లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్లు...ఎక్సైజ్‌శాఖలో ఏం జరుగుతోందో ఎవరికీ అంతుపట్టడం లేదు. రెన్యువల్ కాకుండా మిగిలిపోయిన మద్యం దుకాణాలను అధికారులే నడపాలని ఎక్సైజ్ కమిషనర్ ఆదేశించారు. దీంతో అధికారులు లెసైన్స్‌దారుల వేటలో పడ్డారు. అయితే ప్రభుత్వ మద్యం దుకాణాలకు గదులు లభించకుండా ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే మద్యం దుకాణాలు నడుతున్నవారు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త దుకాణాలు తెరవడం అధికారులకు తలనొప్పిగా మారింది. కాగా ఇదంతా ఎక్సైజ్, మద్యం వ్యాపారుల ఎత్తుగడలో భాగమే అనే వాదన విన్పిస్తోంది.
సాక్షి, కడప: గతేడాది జిల్లా వ్యాప్తంగా 269 మద్యం దుకాణాలు నడిచాయి. ఈఏడాది జూన్‌తో వాటి లెసైన్స్ గడువు ముగిసింది. అయితే 185 దుకాణాలు రెన్యువల్ అయ్యాయి. తక్కిన 84 దుకాణాను రెన్యువల్ చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆబ్కారీ ఆదాయం బాగా తగ్గింది. దుకాణాలను ఎక్సైజ్ ఆధ్వర్యంలోనే నడపాలని, అందుకు అధికారులు చొరవ చూపాలని ఎక్సైజ్ కమిషనర్ మూన్నెళ్ల కిందటే ఆదేశించారు.
ఈ విషయంలో జిల్లా అధికారులు నిర్లిప్తత వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఇటీవల డిప్యూటీ కమిషనర్లతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో రెన్యువల్ కాకుండా మిగిలిన దుకాణాలన్నీ కచ్చితంగా తెరవాల్సిందేనని, రిటైర్డ్ ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి వారికి లెసైన్స్ జారీ చేయాలని ఆదేశించారు. ప్రతి మద్యం దుకాణంలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఇద్దరు సేల్స్‌బాయ్స్‌ను నియమించాలని, వీరికి వేతనాలతో పాటు దుకాణగదికి అద్దెను అధికారులు చెల్లించాలని సూచించారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి
కమిషనర్ ఆదేశాల మేరకు 14 దుకాణాలను నడిపేందుకు రిటైర్డ్ ఉద్యోగులను అధికారులు సిద్ధం చేశారు. తక్కిన 70 దుకాణాలకు గదులు దొరకడం లేదని చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే నడుస్తున్న మద్యం షాపుల యజమానులు కొత్తదుకాణాలకు గదులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. ఒకవేళ ఎవరైనా గది అద్దెకు ఇస్తున్నారని తెలిస్తే వారి వద్దకు వెళ్లి ఎట్టి పరిస్థితుల్లో అలా ఇవ్వొద్దని హుకుం జారీ చేస్తున్నారని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి రాజంపేట డివిజన్‌లో అధికంగా ఉంది. ఇక్కడ పట్టణంలోనే 13 దుకాణాలు నడపాల్సి ఉంది.
రూరల్‌లో మరో 6 దుకాణాలు తెరవాలి. రాజంపేటలో ఇప్పటికే 10 దుకాణాలు నడుస్తున్నాయి. వీరంతా ఏకమై కొత్త దుకాణాలు నడవకుండా, వాటికి గదులు దొరక్కుండా అడ్డుపడుతున్నారు. అవసరమైతే అధికారపార్టీనేతలతో హెచ్చరికలు పంపిస్తున్నారు. అయితే ఈ సలహాను ఎక్సైజ్ అధికారులే ఇచ్చారని, పాతదుకాణదారులతో చేయి కలిపి కొత్తవి తెరవకుండా చూస్తున్నాన్నారని ఆశాఖలోని కొందరు అధికారులు చెబుతున్నారు. మద్యం వ్యాపారుల నుంచి ప్రతి నెలా అందే మామూళ్ల ఆశతోనే కొత్తవాటికి అడ్డుపడి ప్రభుత్వ ఆదాయానికి గండిపెడుతున్నట్లు సమాచారం.
సిండికేట్‌కు గ్రీన్‌సిగ్నల్!:
మద్యాన్ని ఎమ్మార్పీ కంటే 5-10 రూపాయల ఎక్కువకు విక్రయించేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారు. అంతా సిండికేట్‌గా ఏర్పడి ధరలను పెంచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్ల తెలుస్తోంది. ఈ తతంగానికి ఎక్సైజ్ అధికారులు కూడా మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రతి నెలా ఇచ్చే మామూళ్ల మొత్తాన్ని కూడా వ్యాపారులు పెంచినట్లు తెలిసింది.
రెన్యువల్ కష్టంగా ఉంది: నాగలక్ష్మి, డిప్యూటీ కమిషనర్. ఎక్సైజ్.
డిసెంబరు ఒకటి నుంచి దుకాణాలు తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 84లో ఇప్పటికి 14 వాటికి లెసైన్స్‌లు ఇచ్చాం. కొత్తవాటికి గదులు దొరకడం లేదు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరిపితే ఊరుకునే ప్రసక్తే లేదు. కేసులు నమోదు చేస్తాం.
గూడుపుఠాణి
Published Fri, Nov 15 2013 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
Advertisement
Advertisement