భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు, ప్రముఖుల సాక్షిగా గర్భగుడిలో రామ్‌లల్లా కొలువుదీరబోతున్నాడు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని తిలకించడానికి దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రధాన వేడుక ప్రారంభం కానుంది.
మధ్యాహ్నం 12:29:08 గంటల నుంచి 12:30:32 గంటల వరకు.. మొత్తం 84 సెకన్లలో గర్భగుడిలో ప్రాణప్రతిష్ట పూర్తవుతుంది. అపూర్వమైన ఈ వేడుకలో భిన్న మతాలు, సంప్రదాయాలు, వర్గాలకు భాగస్వామ్యం కల్పిస్తున్నారు. పర్వతాలు, అడవులు, తీర ప్రాంతాలు, ద్వీపాలు తదితర అన్ని ప్రాంతాలకు చెందినవారు ఒకే చోట ఒక కార్యక్రమంలో పాల్గొంటుండడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి అని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తెలియజేసింది. రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాల్లో సోమవారం ఉత్సవాలు జరగబోతున్నాయి.
నేడు గర్భాలయం లోపల..
ఉదయం 10:00 మంగళ ధ్వనితో శ్రీకారం
మధ్యాహ్నం 12.20 ప్రధాన వేడుక ప్రారంభం
12:29:08, 12:30:32 84 సెకన్లలో గర్భగుడిలో బాలరాముడి ప్రాణప్రతిష్ట
7,000 హాజరుకానున్న అతిథులు
ఏకకాలంలో వెలిగించనున్న ప్రమిదలు 10,00,000
అయోధ్యలో నేడు కొలువుదీరనున్న బాలరాముడు
అద్భుత వాయిద్యాలతో మంగళ ధ్వని
ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సోమవారం ఉదయం 10 గంటలకు ‘మంగళ ధ్వని’తో శ్రీకారం చుడతారు. ఇందుకు దాదాపు 20 రాష్ట్రాల నుంచి 50కి పైగా అద్భుతమైన వాయిద్యాలను తీసుకొచ్చారు. అయోధ్యకు చెందిన యతీంద్ర మిశ్రా సారథ్యంలో నిర్వహించే ఈ సంగీత ప్రదర్శనకు ఢిల్లీకి చెందిన సంగీత నాటక అకాడమీ సహకారం అందించనుంది.
టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం
రామమందిర ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పా ట్లు పూర్తయ్యాయి. ఉదయం ఏడింటి నుంచే ప్రసారాలు మొదలవు తాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రధాన వేడుక జరుగుతుంది. వీటిని డీడీ న్యూస్, డీడీ జాతీయ చానళ్లతోపాటు ప్రైవేట్ చానళ్లలోనూ తిలకించవచ్చు.
84 సెకన్ల శుభ ముహూర్తం
గర్భగుడిలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు శుభ ముహూర్తం నిర్ణయించారు. సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 12.20 గంటలకు వేడుక ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:29:08 గంటల నుంచి 12:30:32 గంటల వరకు మొత్తం 84 సెకన్లలో ప్రాణప్రతిష్ట పూర్తవుతుంది. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యులుగా 121 మంది రుతి్వక్కులు వేడుక నిర్వహిస్తారు. ప్రాణ ప్రతిష్టలో శైవ, వైష్ణవ, శాక్త, గాణాపత్య, సిక్కు, బౌద్ధ, జైన, దశనామీ శంకర్, రామానంద, రామానుజ, నింబార్క, మధ్వ, విష్ణు నామి, వాల్మీకి, వీర శైవ మొదలైన సంప్రదాయాలు భాగం కానున్నాయి. 150 మందికిపైగా సంప్రదాయాల సాధువులు, మహామండలేశ్వర్, మహంత్, నాగాలతో సహా 50 మందికి పైగా గిరిజన, గిరివాస, ద్వీపవాస సంప్రదాయాల ప్రముఖులు పాల్గొంటారు. ఇలా పర్వతాలు, అడవులు, తీర, ద్వీప వంటి అన్ని ప్రాంతాలకు వారు ఒకే కార్యక్రమంలో పాల్గొంటుండడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తెలియజేసింది.
నగర వీధుల్లో తోరణాలు, కాషాయ జెండాలు
అయోధ్య వీధులు కాషాయ రంగు పులుముకున్నాయి. నగరంలో అన్ని వీధులను కాషాయ జెండా, తోరణాలతోపాటు విద్యుత్ దీపాలు, పూలమాలలతో అలంకరించారు. నివాస భవనాలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, దుకాణాలపైనా పెద్ద సంఖ్యలో జెండాలు దర్శనమిస్తున్నాయి. దుకాణాల్లో వీటి అమ్మకాలు విరివిగా సాగుతున్నాయి. శ్రీరాముడు, హనుమంతుడు, నూతన రామాలయ చిత్రాలు, జైశ్రీరామ్ నినాదంతో కూడిన ఈ జెండాలు, తోరణాలు చూపరులకు ఆధ్యాత్మిక భావనలు పంచుతున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలతోపాటు దాతలు శ్రీరాముడి జెండాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. అయోధ్యలోని రామ్‌పథ్, ధర్మపథ్‌ను జెండాలతో ప్రత్యేకంగా ఆలంకరించారు. అయోధ్యలో రామచరిత మానస్, రామాయణం పుస్తకాల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వీధుల్లో శ్రీరాముడి పాటలు మార్మోగుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా రామయ్య పండుగ
శ్రీరాముడి ప్రాణప్రతిష్ట వేడుక కేవలం ఆయోధ్యకే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ ఉత్సవంలో పాలుపంచుకోబోతున్నారు. సోమవారం ర్యాలీలు, ప్రదర్శనలు, పాదయాత్రలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికాలో దాదాపు 300 ప్రాంతాల్లో ప్రాణప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద కూడా స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. పారిస్‌లో హిందూ సమాజం ఆధ్వర్యంలో భారీ రథయాత్ర నిర్వహించనున్నారు. అలాగే విశ్వ కల్యాణ యజ్ఞం నిర్వహిస్తారు. ఇంగ్లాండ్, ఆ్రస్టేలియా, కెనడా, మారిషస్ సహా 60కిపైగా దేశాల్లో వేడుకలు జరుగుతాయి. ఆయా దేశాల్లోని హిందూ ఆలయాల్లో సాయంత్రం దీపాలు వెలిగించగబోతున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇప్పటికే విద్యుత్ దీపాలు, పూలతో ఆలయాలను అందంగా అలకరించారు. అలాగే రామాయణ పారాయణం కోసం ఏర్పాట్లు చేశారు.
నేటితో ముగియనున్న ప్రత్యేక క్రతువులు
ప్రత్యేక క్రతువుల్లో భాగంగా ఆదివారం ఔషధ జలంతోపాటు దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల తెచి్చన పవిత్ర జలాలతో రామ్‌లల్లాను శుద్ధి చేశారు. రాత్రి జాగరణ అధివస్ జరిపారు. 16న మొదలైన క్రతువులు సోమవారం ముగుస్తాయి.
మూడు నిత్య హారతులు
ప్రాణప్రతిష్ట అనంతరం భక్తులకు రామ్‌లల్లా దర్శనం కల్పించడానికి ఆలయాన్ని ఉదయం 7 గంటల నుండి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. నిత్యం మూడుసార్లు ప్రత్యేక హారతి నిర్వహిస్తారు. ఉదయం 6.30 గంటలకు జాగరణ్ హారతి, మధ్యాహ్నం 12.00 గంటలకు భోగ్ హారతి, రాత్రి 7.30 గంటలకు సంధ్యా హారతి
ఇవ్వనున్నారు.
గర్భాలయంలో ఇలా...
► ఉదయం 10 గంటలు: మంగళ ధ్వని
► మధ్యాహ్నం 12.05 నుంచి 12.55: ప్రాణప్రతిష్ట జరుగుతుంది. రామ్‌లల్లా నేత్రాలు తెరిచిన తర్వాత ప్రధాని మోదీ కాటుక దిద్దుతారు. బాలరాముడికి అద్దంలో ప్రతిబింబం చూపిస్తారు.
► మధ్యాహ్నం 12.55: ప్రధాన ఆలయంపై హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపిస్తారు.
గర్భగుడిలోకి ఆ ఐదుగురు
గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో తీర్థ క్షేత్ర ట్రస్టు మహంత్ నృత్యగోపాల్ దాస్ మహరాజ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. వేడుక పూర్తయిన తర్వాత అతిథులకు రామ్‌లల్లా దర్శనం కల్పిస్తారు.
మోదీ పర్యటన ఇలా..
► ఉదయం 10.25: అయోధ్య విమానాశ్రయం నుంచి ఆలయానికి
► మధ్యాహ్నం 12: గర్భగృహం ఎదుట అతిథులకు పలకరింపు
► మధ్యాహ్నం 1 నుంచి 2 గంటలు: బహిరంగ సభలో మోదీ ప్రసంగం. ఆరెస్సెస్ చీఫ్ భాగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు కూడా ప్రసంగిస్తారు.
► మధ్యాహ్నం 2 గంటలు: శివ మందిరం, కుబేర తిల సందర్శన
► మధ్యాహ్నం 3.30: మోదీ ఢిల్లీకి పయనమవుతారు.
10 లక్షల ప్రమిదల కాంతులు
అయోధ్య నగరం సోమవారం సాయంత్రం దేదీప్యమానంగా వెలిగిపోనుంది. రామ్‌లల్లా ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని 10 లక్షలు ప్రమిదలను ఏకకాలంలో వెలిగించబోతున్నారు. నగరంలోని 100 ఆలయాలు, ప్రధాన ప్రాంతాల్లో ఈ దీపాలు వెలుగులు పంచబోతున్నాయి. ఈ దృశ్యాలు కనులకు పండుగే అనడంలో సందేహం లేదు. భవ్య రామమందిరంతోపాటు రామ్ కీ పైడీ, కనక్ భవన్, గుప్తార్ ఘాట్, సరయూ ఘాట్, లతా మంగేష్కర్ చౌక్, మణిరామ్ దాస్ చౌనీ తదితర ప్రాంతాల్లో ప్రమిదలు వెలిగిస్తారు. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అయోధ్య వాసులు తమ ఇళ్లల్లోనూ దీపాలు వెలిగించబోతున్నారు. దాంతో అయోధ్యాపురం కాంతిమయం కాబోతోంది.
రామాలయ ఉపగ్రహ చిత్రాలు విడుదల
అయోధ్యలో నూతన రామాలయ ఉపగ్రహ చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆదివారం విడుదల చేసింది. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ అంతరిక్షం నుంచి గత ఏడాది డిసెంబర్ 16న ఈ దృశ్యాన్ని చిత్రీకరించింది. ప్రధాన ఆలయంతోపాటు దశరథ మహల్, అయోధ్య రైల్వే స్టేషన్, సరయూ నది వంటివి ఈ చిత్రాల్లో చక్కగా కనిపిస్తున్నాయి.
వేదమంత్రాల నడుమ రామ్‌లల్లాకు ప్రాణప్రతిష్ట
► మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో కార్యక్రమం
► ఉత్సవానికి ప్రధాన యజమానిగా ప్రధాని నరేంద్ర మోదీ
► ప్రాణప్రతిష్ట అనంతరం ప్రముఖులకు బాలరాముని దర్శనం
శుభ ఘడియలు సమీపించాయి. అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట వైభవోజ్వల చరిత్రాత్మక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఐదు శతాబ్దాల వనవాసం వీడి, భవ్య మందిరానికి చేరుకున్న రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ కమనీయ వేడుకను కనులారా తిలకించడానికి ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దేశ విదేశాల్లో రామనామ స్మరణతో భక్తులు ఆనంద డోలికల్లో ఊగిపోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 7 వేల మందికిపైగా అతిథులు, ప్రముఖులు హాజరుకాబోతున్నారు.
150 మందికిపైగా ప్రముఖులు ఇప్పటికే అయోధ్యలో అడుగుపెట్టారు. సామాన్య భక్తజనం అయోధ్య బాటపట్టారు. కాషాయ పతాకాల రెపరెపలు, రాముడి గీతాలు, భజనలు, స్తోత్రాలు, జైశ్రీరామ్ నినాదాలతో, అందంగా తీర్చిదిద్దిన ప్రధాన భవ్య మందిరంతోపాటు ఇతర ఆలయాలతో అయోధ్య అంతటా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. నగరం
ఇప్పటికే జనసంద్రంగా మారింది. భక్తుల పూజలు, వేదమంత్రాల ఘోషతో సరయూ నదీ తీరం కనువిందు చేస్తోంది. నగరంలోని చరిత్రాత్మక కట్టడాలను సైతం సుందరంగా అలంకరించారు. దేశమంతా అయోధ్య నామస్మరణతో సర్వం రామమయంగా మారిపోయింది.
– సాక్షి, న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment