సాక్షి, మెట్‌పల్లి : పాపం..విధి కరెంట్ షాక్ రూపంలో ఆ కుటుంబం పై కన్నెర్ర చేసింది. ఇంటికి పెద్ద దిక్కైనా తల్లిదండ్రులను కబలించి పిల్లలకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. మండలంలోని వెల్లుల్ల గ్రామానికి చెందిన అసరి గంగాధర్, లక్ష్మీ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు మమత(22), మాధురి(20), కుమారుడు మధు(17)ఉన్నారు. పెద్ద కుమార్తె మమతకు కొంతకాలం క్రితమే వివాహం చేశారు.మాధురి ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, మధు ఇంటర్ చదువుతున్నాడు.
గంగాధర్ శుక్రవారం రాత్రి వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చి స్నానానికి వెళ్లాడు. ఆ తర్వాత దుస్తులను ఇంటి ఆవరణలో ఉన్న తీగపై ఆరవేస్తుండగా, ఒక్కసారి కరెంట్ షాక్ తగిలి కిందపడిపోయాడు. అదే సమయంలో ఇంట్లో ఉన్న లక్ష్మీ వెంటనే అక్కడకు వచ్చి గంగాధర్‌ను పట్టుకోగా, ఆమెకు కూడా షాక్ తగలడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.విషయం తెలుసుకున్న కుమార్తెలు, కుమారుడు ఇంటికి వచ్చి తల్లిదండ్రులు విగత జీవులుగా పడి ఉండడాన్ని చూసి బోరున విలపించారు.
‘ఎంత పని చేశావు దేవుడా..ఇక మాకు దిక్కెవరూ’ అంటూ మృతదేహాలపై పడి గుండెలవిసేలా రోదించారు. రెండో కుమార్తెకు వివాహం, కుమారుడి చదువు బాధ్యతలు చూడాల్సిన సమయంలో ఆ పిల్లలకు తల్లిదండ్రులు దూరమైన పరిస్థితి చూసి గ్రామస్తులు సైతం కంటతడిపెట్టారు. శనివారం ఉదయం గంగాధర్, లక్ష్మీ మృతదేహాలకు ఆశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భారమైన హృదయాలతో ఒకే చోట అంత్యక్రియలు పూర్తి చేశారు. కుటుంబాన్ని ఎంపీపీ మారు సాయిరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment