కర్నూలు, న్యూస్‌లైన్: జిల్లాలో ఒకే రోజు రూ.6 కోట్ల మధ్య కొనుగోలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎన్నికలు మిగిసిన తర్వాత ఇంత భారీ స్థాయిలో మద్యం కొనుగోలు చేయడం వెనుక వ్యాపారుల ‘మందు’చూపు కనిపిస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో మద్యం డిపోలు 14 రోజుల పాటు మూతపడనుండటమే ఇందుకు కారణం.
ఈ నెల 24 నుంచి వచ్చే 6వ తేదీ వరకు డిపోల నుంచి మద్యం స్టాక్ పంపిణీ నిలిపేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. 24వ తేదీ వరకు చలానాలు కట్టిన వారికి 27వ తేదీ వరకు స్టాక్ అందిస్తామని.. ఆ తర్వాత 6వ తేదీ వరకు ఎలాంటి లావాదేవీలు ఉండబోవమని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు శివారులోని పందిపాడు గ్రామం వద్ద హంద్రీనది ఒడ్డున ఉన్న ఐఎంఎల్ డిపోకు దుకాణాలు, బార్ల ప్రతినిధులు మంగళవారం క్యూకట్టారు. ప్రస్తుతం జిల్లాలో 170 దుకాణాలు, రెండు క్లబ్‌లు, ఏడు ప్రభుత్వ దుకాణాలు, 35 బార్లు నిర్వహిస్తున్నారు. ఆదోని, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, నంద్యాల, కోవెలకుంట్ల, కోడుమూరు, ఎమ్మిగనూరు ప్రాంతాలకు చెందిన దాదాపు 120 మద్యం దుకాణాల వ్యాపారులు ఒక్క రోజులో రూ.6 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేశారు. ఈనెల 1వ తేదీ నుంచి 19 రోజుల్లో రూ.46.92 కోట్ల మద్యం వ్యాపారం జరగ్గా.. 20వ తేదీన ఒక్క రోజే రూ.6 కోట్ల విలువ చేసే 9,922 కేసుల బీర్లు.. 13,309 కేసుల లిక్కర్ కొనుగోలు చేయడం గమనార్హం.
రన్నింగ్ బ్రాండ్స్ కొరత
రాష్ట్ర విభజన నేపథ్యంలో మద్యం సరఫరా నిలిపివేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాలో మద్యం కొరత ఏర్పడింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు వినియోగిస్తున్న రన్నింగ్ బ్రాండ్స్ దొరక్కపోవడంతో డిపో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీఎస్పీ, రాయల్ ఎగ్జిక్యూటివ్, ఇంపీరియర్ బ్లూ, బ్యాగ్ పైపర్, ఓల్డ్ టావెర్న్ తదితర బ్రాండ్స్ దొరకని పరిస్థితి నెలకొంది.
ప్రీమియం బ్రాండ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ వాటి కొనుగోలుపై వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రంలోని వివిధ డిస్టిలరీల నుంచి కర్నూలు ఐఎంఎల్ డిపోకు మద్యం సరఫరా కావాల్సి ఉంది. ముఖ్యంగా మల్కాజ్‌గిరి,తిరుపతి, హైదరాబాద్‌లోని నాచారం డిస్టలరీల నుంచి కర్నూలు ఐఎంఎల్ డిపోకు మద్యం సరఫరా అవుతోంది. రన్నింగ్ బ్రాండ్స్ ఒక్కొక్కటి ప్రతి నెలా 17వేల కేసులకు పైగా అవసరం కాగా.. ఈనెలలో వారం రోజుల నుంచి ఆయా బ్రాండ్ల సరఫరాను నిలిపివేయడంతో పూర్తిగా కొరత ఏర్పడింది.
ట్రెజరీ సర్వర్‌తో సతమతం
స్టాక్ కొనుగోళ్లపై ఒత్తిడి కారణంగా ఐఎంఎల్ డిపోలో సర్వర్ పని చేయక సిబ్బంది సతమతమవుతున్నారు. గతంలో వ్యాపారులు డీడీలు చెల్లించి మద్యం కొనుగోలు చేస్తుండగా.. ప్రస్తుతం డిపో వద్దనే చలానా రూపంలో చెల్లించాల్సి ఉన్నందున ఏపీ ట్రెజరీ సర్వర్‌కు సంబంధించిన సైట్ మొరాయించింది. చలానా కట్టడంలో ఆలస్యమవుతున్నందున రాత్రి పొద్దుపోయే వరకు వేచి చూసి చలానాలు పూర్తయిన తర్వాతనే వ్యాపారులకు మద్యం సరఫరా చేశారు. రన్నింగ్ బ్రాండ్స్ మద్యం కూడా రెండు, మూడు రోజుల్లో సరఫరా అయ్యే అవకాశం ఉందని డిపో మేనేజర్ షేక్ మునీర్ తెలిపారు.
మందు చూపు
Published Wed, May 21 2014 2:09 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement