విడుదల కాని వార్షిక, ప్రవేశ పరీక్షల ఫలితాలు
ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలకు దూరంగా ఆంధ్రా విద్యార్థులు
గుంతకల్లు టౌన్ : రాష్ట్ర విభజన ప్రభావం రాష్ట్రంలో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు శాపంగా మారింది. వార్షిక, ప్రవేశ పరీక్షలు జరిగి మూడు నెలలు గడిచినా నేటికీ ఫలితాలు విడుదల చేయకపోవడంతో ఉన్నత చదువులు, ఉద్యోగాల అన్వేషణకు వెళ్లలేక విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గుంతకల్లు యస్‌కేపీ ప్రభుత్వ డిగ్రీ కాలేజితోపాటు అనంతపురం-2, హిందూపురం, ఉరవకొండ, రాయదుర్గం, కదిరి, తాడిపత్రి, ధర్మవరం ప్రాంతాల్లో అంబేడ్కర్ వర్సిటీ స్టడీసెంటర్‌లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత అటు తెలంగాణ , ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదర లేదు.
ఏప్రిల్ 12న ప్రవేశపరీక్షను ఇరు రాష్ట్రాల్లోనూ నిర్వహించింది. బీఏ, బీకాం,బీయస్సీ కోర్సుల్లో చేరేందుకు జిల్లాలో మొత్తం 927 మంది విద్యార్థులు ప్రవేశపరీక్ష రాశారు. తెలంగాణా రాష్ట్రంలో ఈ ఫలితాలను విడుదలయ్యాయి. ఆంధ్రా విద్యార్థుల ఫలితాలను మాత్రం విడుదల చేయలేదు. దీంతో అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. మేలో ఇరు రాష్ట్రాల్లోనూ ఫస్ట్, సెకండ్, థర్ట్ ఇయర్‌ల విద్యార్థులకు విశ్వవిద్యాలయం వార్షిక పరీక్షలు నిర్వహించింది. జిల్లాలో రెగ్యులర్, సప్లిమెంటరీ కలిపి సుమారు 6 వేల మందికి పైగా పరీక్షలు రాశారు.
మన రాష్ట్రంలో సెకండ్, థర్డ్ ఇయర్‌ల విద్యార్థుల ఫలితాలను విడుదల చేసినప్పటికీ మార్కుల జాబితాలను స్టడీ సెంటర్‌లకు పంపలేదు. అవసరమైన వారు నేరుగా యూనివర్సిటీ వచ్చి తీసుకె ళ్లాలని యూనివర్సిటీ అధికారులు హుకూం జారీ చేసినట్లు స్టడీ సెంటర్ సిబ్బంది చెబుతున్నారు. పైగా ఏపీ స్టడీ సెంటర్లల్లో పరీక్షలు రాసిన విద్యార్థుల వివరాలను కూడా అధికారిక యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో నుంచి తొలగించారు. దీంతో ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అన్వేషించే అభ్యర్థుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది.
అంధకారంలో అంబేడ్కర్ వర్సిటీ విద్యార్థులు
Published Wed, Aug 5 2015 3:11 AM | Last Updated on Sat, Jun 2 2018 5:38 PM
Advertisement