Degree Admission
-
డిగ్రీ అక్రమ ప్ర‘వేషాలు’
‘కరీంనగర్ పట్టణ ప్రైవేటు కళాశాల నిర్వాహకులు పట్టణంలోని పాతబజార్ ప్రాంతానికి చెందిన ఇంటర్ పాసైన ఒక విద్యార్థిని ఇంటికి వెళ్లారు. వారి కళాశాలలో ప్రవేశం తీసుకుంటే వారు ఇస్తున్న ఆఫర్ల గురించి వివరించి ఆమ్మాయి ఫోన్‌నంబర్ తీసుకొని వెళ్లారు. ఇదే పద్ధతిలో నగరానికి చెందిన మరో రెండుకళాశాల వారు రవాణా ఉచితమని, ఒక్క పైసా కూడా కట్టాల్సిన అవసరం లేదని కేవలం ఇన్కమ్ సర్టిఫికెట్‌తోపాటు సర్టిఫికెట్లు ఇస్తే తామే చూసుకుంటామని చెప్పారు. కోర్సు పూర్తయ్యే వరకు నాదే బాధ్యతని కళాశాల అధ్యాపకుడు హామీ కూడా ఇచ్చాడు. ఆఫర్లు విన్న విద్యార్థిని, తల్లిదండ్రులు సర్టిఫికెట్లు ఇచ్చేశారు.’ ఇది ఈ ఒక్క అమ్మాయి విషయం కాదు శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని చాలావరకు కళాశాలలు ప్రవేశాల సమయంలో పాటిస్తున్న పద్ధతి. సాక్షి, శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్): దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలకు ఇటీవల ప్రకటన వెలువడడంతో శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు కళాశాలలు విద్యార్థుల వేటలో పడ్డాయి. ప్రభుత్వం పారదర్శకంగా డిగ్రీ ప్రవేశాలు నిర్వహించాలనే లక్ష్యానికి పలు కళాశాలలు తూట్లు పొడుస్తూ అక్రమంగా అడ్డదారిలో ప్రవేశాలుపొందే పనిలో నిమగ్నమయ్యాయి. శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని తమ కళాశాలల్లో నింపుకునేందుకు ప్రలోభాల పర్వానికి తెరతీశాయి. నగదు, బహుమతులు వంటి విద్యార్థులకు ఆఫర్ చేస్తూ ప్రవేశాల పారదర్శకతకు మసి పూస్తున్నాయి. కమిషన్ విధానంలో పీఆర్వోలను, కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులు సిబ్బందిని సీట్లు నింపే ప్రక్రియలో ఉపయోగించుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంటే చాలు శాతవాహన యూనివర్సిటీలో 90 ప్రైవేటు కళాశాలలుండగా ఇందులో 36410 సీట్లు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ ప్రవేశాల కారణంగా వివిధ ప్రైవేటు డిగ్రీ కళాశాలల మధ్య తీవ్రమైన అనారోగ్యకరమైన పోటీ నెలకొంది. పలు కళాశాలలు అయితే సీట్లు ఖాళీ ఉంచుకునే బదులు కొంతనైనా లాభపడవచ్చనే ధోరణితో ఆదాయ ధ్రువపత్రం తీసుకొస్తేచాలు అంతా మేమే చూసుకుంటామని నమ్మబలుకుతున్నారు. మరికొందరు కళాశాలకు వచ్చే విద్యార్థులకు బస్సుల ద్వారా రవాణా ఉచితమని, ఇంకొందరు నగదు, సెల్ఫోన్లు, వివిధ రకాల బహుమతులతో ప్రలోభపెడుతూ అడ్మిషన్లు ‘కొని’తెచ్చుకుంటున్నారు. అడ్మిషన్ తీసుకునే వరకూ ఒకమాట చివరగా పరీక్షల సమయంలో హాల్‌టికెట్ ఇచ్చేందుకు నానా తిప్పలు పెట్టిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ప్రభుత్వం ఇలాంటి కళాశాలలపై విద్యాశాఖ అధికారులు దృష్టిపెట్టి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని వివిధ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫ్రీగా ఇస్తున్నారని జాయిన్ కావొద్దు కళాశాలలు ఫ్రీగా ప్రవేశాలిస్తున్నాయని వెళ్తే తర్వాత నాణ్యత ప్రమాణాలు లేక భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందని గుర్తించాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా ఆలోచించి మంచి నాణ్యత ప్రమాణాలు ఉన్న కళాశాలల్లో చేర్పిస్తేనే బంగారు భవిష్యుత్ ఉంటుందని తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా కళాశాలలో ప్రవేశాలు తీసుకునేముందు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని, ఆయా కళాశాలల్లో చదువుతున్న సీనియర్లను సంప్రదించి అందులోని సదుపాయాలు, విద్యాప్రమాణాలు లోతుగా తెలుసుకొని ప్రవేశాలు పొందితే మంచి భవిష్యత్ ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. -
శాతవాహనకు మళ్లీ నిరాశే..!
సాక్షి, కరీంనగర్ : డిగ్రీ సీట్ల కేటాయింపు మూడో దశలోనూ నిరాశే మిగిల్చింది. జూన్ 30న మూడో దశ సీట్లు కేటాయింపు జరిగింది. ఇందులో 3,438 సీట్లు కేటాయించగా సీట్ల భర్తీ శాతం తగ్గుతూ వచ్చింది. ఇప్పటికే మొదటి, రెండో దశ సీట్ల కేటాయింపుల్లో ఆశించనంతంగా సీట్ల భర్తీ కాలేదు. మూడో దశపైనే ఆశలన్నీ పెట్టుకోగా.. ఆశించినంత సీట్ల భర్తీ కాక ప్రైవేటు యాజమాన్యాలు తల పట్టుకున్నారు. గత సంవత్సరం కంటే కూడా తక్కువగా భర్తీ అవుతుండడంతో ఆవేదన మొదలైంది. ప్రభుత్వం ఆది నుంచి డిగ్రీలో ప్రవేశాలు పెంచాలని వివిధ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సాంప్రదాయ కోర్సులతోపాటు వివిధ నూతన కోర్సులను కూడా ప్రవేశపెట్టింది. ఏంచేసినా సీట్ల భర్తీ శాతం పడిపోతూనే ఉంది. దీనికి కారణం ఏమిటో తెలియక తికమక పడుతున్నాయి. ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎక్కువశాతం మంది సాంప్రదాయ డిగ్రీ కోర్సుపై ఆనాసక్తి కలిగి ఉండడంతో నూతన మార్గాలతోపాటు బీటెక్, ఫార్మసీ వంటి కోర్సులకు వెళ్లడానికి మార్గాలు అన్వేషించడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. గతంలో సీట్ల నిండకుంటే దాదాపు 5 దశల్లో ప్రవేశాలు చేపట్టారు. ఇప్పటికి మూడు దశలు పూర్తయినా పెద్దగా సీట్ల భర్తీ కాలేదు. దీనివల్ల ప్రభుత్వం డిగ్రీ ప్రవేశాల శాతం పెంచడానికి ప్రత్యేకంగా ఇంకా ఒకటి రెండు దశలు పెట్టే అవకాశాలు లేకపోలేదని విద్యారంగనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ప్రవేశాలు చేపడితేనే సీట్ల భర్తీ శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు దశల్లో అంతంతే... దోస్త్ ద్వారా డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు ఇప్పటికి మూడు దశలు పూర్తయ్యాయి. మూడో దశ సీట్ల కేటాయింపు కూడా జూన్ 30 సాయంత్రం జరిగింది. మొదటి దశలో 12,354 సీట్లు కేటాయించగా.. 5,126 సీట్లు నిర్ధారించుకున్నారు. రెండో దశలో 4,881 సీట్లు కేటాయించగా ఇందులో బాలురు 1,872, బాలికలు 3,009 ఉన్నారు. మూడో దశలో 3,438 సీట్లు కేటాయింపు జరగడంతో శాతవాహన యూనివర్సిటీలో మొత్తం సీట్లలో సగం కూడా కాకపోవడం గమనార్హం. ఏటేటా కూడా ప్రవేశాలు కూడా నేలచూపే చూస్తున్నాయి. మూడో దశలో సీట్లు కేటాయించిన వారు జూలై 1 నుంచి 4 వరకు సెల్ఫ్‌రిపోర్టింగ్ చేసుకొని కళాశాలల్లో ప్రవేశాలు పొందడానికి గడువుంది. మరో అవకాశమిస్తే వివిధ కారణాల వల్ల సీట్లు పొందని వారు, నమోదు చేసుకోని వారితో ఖాళీ సీట్లను భర్తీ చేసుకునే అవకాశం లభిస్తుంది. సగం కూడా భర్తీకాలేదు.. శాతవాహన యూనివర్సిటీ 3 దశలు సీట్ల కేటాయింపు తర్వాత చూస్తే మొత్తం సీట్లలో సగం కూడా భర్తీ కాలేదు. యూనివర్సిటీ వ్యాప్తంగా బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం కోర్సుల్లో మొత్తం 43,820 సీట్లున్నాయి. ఇందులో గిరిజన, సాంఘిక సంక్షేమ కళాశాలల్లో కలుపుకొని 1,230 సీట్లున్నాయి. వీటికి దోస్త్ ద్వారా కాకుండా ప్రత్యేకంగా ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఇవి పోగా మిగిలిన 42,040 సీట్లు దోస్త్ ద్వారా భర్తీ చేయాల్సినవి ఉన్నాయి. ఇందులో మొదటి దశలో 12,355 సీట్లు, 2వ దశలో 4,881 సీట్లు, 3వ దశలో 3,438 సీట్లు కేటాయించారు. మొత్తం 42,040 సీట్లకు మూడు దశల్లో కలుపుకొని 20,677 సీట్లు మాత్రమే కేటాయించారు. ఇంకా ఇందులో కేటాయించబడిన వారందరూ సీట్లు నిర్ధారించుకుంటారో లేదో తెలియదు. అంటే ఈ సంఖ్య మరింత తగ్గే ప్రమాదముంది. తల పట్టుకుంటున్న యాజమాన్యాలు... యూనివర్సిటీ పరిధిలోని కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమానులు సీట్లు నిండక తల పట్టుకుంటున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తయిన నాటి నుంచి పలు కళాశాలలు తీవ్రమైన ప్రచారాలు, ప్రలోభాలు చేస్తూ వచ్చాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా సీట్లు మాత్రం భర్తీ కాలేదు. దాదాపు రెండు మూడు నెలల నుంచే లక్షల్లో ఖర్చు చేస్తూ క్యాన్వేసింగ్ చేసినా ఆశించిన ఫలితం రాలేదు. మరికొన్ని కళాశాలల పరిస్థితి కొనసాగించే బదులు మూసుకుంటేనే మంచిదనే ఆలోచనలో యాజమాన్యాలున్నట్లు తెలిసింది. కరీంనగర్, జగిత్యాల వంటి ప్రాంతాల్లో ప్రముఖ కళాశాలల్లో మాత్రమే సీట్లు చెప్పుకునే స్థాయిలో నిండినట్లు సమాచారం. అది కూడా వేళ్లమీద లెక్కబెట్టే కళాశాలల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంది. చాలావరకు కళాశాలలు నిరాశతోనే ఉన్నాయని, సీట్ల భర్తీకి కొట్టుమిట్టాడుతూ కష్టాలతోనే నెట్టుకొస్తున్నాయని సమాచారం. ఇలాగే కొనసాగితే వచ్చే విద్యా సంవత్సరం కళాశాలల సంఖ్య కూడా తగ్గుతుందని, స్వచ్ఛందంగా కళాశాలలు మూతబడే పరిస్థితులు ఎదురవుతాయని యూనివర్సిటీ ఆచార్యడొకరు తెలిపారు. ఏదేమైనా ప్రవేశాలకు గతంలో వలే మరో అవకాశమిస్తేనే ఇంకొన్ని సీట్లు భర్తీ అవుతాయని విద్యారంగనిపుణుల విశ్లేషణ. -
మా ఓటు డిగ్రీకే
సాక్షి, శ్రీకాకుళం : డిగ్రీకి డిమాండ్ పెరిగింది. ఇంజినీరింగ్ కోర్సులను కాదని అధిక సంఖ్యలో విద్యార్థులు డిగ్రీలో చేరుతున్నారు. ముఖ్యంగా సైన్స్ గ్రూపుల సీట్లకు ఎక్కడా లేని డిమాండ్ పెరిగిపోయింది. అదే విధంగా బీకాంకు ఇప్పటికీ క్రేజ్ తగ్గకపోవడం విశేషం. ఆర్ట్స్ గ్రూపులకు కూడా ఫరవాలేదనిపించే విధంగా అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇకపోతే పీజు రీయింబర్స్మెంట్ గత ఐదేళ్లలో సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతుండేవారు. జిల్లాకే తలమానికంగా నిలుస్తూ వస్తున్న ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. 2019–20 విద్యాసంవత్సరానికి గాను అడ్మిషన్ల పరంపర ఇటీవలి కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో గత మూడు రోజుల కిందట ప్రవేశాలను మొదలు పెట్టారు. ప్రవేశాల కోసం ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్‌లను పూర్తిచేసిన అధికారులు తాజాగా వెయిటింగ్ లిస్ట్‌లో మెరిట్లో ఉన్న విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తున్నారు. కళాశాల విద్య కమిషనర్ ఆదేశాల మేరకు రోస్టర్ పాయింట్ల ప్రాతిపదికన, గ్రేడ్ పాయింట్ల లో మెరిట్ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు చోటు కల్పిస్తున్నారు. -
అంబేద్కర్ వర్సిటీ ప్రవేశాలు... తెలంగాణకే పరిమితం!
* ఐదుసార్లు లేఖలు రాసినా స్పందించని ఏపీ సర్కారు * తెలంగాణ వరకే డిగ్రీ ప్రవేశాలు నిర్వహించాలని వర్సిటీ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సుల్లో 2015-16 సంవత్సరానికిగాను ప్రవేశాలను తెలంగాణకు మాత్రమే పరిమితం చేయాలని వర్సిటీ నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను 2, 3 రోజుల్లో జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. పదో షెడ్యూలులో ఉన్న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల ప్రజలకు సేవలు అందించాల్సి ఉంది. ఇందులో భాగంగా తమ సేవలను ఆంధ్రప్రదేశ్‌కు అందించాలా? వద్దా? స్పష్టం చేయాలని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వానికి వర్సిటీ వర్గాలు ఇప్పటికే ఐదుసార్లు లేఖలు రాశారు. అయితే, ఏపీ ప్రభుత్వం స్పందించలేదని, ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఏపీలో కాకుండా ఒక్క తెలంగాణలోనే డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలను చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చాయి. అయితే ప్రతిఏటా డిగ్రీ కోర్సుల్లో రెండు రాష్ట్రాలకు చెందిన దాదాపు 70 వేల మంది చేరుతుంటారు. ఇందులో ఏపీ నుంచి దాదాపు 25 వేల మంది ఉంటారు. వారికోసం ఆ రాష్ర్టంలో 90 వరకు అధ్యయన కేంద్రాలు ఉండగా, తెలంగాణలో 120కి పైగా వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నాయి. వాటి ద్వారానే ఈ ప్రవేశాలు, తరగతులు, పరీక్షల నిర్వహణ జరుగుతోంది. కానీ, ఏపీ ప్రభుత్వం స్పందించని కారణంగా ఆ రాష్ర్ట విద్యార్థులు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ కోర్సులు చదువుకునే అవకాశాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇదిలాఉండగా, ఇప్పటికే డిగ్రీ కోర్సులో చేరి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం చేస్తున్న ఏపీ విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనుంది.