నెలల పసికందు. తల్లి ఆస్పత్రిలో..బిడ్డ పోలీసు వొడిలో. బిహార్‌కు చెందిన ఒక కూలి మనిషి కేరళలో హాస్పిటల్ పాలైంది. ఆలనా పాలనా చూసేవారులేక బిడ్డ పోలీస్ స్టేషన్‌కు చేరింది.
వెక్కి వెక్కి ఏడుస్తున్న పసిగుడ్డును చూసి ఒక పోలీసు గుండె ఆగలేదు. వెంటనే పాలిచ్చింది. ఈ వీడియో చూసినవారు అమ్మ ఎక్కడైనా అమ్మే అంటున్నారు.
ఖాకీ యూనిఫామ్ వేసుకున్న మాత్రాన తల్లి గుండె తల్లి గుండె కాకుండా పోతుందా? ఏ తల్లి మనసైనా తన బిడ్డను ఒకలా మరొకరి బిడ్డను ఒకలా చూస్తుందా? ప్రాణం పోసే స్వభావం కదా తల్లిది.
ఎర్నాకుళానికి పట్నా నుంచి వలస వచ్చిన ఒక కుటుంబంలో తల్లికి గుండె జబ్బు రావడంతో ఐసియులో చేరింది. అప్పటికే ఆమె భర్త ఏదో కారణాన జైల్లో ఉన్నాడు. ఆమెకు నలుగురు పిల్లలు. ఆఖరుది నాలుగు నెలల పాప. హాస్పిటల్ వాళ్లు దిక్కులేని ఆమె పిల్లల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి స్టేషన్‌కు తీసుకొచ్చారు.
పసిపాప ఏడ్వడం మొదలెట్టింది. ఆర్య అనే పోలీసు ఆఫీసర్ మనసు ఊరికే ఉండలేకపోయింది. ఆమెకు కూడా 9 నెలల పసిపాప ఉంది. అందుకే చటుక్కున పసిదాన్ని ఒడిలోకి తీసుకొని పాలు ఇచ్చింది. ఊరుకో బెట్టింది. పై అధికారులు ఇందుకు అనుమతించారు. కొచ్చి పోలీసులు ఈ వీడియోను ఫేస్‌బుక్ పేజీలో లోడ్ చేశారు. సాటి మహిళా పోలీసులే కాదు నెటిజన్లు కూడా ఆర్యను మెచ్చుకున్నారు.
ఆ బిహార్ మహిళ పూర్తిగా కోలుకునే వరకు పిల్లలను స్టేట్ హోమ్‌కు తరలించి అక్కడ ఉంచుతామని అధికారులు తెలిపారు. పాలిచ్చిన బంధంతో ఆర్య ఆ పసిగుడ్డును హోమ్‌కు వెళ్లి చూడకుండా ఉంటుందా?
Comments
Please login to add a commentAdd a comment