మాతోపెట్టుకోవద్దు..! | exercise officers seizeing wine shops | Sakshi
Sakshi News home page

మాతోపెట్టుకోవద్దు..!

Published Sat, Sep 21 2013 2:38 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM

exercise officers seizeing wine shops

సాక్షి ప్రతినిధి, కడప: ‘ఇదిగో పుల్లగూర... అంటే ఇదిగో తియ్యగూర’ అన్నట్లుగా ఇచ్చిపుచ్చుకునే అలవాటుతో ఇంతకాలం నెట్టుకొస్తున్న మద్యం షాపుల యజమానులు, ఎక్చైజ్ శాఖ మధ్య తేడా వచ్చిపడింది. నిబంధనలు అతిక్రమిస్తున్నారంటూ ఎక్సైజ్ వేధింపులు ఉత్పన్నం కాగా, మునపటి లాగే విక్రయాలు చేస్తున్నామని మద్యం వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో  చెప్పినట్లు వినడం లేదు... ‘మాతోపెట్టుకోవద్దు’ అంటూ ఎక్సైజ్ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. ఈతతంగం వెనుక రెన్యువల్ మామూళ్ల భాగోతం గుప్పుమంటోంది.
 
 జిల్లాలో 269 మద్యం షాపులున్నాయి. వీటిని రెన్యువల్ చేసి మునపటి వేలం పాటల మేరకు అక్కడి యజమానులకు కట్టబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు రెన్యువల్ చేయించుకునేందుకు యజమానులు ముందుకొచ్చారు. జూలై 1వతేదీ నుంచి నూతన షాపులకు గడువు ప్రారంభం కాగా, ఇప్పటికీ 88 షాపులకు రెన్యువల్ చేయించుకోలేదు.  విక్రయాలపై లాభాలు లేకపోవడంతో మద్యం వ్యాపారులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. జిల్లాలో 181 మద్యం షాఫులు రెన్యువల్ చేయించుకుని వ్యాపార క్రయ విక్రయాలు చేస్తున్నారు.  రెండున్నర నెలల గడువు పూర్తయ్యాక వారికి కొత్త చిక్కు వచ్చి పడింది. ప్రతిరోజు తనిఖీల పేరుతో వే ధింపులు అధికమైనట్లు సమాచారం.
 
 నిబంధనలు అతిక్రమిస్తున్నారంటూనే.....
 ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన మద్యం యజమానులను గాడీలో  పెట్టేందుకు చర్యలుంటే అందరూ హర్షించాల్సిందే. అలా కాకుండా క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తూ యజమానులను వేధించేందుకు మాత్రమే పరిమితమయ్యారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఉదయం 10 గంటలకు ముందు మద్యం షాపు తెరవకూడదు.
 
 రాత్రి 10 గంటలకు మూసేయాలనేది నిబంధనల్లో ఒక భాగం. అలాగే ఎమ్మార్పీ రేటుకు అధికంగా విక్రమించరాదు. వీటిని ఉల్లంఘిస్తే యంత్రాంగం చర్యలు చేపట్టాలి. ఇంతకాలం ఇవేవీ పట్టించుకోని ఎక్సైజ్ శాఖకు ఒక్కమారుగా నిబంధనలు గుర్తుకొస్తున్నాయని మద్యం యజమానులు పేర్కొంటున్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకున్నారా అంటే అదీ లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కేవలం ప్రతిరోజు షాపులు తనిఖీలు చేయడం చెప్పినట్లు వినండి, అందరికీ  ఉపయోగం అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న తతంగం ఇటీవల కాలంలో అధికమైనట్లు సమాచారం.
 
 రెన్యువల్ మామూళ్లు కోసమే....
 మద్యం వ్యాపారులకు వేలం పాటలు లేకుండా మరో అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. గతంలో చెల్లించిన లెసైన్సు ఫీజు చెల్లించేందుకు ఆసక్తి చూపించే వ్యాపారుల షాపులను రెన్యువల్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి ఇబ్బందులు, ఉత్కంఠత లేకుండా షాపులను అప్పగిస్తున్నాం కదా...రెన్యువల్ మామూళ్లు కింద ఒక్కోక్క షాపు రూ.లక్ష చెల్లించాలని  ఎక్సైజ్ యంత్రాంగం ధర నిర్ణయించినట్లు ఆరోపణలున్నాయి.
 
 దీనిని వ్యాపారులు బహిరంగంగానే వ్యతిరేకించినట్లు సమాచారం. తుదకు వ్యాపారంలో అపార అనుభవం ఉన్న కొందరు అటు యజమానులు, ఇటు ఎక్సైజ్ అధికారులతో చర్చలు నిర్వహించినట్లు సమాచారం. తీవ్ర చర్చల అనంతరం రూ.50వేలు ఇవ్వాల్సిందేనని ఎక్సైజ్ అధికారులు  గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బాగా వ్యాపారం చేపట్టే కొందరు మినహా, ఈ ప్రతిపాదనకు కూడా మద్యం వ్యాపారులు అధిక శాతం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.  రూ.20వేలు రెన్యువల్ మామూళ్లు  ఇవ్వాలని  వ్యాపారులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. మీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తామంటే కుదరదంటూ ఎక్సైజ్ అధికారులు భీష్మించుకున్నట్లు తెలుస్తోంది.
 అందుబాటులోకి రాని అధికారులు
 ఈవిషయాలపై  ఎక్సైజ్ సూపరిండెండెంటు వరప్రసాద్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన హలో హలో అంటూ ఫోన్ పెట్టేశారు. ఆపై పలుమార్లు ప్రయత్నించినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.  ఇదే విషయాన్ని అసిస్టెంటు కమిషనర్ విజయకుమారి వివరణ కోరేందుకు ప్రయత్నిస్తే ఆవిషయం ఈఎస్‌నే అడగండని చెప్పారు.
 
 దండోపాయం ప్రయోగం....
 ఆశించిన మేరకు మామూళ్లు కట్టబెట్టని మద్యం షాపులపై సామ, దాన, దండోపాయాలు ప్రయోగించే పనిలో ఎక్సైజ్ శాఖ నిమగ్నమైనట్లు సమాచారం.  ప్రతిరోజూ తనిఖీలు చేస్తూ మద్యం ప్రియుల ఎదుట వ్యాపారులను అభాసుపాలు చేసే చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.  
 
 గురువారం కూడా కడప నగరంలో ఓ మద్యం షాపునకు చెందిన బెల్టుషాపుల విక్రయదారులపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 15 బెల్టుషాపుల పరిధిలో విక్రేతలను అదుపులోకి తీసుకొని కేసులు లేకుండా వదిలేసినట్లు సమాచారం. అందుకు కారణం  సెటిల్‌మెంటేనని తెలుస్తోంది.  ఎమ్మార్పీ రేటు కంటే అధికంగా విక్రయిస్తున్నారని గ్రామీణ ప్రాంతాలలో కొన్ని షాపులపై కేసుల ఉదంతం కూడా మామూళ్ల కోవలో భాగమేనని పలువురు ఆరోపిస్తున్నారు.    
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement