* ఐదుసార్లు లేఖలు రాసినా స్పందించని ఏపీ సర్కారు
* తెలంగాణ వరకే డిగ్రీ ప్రవేశాలు నిర్వహించాలని వర్సిటీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సుల్లో 2015-16 సంవత్సరానికిగాను ప్రవేశాలను తెలంగాణకు మాత్రమే పరిమితం చేయాలని వర్సిటీ నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను 2, 3 రోజుల్లో జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. పదో షెడ్యూలులో ఉన్న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల ప్రజలకు సేవలు అందించాల్సి ఉంది.
ఇందులో భాగంగా తమ సేవలను ఆంధ్రప్రదేశ్‌కు అందించాలా? వద్దా? స్పష్టం చేయాలని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వానికి వర్సిటీ వర్గాలు ఇప్పటికే ఐదుసార్లు లేఖలు రాశారు. అయితే, ఏపీ ప్రభుత్వం స్పందించలేదని, ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఏపీలో కాకుండా ఒక్క తెలంగాణలోనే డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలను చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చాయి. అయితే ప్రతిఏటా డిగ్రీ కోర్సుల్లో రెండు రాష్ట్రాలకు చెందిన దాదాపు 70 వేల మంది చేరుతుంటారు. ఇందులో ఏపీ నుంచి దాదాపు 25 వేల మంది ఉంటారు.
వారికోసం ఆ రాష్ర్టంలో 90 వరకు అధ్యయన కేంద్రాలు ఉండగా, తెలంగాణలో 120కి పైగా వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నాయి. వాటి ద్వారానే ఈ ప్రవేశాలు, తరగతులు, పరీక్షల నిర్వహణ జరుగుతోంది. కానీ, ఏపీ ప్రభుత్వం స్పందించని కారణంగా ఆ రాష్ర్ట విద్యార్థులు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ కోర్సులు చదువుకునే అవకాశాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇదిలాఉండగా, ఇప్పటికే డిగ్రీ కోర్సులో చేరి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం చేస్తున్న ఏపీ విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనుంది.
అంబేద్కర్ వర్సిటీ ప్రవేశాలు... తెలంగాణకే పరిమితం!
Published Sat, Jun 20 2015 3:13 AM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM
Advertisement
Advertisement