రామ్‌లల్లా విగ్రహం వద్ద ప్రాణప్రతిష్ట పూజలు నిర్వహిస్తున్న మోదీ
జగదానందకారకం.. దివ్యమంగళ స్వరూపం.. మందస్మిత వదనం.. చేత బంగారు ధనుస్సు, బాణం.. స్వర్ణవజ్రాభరణాలు, తులసీమాలల అలంకారం.. కార్యక్రమ ప్రధాన యజమాని (కర్త) హోదాలో ఐదేళ్ల బాలరాముడి విగ్రహానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట జరిగింది.
సోమవారం గర్భాలయం లోపల నరేంద్ర మోదీ అభిజిత్ ముహూర్తంలో 84 సెకన్ల వ్యవధిలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. బాలరాముడి పాదాలకు నమస్కరించి, విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసిన అనంతరం సాష్టాంగ ప్రణామం చేశారు.
ప్రాణప్రతిష్ట ముగిశాక ‘మన రామయ్య అయోధ్య నగరానికి వచ్చేశాడం’టూ ప్రధాని అతిథుల హర్షధ్వానాల మధ్య ప్రకటించిన మరుక్షణమే దేశ విదేశాల్లో లక్షలాది మంది భక్తులు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. రాత్రి తమ ఇళ్లలో రామజ్యోతి వెలిగించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు.
ప్రాణప్రతిష్ట తర్వాత ప్రధాని మోదీ ఇదే ప్రాంగణంలో ఉన్న కుబేర తిల శివాలయాన్ని దర్శించుకొని, పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో జటాయువు పక్షి విగ్రహాన్ని ఆవిష్కరించారు. క్రతువు పూర్తికాగానే మోదీ 11 రోజుల అనుష్ఠాన దీక్షను విరమించారు.
అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులను ప్రధాని మోదీ ఘనంగా సన్మానించారు. అంతకుముందు ఆయన ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వేదికపై నుంచి ప్రసంగించారు.
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యకు మన రాముడు వచ్చేశాడని ప్రధానమంత్రినరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. అయోధ్య ఆలయంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట సాకారమైన వేళ ప్రతి పౌరుడు ఇకపై దేశ భవిష్యత్ నిర్మాణ మార్గాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన దేశ పురోగమనానికి, ప్రగతికి రామ మందిరం గొప్ప సాక్షిగా ఉంటుందని చెప్పారు. ‘వికసిత్ భారత్’కు ఈ రామ మందిరం సాక్షి అవుతుందని పేర్కొన్నారు. రాముడు ఈ దేశ విశ్వాసం, ఆలోచన, చట్టం, ప్రతిష్ట, వైభవం అని ఉద్ఘాటించారు. రాముడి ప్రభావం ఈ భూమిపై వేల సంవత్సరాలు పాటు కొనసాగిందని గుర్తుచేశారు.
ఇదే సరైన సమయమని, రాబోయే వెయ్యేళ్ల భారతదేశానికి పునాది వేయాలని సూచించారు. అయోధ్య ఆలయంలోసోమవారం రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట అనంతరం నిర్వహించిన సభలో ప్రధాని మోదీ అతిథులు, ప్రముఖులు, సాధుసంతులు, భక్త జనులను ఉద్దేశించి దాదాపు 40 నిమిషాలపాటు ప్రసంగించారు. భవ్య మందిరం నిర్మాణం పూర్తయ్యిందని, ఒక దేశ నిర్మాణంపై దృష్టి పెట్టాలని చెప్పారు. బలమైన, సమర్థవంతమైన, దివ్య, భవ్య భారతదేశాన్ని నిర్మించడానికి మనం ప్రతిజ్ఞ చేయాలని కోరారు. ప్రజల మనస్సాక్షిలో రాముడి ఆదర్శం ఉండాలని ఉద్బోధించారు. అయోధ్య సభలో ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే...
ప్రజల త్యాగానికి నా కృతజ్ఞతలు
‘‘సమిష్టి తత్వంతో సంఘటితంగా, సమర్థవంతంగా పని చేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. ఇది భారతదేశ సమయం. దేశం మరింత ముందుకు సాగబోతోంది. శతాబ్దాల నిరీక్షణ తర్వాత ఇక్కడికి చేరుకున్నాం. మనమందరం ఈ యుగం కోసం, ఈ కాలం కోసం ఎదురు చూశాం. ఇప్పుడు మనం పరుగు ఆపబోం. అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాం. రామాలయాన్ని సుసాధ్యం చేసిన ప్రజల త్యాగానికి నా కృతజ్ఞతలు.
సాధువులు, కర సేవకులు, రామభక్తులకు నా అభినందనలు. ఇది కేవలం శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట మాత్రమే కాదు. శ్రీరాముడి రూపంలో వ్యక్తమయ్యే భారతీయ సంస్కృతిపై అచంచలమైన విశ్వాసాన్ని ప్రతిష్టించుకొనే కార్యక్రమం. మానవీయ విలువలు, అత్యున్నత ఆశయాలకు భారతీయ సంస్కృతి ప్రతిరూపం. ఇది యావత్ ప్రపంచానికీ అవసరం. ఇది రాముడి రూపంలో ఉన్న జాతీయ చైతన్య ఆలయం. శ్రీరాముడు భారతదేశ విశ్వాసం, పునాది, ఆలోచన, చట్టం, స్పృహ, ఆలోచన, ప్రతిష్ట, కీర్తి. రామ్ అనేది ఓ ప్రవాహం, ఓ ప్రభావం, ఓ నీతి, విశ్వవ్యాప్త ఆత్మ. శ్రీరాముని ప్రాణప్రతిష్ట ప్రభావం వేల సంవత్సరాల పాటు కొనసాగుతుంది.
నూతన కాలచక్రానికి నాంది
శతాబ్దాల ఎదురు చూపులు, ఎన్నో బలిదానాలు, లెక్కలేనన్ని త్యాగాలు, తపస్సుల తర్వాత ఎట్టకేలకు రాముడు మళ్లీ అయోధ్యకు చేరుకున్నాడు. ఈ శుభ సందర్భాన దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. మన రామ్‌లల్లా ఇకపై డేరాలో ఉండడు. దివ్య మందిరంలో ఆయనకు శాశ్వత స్థానం లభించింది. జనవరి 22 అనేది కేవలం ఒక తేదీ కాదు. కొత్త కాలచక్రానికి ప్రతీక, నవశకానికి నాంది. వెయ్యేళ్ల తర్వాత కూడా ఈ తేదీని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు.
రామజన్మభూమి ఆలయ పూజ, అభివృద్ధి పనులు దేశ పౌరుల్లో కొత్త శక్తిని నింపాయి. రామ భగవానుడి ఆశీర్వాదం వల్లే ఈ మహత్తర సందర్భానికి మనం సాక్షిగా ఉన్నాం. రోజులు, దిశలు, ఆకాశాలు సహా ప్రతిదీ ఈ రోజు దైవత్వంతో నిండి ఉంది. ఇది సాధారణ కాలం కాదు. కాలక్రమేణా ముద్రించబడుతున్న చెరగని స్మృతి మార్గం. బానిస మనస్తత్వపు సంకెళ్లను తెంచుకుని, గత అనుభవాల నుంచి స్ఫూర్తి పొంది, చరిత్రను లిఖించే గొప్ప సందర్భమిది.
భారతీయుల హృదయాల్లో కొలువయ్యాడు
బాలరాముడి ప్రాణప్రతిష్టతో చిన్న చిన్న గ్రామాలతో సహా దేశం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. దేవాలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశం మొత్తం ఈ రోజు దీపావళిని జరుపుకుంటోంది. సాయంత్రం వేళల్లో ప్రతి ఇంట్లో ‘రామజ్యోతి’ వెలిగించబోతున్నారు. రామసేతు ప్రారంభ బిందువు అయిన అరిచల్ మునైలో ఇటీవల పర్యటించా. రాముడు పాదం మోపిన అన్ని పవిత్ర ప్రదేశాలను 11 రోజుల అనుష్ఠాన సమయంలో సందర్శించా. నాసిక్‌లోని పంచవటీ ధామ్, కేరళలోని త్రిప్రయార్ దేవాలయం, ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షి, శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వా మి దేవాలయం, రామేశ్వరంలోని శ్రీరామనాథస్వామి దేవాలయం, ధనుషో్కటీని సందర్శించా. సముద్రం నుండి సరయూ నది వరకు నా ప్రయా ణం సాగింది. రఘుకులోత్తమ రాముడు భారతదేశ ఆత్మకు చెందిన ప్రతి కణంతో అనుసంధానమై ఉన్నాడు.
రాముడు భారతీయుల హృదయాల్లో కొలువయ్యాడు. భారతదేశంలో ఎక్కడైనా ప్రతి ఒక్కరి మనస్సాక్షిలో ఏకత్వ భావన కనిపిసుంది. సామూహికతకు ఇంతకంటే కచ్చితమైన సూత్రం మరొకటి లేదు. శ్రీరామ కథను అనేక భాషల్లో నేను ఆలకించాను. మన సంప్రదాయాలు, పండుగల్లో రాముడు ఉన్నాడు. ప్రతి యుగంలో ప్రజలు రాముడిని తలిచారు. తమదైన శైలిలో, మాటల్లో ఆ భగవంతుడిని వ్యక్తీకరించారు. ఈ ‘రామ్‌రస్’ జీవన ప్రవాహంలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. రామకథ అనంతం. రామాయణం అంతులేనిది. రాముడి ఆదర్శాలు, విలువలు, బోధనలు ప్రతిచోటా ఒకే విధంగా ఉంటాయి.
ప్రతి ప్రయత్నానికీ బలం, సహకారం
ప్రతి భారతీయుడిలోని భక్తి, సేవ, అంకితభావం, ఏకత్వం, ఐక్యత అనే భావాలు సమర్థవంతమైన, గొప్ప, దైవిక భారతావనికి ఆధారమవుతాయి. ప్రజలు దేవుడి నుండి దేశానికి(దేవ్ టూ దేశ్), రాముడి నుండి రాజ్యానికి(రామ్ టూ రా్ర‹Ù్ట) చైతన్యాన్ని విస్తరింపజేయాలి. రామభక్త హనుమాన్ సేవ, భక్తి, అంకితభావాన్ని చూసి ప్రజలు ఎంతో నేర్చుకోవచ్చు. దేశంలో నిరాశకు తావు లేదు. తమ ను తాము చిన్నవారుగా, సామాన్యులుగా భావించే వారు రామాయణంలో రామయ్యకు ఉడుత అందించిన సేవలను గుర్తు చేసుకోవాలి. సంకోచాన్ని వదులుకోవాలి.
చిన్నదైనా, పెద్దదైనా ప్రతి ప్రయ త్నానికీ బలం, సహకారం ఉంటుంది. విపరీతమైన జ్ఞానం, అపారమైన శక్తి కలిగిన లంకా«దీశుడు రావణుడితో పోరాడి ఓడిపోతానని తెలిసి కూడా చిత్తశుద్ధితో కర్తవ్యాన్ని నిర్వర్తించిన జటాయువును ఆదర్శంగా తీసుకోవాలి. ప్రస్తుత అమృత కాలంలో యువత అకుంఠిత విశ్వాసంతో ముందుకు సాగాలి. సంప్రదాయ స్వచ్ఛత, ఆధునికతలను మేళవించడం ద్వారా భారతదేశం తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. శ్రీరాముడి తోడ్పాటు, ఆశీస్సులతో దేశం కోసం పని చేస్తామంటూ మనమంతా ప్రతిజ్ఞ చేద్దాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు
శ్రీరాముడి ప్రతి పనిలో హనుమంతుడి ఉనికి తప్పనిసరిగా ఉంటుంది. సీతమ్మతోపాటు హనుమంతుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడిని సైతం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఈ ఆలయ నిర్మాణ ప్రధాన ఘట్టంలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర మరువలేనిది. రామయ్యా.. నన్ను క్షమించు. అయోధ్యలో ఆలయ నిర్మాణం, ప్రాణప్రతిష్ట ఆలస్యమైనందుకు ప్రభు శ్రీరాముడిని క్షమాపణలు కోరుతున్నా. మన ప్రయత్నాలు, త్యాగాలు, తపస్సులో ఏదో లోటు జరిగిన కారణంగానే ఇన్ని శతాబ్దాలుగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేయలేకపోయాం. రామ్‌లల్లా ప్రాణప్రతిష్టతో నేడు ఆ లోటు తీరింది.
శ్రీరాముడు మనల్ని తప్పకుండా ఈ రోజు క్షమిస్తాడని నమ్ముతున్నా. రామాయణ కాలంలో అయోధ్య నగరం శ్రీరాముడితో 14 ఏళ్ల పాటు వియోగం పొందింది. ఈ యుగంలో అయోధ్యవాసులు, దేశ ప్రజలు రాముడి వియోగాన్ని వందల ఏళ్లపాటు అనుభవించారు. మన దేశ రాజ్యాంగం అసలు ప్రతిలో శ్రీరాముడు ఉన్నప్పటికీ, మందిర నిర్మాణం కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగింది. న్యాయం గౌరవాన్ని చెక్కుచెదరకుండా ఉంచినందుకు భారతదేశ న్యాయ వ్యవస్థకు నా ధన్యవాదాలు. శ్రీరాముడి ఆలయ నిర్మాణం రాజ్యాంగబద్ధంగానే జరిగింది. దైవ ఆశీర్వాదం, దైవిక ఆత్మల వల్లనే మందిర నిర్మాణం పూర్తయ్యింది.
నిప్పు కాదు శక్తి పుట్టింది
శ్రీరామ ప్రాణప్రతిష్ట సందర్భం కేవలం విజయానికి సంబంధించిన అంశం కాదు. ఇది వినయానికి సంబంధించినది. రామ్‌లల్లా ఆలయ నిర్మాణం శాంతి, సహనం, పరస్పర సామరస్యం, భారతీయ సమాజంలోని సమన్వయానికి ప్రతీక. అయోధ్యలో ఆలయం నిర్మిస్తే దేశం అగ్నిగుండం అవుతుందని కొందరు హెచ్చరించారు. పునరాలోచన చేయాలని వారిని కోరుతున్నా. ఈ కట్టడం వల్ల ఏ నిప్పూ పుట్టడం లేదు, శక్తి పుట్టడం చూస్తున్నాం. ఉజ్వల భవిష్యత్తు బాటలో ముందుకు సాగేందుకు రామమందిరం సమాజంలోని ప్రతి వర్గానికీ స్ఫూర్తినిస్తోంది. రాముడు నిప్పు కాదు.. అతడొక శక్తి. అతడు వివాదం కాదు.. పరిష్కారం. రాముడు మనకు మాత్రమే కాదు, అందరికీ చెందినవాడు. రాముడు అనంతుడు. ‘వసుదైవ కుటుంబకమ్’ ఆలోచనే రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట. దేశంలో నేడు నిరాశావాదానికి చోటు లేదు. హనుమ, ఉడత, జటాయువుల నుంచి కూడా కొత్త విషయాలు నేర్చుకుందాం.
శతాబ్దాల ఎదురుచూపులు, ఎన్నో బలిదానాలు, లెక్కలేనన్ని త్యాగాలు, తపస్సుల తర్వాత ఎట్టకేలకు రాముడు మళ్లీ అయోధ్యకు చేరుకున్నాడు. మన రామ్‌లల్లా ఇకపై డేరాలో ఉండడు. దివ్య మందిరంలో ఆయనకు శాశ్వత స్థానం లభించింది. జనవరి 22 అనేది కేవలం ఒక తేదీ కాదు. కొత్త కాలచక్రానికి ప్రతీక, నవశకానికి నాంది. వెయ్యేళ్ల తర్వాత కూడా ఈ తేదీని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. ‘వికసిత్ భారత్’కు ఈ రామ మందిరం సాక్షి. భవ్య మందిర నిర్మాణం పూర్తయింది. ఇక దేశ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఇది భారతదేశ సమయం.
– ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment