అయోధ్య/న్యూఢిల్లీ: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు ఇక రెండు రోజులే మిగిలి ఉంది. ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. గర్భగుడిలో శ్రీరాముడి దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. అయితే, ప్రాణప్రతిష్ట కంటే ముందే రామ్‌లల్లా విగ్రహం చిత్రాలు బయటకు వచ్చాయి. గర్భగుడిలోకి చేర్చకముందు వీటిని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. బాలరాముడి చేతిలో బాణం, విల్లు కనిపిస్తున్నాయి.
ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నల్లరాయితో రూపొందించిన ఐదు సంవత్సరాల రాముడి విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ విధంగా రామ్‌లల్లా విగ్రహ తొలి దర్శనం ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో ప్రజలకు లభించింది.
ఇక గర్భగుడిలో ప్రధాన వేదికపై ప్రతిష్టించిన తర్వాత కళ్లకు గంతలు కట్టి ఉన్న రామ్‌లల్లా విగ్రహం ఫొటోను విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) విడుదల చేసింది. ప్రాణప్రతిష్ట పూర్తవకపోవడంతో విగ్రహం కళ్ల చుట్టూ పసుపు రంగు వస్త్రం చుట్టారు. రామ్‌లల్లాను గులాబీల దండతో అలంకరించారు. ప్రాణప్రతిష్ట ముగిశాక ఈ నెల 23 నుంచి సామాన్య భక్తులు గర్భాలయంలో రాముడిని దర్శించుకోవచ్చు.
ఏర్పాట్లపై సీఎం యోగి సమీక్ష
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అయోధ్యలోని హనుమా న్ గార్హీ ఆలయంలో పూజలు చేశారు. అలాగే భవ్య రామ మందిరాన్ని దర్శించుకున్నారు. ప్రాణప్రతిష్ట వేడుక కోసం జరుగుతున్న ఏర్పాట్లు సమీక్షించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత సరయూ నదిలో సోలార్ బోటును ప్రారంభించారు. 1,008 కుండియా హనుమాన్ మహాయజ్ఞంలో పాల్గొన్నారు.
కాలర్ ట్యూన్లుగా రాముని పాటలు
రామాలయ ప్రాణప్రతిష్ట సందర్భంగా అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాతి్మక వాతావరణం కనిపిస్తోంది. వీధుల్లో రాముడి పాటలు మార్మోగుతున్నాయి. ప్రజలు పరస్పరం పలుకరింపుల్లోనూ రామనామం ప్రస్తావిస్తున్నారు. అయోధ్య పౌరులు తమ ఫోన్లలో రాముడి పాటలనే కాలర్ ట్యూన్లు, రింగ్ టోన్లుగా మార్చుకుంటున్నారు. ఎవరికైనా ఫోన్ చేస్తే ‘యుగ్ రామ్ రాజ్ కా’, ‘రామ్ ఆయే హై అయోధ్య మే’, ‘హరి అనంత్ హరి కథ’ వంటి పాటలు వినిపిస్తున్నాయి.
మధ్యప్రదేశ్ నుంచి 5 లక్షల లడ్డూలు
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం కోసం మధ్యప్రదేశ్ భక్తులు 5 లక్షల లడ్డూలు పంపించారు. ఈ లడ్డూలతో ఐదు వాహనా లు శుక్రవారం భోపాల్ నుంచి అయోధ్యకు బయలుదేరాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ వాహనాలకు పచ్చజెండా ఊపారు. 5 లక్షల లడ్డూలు ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో తయారు చేశారు.
ఉత్తరప్రదేశ్ జైళ్లలో ప్రత్యక్ష ప్రసారం
రామమందిర ప్రారంభోత్సవం కోసం అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని టీవీల్లో ప్రత్యక్షంగా వీక్షించాలని నిర్ణయించుకున్నారు. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సైతం ఈ అవకాశం కలి్పంచాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాణప్రతిష్ట వేడుక ప్రత్యక్ష ప్రసారం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్లలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యారక్‌లలో టీవీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
పలు రాష్ట్రాల్లో సోమవారం సెలవు
రామమందిర ప్రాణప్రతిష్ట సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. రాష్ట్రమంతటా కార్యాలయా లు, వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలకు సెలవు అమలు చేస్తున్నట్లు తెలియజేసింది. మధ్యప్రదేశ్‌లోనూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తమ విద్యాసంస్థలకు 22న హాఫ్ డే సెలవు ఇస్తున్నట్లు జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ ప్రకటించింది.
అంబానీ నుంచి బచ్చన్ దాకా..
బాలరాముడి ప్రాణప్రతిష్టకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా అత్యంత ప్రముఖులు హాజరుకాబోతున్నారు. బిలియనీర్ ముకేష్ అంబానీ నుంచి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ దాకా చాలామంది ప్రముఖులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానం పంపించింది. ఆహ్వానితుల జాబితాలో దాదాపు 7,000 మందికి చోటు దక్కింది. ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీ నటులు, క్రీడాకారులు, అధికారులు, దౌత్యవేత్తలకు ఆహా్వనాలు అందాయి. ముకేష్ అంబానీ, అమితాబ్ బచ్చన్ తమ కుటుంబ సభ్యులతో సహా హాజరుకాబోతున్నారు. సినీ ప్రముఖులు అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, చిరంజీవి, రామ్‌చరణ్, అల్లు అర్జున్, మోహన్‌లాల్, అలియా భట్, సరోద్ కళాకారుడు అంజాద్ అలీ, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తదితరులను ఆహా్వనించారు.
ఆ న్యాయమూర్తులకూ...
అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్టకు దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరుకాబోతున్నారు. అయోధ్య వివాదంపై తుది తీర్పునిచి్చ, భవ్య మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సభ్యులకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు ఆహా్వనం పంపించారు. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, మాజీ సీజేఐలు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య వివాదంపై 2019 నవంబర్ 9న చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ప్రాణప్రతిష్టకు హాజరు కావాలని కోరుతూ రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు సభ్యులతోపాటు 50 మందికిపైగా ప్రఖ్యాత న్యాయమూర్తులు, న్యాయవాదులను సైతం ఆహా్వనించారు.
శిల్పికి ‘తీపి బహుమతి’
రామ్‌లల్లా విగ్రహాన్ని చెక్కిన మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు తియ్యటి బహుమతి లభించింది. మైసూరులోని మహాలక్ష్మీ స్వీట్స్ దుకాణం యజమాన్యం ఆయనకు అయోధ్య రామమందిరం ప్రతిరూపంగా తయారు చేసిన మిఠాయిని బహూకరించింది. రకరకాల స్వీట్లతో ఈ బహుమతిని తయారు చేశారు.
22న ఒడిశా రామాలయ ప్రాణప్రతిష్ట
అయోధ్యలో నిర్మించిన భవ్య రామమందిరంలో ఈ నెల 22న రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట జరుగనుంది. అదే రోజు మరో రామాలయ ప్రాణప్రతిష్ట సైతం జరగబోతోంది. ఒడిశాలో నయాగఢ్ జిల్లా ఫతేగఢ్ గ్రామంలో సర్వాంగ సుందరంగా నిర్మించిన గుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సముద్ర మట్టానికి 1,800 అడుగుల ఎగువన ఓ కొండపై 2017లో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. ఆలయం ఎత్తు 165 అడుగులు. 150 మందికిపైగా కారి్మకులు ఏడేళ్లలో నిర్మాణం పూర్తిచేశారు. కళింగ శైలిలో ఆలయం రూపుదిద్దుకుంది. ఈ ప్రాంతానికి చరిత్రాత్మక ప్రాధాన్యం ఉంది. శ్రీకృష్ణుడు ఈ కొండపై తపస్సు చేశాడని చెబుతుంటారు.
శుక్రవారం రాత్రి విద్యుత్ వెలుగుల్లో అయోధ్య రామాలయం.
(ఇన్‌సెట్లో) శుక్రవారం వీహెచ్‌పీ విడుదల చేసిన రామ్‌లల్లా విగ్రహం ఫొటో
Comments
Please login to add a commentAdd a comment