‘ఓపెన్’ మిస్టేక్
అంబేద్కర్ వర్సిటీ అధికారుల నిర్వాకం
హాల్ టికెట్లపై సమయం ముద్రణలో తప్పిదం
పరీక్ష నష్టపోయిన పలువురు విద్యార్థులు
తిరిగి నిర్వహించాలంటూ డిమాండ్
తాండూరు/ఆలంపల్లి: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారుల తప్పిదం కారణంగా పలువురు విద్యార్థులు వార్షిక పరీక్ష నష్టపోయారు. ఈ నెల 18 నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్టడీ సెంటర్ల నిర్వాహకులు ఈనెల 16 నుంచి విద్యార్థులకు హాల్‌టికెట్లు అందజేశారు. ఆదివారం నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష రాసేందుకు తాండూరు పీపుల్స్ డిగ్రీ కళాశాల, వికారాబాద్‌లోని ఎస్‌ఏపీ కళాశాలల్లోని కేంద్రాలకు విద్యార్థులు వచ్చారు. తృతీయ సంవత్సరం విద్యార్థుల హాల్‌టికెట్లపై మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని రాసి ఉంది. వారు ఆదివారం మధ్యాహ్నం పరీక్ష కేంద్రానికి రాగా.. ఉదయమే పరీక్ష అయిపోయిం దని అధికారులు చెప్పారు.
దీంతో విద్యార్థులు అవాక్కయ్యా రు. హాల్‌టికెట్‌లో మధ్యాహ్నం 2గంటల నుంచి పరీక్ష ఉన్నట్లుగా రాసిఉంటే ఉదయమే పరీక్షను ఎలా నిర్వహించారని పలువురు విద్యార్థులు ఆందోళనకు దిగారు. తృతీయ సంవత్సరం విద్యార్థులమైన తాము ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో పాసై ఉన్నత చదువులు చద వాలనుకుంటే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయామని వాపోయారు. పరీక్షను మళ్లీ నిర్వహించాలంటూ అధికారులను డిమాండ్ చేశారు. వికారాబాద్ స్టడీ సెంటర్‌లో 105 మంది విద్యార్థులకు 76 మంది మాత్రమే పరీక్షలు రాశారు. మిగతా 29 మంది పరీక్ష రాయలేకపోయారు. తమ పిల్లల భవిష్యత్తుతో వర్సిటీ అధికారులు ఆటాడుకున్నారని, ఒక పరీక్ష కోసం సంవత్సరం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
మా తప్పేమీ లేదు
యూనివర్సిటీలోనే సమయాన్ని మార్చారు. విద్యార్థులకు సమాచారం ఇచ్చాం. కొందరు తెలియని వారు మధ్యాహ్నం పరీక్ష కేంద్రానికి వచ్చారు. ఇందులో మా త ప్పేమీ లేదు. యూనివర్సిటి నుంచే పరీక్ష సమయం మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలిచ్చారు.
- రాజరత్నం, స్టడీసెంటర్ కో-ఆర్డినేటర్, వికారాబాద్