బంజారాహిల్స్: కరోనా విజృంభణతో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పలు యూనివర్సిటీలు పరీక్షలను వాయిదా వేశాయి. కొన్ని పరీక్షలను రద్దు చేశాయి. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఏవీఎన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామన్నారు. పూర్తి వివరాలను విశ్వ విద్యాలయ వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు.
జేఎన్‌టీయూ పరిధిలో...
కేపీహెచ్‌బీ కాలనీ: జేఏన్‌టీయూహెచ్‌లో జరగనున్న అన్ని పరీక్షలను ఈ నెల 30వరకు వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ యం. మంజూర్ హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీ వార్షిక పరీక్షలు (థియరీ, ప్రాక్టికల్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు), మధ్యస్థ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా పరీక్షల రీషెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
ఓయూలో పరీక్షలు రద్దు..
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 17 నుంచి 31 వరకు జరిగే పరీక్షలను రద్దు చేసినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సోమవారం పేర్కొన్నారు. వివిధ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా రెగ్యులర్, దూరవిద్య కోర్సుల సెమిస్టర్ పరీక్షలతో పాటు ఇంటర్నల్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment