రాష్ట్రస్థాయి విద్యా సంస్థలు రెండు రాష్ట్రాలకు సేవలందిచేలా ప్రణాళికలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి రెండు రాష్ట్రాల్లో పదేళ్లపాటు ప్రస్తుతం ఉన్న ప్రవేశాల విధానం కొనసాగింపు, ఉన్నత విద్యా మండలి సహా రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలు ఉమ్మడి రాష్ట్రాలకు సేవలందించేలా త్వరలో గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్లలో పొందుపరచాల్సిన అంశాలపై ఉన్నత విద్యా మండలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం పదో షెడ్యూలులో ఉన్నత విద్యా మండలితోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ద్రవిడ యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్‌జీయూకేటీ), శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలతోపాటు మరో 100 రాష్ట్రస్థాయి విద్యా, శిక్షణ సంస్థలు ఏడాది పాటు రెండు రాష్ట్రాలకు సేవలు అందించాలి. చట్టం ప్రకారం మొదటి ఏడాదిలోగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వీటి సేవల విషయంలో పరస్పర అంగీకారానికి రావాల్సి ఉంది. ఇందులో భాగంగా ఉన్నత విద్యా మండలి పరిధిలోని ఆరు విద్యా సంస్థలు అపాయింటెడ్ డే జూన్ 2నుంచి వచ్చే ఏడాది జూన్ 2 వరకు రెండు రాష్ట్రాలకు సేవలు అందించేలా గెజిట్ నోటిఫికేషన్లు సిద్ధం అవుతున్నాయి. రాష్ట్రాలు విడిపోయినా వాటి సేవలు మాత్రం రెండు రాష్ట్రాలకు అందించాలి.
ఆ సేవలను కొనసాగిస్తారా? లేదా? వేర్వేరుగా ఆయా సంస్థలను ఏర్పాటు చేసుకుంటారా? అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకునే వరకు ఈ గెజిట్ నోటిఫికేషన్లు అమల్లో ఉంటాయి. ఏడాదిలోగా రెండు ప్రభుత్వాలు అవగాహనకు రాకపోతే చట్టం ప్రకారం వాటిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇంజనీరింగ్, మెడిసిన్, లా, పోస్టు గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల విధానం పదేళ్లపాటు పాత పద్ధతి ప్రకారమే ఉంటుందని చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది.
అడ్మిషన్లపై త్వరలో గెజిట్ నోటిఫికేషన్
Published Fri, Mar 21 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 4:57 AM
Advertisement
Advertisement