ఖైదీల కోసం మరిన్ని కోర్సులు
అంబేడ్కర్ వర్సిటీ వీసీ సీతారామారావు వెల్లడి
హైదరాబాద్: క్షణికావేశంలో తప్పులు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో మానసిక పరి వర్తన తెచ్చి, బాధ్యతగా వ్యవహరించేలా చేయడమే తమ లక్ష్యమని అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ కె.సీతారామారావు తెలిపారు. డిగ్రీలో ప్రవేశాల కోసం తెలుగు రాష్ట్రాల్లోని 185 కేంద్రాల్లో విశ్వవిద్యాలయం ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించింది.
చర్లపల్లి కేంద్ర కారాగారంలోని పరీక్షా కేంద్రాన్ని వీసీ తనిఖీ చేశారు. మరిన్ని కోర్సులను ఖైదీలకు ఉపయోగపడేలా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ఎమ్మెస్సీ సైకాలజీ ప్రారంభిస్తామన్నారు. ఖైదీల శిక్షాకాలం వృథా కాకుండా, మానసిక పరిస్థితి దెబ్బ తినకుండా అంబేడ్కర్ వర్సిటీ సహకారంతో పలు కోర్సులు నిర్వహిస్తున్నామని చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ తెలిపారు.