సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎక్సైజ్ శాఖ అవినీతిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి నామమాత్రమే అవుతున్నాయి. శాఖ అవినీతిని బట్టబయలు చేసిన ఏసీబీ కేసులు ఏ మాత్రమూ ప్రభావం చూపలేదు. జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతున్న మామూళ్ల వ్యవహారం నివ్వెరపరుస్తోంది. మార్చిన ఎక్సైజ్ పాలసీ మేరకు ప్రభుత్వం గత ఏడాది కొత్త షాపులకు మొదటి సంవత్సరం లెసైన్సులు జారీ చేసింది.
ఏడాది గడువు ముగిశాఖ కొత్త టెండర్లు నిర్వహించకుండా రెండో ఏడాదికి కూడా పాత లెసైన్సుదారులనే కొనసాగించాలని నిర్ణయించి ఆ మేరకు లెసైన్సులను రెన్యూవల్ చేసింది. అయితే, ఈ సారి రూ.2లక్షలు అదనంగా చెల్లించి పర్మిట్ రూము తీసుకుంటేనే రెన్యూవల్ చేస్తామని కొత్త కండీషన్ పెట్టింది. ఈ మేరకు అర్హతలున్న ప్రతి వైన్‌షాపు యజమాని పర్మిట్ రూము తీసుకున్నారు. ఈ సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరేదే. అయితే, రెన్యూవల్ సమయంలో ఎక్సైజ్ శాఖ అనధికారికంగా వైన్సు యజమానుల నుంచి ముక్కు పిండి మరీ మామూళ్లు వసూలు చేసింది.
రెన్యూవల్స్‌కు వసూళ్లు..
రెండో సంవత్సరం వైన్‌షాపు లెసైన్సులను రెన్యూవల్ చేసుకున్న యజమానులు ఒక్కొ క్కరి నుంచి రూ.37,500 వసూలు చేశారు. ఇలా జిల్లాలోని 241 షాపుల నుంచి వీరు వసూలు చేసిన మొత్తం అక్షరాల రూ.90లక్షల 37వేల 500. ఒక్కో షాపు నుంచి వసూలు చేసిన రూ.37,500లో కార్యాలయ ఖర్చుల పేర రూ.10వేలు, ఓ అధికారికి రూ.20వేలు, ఆయన కింది స్థాయి అధికారికి రూ.7500 వాటాలు పంచారు. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడెం ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలోని స్టేషన్ల సంఖ్యను బట్టి ఈ రెండు డివిజన్లలో వాటాల పంపకాలు జరిగాయి.
రెగ్యులర్ మామూళ్ల దందా..
రెన్యువల్స్ ద్వారా ఒక్కసారే వచ్చి పడిన సొమ్ములతో సంతృప్తి చెందని కొందరు అధికారులు రెగ్యులర్ మామూళ్ల దందాను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రతి వైన్‌షాప్‌కు ఓ రేటు నిర్ణయించి వసూలు చేసి పంచుకుతింటున్నారు. ఆయాఈఎస్‌ల పరిధిలో సర్కిళ్ల వారీగా వసూళ్లు జరుగుతున్నాయి. వీరు ఒక్కో షాపు నుంచి ప్రతి నెలా రూ.7500 వసూలు చేస్తున్నారు. (ఈ లెక్కన నెలకు వసూలవుతున్న మొత్తం రూ.18,07,500.) ఇందులో సీఐ స్థాయి అధికారికి నెలకు రూ.2500, ఎస్‌ఐస్థాయి అధికారికి రూ.2500, కార్యాలయ సిబ్బందికి రూ.2500 చొప్పున వాటాలున్నాయని శాఖా వర్గాల వారి సమాచారం. ఇది కాకుండా, సూపరింటెండెంట్ పరిధిలోని స్పెషల్ టీమూ మామూళ్ల రేటును నిర్ణయించింది. ఒక్కో ఈఎస్ పరిధిలో ఎక్కువ సంఖ్యలో షాపులు ఉంటాయి కనుక వీరు కొంత కనికరించి ఒక్కో షాపు నుంచి రూ.2500 వసూలు చేస్తున్నారు.
( నెలకు వసూలయ్యే మొత్తం రూ.6,02,500) ఇందులో నుంచి ఓ అధికారికి రూ.1000, ఆయన కింది స్థాయి అధికారికి రూ.750, ఆఫీసు స్టాఫ్‌కు రూ.750 చొప్పున వాటాలు తీసుకుని జేబులో వేసుకుంటున్నారు. అయితే, ఓ ఈఎస్ పరిధిలోని ఏఈఎస్ పోస్టు ఖాళీగా ఉంది. లెక్క ప్రకారం ఏఈఎస్ వాటా కూడా తనకే ఇవ్వాలని ఓ అధికారి మంకు పట్టుపడుతుండడంతో మామూళ్ల వ్యవహారం బయటకు పొక్కింది. మొత్తంగా పరిస్థితిని విశ్లేషిస్తే.. ఆబ్కారీ శాఖ పూర్తిగా అవినీతి మత్తులో మునిగిపోయిందన్న విమర్ళలు నిజం అనిపించడంలో వింతేమీ లేదు.
ఆభ్కారీ ఆదాయం
Published Sun, Sep 15 2013 3:49 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement