merin joseph
-
అందమైన అధికారిణుల జాబితాపై ఐపీఎస్ ఆగ్రహం!
'భారత్‌లో కెల్లా అందమైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారిణిలు' అంటూ ఓ హిందీ దినపత్రిక జాబితాను ప్రచురించడంపై మహిళా ఐపీఎస్ అధికారి మెరిన్ జోసెఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'అందమైన ఐపీఎస్, ఐఏఎస్ పురుష అధికారుల గురించి జాబితాను ఎప్పుడైనా చూశామా?' అని ఆమె ప్రశ్నించారు. కేరళలోని మున్నార్ ఏఎస్పీ (అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు)గా పనిచేస్తున్న ఆమె తాజా ఈ విషయమై పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. అందం కొలమానంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మీడియా చూడటం లింగవివక్షనంటూ ఆమె పెట్టిన పోస్టు ఇప్పటికే వైరల్‌గా మారిపోయింది. ఆమెకు మద్దతుగా పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. భారతీయ మీడియా ఎప్పుడూ వక్ర దృష్టితోనే మహిళలను చూస్తున్నదని ఆమె తన పోస్టులో మండిపడ్డారు. రూపురేఖలు ఒక మహిళ ప్రతిభను ఎలా నిర్ధారిస్తాయని ఆమె ప్రశ్నించారు. 'సంక్లిష్టమైన భారతీయ బ్యూరోక్రసిలో ఎంతో ధైర్యసాహసాలతో ఈ అధికారిణులు పనిచేస్తున్నారు. మన రాజకీయ వ్యవస్థలోని మంచిని, చెడును, వికృతాన్ని తమదైన రీతిలో ఎదుర్కొంటున్నారు. కానీ, వారిని మనం మోహదృష్టితో చూస్తూ జాబితాలు సిద్ధం చేస్తున్నాం' అని ఆ పత్రిక తీరును తప్పుబట్టారు. ఇలా అధికారిణుల అందచందాల ఆధారంగా జాబితాలు తయారుచేయడం చాలా దుర్మార్గమైన చర్య అని ఆమె మద్దతుగా ఫేస్బుక్లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. లింగ వివక్షత సంబంధించిన అంశాలను లేవనెత్తడం మెరిన్ జోసెఫ్‌కు ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆమెకు ఎండంలో ఓ జూనియర్ అసిస్టెంట్ గొడుగు పడుతున్న ఫొటో ఆన్లైన్లో వైరల్ అయింది. ఆ తర్వాత నటుడు నవిన్ పౌలీతో ఆమె ఫొటో తీయాల్సిందిగా ఓ ఎమ్మెల్యేను కోరడం కూడా సోషల్ మీడియాలో దుమారం రేపింది. అయితే, ఆమె మహిళ కావడం వల్లే ఆమె చర్యలను భూతద్దంలో చూపిస్తున్నారని ఆమె మద్దతుదారులు గతంలో పేర్కొన్నారు. -
నటుడితో ఫొటో దిగి...
తిరువనంతపురం: కేరళకు చెందిన ఓ మహిళా పోలీస్ అధికారి.. ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, వివాదంలో ఇరుక్కున్నారు. అసిస్టెంట్ కమిషనర్ మెరిన్ జోసెఫ్.. దక్షిణాది నటుడు నివిన్ పాలీతో కలిసి దిగిన ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతో వేలకొద్దీ లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. అయితే ఆ ఆనందం ఆమెకు ఎంతోసేపు నిలవలేదు. మెరిన్ జోసెఫ్ ప్రొటోకాల్ పాటించలేదంటూ విమర్శలు చెలరేగాయి. పోలీస్ ఉన్నతాధికారి అయిన ఆమె యూనిఫాంలో ఉండి, సినీ నటుడితో ఫొటో దిగడం, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై విమర్శలు గుప్పించాయి. అక్కడి ఛానల్స్ వరుస కథనాలు ప్రసారం చేశాయి. ఈ వివాదంపై మెరిన్ జోసెఫ్ మీడియాపై విరుచుకుపడ్డారు. అనవసరంగా విషయాన్ని సంచలనం చేశారని మండిపడ్డారు. వాళ్ల (ఛానల్స్) రేటింగ్ కోసం ఛీప్ ట్రిక్స్ ప్లే చేయడం మీడియాకు అలవాటేనని ఆమె ఆరోపించారు. వారిపట్ల జాలిపడటం తప్ప ఏమీ చేయలేనని మెరిన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఓ కాలేజీ ఫంక్షన్‌కు వెళ్లిన తాను కార్యక్రమం పూర్తయి, తన విధులు ముగిసిన తర్వాతే నటుడుతో ఫొటో తీసుకున్నట్లు మెరిన్ జోసెఫ్ వివరణ ఇచ్చారు. కేరళ హోం మంత్రి, తదితర ముఖ్య అతిథులు వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే ఆ నటుడ్ని కలిసినట్లు చెప్పారు. నటుడు నివిన్, తన కోరికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే హిబి ఇడెన్ ఈ ఫొటో తీశారని తెలిపారు. కాగా జోసెఫ్ గతంలో కూడా ఒక వివాదంలో ఇరుక్కున్నారు. ఐపీఎస్ శిక్షణలో ఉండగా ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ పై విమర్శలు చెలరేగాయి. -
మేడమ్.. నన్ను అరెస్టు చేయండి ప్లీజ్!
-
ఫేస్బుక్ అకౌంట్ పీకేసిన ఐపీఎస్ అధికారిణి
మెరిన్ జోసెఫ్.. ఐపీఎస్ ట్రైనీ. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఆమె పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. ఇంటర్నెట్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆమె ఫొటోలు, 'మేడమ్.. నన్ను అరెస్టు చేయండి' అంటూ ఆమె కోసం వేడుకోళ్లు. ఒక్క రోజులోనే ఆమెకు 25వేల మంది ఫాలోయర్లు వచ్చేశారు. కొచ్చి నగరానికి కొత్త ఏసీపీగా మెరిన్ జోసెఫ్ వచ్చారంటూ ఒక ఫేస్బుక్ పేజీలో ప్రచురించడంతో మెరిన్ జోసెఫ్ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. చివరకు ఈ వ్యవహారం మరీ శ్రుతి మించడంతో ఆమె తన ఫేస్బుక్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసిపారేశారు. ఫేస్బుక్లో పోస్టులు విపరీతంగా పెరిగిపోవంతో అసలు ముందు ఆమె ఫొటోను ఫేస్బుక్లో ఎవరు పోస్ట్ చేశారోనంటూ కొచ్చి నగర పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. వాస్తవానికి ఆమె కొచ్చి ఏసీపీగా బాధ్యతలే స్వీకరించలేదని, ఎవరో తప్పుడు పోస్ట్ పెట్టడంతో అది కాస్తా విస్తృతంగా ప్రచారం అయ్యిందని కమిషనర్ కేజీ జేమ్స్ తెలిపారు. తప్పుడు సమాచారాన్ని ఇలా పంచినవాళ్లపై అవసరమైతే తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, తానింకా శిక్షణలోనే ఉన్నానని, వచ్చే సంవత్సరం జనవరిలోనే తనకు మొదటి పోస్టింగ్ వస్తుందని, వచ్చినప్పుడు తప్పకుండా మీడియాకు చెబుతానని మెరిన్ జోసెఫ్ అన్నారు. ఈలోపు మాత్రం నిరాధార వదంతులు వ్యాప్తి చేయొద్దని తన అభిమానులకు హితవు పలికారు. -
మేడమ్.. నన్ను అరెస్టు చేయండి ప్లీజ్!
కేరళలో ఇప్పుడంతా మమ్మల్ని అరెస్టు చేయండి ప్లీజ్ అంటూ క్యూ కడుతున్నారు. అయితే వీళ్లెవరూ ఏ స్టేషన్ పడితే ఆ స్టేషన్‌కు వెళ్లట్లేదు. కేవలం కొచ్చి ఏసీపీ వద్దకు మాత్రమే అరెస్టు చేయాలంటూ వెళ్తున్నారు. ఎందుకంటే.. మెరిన్ జోసెఫ్ అనే ఐపీఎస్ అధికారిణి అక్కడ ఏసీపీగా ఇటీవలే ఛార్జి తీసుకున్నారు. ఇప్పుడు ఆమె ఫొటోను ఫేస్బుక్లో విపరీతంగా షేర్ చేస్తూ.. మమ్మల్ని అరెస్టు చేయండి అంటూ కోరుతున్నారు. మెరిన్ జోసెఫ్ అందంగా కనపడటమే అందుకు కారణం. ఆమె చేతుల్లో అరెస్టు కావడానికి తాము దొంగలుగా మారేందుకు కూడా అభ్యంతరం లేదని కొంతమంది చెబుతున్నారు. ఇదంతా ఎలా మొదలైందంటే... కొచ్చి కొత్త ఏసీపీగా మెరిన్ జోసెఫ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పౌర సమస్యలకు సంబంధించిన ఓ ఫేస్బుక్ పేజీలో ఆమెకు స్వాగతం పలుకుతూ ఫొటో పోస్ట్ చేశారు. కేవలం ఒక్కరోజులోనే ఆ ఫొటోకు ఏకంగా పదివేల లైకులు వచ్చాయి. షేర్లు కూడా చాలా ఎక్కువ వచ్చాయి. వాట్సప్‌లో కూడా ఈ ఫొటోను విస్తృతంగా షేర్ చేసుకున్నారు. నిక్కీ అనే ఓ కుర్రాడు తాను దోపిడీలు మొదలుపెట్టేస్తానని బహిరంగంగా చెప్పాడు. ''వావ్!! ఇంత అందమైన పోలీసు ఆఫీసర్ కొచ్చిని పాలిస్తుంటే చూడటానికి చాలా సంతోషంగా ఉంది. మీకు అభినందనలు!'' అని పెట్టాడు. తనను అరెస్టు చేయాలంటూ ప్రముఖ నటుడు మోహన్‌లాల్ ఆమెను అడుగుతున్నట్లుగా ఫొటోషాప్‌లో మార్ఫింగ్ చేసిన ఫొటో కూడా ఫేస్బుక్లో విస్తృతంగా వ్యాపించింది. ఇప్పుడు అక్కడ లేనే లేరట అయితే.. ఐపీఎస్ శిక్షణ పొందుతున్న మెరిన్ జోసెఫ్ కేవలం రెండు వారాల శిక్షణ కోసం మాత్రమే కొచ్చికి వెళ్లి, అక్కడినుంచి తిరిగి వెళ్లిపోయారు కూడా. ఈ విషయాన్ని డీసీపీ మహ్మద్ రఫీక్ తెలిపారు. 'వై20' పేరిట ఆస్ట్రేలియాకు వెళ్లే యువ బృందానికి కూడా ఆమె ఇటీవల ఎంపికయ్యారు. న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజిలో బీఏ ఆనర్స్ చదివిన మెరిన్ జోసెఫ్.. 2012లో తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించారు.