కావలి వద్ద రూ.2.62 కోట్ల విలువైన నగదు, బంగారం స్వాధీనం
టంగుటూరు వద్ద 1.238 కేజీల బంగారం పట్టివేత
తరలిస్తున్న వారంతా మిర్యాలగూడ వాసులే
కావలి/టంగుటూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లా పరిధిలో పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు, బంగార దొరికాయి. కావలి వద్ద చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై ఉన్న గౌరవరం టోల్‌ప్లాజా సమీపంలో కావలి రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా నగదు, బంగారాన్ని పట్టుకున్నారు. వీటిని తరలిస్తూ పట్టుబడిన వారంతా తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన వారే కావడం గమనార్హం.
ఈ వివరాలను కావలి డీఎస్పీ వెంకటరమణ మీడియాకు వెల్లడించారు. చెన్నై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును తనిఖీ చేయగా.. మిర్యాలగూడకు చెందిన మహిళలు తేజ, సుమతి వద్ద రూ.72.50 లక్షల నగదు బయటపడిందని చెప్పారు. వీటికి సంబంధించి ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే చెన్నై వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సును తనిఖీ చేయగా మిర్యాలగూడకే చెందిన శివమ్మ, యాదమ్మ వద్ద రూ.60 లక్షలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
మరో బస్సులో వెళ్తున్న మిర్యాలగూడకే చెందిన పర్వీన్ వద్ద రూ.29 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చెన్నై నుంచి మిర్యాలగూడ వెళ్తున్న కారును తనిఖీ చేయగా.. మోహన్, ప్రభాకర్ అనే వ్యక్తుల వద్ద కిలోన్నర బంగారం బయటపడిందని చెప్పారు. ఈ బంగారానికి సంబంధించి రసీదులు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నగదు, మొత్తం బంగారం విలువ కలిపి రూ.2.62 కోట్లు ఉంటాయని వెల్లడించారు. అలాగే చెన్నై నుంచి మిర్యాలగూడకు కారులో వెళ్తున్న మద్దిశెట్టి మల్లేశ్, చంద్రకళ వద్ద 1.238 కేజీల బంగారు బిస్కెట్లను ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద సింగరాయకొండ పోలీసులు పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment