kerala police officer
-
Police Officer breastfeeds: అమ్మ ఎక్కడైనా అమ్మే
నెలల పసికందు. తల్లి ఆస్పత్రిలో..బిడ్డ పోలీసు వొడిలో. బిహార్‌కు చెందిన ఒక కూలి మనిషి కేరళలో హాస్పిటల్ పాలైంది. ఆలనా పాలనా చూసేవారులేక బిడ్డ పోలీస్ స్టేషన్‌కు చేరింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న పసిగుడ్డును చూసి ఒక పోలీసు గుండె ఆగలేదు. వెంటనే పాలిచ్చింది. ఈ వీడియో చూసినవారు అమ్మ ఎక్కడైనా అమ్మే అంటున్నారు. ఖాకీ యూనిఫామ్ వేసుకున్న మాత్రాన తల్లి గుండె తల్లి గుండె కాకుండా పోతుందా? ఏ తల్లి మనసైనా తన బిడ్డను ఒకలా మరొకరి బిడ్డను ఒకలా చూస్తుందా? ప్రాణం పోసే స్వభావం కదా తల్లిది. ఎర్నాకుళానికి పట్నా నుంచి వలస వచ్చిన ఒక కుటుంబంలో తల్లికి గుండె జబ్బు రావడంతో ఐసియులో చేరింది. అప్పటికే ఆమె భర్త ఏదో కారణాన జైల్లో ఉన్నాడు. ఆమెకు నలుగురు పిల్లలు. ఆఖరుది నాలుగు నెలల పాప. హాస్పిటల్ వాళ్లు దిక్కులేని ఆమె పిల్లల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి స్టేషన్‌కు తీసుకొచ్చారు. పసిపాప ఏడ్వడం మొదలెట్టింది. ఆర్య అనే పోలీసు ఆఫీసర్ మనసు ఊరికే ఉండలేకపోయింది. ఆమెకు కూడా 9 నెలల పసిపాప ఉంది. అందుకే చటుక్కున పసిదాన్ని ఒడిలోకి తీసుకొని పాలు ఇచ్చింది. ఊరుకో బెట్టింది. పై అధికారులు ఇందుకు అనుమతించారు. కొచ్చి పోలీసులు ఈ వీడియోను ఫేస్బుక్ పేజీలో లోడ్ చేశారు. సాటి మహిళా పోలీసులే కాదు నెటిజన్లు కూడా ఆర్యను మెచ్చుకున్నారు. ఆ బిహార్ మహిళ పూర్తిగా కోలుకునే వరకు పిల్లలను స్టేట్ హోమ్‌కు తరలించి అక్కడ ఉంచుతామని అధికారులు తెలిపారు. పాలిచ్చిన బంధంతో ఆర్య ఆ పసిగుడ్డును హోమ్‌కు వెళ్లి చూడకుండా ఉంటుందా? -
కారుకింద తోసి చంపిన డీఎస్పీ.. అనుమానాస్పద మృతి
తిరువనంతపురం : పార్కింగ్ నిషేదించిన చోట కారు నిలిపాడని నెయ్యంతికర డీఎస్పీ హరికుమార్ ఓ వ్యక్తిని నెట్టేసి అతని మృతికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన కేరళ సీఎం పినరయి విజయన్ హరికుమార్‌ను విధుల నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించారు కూడా. అయితే, 34 ఏళ్ల సనాల్ మృతికి కారణమైన హరికుమార్ అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. కల్లంబాల్లంలోని ఓ ఇంటిలో ఉరికి వేలాడుతూ కనిపించారు. కాగా, ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హత్యా.. ఆత్మహత్యా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (మాట్లాడుతుండగానే కారుకింద తోసేశాడు..!) ఇదిలాఉండగా.. సనాల్ మృతి చెందినప్పటి నుంచి (నవంబర్,5) పరారీలో ఉన్న హరికుమార్‌ను పట్టుకునేందుకు పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. కేరళతో పాటు తమిళనాడులో సైతం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా, హరికుమార్‌ను ఈ కేసు నుంచి తప్పించేందుకు అధికార కమ్యూనిస్టు పార్టీ యత్నిస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు గుప్పించాయి. నిందితున్ని పట్టుకోవడంలో కావాలనే జాప్యం చేస్తోందని పోలీసు శాఖపై ఆరోపణలు చేశాయి. సనాల్ మృతి అనంతరం డీఎస్పీ హరికుమార్ పారిపోయేందుకు సహకరించిన వారిని పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. -
మాట్లాడుతుండగానే..
తిరువనంతపురం : కేరళలో దారుణం చోటుచేసుకుంది. పార్కింగ్ నిషేదించిన చోట కారు నిలిపాడని ఓ పోలీసు కర్కశంగా వ్యవహరించి ఒకరి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. సనాల్ అనే వ్యక్తి రోడ్డు పక్కన కారు నిలిపాడు. ఇది గమనించిన నెయ్యంతికర డీఎస్పీ హరికుమార్ పార్కింగ్ నిషేదించిన చోట కారు నిలపొద్దని చెప్పాడు. కారు తియ్యాలని హెచ్చరిస్తూ తోసేశాడు. దీంతో సనాల్ రోడ్డుపై పడడంతో అటుగా వెళ్తున్న వాహనం అతన్ని ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన సనాల్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. నిందితుడు హరికుమార్ పరారీలో ఉన్నాడు. కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. డీఎస్పీని సస్సెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కేసును దర్యాప్తును ఏఎస్పీకి అప్పగించామని తెలిపారు. హరికుమార్‌పై మర్డర్ కేసు నమోదు చేశామనీ, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా.. డీఎస్పీ హరికుమార్ డ్యూటీలో లేడనీ, తన నివాసానికి వెళ్తున్న క్రమంలో సనాల్‌ను కారుకింద తోసేసి చంపేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
నటుడితో ఫొటో దిగి...
తిరువనంతపురం: కేరళకు చెందిన ఓ మహిళా పోలీస్ అధికారి.. ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, వివాదంలో ఇరుక్కున్నారు. అసిస్టెంట్ కమిషనర్ మెరిన్ జోసెఫ్.. దక్షిణాది నటుడు నివిన్ పాలీతో కలిసి దిగిన ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతో వేలకొద్దీ లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. అయితే ఆ ఆనందం ఆమెకు ఎంతోసేపు నిలవలేదు. మెరిన్ జోసెఫ్ ప్రొటోకాల్ పాటించలేదంటూ విమర్శలు చెలరేగాయి. పోలీస్ ఉన్నతాధికారి అయిన ఆమె యూనిఫాంలో ఉండి, సినీ నటుడితో ఫొటో దిగడం, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై విమర్శలు గుప్పించాయి. అక్కడి ఛానల్స్ వరుస కథనాలు ప్రసారం చేశాయి. ఈ వివాదంపై మెరిన్ జోసెఫ్ మీడియాపై విరుచుకుపడ్డారు. అనవసరంగా విషయాన్ని సంచలనం చేశారని మండిపడ్డారు. వాళ్ల (ఛానల్స్) రేటింగ్ కోసం ఛీప్ ట్రిక్స్ ప్లే చేయడం మీడియాకు అలవాటేనని ఆమె ఆరోపించారు. వారిపట్ల జాలిపడటం తప్ప ఏమీ చేయలేనని మెరిన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఓ కాలేజీ ఫంక్షన్‌కు వెళ్లిన తాను కార్యక్రమం పూర్తయి, తన విధులు ముగిసిన తర్వాతే నటుడుతో ఫొటో తీసుకున్నట్లు మెరిన్ జోసెఫ్ వివరణ ఇచ్చారు. కేరళ హోం మంత్రి, తదితర ముఖ్య అతిథులు వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే ఆ నటుడ్ని కలిసినట్లు చెప్పారు. నటుడు నివిన్, తన కోరికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే హిబి ఇడెన్ ఈ ఫొటో తీశారని తెలిపారు. కాగా జోసెఫ్ గతంలో కూడా ఒక వివాదంలో ఇరుక్కున్నారు. ఐపీఎస్ శిక్షణలో ఉండగా ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ పై విమర్శలు చెలరేగాయి. -
పరీక్షల్లో కాపీకొడుతూ దొరికేసిన ఐజీ
ఆయనో సీనియర్ పోలీసు అధికారి. ఆయనకు మాస్టర్ ఆఫ్ లా చదవాలని అనిపించింది. అయితే, పరీక్షలకు కష్టపడి చదివి.. రాసే ఓపిక, తీరిక రెండూ లేవు. అందుకే కాపీ కొట్టాలనుకున్నారు. కానీ, పరీక్ష హాల్లో దొరికిపోయారు. దాంతో ఆయనను బయటకు పంపేశారు. కేరళలోని త్రిసూర్ రేంజి ఐజీ టీజే జోస్ సెయింట్ పాల్స్ కాలేజిలో కాన్స్టిట్యూషనల్ లా పేపర్ సప్లిమెంటరీ పరీక్ష రాస్తున్నారు. అంటే, ఆయన అంతకుముందు రాసిన పరీక్షలో ఫెయిలయ్యారన్న మాట. దూరవిద్య పద్ధతిలో ఎల్ఎల్ఎం చదువుతున్న ఆయన.. ఉదయం 10 గంటలకు పరీక్షకు హాజరయ్యారు. కానీ 11.30 ప్రాంతంలో ఆయన ఆన్సర్ షీట్ల మధ్యలో చీటీ పెట్టుకుని కాపీ కొడుతుండగా ఇన్విజిలేటర్ పట్టేసుకున్నారు. వెంటనే ఇన్విజిలేటర్ ఆయనను బయటకు పంపి, కాలేజి మేనేజర్‌కు, ఎక్స్టర్నల్ ఎగ్జామినర్‌కు చెప్పారని.. తాము ఈ విషయాన్ని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి కూడా తెలియజేశామని కాలేజి వైస్ ప్రిన్సిపాల్ పీటర్ తెలిపారు. అయితే ఐజీ మాత్రం తాను కాపీ కొట్టానన్న విషయాన్ని అంగీకరించలేదు. పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా, తాను రాయడం 12 గంటలకే అయిపోయిందని, అందుకే బయటకు వచ్చేశానని, కాపీ ప్రసక్తిగానీ, తన వద్ద నుంచి పేపర్లు లాక్కోవడం గానీ జరగనేలేదని ఆయన అన్నారు. మంగళవారం నాడు జరిగే పరీక్షకు కూడా హాజరవుతానని ధీమాగా చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా తనను వివరణ కోరగా ఇదే విషయం చెప్పానన్నారు.