ఆదాయం కోసం ఎక్సైజ్‌శాఖ అధికారుల ఆరాటం చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిందే.. జిల్లాలో ఇప్పటికే ఉన్న మద్యం దుకాణాల ద్వారా ప్రజల నుంచి లాగేస్తున్న ఆదాయం సరిపోలేదు కాబోలు.. ఇతర జిల్లాల్లో టెండర్లు రాని దుకాణాలకు మన జిల్లాలో అనుమతి ఇచ్చి ఏర్పాటు చేశారు. ఇక.. వైన్స్ యజమానులు కనీస నిబంధనలు పాటించడం లేదు. బడి, గుడికి అతి సమీపంలో దుకాణాలు ఏర్పాటు చేస్తూ ఇష్టారాజ్యంగా విక్రయాలు జరుపుతున్నారు.!!
- న్యూస్‌లైన్, మిర్యాలగూడ
ఆదాయమే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా మద్యం దుకాణాలు తెరుస్తున్నారు. వీరి అండతో దుకాణదారులు మద్యం విక్రయాలకు ఉండాల్సిన నిబంధనలు కూడా పాటించకుండా వ్యాపారాలు సాగిస్తున్నారు. జిల్లాలో 245 మద్యం దుకాణాలు ఉండగా ఇటీవల మరో 14దుకాణాలకు టెండర్లు పిలిచి అనుమతి ఇచ్చారు. 20వేల జనాభా ఉంటేనే ఒక మద్యం దుకాణం ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాల్సి ఉన్నా, ఎక్సైజ్ అధికారులు ఆదాయమే లక్ష్యంగా ఇష్టానుసారంగా అనుమతి ఇస్తున్నారు. మిర్యాలగూడ పట్టణంలో 1.05లక్షల జనాభా ఉండగా 7మద్యం దుకాణాలున్నాయి. ఇప్పటికే అదనంగా ఒక దుకాణం ఉండగా ఇటీవల మరో మద్యం దుకాణాన్ని ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటు చేయాల్సిన మద్యం దుకాణాలకు మూడు మాసాల క్రితం టెండర్లు పిలిచి 15రోజుల క్రితం ప్రారంభించారు.
అదనంగా 14దుకాణాలు ఏర్పాటు
జిల్లాలోమొదటగా 245మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చారు. వాటికి మాత్రమే టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఏర్పాటు చేశారు. కానీ ఇటీవల ఇతర జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సిన దుకాణాలకు అక్కడ టెండర్లు రాకపోవడం వల్ల వాటిని కూడా నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో కొత్తగా 14 వైన్స్‌లు ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలోని దుకాణాల సంఖ్య 259కి చేరింది. వీటితో పాటు 20బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి.
ఊరూరా బెల్ట్‌షాపులు
మిర్యాలగూడ నియోజకవర్గంలో గతంలో మొత్తం 16వైన్స్‌లు ఉండగా ఇటీవల మరో రెండు దుకాణాలు అదనంగా ప్రారంభించారు. మిర్యాలగూడ పట్టణంతో పాటు మండలంలో 12, దామరచర్ల మండలంలో నాలుగు, వేములపల్లి మండలంలో రెండు మద్యం దుకాణాలు ఉన్నాయి. ప్రతి దుకాణం వద్ద అక్రమ సిట్టింగ్‌లు, గ్రామాల్లో బెల్ట్‌షాపులు జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గంలోని మిర్యాలగూడ పట్టణం, మండలంలో 120, దామరచర్లలో 60, వేములపల్లిలో 80 బెల్ట్‌షాపులు ఉన్నాయి. ఎక్సైజ్ అధికారులు వీటిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
రాత పూర్వకంగా ఫిర్యాదులు వస్తే పరిశీలిస్తా : అనసూయాదేవి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, నల్లగొండ వైన్స్ దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసినట్టు ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. నిబంధనలు పాటించని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్‌లపై ఆయా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లు చర్యలు తీసుకుంటారు.
ఆదాయమే పరమావధి..!
Published Mon, Feb 17 2014 4:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM
Advertisement
Advertisement