస్తకాలు నింపారు. విషయం తెలుసుకున్న మీడియా, అధికారులు అక్కడికి చేరుకోవడంతో సదరు అధికారిణి అవాక్కైంది. తనకు డెరైక్టర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయని, డీఈఓకు సమాచారం ఇవ్వాలని తనకు తెలియదని డిప్యూటీ ఈఓ గోవిందరాజులు, ఎంఈఓ వెంకట్‌రాముడుకు తెలిపింది.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
పుస్తకాలు తరలించే విషయం నాకు ఎలాంటి సమాచారం లేదు. డెరైక్టర్‌తో మాట్లాడాను. తక్కువ పుస్తకాలు ఆర్డర్ ఇస్తే ఎక్కువ తరలిస్తున్నట్లు తెలిసింది. లారీలో నుంచి ఒక్క పుస్తకం కూడా తరలించకుండా అక్కడే ఉంచాలని ఆదేశించాం. పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
- నాంపల్లి రాజేష్, డీఈఓ, మహబూబ్‌నగర్
పుస్తకాలు పక్కదారి
Published Sat, Dec 27 2014 1:49 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement