నటుడితో ఫొటో దిగి...
తిరువనంతపురం: కేరళకు చెందిన ఓ మహిళా పోలీస్ అధికారి.. ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, వివాదంలో ఇరుక్కున్నారు. అసిస్టెంట్ కమిషనర్ మెరిన్ జోసెఫ్.. దక్షిణాది నటుడు నివిన్ పాలీతో కలిసి దిగిన ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతో వేలకొద్దీ లైక్లు, కామెంట్లు వచ్చాయి. అయితే ఆ ఆనందం ఆమెకు ఎంతోసేపు నిలవలేదు. మెరిన్ జోసెఫ్ ప్రొటోకాల్ పాటించలేదంటూ విమర్శలు చెలరేగాయి. పోలీస్ ఉన్నతాధికారి అయిన ఆమె యూనిఫాంలో ఉండి, సినీ నటుడితో ఫొటో దిగడం, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై విమర్శలు గుప్పించాయి. అక్కడి ఛానల్స్ వరుస కథనాలు ప్రసారం చేశాయి.
ఈ వివాదంపై మెరిన్ జోసెఫ్ మీడియాపై విరుచుకుపడ్డారు. అనవసరంగా విషయాన్ని సంచలనం చేశారని మండిపడ్డారు. వాళ్ల (ఛానల్స్) రేటింగ్ కోసం ఛీప్ ట్రిక్స్ ప్లే చేయడం మీడియాకు అలవాటేనని ఆమె ఆరోపించారు. వారిపట్ల జాలిపడటం తప్ప ఏమీ చేయలేనని మెరిన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఓ కాలేజీ ఫంక్షన్కు వెళ్లిన తాను కార్యక్రమం పూర్తయి, తన విధులు ముగిసిన తర్వాతే నటుడుతో ఫొటో తీసుకున్నట్లు మెరిన్ జోసెఫ్ వివరణ ఇచ్చారు. కేరళ హోం మంత్రి, తదితర ముఖ్య అతిథులు వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే ఆ నటుడ్ని కలిసినట్లు చెప్పారు. నటుడు నివిన్, తన కోరికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే హిబి ఇడెన్ ఈ ఫొటో తీశారని తెలిపారు. కాగా జోసెఫ్ గతంలో కూడా ఒక వివాదంలో ఇరుక్కున్నారు. ఐపీఎస్ శిక్షణలో ఉండగా ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ పై విమర్శలు చెలరేగాయి.