అయోధ్య భక్తజన సంద్రం.. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ రేపే | Ayodhya Ram mandir: Ayodhya Temple idol Instalation ceremony of sakshi Special Story | Sakshi
Sakshi News home page

Ayodhya Ram mandir: అయోధ్య భక్తజన సంద్రం.. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ రేపే

Published Sun, Jan 21 2024 5:49 AM | Last Updated on Sun, Jan 21 2024 1:00 PM

Ayodhya Ram mandir: Ayodhya Temple idol Instalation ceremony of sakshi Special Story - Sakshi

అయోధ్య.. ఆ పేరు వింటేనే ఆధ్యాత్మిక పరవశం. అది శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి. ఎన్నో వివాదాలు.. మరెన్నో ఆందోళనలు..అవన్నీ సమసిపోయాయి. రాముడు పుట్టిందక్కడే అని బలంగా నమ్మే కోట్లాది భక్త హృదయాలు ఉప్పొంగేలా, భవ్యమైన దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేం చేయబోతున్నాడు. ఆ దివ్యమంగళ రూపం కోసం పరితపిస్తున్న భక్తకోటి ఆర్తి తీరేలా బాలరాముడిగా రేపు తొలి దర్శనభాగ్యం కలిగించబోతున్నాడు. అయోధ్యలో దివ్యంగా రూపుదిద్దుకున్న భవ్య మందిరంలో భక్తవత్సలుడు కొలువు దీరబోతున్నాడు. కనులారా బాలరాముడిని వీక్షించే భాగ్యం భక్తులకు దక్కనుంది.

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగసుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనం ఇవ్వనున్నాడు. రేపు సోమవారం బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర రాజకీయ ప్రముఖులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మిక, ఇతర రంగాల ప్రముఖులు,  ప్రపంచం నలు మూలల నుంచి తరలివస్తున్న భక్త జనం సాక్షిగా ఆగమ శాస్త్ర పద్ధతుల్లో ప్రతిష్ఠించనున్నారు. రూ.1300 కోట్లతో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్టు కావటంతో ఆలయాన్ని మూడు విడతల్లో పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం దిగువ అంతస్తు మాత్రమే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే సిద్ధం చేసిన బాల రాముడి విగ్రహానికి రేపు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది.


బాలరాముడిని ప్రతిష్ఠించే గర్భాలయం; 1947 నుంచి పూజలందుకుంటున్న విగ్రహం; ప్రాణప్రతిష్ఠ జరగనున్న బాలరాముడి విగ్రహం 


మొదటి అంతస్తులో రామదర్బార్‌
 రావణవధ అనంతరం తిరిగి వచ్చిన సీతారాములకు అయోధ్యలో అంగరంగవైభవంగా  పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత సోదర, ఆంజనేయ సమేతంగా అద్భుత పాలనతో సుభిక్ష రామరాజ్యం విలసిల్లిందన్నది పురాణగాధ. బాలరాముడితో దర్శనం సమాప్తమైతే.. సీతారాములను కనులారా వీక్షించాలని ఉబలాటపడే భక్తుల్లో కొంత అసంతృప్తి ఉంటుందనే ఉద్దేశంతో మొదటి అంతస్తులో ‘రామదర్బార్‌’ రూపంలో అద్భుత దర్శనభాగ్యం కలిగించే ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ సీతారామచంద్రులు లక్ష్మణ, భరత, శత్రఘ్న, ఆంజనేయ విగ్రహాలు సమేతంగా భక్తులకు మొదటి అంతస్తులో దర్శనమివ్వనున్నాయి. రామదర్బార్‌ విగ్రహాలను రాజస్థాన్  తెల్లరాతితో సిద్ధం చేయనున్నారు. వచ్చే సంవత్సరం ఆ విగ్రహాలు దర్శనమివ్వనున్నాయి.
ఆ దివ్య మందిరంపై నిర్మించే రెండో అంతస్తులో ఎలాంటి దర్శన ఏర్పాట్లు చేయాలన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే సంవత్సరం డిసెంబరు నాటికి మొదటి రెండు అంతస్తులను పూర్తి చేసి రామ దర్బార్‌ దర్శనం కలిగించనున్నారు.

బాలరాముడి రూపునకు మూడు విగ్రహాల పరిశీలన
బాలరాముడి రూపు కోసం మూడు విగ్రహాలను పరిశీలించారు. రాజస్థాన్ , కర్నాటక ప్రాంతాలకు చెందిన శిల్పులు ఆరు నెలల క్రితమే వీటిని సిద్ధం చేసి పెట్టారు. విగ్రహాల తయారీకి కర్నాటక నుంచి మూడు కృష్ణ శిలలు, ఓంకారేశ్వర్‌పూజ్య అవధూత నర్మదానంద్‌జీ మహరాజ్‌ ప్రత్యేకంగా రాజస్థాన్  నుంచి పంపిన తెల్లరాయిని శిల్పులకు అప్పగించారు. ఇందులో నల్లరాయిని బాలరాముడి విగ్రహానికి కేటాయించారు. తయారైన మూడు బాల రాముడి విగ్రహాల్లో మైసూరుకు చెందిన అరుణ్‌ యోగిరాజ్‌ శిల్పి రూపొందించిన విగ్రహాన్ని ఇటీవల ట్రస్టు సభ్యులు ఓటింగ్‌ పద్ధతిలో ఎంపిక చేశారు. ఈ విగ్రహానికే రేపు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది.


మూల విరాట్‌గా కొత్త విగ్రహం...
ఉత్సవమూర్తిగా పాత విగ్రహం
దిగువ అంతస్తులో బాలరాముడు, మొదటి అంతస్తులో పట్టాభి రాముడు దర్శనం ఇవ్వడం ఒక విశేషమైతే, దిగువ అంతస్తులోనే బాలరాముడితో పాటు పురాతన విగ్రహ దర్శనభాగ్యం కూడా భక్తులకు కల్పించనున్నారు. రామజన్మభూమిలో 1947లో రాముడి విగ్రహం ఒకటి వెలుగు చూసింది. దాన్ని గుర్తించిన వెంటనే సమీపంలోనే ఉంచి పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలోని తాత్కాలిక మందిరంలో ఆ విగ్రహమే పూజలందుకుంటోంది.

కొత్త ఆలయంలో ప్రాణప్రతిష్ఠకు కొత్త విగ్రహాన్ని రూపొందించిన తరుణంలో, పాత విగ్రహాన్ని ఏం చేస్తారన్న ప్రశ్నలు ఉద్భవించాయి. ఇటీవలే ట్రస్టు ఆ సందేహాలను నివృత్తి చేసింది. దిగువ అంతస్తులో బాలరాముడి విగ్రహం ముందే ఆ పాత విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించనున్నారు. 30 అడుగుల దూరం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. పాత విగ్రహం చిన్నదిగా ఉన్నందున సరిగ్గా కనిపించదు. అందుకోసమే కొత్త విగ్రహాన్ని రూపొందించారు. ఇన్ని దశాబ్దాలుగా పూజలందుకుంటున్న పాత విగ్రహాన్ని కూడా గర్భాలయంలోనే ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. కొత్త విగ్రహాన్ని మూల విరాట్‌గానూ, పాత విగ్రహాన్ని ఉత్సవమూర్తిగా మారుస్తున్నారు. ప్రత్యేక పూజాదికాల కోసం ఉత్సవ విగ్రహం వివిధ ప్రాంతాలకు తరలుతుందని,  మూల విరాట్‌ గర్భాలయంలోనే స్థిరంగా ఉంటుందని ట్రస్టు స్పష్టం చేసింది.  


అయోధ్యలో సరయూ నదికి హారతి 


లేజర్‌ షో 


జటాయువు కంచు విగ్రహం కూడా...
15 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో జటాయువు కంచు విగ్రహాన్ని కూడా రూపొందిస్తున్నారు. అక్కడి కుబేర్‌టీలాపై ప్రతిష్ఠించే ఈ విగ్రహం మూలమూర్తి వైపు ధ్యానముద్రలో చూస్తూ వినమ్రంగా ఉండేలా దీనిని ప్రఖ్యాత శిల్పి, పద్మభూషణ్‌రామ్‌ సుతార్‌ సిద్ధం చేస్తున్నారు.

దక్షిణ భారతశైలిలో గాలిగోపురం
దక్షిణాది దేవాలయాల మాదిరిగా ద్రవిడ శైలిలో ఉండే రాజగోపురాలు ప్రధానాకర్షణగా నిలవనున్నాయి. అయోధ్య రామజన్మభూమి ప్రధాన ఆలయాన్ని ఉత్తర భారతీయ నాగర శైలిలో నిర్మిస్తున్నారు. అయితే నాగరశైలిలో గాలి గోపురాలకు చోటు లేదు. కానీ రామజన్మభూమి ఆలయ ప్రవేశం వద్ద మాత్రం భారీ గాలిగోపురం నిర్మించాలని నిర్ణయించారు. ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.

రాముడు పుట్టిన చోటనే గర్భగుడి కట్టాలని అదనంగా స్థల సేకరణ
సుప్రీంకోర్టు తీర్పుతో 72 ఎకరాలు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధీనంలోకి వచ్చాయి. అయితే రాముడు జన్మించినట్టుగా చెబుతున్న భాగంలోనే గర్భాలయం నిర్మించాలన్నది ప్రణాళిక. కానీ రాముడు పుట్టినట్టుగా పేర్కొంటున్న ఆ భూమి ఆగ్నేయ మూలలో ఉంది. అది గర్భాలయ నిర్మాణానికి అనుకూలంగా లేదు. దీంతో దాని వెనుకవైపు కొంత భూమిని ప్రైవేట్‌వ్యక్తుల నుంచి ట్రస్టు కొనుగోలు చేసి ఆ ప్రాంగణాన్ని ప్రస్తుతం నిర్మిస్తున్న ఆలయ నమూనాకు వీలుగా సిద్ధం చేసింది.  
ఏఏఏ

ఆలయ పునాదుల్లో నాలుగున్నర లక్షల ఇటుకలు
రామ మందిర నిర్మాణంతో తమ చేయూత ఉండాలన్న సంకల్పంతో దేశంలోని పలు గ్రామాల నుంచి  ప్రజలు ఇటుకలు పంపారు. అలా నాలుగు లక్షల గ్రామాల నుంచి నాలుగున్నర లక్షల ఇటుకలు అయోధ్యకు చేరాయి. అయితే ఆలయాన్ని పూర్తి రాతి కట్టడంగా నిర్మిస్తున్నందున ఇటుకల వాడకం సాధ్యం కాదు. అలా అని మరోచోట ఈ ఇటుకలను వినియోగిస్తే.. భక్తులు అసంతృప్తికి లోనయ్యే అవకాశముంది. దీంతో వాటికి ప్రత్యేకస్థానం దక్కాల్సిందేని భావించిన ట్రస్టు,  వాటిని ఆలయ పునాదుల్లో వినియోగించింది. ఇప్పుడు నాలుగున్నర లక్షల ఇటుకలు పునాది భాగంలో శాశ్వతంగా నిలిచిపోయాయి.

దిగువ అంతస్తులో బాలరాముడు
ఆలయం మూడు అంతస్తులుగా ఉంటుంది. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. భూ ఉపరితలం నుంచి 20 అడుగుల ఎత్తుతో ప్రదక్షిణ పథ (పరిక్రమ్‌) నిర్మించారు. దాని మీద ప్రధాన ఆలయం దిగువ అంతస్తు ఉంటుంది. ఈ దిగువ అంతస్తులోనే బాల రాముడి విగ్రహం ఉంటుంది. రాముడు పుట్టినట్టుగా భావిస్తున్న చోటనే ఈ ఆలయం నిర్మిస్తున్నందున అక్కడే బాలరాముడు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ట్రస్టు నిర్ణయించింది. ఐదేళ్ల వయసులో ఉన్న రాముడి రూపం  51 అంగుళాల విగ్రహంగా భక్తజనానికి దర్శనమివ్వనుంది.

ఎన్నో ప్రత్యేకతలు
రాముడి సుగుణాలు అనేకం..ప్రతిఒక్కోటి విలక్షణమే. అలాంటి రాముడు పుట్టిన చోట నిర్మిస్తున్న మందిర నిర్మాణంలోనూ ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. అందుకే ఈ ఆలయాన్ని నభూతో న భవిష్యతిగా వర్ణిస్తున్నారు. ఆధునిక భారతావనిలో రాతితో నిర్మించిన అతి పెద్ద దేవాలయం కూడా ఇదే. సిమెంటు, స్టీలు, ఇతర అనుసంధాన రసాయనాలు లేకుండా పూర్తిగా రాతితోనే దీనిని నిర్మిస్తున్నారు. ఆలయం, పరిసరాలన్నీ కలుపుకొని 90 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు సంక్రమించినది 72 ఎకరాలు. మిగతా భూమిని ప్రైవేట్‌సంస్థలు, వ్యక్తుల నుంచి ట్రస్టు కొనుగోలు చేసింది. ఇందులో 2.7 ఎకరాల్లో  50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన దేవాలయం రూపుదిద్దుకుంటోంది.

2025 నాటికి మొత్తం ఆలయం సిద్ధం
ప్రస్తుతానికి గర్భాలయంగా ఉండే ప్రధాన ఆలయ నిర్మాణమే జరుగుతోంది. మూడంతస్తులుగా ఉండే ఈ ఆలయంతోపాటు ఆ ప్రాంగణంలో పర్‌కోట (ప్రాకారం) ఆవల మరో ఎనిమిది మందిరాలు కూడా ఉంటాయి. శ్రీరాముడి జీవితంతో అనుబంధం ఉన్న భిన్నవర్గాలకు చెందిన వారి ఆలయాలు నిర్మిస్తారు. వాల్మీకి, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, శబరి, అహల్య, గుహుడు..లాంటి వారితో కూడిన ఎనిమిది గుళ్లుంటాయి. మర్యాద పురుషోత్తముడి సామాజిక దృష్టి కోణానికి నిదర్శనంగా ఇప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఈ ఆలోచన  జరిగిందన్నది ట్రస్టు మాట. అయితే ప్రధాన ఆలయ ప్రాంగణాన్ని 2025 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ట్రస్టు లక్ష్యంగా పెట్టుకుంది.

ఆరంభమైన వేడుకలు
బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఈనెల 16 నుంచే మొదలయ్యాయి. హోమాలు, జపాలు, ఇతర ప్రధాన క్రతువులతోపాటు బాలరాముడి విగ్రహానికి శోభాయాత్ర నిర్వహిస్తారు. తెల్లవారుజామునే సరయూ నదిలో విగ్రహానికి స్నానం నిర్వహించి నేత్రపర్వంగా శోభాయాత్ర ద్వారా పట్టణానికి తరలిస్తారు. అక్కడ అతి పురాతన ఆలయాల సందర్శన తర్వాత  గర్భాలయంలో ప్రాణప్రతిష్ఠకు తరలిస్తారు. అప్పటి వరకు విగ్రహ నేత్రాలను కప్పి ఉంచుతారు. బాలరాముడు అప్పట్లో అయోధ్యలో స్నానపానాదులు చేస్తూ సంచరించిన తరహాలో ఈ వేడుక నిర్వహించనున్నారు.  

వాస్తుశిల్పి ‘సోమ్‌పురా’ సారథ్యంలో నిర్మాణ పనులు
దేవాలయ ఆర్కిటెక్ట్‌గా ప్రఖ్యాత ‘సోమ్‌పురా’ కుటుంబమే వ్యవహరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆ కుటుంబం వందకుపైగా ఆలయాలను రూపొందించింది. ప్రఖ్యాత సోమ్‌నాథ్‌ ఆలయానికి కూడా వాస్తుశిల్పిగా పనిచేసిన ఆ కుటుంబం 15 తరాలుగా ఇదే పనిలో ఉంది. అయోధ్య రామాలయం కోసం చంద్రకాంత్‌ సోమ్‌పురా చీఫ్‌ ఆర్కిటెక్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన విఖ్యాత అక్షర్‌ధామ్‌ను రూపొందించారు. ఆయన ఇద్దరు కుమారులు నిఖిల్‌ సోమ్‌పురా, ఆశిష్‌ సోమ్‌పురాలు ఆర్కిటెక్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు.

► ప్రధాన ఆలయం 235 అడుగుల వెడల్పు, 350 అడుగుల పొడవు, 161 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా చెప్పవచ్చు.
► ఆలయ నిర్మాణం ఆగమశాస్త్రం నాగర విధాన గుర్జర చాళుక్య శైలిలో రూపుదిద్దుకుంటోంది.
     ప్రధాన ఆలయం మూడు అంతస్తుల్లో ఉంటుంది. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఒక్కో అంతస్తులో నృత్య, రంగ, కుడు, కీర్తన, ప్రార్థన పేర్లతో ఐదు మండపాలుంటాయి.
► ప్రధాన ఆలయంలో 366 స్తంభాలుంటాయి. ఒక్కో దానిపై 30 వరకు శిల్పాలు, ఇతర నగిషీలు ఉంటాయి.
► స్తంభాలపై శివుడు, వినాయకుడు, దశావతారాలు, యోగినులు, సరస్వతి ఇతర దేవతా రూపాలను చిత్రీకరించారు.
► గర్భాలయం అష్టభుజి ఆకృతిలో ఉంటుంది.
► దేవాలయాన్ని లేత గులాబీరంగు ఇసుక రాయితో నిర్మించారు. ఇందుకు రాజస్థాన్ లోని భరత్‌పూర్‌ జిల్లా బన్సీపహాడ్‌పూర్‌ క్వారీ నుంచి 5 లక్షల ఘనపుటడుగుల లేత గులాబీ రంగు రాయి, గర్భాలయం కోసం ఇదే రాష్ట్రంలోని మక్రానా నుంచి లక్ష ఘనపుటడుగుల తెలుపురంగు చలవరాతిని తెప్పించారు.
► రామ జన్మభూమికి సంబంధించి 2019 నవంబరులో సుప్రీం కోర్టు తీర్పు రాగా, 2020 ఫిబ్రవరిలో దేవాలయ కమిటీ ఏర్పాటైంది. ఆలయానికి ప్రధాని మోదీ 2020 ఆగస్టు 5న భూమి పూజ చేశారు.
► ఆలయ పనులు మూడు షిఫ్టుల్లో రేయింబవళ్లు కొనసాగిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 3500 మంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు.
► ఎల్‌ అండ్‌ టీ నిర్మాణ సంస్థ కాగా, పనుల పర్యవేక్షణ బాధ్యత టాటా కన్సల్టింగ్‌ ఇంజినీర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చూస్తోంది.
► శిల్పాలను తీర్చిదిద్దేందుకు ఒడిషా నుంచి ఎక్కువమంది శిల్పులు వచ్చారు. సిమెంట్‌ లాంటి బైండింగ్‌ మెటీరియల్‌ వినియోగిస్తున్నారు. ఇందులో రాళ్లు జోడించటం అనేది క్లిష్టమైన ప్రక్రియ, ఈ ప్రక్రియలో విశేష అనుభవం ఉన్న రాజస్థాన్  నిపుణులకు ఆ బాధ్యత అప్పగించారు. కాపర్‌ క్లిప్స్‌ మాత్రమే వాడి రాళ్లను అనుసంధానిస్తున్నారు.
► ఒడిషా, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌ తదితర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సిబ్బంది పనుల్లో పాల్గొంటున్నారు.

ఈ మందిరం భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీక
‘‘రాముడు జన్మించిన చోటే ఆయన దేవాలయం నిర్మితమవుతుందన్న విశ్వాసం పదేళ్ల క్రితం వరకు లేదు. కానీ అది సాధ్యమై ఇప్పుడు ఆ ఆదర్శ పురుషుడి దివ్య దర్శనానికి నోచుకోబోతున్నాం. అందుకే రామజన్మభూమి మందిరం నిర్మించాలన్న ఆకాంక్ష దైవ సంకల్పమని నేను నమ్ముతాను. అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య మందిరం ఓ సాధారణ దేవాలయం కాదు, అది భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీక. అందరూ ఆ అద్భుతాన్ని దర్శించుకోవాలి. దేవుడి ముందు అంతా సమానులే, అందరిపట్లా ఆ రాముడిది సమభావనే. అందుకే ఈ నిర్మాణం సామాజిక సామరస్యాన్ని ప్రతిబింబిస్తుంది. దేశ నలుమూలల ఆలయ నిర్మాణ సంప్రదాయాలను ప్రతిఫలిస్తుంది. దేశంలోని ప్రతి గ్రామ చొరవ అందులో కనిపిస్తుంది. దాదాపు రూ.2 వేల కోట్లతో నిర్మిస్తున్న ఈ ఆలయ ఖర్చులో ప్రభుత్వాలది నయా పైసా లేదు. అంతా భక్తుల విరాళమే. అందుకే మన దేవుడు, మన మందిరం.’’

– నృపేంద్ర మిశ్రా, శ్రీ రామజన్మభూమి దేవాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ . ప్రధానమంత్రి కార్యాలయ మాజీ ముఖ్య కార్యదర్శి

ఆ తలుపుల తయారీలో తెలుగువారు...
ప్రధాన ఆలయానికి తలుపులు అమర్చే అవకాశం హైదరాబాద్‌కు చెందిన అనురాధా టింబర్‌ డిపోకు దక్కింది. డిపో నిర్వాహకుడు శరత్‌ బాబు చదలవాడ గతంలో యాదాద్రి మందిరానికి తలుపు చేయించారు. అయోధ్య రామ మందిరానికి తలుపుల నమూనా కావాలంటూ ట్రస్టు సభ్యుల నుంచి పిలుపు రావటంతో ఆయన టేకుతో దాన్ని సిద్ధం చేయించారు. ఆ పనితనానికి సంతృప్తి చెందిన కమిటీ ఆయనతో చర్చించి తలుపులు సిద్ధం చేసే బాధ్యత అప్పగించింది. మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి తెప్పించిన మేలిమి రకం టేకు చెక్కతో తలుపులు రూపొందిస్తున్నారు.

శరత్‌ బాబు చదలవాడ 

అయోధ్యలోని కరసేవక్‌ పురంలోని కార్యశాలలో ఈ తలుపులను నిపుణులు సిద్ధం చేస్తున్నారు. అక్కడి ఇన్ చార్జ్‌ ఆర్యన్ మిశ్రా ఆధ్వర్యంలో తమిళనాడుకు చెందిన నిపుణులు వాటిని రూపొందిస్తున్నారు. మొత్తం 44 తలుపులకుగాను ప్రస్తుతానికి 18 సిద్ధమయ్యాయి. వీటిని దిగువ అంతస్తులో వినియోగిస్తారు. బాలరాముడు ఉండే గర్భాలయానికి సంబంధించి రెండు జతలు పూర్తి చేసి ఆలయానికి చేర్చారు. 9 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో ఇవి రూపొందాయి. నెమలి పురి విప్పుకున్నట్టు వీటిపై నగిషీలద్దారు. ఇక అంతస్తులోని ఇతర ప్రాంతాల్లో వాడే తలుపులకు  ఏనుగు అర్చిస్తున్నట్టుగా.. పద్మాలు విచ్చుకున్నట్టుగా... ఇలా పలు చెక్కడాలతో అద్భుతంగా రూపొందించారు. వెయ్యేళ్లపాటు వర్థిల్లే దేవాలయానికి తలుపులు సిద్ధం చేసే అవకాశం రావటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు చదలవాడ శరత్‌బాబు ‘సాక్షి’తో చెప్పారు.

అన్నీ ఉచితమే... అందరూ సమానమే!
రామ మందిరం దేశంలోనే ప్రముఖ దేవాలయాల జాబితాలో చేరబోతోంది. ఇలాంటి చోట దర్శనం,  ప్రసాదాలకు రుసుము ఉండటం సహజం. కానీ, భక్తులు సమర్పించిన రూ.వేల కోట్ల విరాళాలతో రూపుదిద్దుకుంటున్న ఈ భవ్య మందిరంలో భక్తులపై దర్శన వేళ అదనంగా రుసుము భారం మోపొద్దని  ట్రస్టు నిర్ణయించింది. ఎంతమంది భక్తులు వచ్చినా ఎలాంటి రుసుమూ లేకుండా దర్శనానికి అవకాశం కల్పించబోతున్నారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరికీ ఒకే తరహాలో దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి దర్శన అనంతరం ఎంతో భక్తిశ్రద్ధలతో స్వీకరించే ప్రసాదం కూడా ఉచితంగా అందించాలని నిర్ణయించారు.
 

60 కిలోల బంగారంతో తాపడం
ఆలయంలోని తలుపులకు బంగారంతో తాపడం చేయించనున్నారు. అన్ని తలుపులకు కలిపి 60 కిలోల బంగారాన్ని వినియోగిస్తున్నట్టు సమాచారం. దిగువ అంతస్తు బాలరాముడి ఆలయ తలుపులకు తాపడం పనులు ప్రారంభించారు. అనంతరం తాపడం కోసం సిద్ధం చేశారు. తలుపులపై ఉన్న నగిషీల తరహాలోనే బంగారు తాపడంపై కూడా సిద్ధం చేస్తున్నారు.

భారీ భూకంపాలను తట్టుకునేలా...
రామమందిర ప్రత్యేకతల్లో పునాది కూడా ఒకటి. 161 అడుగుల ఎత్తుతో నిర్మితమవుతున్న దివ్యభవ్య మందిరానికి 50 అడుగుల లోతుతో పునాది నిర్మించారు. అయోధ్య పట్టణ శివారు నుంచి సరయూ నది ప్రవహిస్తోంది. అయితే 400 ఏళ్ల క్రితం సరయూ ప్రస్తుతం ఆలయం నిర్మిస్తున్న ప్రాంతానికి అతి చేరువగా ప్రవహించేది. దీంతో ఆ ప్రాంత భూగర్భం ఇసుక మేటలతో నిండి ఉంది. భారీ నిర్మాణానికి పునాది పడాలంటే ఆ ఇసుకనంతా తొలగించాలి. ఇందుకోసం ఐఐటీ, ఎన్ ఐటీ నిపుణులు, రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ పరిశోధకులు కలిసి దీనికి ప్రత్యేక పునాది నిర్మాణానికి డిజైన్  చేశారు.

50 అడుగుల లోతు నుంచి ఇసుక, మట్టిని తొలగించి వాటికి రీయింజనీర్‌ ఇసుక, కొన్ని రసాయనాలు, 10 శాతం ఫైన్ సిమెంట్‌ కలిపి పొరలు పారలుగా వేసి వాటిని కాంపాక్ట్‌గా మార్చి 47 పొరలుగా పైవరకు నిర్మించారు. ఆ ఇసుక, మట్టి భాగం పూర్తిగా గట్టిబడి 50 అడుగుల ఏకశిలగా మారింది. దాని మీద రెండున్నర మీటర్ల మందంతో రాఫ్ట్‌ నిర్మించారు. ఆ పైన ఒకటిన్నర మీటరు మందంతో గ్రానైట్‌ రాతిని పరిచి దాని మీద ప్రధాన నిర్మాణం జరిపారు. ఇప్పుడు భూ ఉపరితలం నుంచి ప్రధాన నిర్మాణం 20 అడుగుల ఎత్తులో మొదలవుతుంది. అక్కడకు చేరాలంటే 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.

పునాది డిజైన్  మార్చింది తెలుగు ఇంజినీరింగ్‌ నిపుణుడే..!
అయోధ్య మందిరానికి ప్రస్తుతం ఏర్పాటు చేసిన పునాదికి డిజైన్  చేసింది తెలంగాణకు చెందిన ఇంజినీరింగ్‌ నిపుణుడే కావటం విశేషం. తొలుత ఐఐటీ మద్రాస్‌ నిపుణులు పునాది కోసం సిమెంటు కాంక్రీట్‌ పైల్స్‌ డిజైన్  ఇచ్చారు. ఆలయ ట్రస్టు దానికి సమ్మతించి పనులకు శ్రీకారం చుట్టింది. ఒక్కోటి మీటర్‌ వ్యాసం, 40 మీటర్ల లోతుతో సిమెంట్‌కాంక్రీట్‌పైల్స్‌ను పునాదిలో నిర్మించాలని నిర్ణయించారు. ఇలా 1200 పైల్స్‌ ఏర్పాటు చేసి దాని మీద ప్రధాన నిర్మాణం చేపట్టాలన్నది వారి ఆలోచన. కానీ, సిమెంటు కాంక్రీట్‌పైల్స్‌ వయసు కేవలం వందేళ్లలోపు మాత్రమే ఉంటుందని పేర్కొంటూ, వరంగల్‌ నిట్‌ మాజీ ప్రొఫెసర్‌ పాండురంగారావు ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు.

దాని బదులు కాకతీయులు అనుసరించిన శాండ్‌బాక్స్‌ టెక్నాలజీని వినియోగిస్తే వెయ్యేళ్ల జీవిత కాలం ఉంటుందని రామప్ప, వేయి స్తంభాల దేవాలయాలపై నిర్వహించిన పరిశోధన పత్రాలను జత చేశారు. దీంతో ఆయనకు ట్రస్టు నుంచి పిలుపు వచ్చింది. విశ్వహిందూ పరిషత్‌ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ ఆధ్వర్యంలో పాండురంగారావు తెలంగాణ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ ప్రతినిధులతో పునాది నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ఒక నిపుణుల కమిటీని నియమించారు. నిర్మాణ ప్రాంతం గుండా వందల ఏళ్ల కింద సరయూ నది ప్రవహించటంతో భూమి పొరల్లో ఇసుక మేటలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆ కమిటీ కూడా నాటి పునాది డిజైన్ ను తిరస్కరించింది. తర్వాత 50 అడుగుల మేర మట్టిని తొలగించి రీయింజనీర్డ్‌ ఇసుక, దానికి కొన్ని రసాయనాలు, స్వల్ప మొత్తంలో ఫైన్  సిమెంట్‌ కలిపి పొరలు పొరలుగా వేసి కంప్రెస్‌ చేయాలంటూ సిఫారసు చేసింది. అలా చేస్తేనే పునాది కనీసం వెయ్యేళ్లపాటు ఉంటుందని పేర్కొంది. పాండురంగారావు సూచన మేరకే కొత్త పునాది ప్రణాళిక అమలు చేసి, వెయ్యేళ్లపాటు నిలిచే రీతిలో ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం విశేషం.

మందిర పునాది ప్రాంతాన్ని పరిశీలిస్తున్న నిట్‌ మాజీ ప్రొఫెసర్‌ పాండురంగారావు

వేయేళ్లు ఉండేలా...
అయోధ్య రామాలయం వేయి సంవత్సరాల వరకు పటిష్ఠంగా ఉండేలా నిర్మిస్తున్నారు. ఇది జరగాలంటే పెద్దపెద్ద భూకంపాలను కూడా తట్టుకుని నిలబడే నిర్మాణం అవసరం. ఇందుకోసం రూర్కీలోని సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిపుణులు నిర్మాణ డిజైన్ లో పాలుపంచుకున్నారు. నేపాల్‌నుంచి అయోధ్య వరకు గతంలో సంభవించిన భూకంపాల తీవ్రతను పరిశీలించి వాటికి 50 రెట్లు పెద్ద భూకంపాలను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు.

వరదలను తట్టుకునేలా...
అయోధ్య నగరం మీదుగా సరయూ నది ప్రవాహం గతంలో ఉండేది. ఇప్పుడు నగర శివారు గుండా ప్రవహిస్తోంది. ప్రతి వేయి సంవత్సరాల్లో నదీ ప్రవాహ గమనం మారడం సహజం. భవిష్యత్‌లో ఎప్పుడైనా ఇప్పుడు గుడి నిర్మిస్తున్న ప్రాంతం మీదుగా వరద పోటెత్తినా, పెద్దపెద్ద వరదలు సంభవించినా నిర్మాణానికి ఇబ్బంది లేకుండా ఉండేలా దాని పునాది పైన పీఠం ప్లాన్  చేశారు. ఇందుకు సీఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్తల సిఫారసులను అనుసరించారు.

25 వేల మంది సామర్థ్యంతో త్వరలో బస ఏర్పాట్లు...
ఆలయానికి చేరువలో భక్తులకు వసతి మందిరం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి దీంట్లో 25 వేల మంది వరకూ ఉండొచ్చు. ఈ గదులను ఉచితంగా అందిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారు. లక్షమంది భక్తులకు వసతి ఉండేలా గదులు సిద్ధం చేయాలన్న ఆలోచనలో ట్రస్టు ఉంది. అయితే సొంతంగా ఏర్పాటు చేయాలా, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలా అన్న దానిపై ఆలోచన చేస్తున్నారు.  

ప్రతి శ్రీరామనవమీ ప్రత్యేకమే!
► నవమి నాడు బాలరాముడి నుదుటిపై సూర్య కిరణాలు
► ప్రధాని మోదీ కోరికకు తగ్గట్టుగా నిర్మాణం

అయోధ్య రామమందిరంలో ప్రతి శ్రీరామనవమి ప్రత్యేకంగా నిలవబోతోంది. ఆ రోజు సూర్యోదయ వేళ ఆలయ దిగువ అంతస్తు గర్భాలయంలోని బాల రాముడి విగ్రహ నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఆకాంక్షను ట్రస్టు ముందర ఉంచారు. ఆ మేరకు నిర్మాణం జరుగుతోంది. కిరణాలు దిగువ అంతస్తులోని గర్భాలయంలోకి ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా గర్భాలయం ద్వారం ఎత్తు, విగ్రహ ఎత్తును ఖరారు చేశారు. చాలా విశాలమైన దేవాలయం కావటంతో సహజసిద్ధంగా సూర్యకిరణాలు లోనికి వచ్చే వీలు ఉండదేమోనన్న ఉద్దేశంతో ప్రతిబింబం రూపంలో సూర్యకాంతి లోపలకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

అప్పట్లో రోజుకు 2 వేల మంది.. ఇప్పుడు 50 వేల మంది.. రేపు లక్ష?
అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి కాకముందే భక్తుల తాకిడి పెరిగింది. ఇక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభం కాకమునుపు రోజుకు సగటున 1500 నుంచి 2000 మంది వరకు వచ్చేవారు. ఆలయ పనులు మొదలయ్యాక ఆ సంఖ్య ఒక్కసారిగా పది వేలకు పెరిగింది. ఇప్పుడు నిత్యం 40 వేల నుంచి 50 వేల మంది భక్తులు అయోధ్యకు వస్తున్నారు. జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆ సంఖ్య లక్షకు చేరువవుతుందని అంచనా వేస్తున్నారు.

అయోధ్య రాముడి విరాళాలు రూ.3500 కోట్ల పైమాటే...
ఆలయ నిర్మాణానికి అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రపభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవటం లేదని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇప్పటికే ప్రకటించింది. పూర్తిగా భక్తులు సమర్పించిన విరాళాలతోనే పనులు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా రామభక్తుల నుంచి రూ.3500 కోట్లకు పైగానే విరాళాలు అందినట్టు సమాచారం. వాటి ద్వారా వస్తున్న వడ్డీ మొత్తంతోనే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. భక్తులు ఇప్పటికీ విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. అయోధ్య ఆలయ సమీపంలో ఉన్న కౌంటర్లు, తాత్కాలిక మందిరం వద్ద ఉన్న కౌంటర్లతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆన్ లైన్  ద్వారా భక్తులు విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. ప్రతినెలా రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు అవి సమకూరుతున్నట్టు సమాచారం.


(అయోధ్య నుంచి ‘సాక్షి’ ప్రతినిధి గౌరీభట్ల నరసింహమూర్తి)
ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement