అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సమయంలో మంత్రాలు, స్తోత్రాలతోపాటు భక్తి సంగీతం కూడా భక్తులను తన్మయత్వానికి గురి చేసింది. శంకర్ మహదేవన్, సోను నిగమ్ వంటి
సీనియర్ గాయకులతో పాటు రామ సన్నిధిలో ‘శబరి గీతం’ వినిపించిన బిహార్ గాయని మైథిలీ ఠాకూర్ ప్రత్యేక ప్రశంసలు పొందింది. నరేంద్ర మోడీ ఆమె గురించే ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఆరేళ్ల వయసు నుంచి భక్తి సంగీతాన్ని వినిపిస్తున్న మైథిలీ ఠాకూర్ పరిచయం.
‘శబరీ సవారె రాస్తా ఆయేంగె రామ్‌జీ’...
(శబరి వీధుల్ని అలంకరిస్తోంది రాముని రాక కోసం)...
అని పాడిన మైథిలీ ఠాకూర్ పాటను ప్రత్యేకంగా మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. బాలక్ రామ్ ప్రాణ ప్రతిష్ఠ సమయంలో మైథిలీ ఠాకూర్ ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేయడమే కాదు... ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆలయప్రాంగణంలో రాముని భజనలు కూడా పాడింది. దేశం మొత్తంలో ఇలాంటి అవకాశం పొందిన అతి చిన్న వయసు గాయని మైథిలి. 21 ఏళ్ల వయసులో ఇంత గుర్తింపు పొందడానికి కారణం ఎడతెగని సాధన, సంగీతం పట్ల ఆరాధనే.
బిహార్ అమ్మాయి
మైథిలీ ఠాకూర్‌ది బిహార్‌లోని మధుబని. తండ్రి రమేష్ ఠాకూర్ భజన గాయకుడు. అందువల్ల బాల్యం నుంచి తండ్రితో పాటు భజనలు పాడేది మైథిలి. ఇంట్లో ఏదో ఒక సమయంలో రామ్‌సీతా కీర్తనలు కొనసాగుతుండేవి. మైథిలిని తన వారసురాలిగా చేయాలని తండ్రికి ఉండేది. అందుకుని పదేళ్ల వరకూ స్కూల్‌కే పంపకుండా సంగీతంలో సాధన చేయించాడు. అయితే మైథిలికి గుర్తింపు మాత్రం వెంటనే రాలేదు.
గెలుపూ ఓటమి
మైధిలి భవిష్యత్తు కోసం ఢిల్లీకి మకాం మార్చాడు తండ్రి. ఢిల్లీలోని బాలభవన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో నేరుగా ఆరవ తరగతిలో చేరిన మైథిలి మొదటిసారి స్కూల్ ముఖం చూడటం, అక్కడ ఇంగ్లిష్ రాక అవస్థ పడటం కొనసాగిస్తూనే సంగీతాన్ని సాధన చేసింది. ఢిల్లీలో మైథిలి కచ్చేరీలు చేసినా అందరికీ తెలిసేటంతటి పేరు రాలేదు. ఆ సమయంలోనే అంటే 11 ఏళ్ల వయసులో ‘లిటిల్ చాంప్’, ‘ఇండియన్ ఐడల్ 2’ వంటి రియాలిటీ షోస్‌కు వెళ్లి ఫెయిల్ అయ్యి తిరిగి వచ్చింది మైథిలి.
దశ తిరిగింది
2017లో కలర్స్ టీవీలో ‘రైజింగ్ స్టార్’ అనే సింగింగ్ రియాలిటీ షో మైథిలి దశ తిప్పింది. ఆ షోలో మైథిలి రన్నర్ అప్‌గా నిలిచింది. ముంబైలో ఈ షో చేసి తిరిగి వచ్చాక ఢిల్లీ నుంచే తాను లోకానికి తెలియానుకుంది. వెంటనే సోషల్ మీడియాలో తన పాటలను పోస్ట్ చేయడం మొదలెట్టింది. మైథిలికి ఇద్దరు తమ్ముళ్లు–రిషబ్, అయాచి ఉన్నారు. వారిద్దరు తబలా, డోలక్ వాయిస్తారు. మైథిలి హార్మోనియం వాయిస్తుంది.
వీరు ముగ్గురు కలసి పాటల వీడియోలు రిలీజ్ చేయడం మొదలెట్టారు. పెద్ద హిట్ అయ్యాయి. సినిమా పాటలే కాకుండా బిహార్‌లోని జానపద సంగీతాన్ని, పంజాబీ, గుజరాతీ, కేసరియా, బజ్జిక వంటి సంగీత ధోరణులను వీడియోలుగా రిలీజ్ చేసింది మైథిలి. అంతేకాదు భజన సంగీతాన్ని కొనసాగించింది. ఇప్పుడు ఆమెకు యూట్యూబ్‌లో 20 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. ఇన్‌స్టాలో, ఫేస్‌బుక్‌లో లక్షల ఫాలోయెర్లు ఉన్నారు. ఆ ప్రఖ్యాతి మైథిలిని రాముని పాదాల వరకూ చేర్చింది.
Comments
Please login to add a commentAdd a comment