ఉద్యోగులే... ఓనర్లు
వైన్ షాపులు, బార్లలో ఎక్సైజ్ సిబ్బంది పెట్టుబడులు
కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు ఇదే తీరు
రెండు జిల్లాల్లో 30కి పైగా షాపుల్లో భాగస్వామ్యం
విజయవాడ : ఎక్సైజ్ శాఖలో ఉద్యోగులే కింగ్‌మేకర్లుగా ఎదుగుతున్నారు. సాధారణ ఉద్యోగిగా ప్రభుత్వ సర్వీసులో చేరి అనతి కాలంలోనే కోట్లు గడిస్తున్నారు. బార్, వైన్‌షాపుల నుంచి మామూళ్లు వసూలు చేసి కొందరు జేబులు నింపుకొంటుంటే.. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి బార్, వైన్ షాపుల్లో బినామీల పేర్లతో పెట్టుబడులు పెట్టి భాగస్వాములుగా మారుతున్నారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని బార్లు, వైన్ షాపుల్లో దాదాపు 15 మందికిపైగా ఎక్సైజ్ శాఖలోని వివిధ స్థాయిల్లోని సిబ్బందికి భారీగా వాటాలు ఉన్నాయి. తాజాగా స్వర్ణ బార్ వ్యవహారంతో ఎక్సైజ్ ఉద్యోగుల పాత్ర, మామూళ్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో రెండు జిల్లాల్లోని బార్లు, రెస్టారెంట్లలో ఎవరి వాటాలు ఎంత అనే లెక్కలపై అందరి దృష్టీ నెలకొంది.
15 బార్లు, వైన్ షాపుల్లో ఉన్నతాధికారికి వాటాలు...
కృష్ణా జిల్లాలో 325 వైన్ షాపులు, 163 బార్లు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 355 వైన్ షాపులు 186 బార్లు ఉన్నాయి. రెండు జిల్లాల్లో కలిపి నెలకు సగటున రూ.230 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. అనతికాలంలోనే కోట్లు గడించటం కోసం ఎక్సైజ్ సిబ్బంది కొందరు తమ మామూళ్లను పెట్టుబడులుగా మార్చుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో ఉన్న ఒక ఉన్నతాధికారికి జిల్లాలోని ఎక్సైజ్ సిండికేట్‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ లావాదేవీలు ఉన్నాయి.
ఖమ్మం, విశాఖపట్నం జిల్లాలతో పాటు నగరంలో పేరుమోసిన లిక్కర్ సిండికేట్‌లతో కలిపి మొత్తం 15 వరకు బార్లు, వైన్ షాపుల్లో వాటాలు ఉన్నట్లు సమాచారం. ఆయన వ్యవహారాలన్నీ చూడటానికి తొలినుంచి నమ్మినబంటుగా ఒక కానిస్టేబుల్ ఉన్నాడు. పెట్టుబడులన్నీ అతని పేరుతోనే ఉండటంతో అతనే శాఖాపరమైన విధులతో పాటు వ్యాపార వ్యవహారాలు చూస్తుంటాడు. ఉన్నతాధికారి ఎక్కడ ఉంటే.. అదే జిల్లాలో అతనికీ పోస్టింగ్ ఉండటం గమనార్హం.
కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు సైతం...
కృష్ణా జిల్లాలో ఐదుగురు కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు వివిధ బార్లలో భాగస్వామ్యం ఉంది. ముఖ్యంగా నందిగామ స్టేషన్‌లో పనిచేసే ఒక హెడ్ కానిస్టేబుల్‌కు రెండు బార్లలో వాటాలు ఉన్నాయి. విజయవాడ నగరంలోని మరో హెడ్ కానిస్టేబుల్‌కు రెండు బార్లలో భాగస్వామ్యం ఉంది. ఒక కానిస్టేబుల్‌కు ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉండగా, దీనిని అతని బంధువులే నిర్వహిస్తున్నారు.
డిస్టిలరీలో విధులు నిర్వహించే ఒక కానిస్టేబుల్‌కు, విజయవాడ తూర్పు ఎక్సైజ్ స్టేషన్‌లో ఒక కానిస్టేబుల్‌కు, గన్నవరం ఎక్సైజ్ స్టేషన్‌లో పనిచేసే మరో కానిస్టేబుల్‌కు వివిధ బార్లలో భాగస్వామ్యం ఉంది. విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసే మరో కానిస్టేబుల్‌కు ఓ బార్‌లో వాటా ఉంది. గుంటూరు నగరంలోని ఒక కానిస్టేబుల్‌కు పేరేచర్ల, గుంటూరులలో మూడు వైన్ షాపుల్లో వాటాలు ఉన్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో పనిచేసే మరో కానిస్టేబుల్‌కు గుంటూరులోని జిన్నాటవర్, చుట్టుగుంట సెంటర్, మరో ప్రాంతంలో ఉన్న బార్లలో వాటాలు ఉండగా, చుట్టుగుంట బార్ ఉన్న స్థలం కూడా అతనితో పాటు పలువురి పేర్లతో ఉంది.
దాడులతో వెనుకంజ...
2012కు ముందు వరకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్సైజ్ సీఐలు మొదలుకొని డిప్యూటీ కమిషనర్ల వరకు సుమారు వందకు పైగా వైన్స్, బార్లలో భాగస్వామ్యం ఉండేది. 2011 డిసెంబర్‌లో ఎక్సైజ్ శాఖపై అవినీతి నిరోధక శాఖ అధికారులు వరుస దాడులు నిర్వహించి పదుల సంఖ్యలో అధికారుల్ని, వ్యాపారుల్ని అరెస్టు చేయటంతో అధికారుల్లో భయం మొదలై ంది. దీంతో నెలవారీ మామూళ్లు తీసుకుంటూ.. బాగా ఆదాయం వచ్చే ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఇప్పటికీ తమ వాటాలు కొనసాగిస్తున్నారు.