మోసం, లైంగిక దోపిడి నుంచి అమ్మాయిలను రక్షించే లేడీ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఆర్తిసింగ్ తన్వర్‌కి మంచి పేరుంది. దీంతోపాటు సైబర్ నేరగాళ్ల నుంచి ఎంత అలెర్ట్‌గా ఉండాలో సోషల్ మీడియా ద్వారా అవగాహన కలిగిస్తుంటుంది. చట్టం గురించి వీడియో పాఠాలు చెబుతుంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు, మోటివేషనల్ స్పీచ్‌లు ఇస్తుంటుంది. ఆమె గైడ్‌లైన్స్‌కి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. రాజస్థాన్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్తిసింగ్ తన అభిరుచితో బాధ్యత గల సామాజికవేత్తగానూ ప్రశంసలు అందుకుంటోంది.
ఈ లేడీ సబ్ ఇన్‌స్పెక్టర్ తన విధుల ద్వారానే కాదు రోజూ ఇచ్చే స్ఫూర్తిమంతమైన స్పీచ్‌లు, ఎలాంటి మోసం జరగకుండా ఇచ్చే సైబర్ గైడెన్స్‌తో ప్రతిరోజూ చర్చలో ఉంటుంది. ‘నా అభిరుచిని వృత్తితో జోడీ కట్టించాను. ఫలితం ఎంతోమందికి చేరువయ్యాను’ అంటారు ఈ లేడీ పోలీస్.
► వృత్తి... ప్రవృత్తితో కలిసి..
ఆర్తిసింగ్ కుటుంబ సభ్యులు, బంధువుల్లో చాలామంది పోలీసులుగా ఉన్నారు. వారిలాగే ఆర్తి కూడా పోలీస్ వృత్తినే ఎంచుకుంది. 2012లో రాజస్థాన్ పోలీస్ అకాడమీలో చేరి 2014లో సబ్ ఇన్ స్పెక్టర్‌గా విధులను చేపట్టింది. ‘నేను సోషల్ మీడియా ఫ్రెండ్లీగా ఉంటాను. చేస్తున్న పనుల ద్వారానే నలుగురిలో అవగాహన కలిగిస్తే చాలనుకున్నాను. మహిళల గళం వినిపించాల్సిన చోటు, సైబర్ అవగాహన, సందేశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఫాలోవర్స్ ఎప్పుడు ఇంతగా పెరిగిపోయారో తెలియనే లేదు’ అనేస్తారు ఆమె నవ్వుతూ.
► సోషల్ మీడియా సెల్...
పోలీస్ అకాడమీలో శిక్షణ ఇవ్వడంతోపాటు సోషల్ మీడియా సెల్ కూడా నిర్వహిస్తోంది ఈ సబ్ ఇన్‌స్పెక్టర్. ‘ఇటీవల మా సిబ్బందికి పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఫొటోతో ఓ మెసేజ్ వచ్చింది. గిఫ్ట్ కార్డుల సాకుతో ఎవరో నకిలీ నంబర్ తో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. వెంటనే అందరినీ అప్రమత్తం చేశాను. ఇలాగే.. షాపింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, మెసేజ్‌లలో వచ్చే షార్ట్ లింక్స్... వంటి ఆన్‌లైన్ మోసాలు ప్రతిరోజూ నమోదవుతున్నాయి. ఈ మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అవగాహన తప్పనిసరి అనుకున్నాను. లైవ్ ఇంటరాక్షన్ ద్వారా మోసాన్ని నివారించడానికి సూచనలు ఇస్తుంటాను. బాధితులు తమ అనుభవాలను కామెంట్స్‌లో లేదా డైరెక్ట్ మెసేజ్ ద్వారా తెలియజేస్తారు. దీంతో వారికి తక్షణ సహాయం అందివ్వడానికి ప్రయత్నిస్తుంటాం. మోసం, లైంగిక దోపిడీని ఎలా నివారించాలో సూచించే వీడియోలను అప్‌లోడ్ చేస్తుంటాను’ అని వివరిస్తారు ఆమె.
► యువతకు వీడియో పాఠాలు
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు, టైమ్ టేబుల్ తయారు చేసుకోవడం, రోజువారీ సిలబస్‌ను ఎలా సిద్ధం చేసుకోవాలి, ఏ సబ్జెక్టులను ఎప్పుడు, ఎలా చదవాలి, కంటెంట్ సులభంగా ఎలా గుర్తుంచుకోవచ్చు... ఇలాంటి వీడియోల కోసం యువత ఎదురు చూస్తుంటుంది.
► కొత్త టెక్నాలజీ పరిచయం
సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వీడియోల ద్వారా షేర్ చేస్తుంటుంది ఆర్తి. మొబైల్ హ్యాక్ అయితే ఏం చేయాలి? ఇంట్లోని స్మార్ట్ టీవీ హ్యాక్ అయితే సమస్యను ఎలా పరిష్కరించాలి? సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కొత్త ఫీచర్లు ఏమిటి?.. వీటికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటుంది ఆర్తి.
► ఖాకీ యూనిఫాంలో..
‘నా వీడియోలలో చాలా వరకు నేను ఖాకీ యూనిఫాంలోనే కనిపిస్తాను. ఆఫీసులో పని చేస్తున్నప్పుడు చట్టపరమైన సమాచారాన్ని చిన్న చిన్న వీడియోలు చేసి పోస్ట్ చేస్తాను. కొన్నిసార్లు ఇంటి నుంచి ఆఫీసుకు లేదా ఆఫీసుకు నుంచి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు కారులో వీడియోలు షూట్ చేసి అప్‌లోడ్ చేస్తుంటాను. పోస్ట్ చేసిన గంటల్లోనే వేలల్లో వ్యూస్ వస్తాయి. దీనిని బట్టి ప్రజల్లో చట్టం, న్యాయం, మోసాలకు సంబంధించిన అవగాహన ఎంత అవసరం ఉందో గ్రహించవచ్చు’ అని చెప్పే ఆర్తిసింగ్‌ను ‘మా మంచి పోలీస్’ అంటూ ప్రశంసిస్తున్నారు ఆమె ఫాలోవర్స్.
ప్రతిరోజూ అవగాహన రీల్
ప్రతిరోజూ లక్షలాది మంది ఫాలోవర్లు ఆర్తి గైడెన్స్ రీల్స్ కోసం ఎదురు చూస్తుంటారు. వాటిలో చట్టం, న్యాయానికి సంబంధించి అవగాహన కంటెంట్‌కే ప్రాధాన్యమిస్తుంటుంది. ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్‌ల ద్వారా నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు ఆర్తి సూచనలను ఫాలో అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment