women police officer
-
Police Officer breastfeeds: అమ్మ ఎక్కడైనా అమ్మే
నెలల పసికందు. తల్లి ఆస్పత్రిలో..బిడ్డ పోలీసు వొడిలో. బిహార్‌కు చెందిన ఒక కూలి మనిషి కేరళలో హాస్పిటల్ పాలైంది. ఆలనా పాలనా చూసేవారులేక బిడ్డ పోలీస్ స్టేషన్‌కు చేరింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న పసిగుడ్డును చూసి ఒక పోలీసు గుండె ఆగలేదు. వెంటనే పాలిచ్చింది. ఈ వీడియో చూసినవారు అమ్మ ఎక్కడైనా అమ్మే అంటున్నారు. ఖాకీ యూనిఫామ్ వేసుకున్న మాత్రాన తల్లి గుండె తల్లి గుండె కాకుండా పోతుందా? ఏ తల్లి మనసైనా తన బిడ్డను ఒకలా మరొకరి బిడ్డను ఒకలా చూస్తుందా? ప్రాణం పోసే స్వభావం కదా తల్లిది. ఎర్నాకుళానికి పట్నా నుంచి వలస వచ్చిన ఒక కుటుంబంలో తల్లికి గుండె జబ్బు రావడంతో ఐసియులో చేరింది. అప్పటికే ఆమె భర్త ఏదో కారణాన జైల్లో ఉన్నాడు. ఆమెకు నలుగురు పిల్లలు. ఆఖరుది నాలుగు నెలల పాప. హాస్పిటల్ వాళ్లు దిక్కులేని ఆమె పిల్లల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి స్టేషన్‌కు తీసుకొచ్చారు. పసిపాప ఏడ్వడం మొదలెట్టింది. ఆర్య అనే పోలీసు ఆఫీసర్ మనసు ఊరికే ఉండలేకపోయింది. ఆమెకు కూడా 9 నెలల పసిపాప ఉంది. అందుకే చటుక్కున పసిదాన్ని ఒడిలోకి తీసుకొని పాలు ఇచ్చింది. ఊరుకో బెట్టింది. పై అధికారులు ఇందుకు అనుమతించారు. కొచ్చి పోలీసులు ఈ వీడియోను ఫేస్బుక్ పేజీలో లోడ్ చేశారు. సాటి మహిళా పోలీసులే కాదు నెటిజన్లు కూడా ఆర్యను మెచ్చుకున్నారు. ఆ బిహార్ మహిళ పూర్తిగా కోలుకునే వరకు పిల్లలను స్టేట్ హోమ్‌కు తరలించి అక్కడ ఉంచుతామని అధికారులు తెలిపారు. పాలిచ్చిన బంధంతో ఆర్య ఆ పసిగుడ్డును హోమ్‌కు వెళ్లి చూడకుండా ఉంటుందా? -
మహిళా అధికారులు.. వరదలకు ఎదురు నిలిచి ధీరత్వం ప్రదర్శించారు
పంజాబ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు మహిళా ఆఫీసర్ల ధైర్యగాధలు మార్మోగుతున్నాయి. ఇటీవలి పెను వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడటంలో మహిళా కలెక్టర్లు, ఎస్పిలు రేయింబవళ్లు కష్టపడి ధీరత్వాన్ని ప్రదర్శించారు. చంటి పిల్లల్ని ఇళ్లల్లో వదిలి ప్రజల కోసం రోజుల తరబడి పని చేసిన ఈ ఆఫీసర్ల పరిచయం... ఉత్తర భారతాన్ని వానలు, వరదలు చుట్టుముట్టాయి. పంజాబ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకూ కుంభవృష్టి ముంచెత్తింది. నదులు వెర్రెత్తి ఫ్రవహించాయి. కొండ చరియలు విరిగి పడ్డాయి. గిరి వృక్షాలు కూకటివేళ్లతో సహా పెకలించుకుని వరదనీటిలో అడ్డొచ్చినవాటిని ధ్వంసం చేసుకుంటూ ముందుకు సాగాయి. కార్లు అగ్గిపెట్టెల్లా చెల్లాచెదురయ్యాయి. ప్రాణాలకు ప్రమాదం వచ్చి ఏర్పడింది. ఇలాంటి సమయాల్లో బయటకు అడుగు పెట్టడమే కష్టం. కాని ఈ సందర్భాలను సమర్థంగా ఎదుర్కొని ప్రశంసలు పొందారు మహిళా అధికారులు. ప్రకృతి విసిరే సవాళ్లకు తాము జవాబు చెప్పగలమని నిరూపించారు. సహాయక బృందాలను సమాయత్త పరచడం, లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించడం, వరదల్లో చిక్కుకున్నవారిని సురక్షితంగా తరలించడం ఈ పనుల్లో స్వయంగా పాల్గొంటూ రేయింబవళ్లు పని చేశారు. అందుకే వారిని జనం మెచ్చుకుంటున్నారు. కృతజ్ఞతలు చెబుతున్నారు. పాటియాలా కలెక్టర్ ఉత్తర భారతానికి పెను వర్షగండం ఉందని వార్తలొచ్చాక ఆ గండం పంజాబ్‌లో పాటియాలా జిల్లాకు కూడా వచ్చింది. జూలై 9, 10 తేదీల్లో పాటియాలా జిల్లా వరదల్లో చిక్కుకుంది. ఆ జిల్లా కలెక్టర్ సాక్షి సహానె వెంటనే రంగంలో దిగింది. ఆమెకు మూడేళ్ల కుమార్తె ఉంది. ఆ కుమార్తె బాగోగులు తన తల్లిదండ్రులకు అప్పజెప్పి దాదాపు 7 రోజులు ఇంటికే వెళ్లకుండా జిల్లా అంతటా తిరుగుతూ ప్రజలను కాపాడింది సాక్షి సహానె. ముఖ్యంగా ఎగువన ఉన్న మొహాలీ జిల్లా నుంచి వరద నీరు పాటియాలాలోని సట్లజ్ యమున లింక్ కెనాల్‌కి చేరడంతో ఒక్కసారిగా వరద చండీగడ్–పాటియాలా హైవేపై ఉన్న రాజ్‌పుర ప్రాంతానికి వచ్చేసింది. అక్కడే చిత్కారా యూనివర్సిటీ, నీలమ్ హాస్పిటల్ ఉన్నాయి. రెండూ వరదలో చిక్కుకున్నాయి. ‘నీలమ్ హాస్పిటల్లో ఉన్న అందరు పేషెంట్లను, 14 మంది ఐసియు పేషెంట్లను విజయవంతంగా తరలించ గలిగాం’ అని సహానె తెలిపింది. అలాగే చిత్కారా యూనివర్సిటీలో విద్యార్థులందరూ బయటకు రాలేనంతగా వరద నీటిలో చిక్కుకున్నారు. సహానె స్వయంగా యూనివర్సిటీ దగ్గరకు వెళ్లి ఆర్మీ, ఎన్డిఆర్ఎఫ్ దళాల సహాయంతో ఆ విద్యార్థులను బయటకు తరలించారు. ‘సులూర్ అనే గ్రామంలో వరద నీటిలో చిక్కుకుని ఆహారం కోసం జనం అల్లాడుతున్నారని నాకు అర్ధరాత్రి ఫోన్ వచ్చింది. వెంటనే ఆహారం తీసుకుని ఆ వానలో వరదలో బయలుదేరాను. కారులో కూచుని ఉంటే వరద నీరు నా అద్దాల వరకూ చేరుకుంది. భయమూ తెగింపు కలిగాయి. అలాగే ముందుకు వెళ్లి ఆహారం అందించగలిగాను’ అంది సాక్షి సహానె. 2014 ఐ.ఏ.ఎస్ బ్యాచ్‌కు చెందిన సహానె తన చొరవ, చురుకుదనంతో పాటియాలా జిల్లా ప్రజల అభిమానం గెలుచుకుంది. కుల్లు ఎస్.పి. హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లు జిల్లా ఎస్.పి 28 సంవత్సరాల సాక్షి వర్మను అందరూ ‘లేడీ సింగం’ అంటారు. సిమ్లా జిల్లాలో ఆమె పని చేసినప్పుడు బ్రౌన్‌షుగర్ సరఫరా చేసే ముఠాలను పట్టుకుంది. అలాగే పేరు మోసిన దొంగలను జైలు పాలు చేసింది. స్త్రీల రక్షణ కోసం ‘గుడియా హెల్ప్‌లైన్’, ‘శక్తి బటన్’, ‘హోషియార్ సింగ్’ అనే హెల్ప్లైన్లు ప్రారంభించింది. దాంతో జనం ఆదరణ పొందింది. కుల్లు ఎస్.పిగా చార్జ్ తీసుకున్నాక వచ్చిన తీవ్ర వరదలను సాక్షి వర్మ సమర్థంగా ఎదుర్కొంది. ‘ఈ వరదల్లో నాకు ఎదురైన పెద్ద సవాలు ఏమిటంటే మా జిల్లాలో ఉన్న పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్స్ మనాలి కావచ్చు, తీర్థన్ కావచ్చు... వీటన్నింటితో కమ్యునికేషన్ కోల్పోవడం. మొబైల్స్ పని చేయలేదు. మా పోలీసు శాఖ వైర్లెస్ ఫోన్లు కొన్ని చోట్ల మాత్రమే పని చేశాయి. మిగిలిన ప్రాంతాలకు శాటిలైట్ ఫోన్లు పంపి అక్కడి నుంచి సమాచారం తెప్పించాను. కాని శాటిలైట్ ఫోన్లు చేర్చడం కూడా పెద్ద సవాలైంది. అలాగే రోడ్లు ధ్వంసం కావడం వల్ల సహాయక బృందాలు చేరలేకపోయాయి. అయినా సరే మేమందరం సమర్థంగా సహాయక చర్యలు చేపట్టాము. పని చేసేటప్పుడు నేను స్త్రీనా, పురుషుడినా అనేది నాకు గుర్తు ఉండదు. ఒక ఆఫీసర్‌గా ఏం చేయగలను అనేదే ఆలోచిస్తాను’ అని తెలిపింది సాక్షి వర్మ– 2014 ఐపిఎస్ బ్యాచ్ ఆఫీసర్. మండి ఎస్.పి. కుల్లు జిల్లా పక్కనే ఉంటుంది మండి జిల్లా. రెంటికీ రెండు గంటల దూరం. ఈ జిల్లా కూడా తీవ్రంగా వరద బారిన పడింది. వంతెనలు, ఇళ్లు, రోడ్లు పూర్తిగా మునిగిపోయాయి. చివరకు పోలీస్ స్టేషన్లకు బిఎస్ఎఫ్ దళాలకు కూడా కమ్యూనికేషన్ లేదు. ఇలాంటి సమయంలో గొప్ప సమర్థతతో పని చేసింది మండి ఎస్.పి సౌమ్య సాంబశివన్. 2010 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన ఈ ఆఫీసర్ బియాస్ నది ఒడ్డున ఉన్న స్లమ్స్ చిక్కుకున్న 80 మందిని కాపాడగలగడంతో మొదటి ప్రశంస పొందింది. టూరిస్ట్ ప్రాంతం కాబట్టి కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అక్కడికి వచ్చిన టూరిస్ట్‌లు ఎలా ఉన్నారంటూ ఫోన్ల వరద మొదలైంది. టూరిస్ట్‌లను సురక్షితంగా ఉంచడం సౌమ్యకు ఎదురైన పెద్ద సవాలు. ‘వారందరిని వెతికి స్థానిక సత్రాల్లో, గురుద్వారాల్లో చేర్చడం చాలా వొత్తిడి కలిగించింది. అలాగే ఇళ్లు విడిచి రావడానికి చాలామంది ఇష్టపడలేదు. కష్టపడి సంపాదించుకున్న వస్తువులను వదిలి రావడం ఎవరికైనా బాధే. వారు అలాగే ఉంటే చనిపోతారు. ఎంతో ఒప్పించి వారిని ఖాళీ చేయించాను’ అందామె. సౌమ్య సాంబశివన్ కింద మొత్తం 1200 మంది సహాయక సిబ్బంది పని చేసి ఈ ఉత్పాతాన్ని ఎదుర్కొన్నారు. -
ఆత్మవిశ్వాసంలో అతివలే మేటి
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ సర్వీసెస్‌లోకి వచ్చే మహిళా అధికారుల సంఖ్య ఏటా పెరుగుతుండటం శుభపరిణామం అని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ) డైరెక్టర్ ఏఎస్ రాజన్ అన్నారు. ఆత్మవిశ్వాసంలో పురుషుల కంటే అతివలే మేటి అని చెప్పారు. ప్రతి బ్యాచ్‌లోనూ 20 మందికిపైగా మహిళా ఐపీఎస్‌లు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. శిక్షణలోనూ పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా ఔట్‌డోర్‌లో సైతం తాము మేటి అని నిరూపిస్తున్నారన్నారు. ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న 2021 బ్యాచ్‌లోనూ దీక్ష అనే మహిళా ఐపీఎస్ బెస్ట్ ఔట్‌డోర్ ప్రొబేషనరీగా ఐపీఎస్ అసోసియేషన్ గౌరవ కరవాలాన్ని పొందారని, ఎన్పీఏ చరిత్రలో రెండోసారి ఈ ఘనత దక్కించుకున్న అధికారిణిగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. ఎన్పీఏలో శిక్షణ పొందిన 2021 బ్యాచ్ ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ శనివారం జరగనుంది. ఈ సందర్భంగా.. దేశవ్యాప్తంగా శాంతిభద్రతల నిర్వహణలో అత్యంత కీలకమైన ఐపీఎస్ అధికారులను తీర్చిదిద్దే ఎన్పీఏలో ఇచ్చే శిక్షణ, మారుతున్న పరిస్థితులకు తగిన విధంగా శిక్షణలో తెచ్చిన మార్పులు తదితర అంశాలపై రాజన్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అకాడమీలోకి వచ్చాక అందరూ సమానమే.. ఐపీఎస్కుకు ఎంపికయ్యే వారిలో కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్‌ల పిల్లల వరకు.. స్థానిక విద్యా సంస్థలు మొదలు కాన్వెంట్లలో చదివిన వారు..అప్పుడే చదువులు పూర్తి చేసుకున్న వారి నుంచి విదేశాల్లో లక్షల జీతాల కొలువులు వదిలి వచ్చే వారి వరకు విభిన్న నేపథ్యాల వారు ఉంటారు. అది ఎన్‌పీఏలోకి రాకముందు వరకే. ఒకసారి అకాడమీలో అడుగుపెట్టిన తర్వాత వారంతా సమానమే. మొదటి రెండు వారాలు ఇదే అంశంపై దృష్టి పెడతాం. ట్రైనీలను బృందాలుగా ఏర్పాటు చేసి వారిలో నాయకత్వ లక్షణాలు పెంచేలా చూస్తాం. ఐపీఎస్ అధికారిగా తనతోపాటు వందల మందిని కలుపుకొని నిత్యం పనిచేయాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా వారిని తీర్చిదిద్దుతాం. నైతిక విలువలు పెంచేలా శిక్షణ కొత్తగా విధుల్లోకి వచ్చే ఐపీఎస్ అధికారుల వైఖరి సరిగా ఉండడం లేదన్న విమర్శల నేపథ్యంలో 8 రాష్ట్రాల్లో 6 విధాలుగా అభిప్రాయాలు సేకరించాం. ఐపీఎస్‌ల వైఖరి, శిక్షణలో ఎలాంటి మార్పులు చేయాలన్న అంశాలపై డీఎస్పీ, సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ ర్యాంకు వరకు ఒక గ్రూప్, డీఐజీ నుంచి డీజీపీ ర్యాంకు వరకు ఒక గ్రూప్, రెవెన్యూలో వివిధ స్థాయిల అధికారులు ఒక గ్రూప్, ఎన్జీఓలు.. మీడియా ఒక గ్రూప్, సమాజంలో ప్రభావిత స్థానాల్లో ఉన్న వారు ఒక గ్రూప్, ప్రజలు ఒక గ్రూప్.. ఇలా వారి అభిప్రాయాలు తీసుకుని వాటిని క్రోడీకరించి బలాలు, బలహీనతలు గుర్తించాం. బాధితులతో ఎలా వ్యవహరించాలన్న అంశంతో పాటు ఐపీఎస్ శిక్షణ నైతిక విలువలు పెంచేలా కరికులంలో చాలా మార్పులు చేశాం. శిక్షణలోనూ స్త్రీ, పురుష తేడా లేదు అకాడమీలో శిక్షణలో ప్రవేశించిన తర్వాత మహిళలు, పురుషులు అనే తేడా కూడా ఏ అంశంలోనూ ఉండదు. శిక్షణలోనూ మినహాయింపులు ఉండవు. వారంతా కూడా సుశిక్షితులైన పోలీస్ అధికారులుగా తయారు కావాల్సిందే. వాస్తవం చెప్పాలంటే ఆత్మవిశ్వాసంలో పురుషుల కంటే మహిళలే మేటి. ప్రతి బ్యాచ్‌లో మేం ఔట్‌డోర్ శిక్షణలో మహిళలకు ప్రత్యేకంగా ట్రోఫీ కేటాయిస్తాం. ఆ ట్రోఫీయే ఈసారి దీక్షకు దక్కింది. 2019లోనూ రంజితశర్మ బెస్ట్ ఔట్‌డోర్ ప్రొబేషనరీగా నిలిచారు. ఔట్‌డోర్ శిక్షణలో వాళ్లు పురుషులను వెనక్కి నెట్టి బెస్ట్‌గా నిలిచారు. చూస్తుంటే ఇకపై బెస్ట్ లేడీ ప్రొబేషనరీ ఔట్‌డోర్ ట్రైనింగ్ మాదిరిగా బెస్ట్ జెంటిల్మెన్ ప్రొబేషనరీ ఔట్‌డోర్ ట్రైనింగ్ అని పెట్టాల్సి వచ్చేట్టుంది.. (నవ్వుతూ..). ‘సైబర్’ సవాళ్లను ఎదుర్కొనేలా ప్రత్యేక శిక్షణ సైబర్ నేరాలనేవి భవిష్యత్తులో మనం ఎదుర్కొనబోయే అతిపెద్ద ముప్పు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు యువ ఐపీఎస్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. ఇందుకోసం ఎన్పీఏలో ప్రత్యేకంగా నేషనల్ డిజిటల్ క్రైం రిసోర్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (ఎన్డీసీఆర్టీసీ)ని ఏర్పాటు చేశాం. సరికొత్త సైబర్ సవాళ్లను ఎదుర్కొనేలా ఇక్కడ శిక్షణ ఇస్తాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 10 వేల మంది వివిధ ర్యాంకుల పోలీస్ అధికారులకు ఎన్డీసీఆర్టీసీలో సైబర్ క్రైం దర్యాప్తు, నియంత్రణలో శిక్షణ ఇచ్చాం. ప్రొబేషనరీ ఐపీఎస్‌లతోపాటు సీనియర్ ఐపీఎస్‌లకు కూడా వివిధ దశల్లో ఇక్కడ శిక్షణలు ఇస్తుంటాం. మన పోలీసులతో పాటు నేపాల్, భూటాన్, మాల్దీవులు, మారిషస్ దేశాల పోలీస్ అధికారులకు సైతం శిక్షణ ఇస్తాం. -
Arti Singh Tanwar: పోలీస్ వీడియో పాఠాలు
మోసం, లైంగిక దోపిడి నుంచి అమ్మాయిలను రక్షించే లేడీ సబ్ ఇన్స్పెక్టర్గా ఆర్తిసింగ్ తన్వర్కి మంచి పేరుంది. దీంతోపాటు సైబర్ నేరగాళ్ల నుంచి ఎంత అలెర్ట్‌గా ఉండాలో సోషల్ మీడియా ద్వారా అవగాహన కలిగిస్తుంటుంది. చట్టం గురించి వీడియో పాఠాలు చెబుతుంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు, మోటివేషనల్ స్పీచ్‌లు ఇస్తుంటుంది. ఆమె గైడ్లైన్స్కి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. రాజస్థాన్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్తిసింగ్ తన అభిరుచితో బాధ్యత గల సామాజికవేత్తగానూ ప్రశంసలు అందుకుంటోంది. ఈ లేడీ సబ్ ఇన్స్పెక్టర్ తన విధుల ద్వారానే కాదు రోజూ ఇచ్చే స్ఫూర్తిమంతమైన స్పీచ్‌లు, ఎలాంటి మోసం జరగకుండా ఇచ్చే సైబర్ గైడెన్స్‌తో ప్రతిరోజూ చర్చలో ఉంటుంది. ‘నా అభిరుచిని వృత్తితో జోడీ కట్టించాను. ఫలితం ఎంతోమందికి చేరువయ్యాను’ అంటారు ఈ లేడీ పోలీస్. ► వృత్తి... ప్రవృత్తితో కలిసి.. ఆర్తిసింగ్ కుటుంబ సభ్యులు, బంధువుల్లో చాలామంది పోలీసులుగా ఉన్నారు. వారిలాగే ఆర్తి కూడా పోలీస్ వృత్తినే ఎంచుకుంది. 2012లో రాజస్థాన్ పోలీస్ అకాడమీలో చేరి 2014లో సబ్ ఇన్ స్పెక్టర్‌గా విధులను చేపట్టింది. ‘నేను సోషల్ మీడియా ఫ్రెండ్లీగా ఉంటాను. చేస్తున్న పనుల ద్వారానే నలుగురిలో అవగాహన కలిగిస్తే చాలనుకున్నాను. మహిళల గళం వినిపించాల్సిన చోటు, సైబర్ అవగాహన, సందేశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఫాలోవర్స్ ఎప్పుడు ఇంతగా పెరిగిపోయారో తెలియనే లేదు’ అనేస్తారు ఆమె నవ్వుతూ. ► సోషల్ మీడియా సెల్... పోలీస్ అకాడమీలో శిక్షణ ఇవ్వడంతోపాటు సోషల్ మీడియా సెల్ కూడా నిర్వహిస్తోంది ఈ సబ్ ఇన్స్పెక్టర్. ‘ఇటీవల మా సిబ్బందికి పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఫొటోతో ఓ మెసేజ్ వచ్చింది. గిఫ్ట్ కార్డుల సాకుతో ఎవరో నకిలీ నంబర్ తో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. వెంటనే అందరినీ అప్రమత్తం చేశాను. ఇలాగే.. షాపింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, మెసేజ్‌లలో వచ్చే షార్ట్ లింక్స్... వంటి ఆన్లైన్ మోసాలు ప్రతిరోజూ నమోదవుతున్నాయి. ఈ మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అవగాహన తప్పనిసరి అనుకున్నాను. లైవ్ ఇంటరాక్షన్ ద్వారా మోసాన్ని నివారించడానికి సూచనలు ఇస్తుంటాను. బాధితులు తమ అనుభవాలను కామెంట్స్‌లో లేదా డైరెక్ట్ మెసేజ్ ద్వారా తెలియజేస్తారు. దీంతో వారికి తక్షణ సహాయం అందివ్వడానికి ప్రయత్నిస్తుంటాం. మోసం, లైంగిక దోపిడీని ఎలా నివారించాలో సూచించే వీడియోలను అప్లోడ్ చేస్తుంటాను’ అని వివరిస్తారు ఆమె. ► యువతకు వీడియో పాఠాలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు, టైమ్ టేబుల్ తయారు చేసుకోవడం, రోజువారీ సిలబస్‌ను ఎలా సిద్ధం చేసుకోవాలి, ఏ సబ్జెక్టులను ఎప్పుడు, ఎలా చదవాలి, కంటెంట్ సులభంగా ఎలా గుర్తుంచుకోవచ్చు... ఇలాంటి వీడియోల కోసం యువత ఎదురు చూస్తుంటుంది. ► కొత్త టెక్నాలజీ పరిచయం సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వీడియోల ద్వారా షేర్ చేస్తుంటుంది ఆర్తి. మొబైల్ హ్యాక్ అయితే ఏం చేయాలి? ఇంట్లోని స్మార్ట్ టీవీ హ్యాక్ అయితే సమస్యను ఎలా పరిష్కరించాలి? సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కొత్త ఫీచర్లు ఏమిటి?.. వీటికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటుంది ఆర్తి. ► ఖాకీ యూనిఫాంలో.. ‘నా వీడియోలలో చాలా వరకు నేను ఖాకీ యూనిఫాంలోనే కనిపిస్తాను. ఆఫీసులో పని చేస్తున్నప్పుడు చట్టపరమైన సమాచారాన్ని చిన్న చిన్న వీడియోలు చేసి పోస్ట్ చేస్తాను. కొన్నిసార్లు ఇంటి నుంచి ఆఫీసుకు లేదా ఆఫీసుకు నుంచి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు కారులో వీడియోలు షూట్ చేసి అప్లోడ్ చేస్తుంటాను. పోస్ట్ చేసిన గంటల్లోనే వేలల్లో వ్యూస్ వస్తాయి. దీనిని బట్టి ప్రజల్లో చట్టం, న్యాయం, మోసాలకు సంబంధించిన అవగాహన ఎంత అవసరం ఉందో గ్రహించవచ్చు’ అని చెప్పే ఆర్తిసింగ్ను ‘మా మంచి పోలీస్’ అంటూ ప్రశంసిస్తున్నారు ఆమె ఫాలోవర్స్. ప్రతిరోజూ అవగాహన రీల్ ప్రతిరోజూ లక్షలాది మంది ఫాలోవర్లు ఆర్తి గైడెన్స్ రీల్స్ కోసం ఎదురు చూస్తుంటారు. వాటిలో చట్టం, న్యాయానికి సంబంధించి అవగాహన కంటెంట్‌కే ప్రాధాన్యమిస్తుంటుంది. ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్‌ల ద్వారా నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు ఆర్తి సూచనలను ఫాలో అవుతున్నారు. -
న్యూయార్క్ సిటీకి లేడీ బాస్
న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్! ఎన్.వై.పి.డి. నూటా డెబ్భై ఐదేళ్ల చరిత్ర. యాభై ఐదు వేల మంది సిబ్బంది. నలభై ఐదు వేల కోట్ల రూ. బడ్జెట్. పది వేల పోలీస్ కార్లు. పదకొండు పోలీస్ బోట్లు. ఎనిమిది పోలీస్ హెలీకాప్టర్లు. నలభై ఐదు గుర్రాలు. ముప్పై ఐదు జాగిలాలు! కొత్తగా ఇప్పుడు.. హ్వానీటా హోమ్! ఎన్.వై.పి.డి.కి తొలి మహిళా చీఫ్. హ్వానీటా హోమ్స్ ఎన్.వై.పి.డి.కి చీఫ్ అవగానే న్యూయార్క్ సిటీ మేయర్ బిల్ డే బ్లాసియో.. ‘హ్వానీటా ఒక చరిత్రాత్మక ఎంపిక మాత్రమే కాదు. తగిన ఎంపిక కూడా’ అని మొన్న 29న ట్వీట్ పెట్టారు. ఇప్పటికి చార్జి తీసుకునే ఉంటారు హ్వానీటా. 175 ఏళ్ల చరిత్ర కలిగిన న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆమె తొలి మహిళా చీఫ్. అంతేకాదు. తొలి ఆఫ్రికన్–అమెరికన్ మహిళా చీఫ్. ‘చీఫ్ ఆఫ్ పెట్రోల్’ ఆమె ఈ కొత్త హోదా. హ్వానీటా ముప్పై ఏళ్లకు పైగా ఎన్.వై.పి.డి.లో ఉన్నారు. తొలి పోస్టింగ్ 1987లో ‘పెట్రోల్ ఆఫీసర్’గా. తర్వాత సార్జెంట్, లెఫ్ట్‌నెంట్, కెప్టెన్, డిప్యూటీ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, డిప్యూటీ చీఫ్. 2016లో అసిస్టెంట్ పోలీస్ చీఫ్‌గా ‘బరో కమాండర్’! బరో అంటే సిటీ. ఇప్పుడిక.. చీఫ్ ఆఫ్ పెట్రోల్. న్యూయార్క్ సిటీలో క్రైమ్‌ని తగ్గించడం ఆమె ముఖ్య విధి. అందుకోసం ఎన్.వై.పి.డి.కి ఎన్ని బలగాలు ఉన్నాయో, అన్నీ ఆమె అధీనంలోకి వచ్చేస్తాయి. ముప్పై ఐదు జాగిలాలు సహా. హ్వానీటా కుటుంబం నుంచే 16 మంది న్యూయార్క్ సిటీ పోలీసులు ఉన్నారు! ప్రజల రక్షణకు అంకితమైన పోలీస్ కుటుంబం. అమెరికాలోనే అత్యంత శక్తిమంతమైన పోలీస్ డిపార్ట్మెంట్ను హ్వానీటా ఇప్పుడు నడిపించబోతున్నారు. తర్వాతి పొజిషన్ పోలీస్ కమిషనర్. ఇప్పటి వరకు ఉన్న ‘పెట్రోల్ చీఫ్’ ఫాటో పిచార్డో ఈ నెలలో తన పదవీ విరమణ ప్రకటించడంతో ఆ స్థానంలోకి తగిన వ్యక్తిగా డిపార్ట్మెంట్ హ్వానీటాను ఎంపిక చేసింది. ఆమె ఆ స్థానంలోకి రాగానే.. ‘‘ఎ కంప్లీట్ ప్యాకేజ్’ అని ఇప్పుడున్న కమిషనర్ ఆమెను అభినందించారు. అన్ని విధాలా పర్ఫెక్ట్ ఆఫీసర్ అని. ఆయనే.. ‘‘వాక్డ్ ది వాక్ అండ్ టాక్డ్ ద టాక్’’ అని ఆమెను ప్రశంసించారు. మాటల్లోనే కాదు, చేతల్లోనూ చూపించే మనిషి అని. పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ లించ్.. ‘‘మన ప్రొఫెషన్లో ఎలాంటి అనూహ్యమైన పరిస్థితులు ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అన్నది హ్వానీటాకు మించి ఎవరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆమె కుటుంబం మొత్తం డిపార్ట్మెంట్ కోసం పనిచేస్తోంది’’ అని పూలగుచ్ఛం అందించారు. పదోన్నతి పొందిన ఒక అధికారికి మొక్కుబడిగా లభించే ప్రశంసలు కావివి. ఆమె కెరీర్లో ప్రతి దశ అత్యుత్తమ ప్రతిభ, సమర్థతలతో కూడి ఉంది. ఆమె ఎన్.వై.పి.డి. స్కూల్ సేఫ్టీ డివిజన్లో చేశారు. డొమెస్టిక్ వయెలెన్స్ యూనిట్లో చేశారు. ‘డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రైనింగ్’ విభాగంలోనూ చేశారు. ఖండితంగా ఉంటారు హ్వానీటా. ఏది జరగాలో దానినే జరగనిస్తారు. ఒత్తిళ్లకు లోనవరు. చీఫ్ పెట్రోల్ ఆఫీసర్‌కు కావలసినవి కూడా ఈ గుణాలే. నిజాయితీ, సమానత్వం, దాపరికాలు లేకుండా ఉండటం. ‘‘ప్రజలు మనకెంతో చెప్పాలని తాపత్రయ పడుతుంటారు. వాళ్లు చెప్పింది మనం వినాలని ఆశిస్తుంటారు. నేరాలను తగ్గించి, జీవితంలోని నాణ్యతను పెంచడంలో వారి తోడ్పాటు కూడా పోలీసులకు అత్యవసరమే’’ అంటారు హ్వానీటా. -
రియల్ లైఫ్ లేడీ సింగం
మాఫియా డాన్లను పట్టుకోవడానికి పోలీసు అధికారి నరసింహం విదేశాలకు వెళ్లడం చూశాం. నేరం చేసిన వాడు ఎవడైతే ఏంటి, ఎక్కడ తలదాచుకుంటే ఏమిటి.. చిత్తశుద్ధి ఉంటే వాడి తాట తీయొచ్చని అని నరసింహం నిరూపించాడు. అయితే అదంతా సింగం సిరీస్‌లో హీరో సూర్య రీల్ లైఫ్ పెర్ఫామెన్స్. కానీ రియల్ లైఫ్‌లో కూడా అలాంటి ఓ మహిళా ఆఫీసర్ ఉన్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడి సౌదీకి పారిపోయిన ఓ వ్యక్తిని పట్టుకునేందుకు ఆమె తన టీమ్‌తో కలిసి ఎడారి దేశానికి బయల్దేరారు. ఇంటర్‌పోల్ సహాయంతో అతడిని అరెస్టు చేసి భారత్‌కు తీసుకువచ్చారు. ఆ లేడీ సింగం పేరు మెరిన్ జోసెఫ్. కేరళలోని కొల్లాం పోలీసు కమిషనర్ ఆమె. అకృత్యానికి బలై ఆత్మహత్యకు పాల్పడ్డ బాధితురాలికి న్యాయం చేకూర్చేందుకు ఆమె చేసిన, చేస్తున్న కృషి నిజంగా స్ఫూర్తిదాయకం. కేసు నేపథ్యం కేరళలోని కొల్లాంకు చెందిన సునీల్ కుమార్ బంద్రాన్ అనే వ్యక్తి సౌదీ అరేబియాలో టైల్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 2017లో సెలవుల నిమిత్తం స్వదేశానికి వచ్చినపుడు స్నేహితుడి మేనకోడలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 13 ఏళ్ల బాలిక అనే కనికరం లేకుండా మూడు నెలల పాటు ఆమెకు ప్రత్యక్ష నరకం చూపించాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ చిన్నారి మిన్నకుండి పోయింది. అయితే ఆ కామాంధుడు సౌదీ వెళ్లిపోయాక జరిగిన దారుణం గురించి కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆ పీడకలను మర్చిపోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అతడిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ కేసులో ఎటువంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కొల్లాం పోలీస్ చీఫ్ మెరిన్ ఇటీవలే రియాద్‌కు వెళ్లారు. స్థానిక పోలీసుల అదుపులో ఉన్న సునీల్ కుమార్‌ను అరెస్టు చేసి కేరళకు తీసుకువచ్చారు. పోక్సో చట్టం కింద అతడిపై ఉన్న కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఎక్కడా దాక్కున్నా ఈ కేసు గురించి జోసెఫ్ మెరిన్ మాట్లాడుతూ..‘‘ఇది అత్యంత హేయమైన నేరం. సునీల్ దుశ్చర్య కారణంగా ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. మహిళలు, చిన్నారుల పట్ల ఇటువంటి అకృత్యాలు జరిగినపుడు మనసు కకావికలం అవుతుంది. ఇలాంటి ఘటనల్లో బాధితులు ఎంతటి మానసిక క్షోభను అనుభవిస్తారో నాకు తెలుసు. సమాజం కూడా వారిని చూసే తీరు వేరుగా ఉంటుంది. అటువంటి వారికి న్యాయం చేయడం నా కర్తవ్యం. అందుకే నిందితుడిని పట్టుకుని బాధితురాలికి న్యాయం చేయాలని నిర్ణయించు కున్నాను’’ అని తెలిపారు. ‘‘ఈ కేసులో నిందితుడు సౌదీకి పారిపోయాడు. అతడు ఒక్కడే కాదు గల్ఫ్‌దేశాల్లో నివసిస్తున్న చాలా మంది కేరళ కార్మికులు.. ఇక్కడ నేరాలకు పాల్పడి పారిపోతున్నారు. ఇటువంటి కేసులు ఎంత క్లిష్టతరమైనవో నాకు తెలుసు. అయినప్పటికీ వెనకడుగు వేయలేదు. మా బాస్ ప్రోద్బలంతో కేసులో పురోగతి సాధించాను. రియాద్‌కు వెళ్లి సునీల్ కుమార్‌ను అరెస్టుచేసి కేరళకు తీసుకువచ్చాను. ఇక అతడికి శిక్ష వేయించడమే నా ముందున్న లక్ష్యం’’ అని అన్నారు. సవాళ్లను స్వీకరించాలి ‘‘సమాజంలో ఆడపిల్లల పట్ల లింగ వివక్ష వేళ్లూనుకుపోయింది. అయితే ఒక మహిళగా నేనెప్పుడూ రాయితీలు కోరుకోలేదు. ఎవరెంతగా నిరుత్సాహ పరిచినా నిరాశ చెందక సవాళ్లను స్వీకరిస్తూ ముందుకు సాగాను. ఐపీఎస్ కావాలన్న నా కలను నెరవేర్చుకున్నాను. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాను. నిజానికి మహిళా అధికారుల పట్ల కూడా ఒక రకమైన చిన్నచూపు ఉంటుంది. ఒత్తిళ్లను ఎదుర్కొని పని చేయలేరన్న కారణంగా ఫీల్డ్ పోస్టింగులు తక్కువగా ఇస్తుంటారు. అది వాస్తవం కాదు. మహిళలకు పని పట్ల శ్రద్ధ, అంకిత భావం ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అన్ని రంగాల్లో వారు ముందుకు సాగుతున్న తీరును గమనించాలి. పోలీసు శాఖలో మహిళా అధికారుల సంఖ్య మరింతగా పెరగాల్సిన ఆవశ్యకత ఉంది’’ అంటూ కేరళలోనే అత్యంత పిన్నవయస్కురాలైన పోలీసు కమిషనర్‌గా గుర్తింపు పొందిన మెరీన్(29) అమ్మాయిల్లో స్ఫూర్తి నింపారు.– యాళ్ల సుష్మారెడ్డి, సాక్షి వెబ్‌డెస్క్ -
శబరిమల చరిత్రలోనే తొలిసారి..!
శబరిమల : మకరవిలక్కు పూజల కోసం శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు నేడు తెరుచుకోనున్నాయి. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సన్నిధానం తెరుచుకోవడం ఇది రెండోసారి. గతనెల మాసపూజల సందర్భంగా గుడిలోకి వెళ్లేందుకు మహిళలు ప్రయత్నించడంతో... శబరిమల పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆలయ చరిత్రలోనే తొలిసారి ప్రభుత్వం 15 మంది మహిళా పోలీస్ ఉద్యోగులను ఆలయం వద్ద భద్రతా విధుల నిర్వహణ కోసం నియమించింది. అయితే వీరంతా 50 ఏళ్ల పైబడిన వారు కావడం గమనార్హం. ఆలయ సాంప్రదాయం ప్రకారం 10 సంవత్సరాల లోపు బాలికలు.. 50 ఏళ్ల పైబడిన మహిళలను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా 50 ఏళ్ల పైబడిన మహిళా పోలీసు అధికారులను నియమించింది. వీరిలో చాలా మంది ఇప్పటి వరకు ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకోలేదని తెలిపారు. మరోక ఉద్యోగిని ఆమె చిన్నతనంలో అయ్యప్ప దర్శనం చేసుకున్నానని చెప్పారు. ఈ విషయం సదరు ఉద్యోగినులు మాట్లాడుతూ ‘మేము ఇక్కడ మాకు కేటాయించిన విధులు నిర్వహించడానికి వచ్చాము. ఆలయ నిబంధనలు ఉల్లంఘించి దర్శనం కోసం ప్రయత్నించే మహిళలను అడ్డుకోవడమే మా ప్రధాన బాధ్యత’ అని తెలిపారు. అయితే ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి ప్రస్తావించగా ‘నో కామెంట్స్’ అంటూ సమాధానమిచ్చారు. మకరవిలక్కు పూజల కోసం నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం.. రేపు సాయంత్రం 10 గంటలకు వరకూ తెరుచుకుని ఉంటుంది. -
రాజ్‌నాథ్ ప్రసంగం.. మహిళా పోలీసు అపస్మారకం
దేశ రాజధానిలో సాధారణ మహిళలకే కాదు పోలీసు అధికారులకూ తిప్పలు తప్పట్లేదు! మహిళల రక్షణే ప్రధాన లక్ష్యమని చెప్పే ఢిల్లీ పోలీసుశాఖ తీరులో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సరిపడా సిబ్బందిని నియమించకపోవడంతో సర్వీసులో ఉన్న ఉద్యోగినులపై ఒత్తిడి పెరిగింది. సోమవారం ఢిల్లీ పోలీస్ రైజింగ్ డే పరేడ్‌లో చోటుచేసుకున్న ఘటనే ఇందుకు తాజా ఉదాహరణ. పరేడ్‌కు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సరిగ్గా ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఏసీపీ నియతి మిట్టల్ సొమ్మసిల్లి పడిపోయారు. పరేడ్ నిర్వహణ కోసం కొన్ని రోజులుగా శ్రమించిన ఆమె బాగా అలసిపోవడంతో పడిపోయారని సహ ఉద్యోగినులు తెలిపారు. అయితే అధికారిణి పడిపోవడాన్ని చూసి కూడా పట్టించుకోనట్లే రాజ్‌నాథ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు! 'మహిళా అధికారిణి సొమ్మసిల్లడంలో వింతేముంది? అయినా మా డిపార్ట్మెంట్లో ఇలాంటివి సహజం' అంటూ విషయాన్ని చాలా తేలిగ్గా తీసిపారేశారు అక్కడున్న మగ పోలీసులు.