temple construction
-
అయోధ్య భక్తజన సంద్రం.. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ రేపే
అయోధ్య.. ఆ పేరు వింటేనే ఆధ్యాత్మిక పరవశం. అది శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి. ఎన్నో వివాదాలు.. మరెన్నో ఆందోళనలు..అవన్నీ సమసిపోయాయి. రాముడు పుట్టిందక్కడే అని బలంగా నమ్మే కోట్లాది భక్త హృదయాలు ఉప్పొంగేలా, భవ్యమైన దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేం చేయబోతున్నాడు. ఆ దివ్యమంగళ రూపం కోసం పరితపిస్తున్న భక్తకోటి ఆర్తి తీరేలా బాలరాముడిగా రేపు తొలి దర్శనభాగ్యం కలిగించబోతున్నాడు. అయోధ్యలో దివ్యంగా రూపుదిద్దుకున్న భవ్య మందిరంలో భక్తవత్సలుడు కొలువు దీరబోతున్నాడు. కనులారా బాలరాముడిని వీక్షించే భాగ్యం భక్తులకు దక్కనుంది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగసుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనం ఇవ్వనున్నాడు. రేపు సోమవారం బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర రాజకీయ ప్రముఖులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మిక, ఇతర రంగాల ప్రముఖులు, ప్రపంచం నలు మూలల నుంచి తరలివస్తున్న భక్త జనం సాక్షిగా ఆగమ శాస్త్ర పద్ధతుల్లో ప్రతిష్ఠించనున్నారు. రూ.1300 కోట్లతో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్టు కావటంతో ఆలయాన్ని మూడు విడతల్లో పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం దిగువ అంతస్తు మాత్రమే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే సిద్ధం చేసిన బాల రాముడి విగ్రహానికి రేపు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. బాలరాముడిని ప్రతిష్ఠించే గర్భాలయం; 1947 నుంచి పూజలందుకుంటున్న విగ్రహం; ప్రాణప్రతిష్ఠ జరగనున్న బాలరాముడి విగ్రహం మొదటి అంతస్తులో రామదర్బార్ రావణవధ అనంతరం తిరిగి వచ్చిన సీతారాములకు అయోధ్యలో అంగరంగవైభవంగా పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత సోదర, ఆంజనేయ సమేతంగా అద్భుత పాలనతో సుభిక్ష రామరాజ్యం విలసిల్లిందన్నది పురాణగాధ. బాలరాముడితో దర్శనం సమాప్తమైతే.. సీతారాములను కనులారా వీక్షించాలని ఉబలాటపడే భక్తుల్లో కొంత అసంతృప్తి ఉంటుందనే ఉద్దేశంతో మొదటి అంతస్తులో ‘రామదర్బార్’ రూపంలో అద్భుత దర్శనభాగ్యం కలిగించే ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ సీతారామచంద్రులు లక్ష్మణ, భరత, శత్రఘ్న, ఆంజనేయ విగ్రహాలు సమేతంగా భక్తులకు మొదటి అంతస్తులో దర్శనమివ్వనున్నాయి. రామదర్బార్ విగ్రహాలను రాజస్థాన్ తెల్లరాతితో సిద్ధం చేయనున్నారు. వచ్చే సంవత్సరం ఆ విగ్రహాలు దర్శనమివ్వనున్నాయి. ఆ దివ్య మందిరంపై నిర్మించే రెండో అంతస్తులో ఎలాంటి దర్శన ఏర్పాట్లు చేయాలన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే సంవత్సరం డిసెంబరు నాటికి మొదటి రెండు అంతస్తులను పూర్తి చేసి రామ దర్బార్ దర్శనం కలిగించనున్నారు. బాలరాముడి రూపునకు మూడు విగ్రహాల పరిశీలన బాలరాముడి రూపు కోసం మూడు విగ్రహాలను పరిశీలించారు. రాజస్థాన్ , కర్నాటక ప్రాంతాలకు చెందిన శిల్పులు ఆరు నెలల క్రితమే వీటిని సిద్ధం చేసి పెట్టారు. విగ్రహాల తయారీకి కర్నాటక నుంచి మూడు కృష్ణ శిలలు, ఓంకారేశ్వర్పూజ్య అవధూత నర్మదానంద్జీ మహరాజ్ ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి పంపిన తెల్లరాయిని శిల్పులకు అప్పగించారు. ఇందులో నల్లరాయిని బాలరాముడి విగ్రహానికి కేటాయించారు. తయారైన మూడు బాల రాముడి విగ్రహాల్లో మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ శిల్పి రూపొందించిన విగ్రహాన్ని ఇటీవల ట్రస్టు సభ్యులు ఓటింగ్ పద్ధతిలో ఎంపిక చేశారు. ఈ విగ్రహానికే రేపు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. మూల విరాట్‌గా కొత్త విగ్రహం... ఉత్సవమూర్తిగా పాత విగ్రహం దిగువ అంతస్తులో బాలరాముడు, మొదటి అంతస్తులో పట్టాభి రాముడు దర్శనం ఇవ్వడం ఒక విశేషమైతే, దిగువ అంతస్తులోనే బాలరాముడితో పాటు పురాతన విగ్రహ దర్శనభాగ్యం కూడా భక్తులకు కల్పించనున్నారు. రామజన్మభూమిలో 1947లో రాముడి విగ్రహం ఒకటి వెలుగు చూసింది. దాన్ని గుర్తించిన వెంటనే సమీపంలోనే ఉంచి పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలోని తాత్కాలిక మందిరంలో ఆ విగ్రహమే పూజలందుకుంటోంది. కొత్త ఆలయంలో ప్రాణప్రతిష్ఠకు కొత్త విగ్రహాన్ని రూపొందించిన తరుణంలో, పాత విగ్రహాన్ని ఏం చేస్తారన్న ప్రశ్నలు ఉద్భవించాయి. ఇటీవలే ట్రస్టు ఆ సందేహాలను నివృత్తి చేసింది. దిగువ అంతస్తులో బాలరాముడి విగ్రహం ముందే ఆ పాత విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించనున్నారు. 30 అడుగుల దూరం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. పాత విగ్రహం చిన్నదిగా ఉన్నందున సరిగ్గా కనిపించదు. అందుకోసమే కొత్త విగ్రహాన్ని రూపొందించారు. ఇన్ని దశాబ్దాలుగా పూజలందుకుంటున్న పాత విగ్రహాన్ని కూడా గర్భాలయంలోనే ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. కొత్త విగ్రహాన్ని మూల విరాట్గానూ, పాత విగ్రహాన్ని ఉత్సవమూర్తిగా మారుస్తున్నారు. ప్రత్యేక పూజాదికాల కోసం ఉత్సవ విగ్రహం వివిధ ప్రాంతాలకు తరలుతుందని, మూల విరాట్ గర్భాలయంలోనే స్థిరంగా ఉంటుందని ట్రస్టు స్పష్టం చేసింది. అయోధ్యలో సరయూ నదికి హారతి లేజర్ షో జటాయువు కంచు విగ్రహం కూడా... 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో జటాయువు కంచు విగ్రహాన్ని కూడా రూపొందిస్తున్నారు. అక్కడి కుబేర్టీలాపై ప్రతిష్ఠించే ఈ విగ్రహం మూలమూర్తి వైపు ధ్యానముద్రలో చూస్తూ వినమ్రంగా ఉండేలా దీనిని ప్రఖ్యాత శిల్పి, పద్మభూషణ్రామ్ సుతార్ సిద్ధం చేస్తున్నారు. దక్షిణ భారతశైలిలో గాలిగోపురం దక్షిణాది దేవాలయాల మాదిరిగా ద్రవిడ శైలిలో ఉండే రాజగోపురాలు ప్రధానాకర్షణగా నిలవనున్నాయి. అయోధ్య రామజన్మభూమి ప్రధాన ఆలయాన్ని ఉత్తర భారతీయ నాగర శైలిలో నిర్మిస్తున్నారు. అయితే నాగరశైలిలో గాలి గోపురాలకు చోటు లేదు. కానీ రామజన్మభూమి ఆలయ ప్రవేశం వద్ద మాత్రం భారీ గాలిగోపురం నిర్మించాలని నిర్ణయించారు. ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రాముడు పుట్టిన చోటనే గర్భగుడి కట్టాలని అదనంగా స్థల సేకరణ సుప్రీంకోర్టు తీర్పుతో 72 ఎకరాలు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధీనంలోకి వచ్చాయి. అయితే రాముడు జన్మించినట్టుగా చెబుతున్న భాగంలోనే గర్భాలయం నిర్మించాలన్నది ప్రణాళిక. కానీ రాముడు పుట్టినట్టుగా పేర్కొంటున్న ఆ భూమి ఆగ్నేయ మూలలో ఉంది. అది గర్భాలయ నిర్మాణానికి అనుకూలంగా లేదు. దీంతో దాని వెనుకవైపు కొంత భూమిని ప్రైవేట్వ్యక్తుల నుంచి ట్రస్టు కొనుగోలు చేసి ఆ ప్రాంగణాన్ని ప్రస్తుతం నిర్మిస్తున్న ఆలయ నమూనాకు వీలుగా సిద్ధం చేసింది. ఏఏఏ ఆలయ పునాదుల్లో నాలుగున్నర లక్షల ఇటుకలు రామ మందిర నిర్మాణంతో తమ చేయూత ఉండాలన్న సంకల్పంతో దేశంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు ఇటుకలు పంపారు. అలా నాలుగు లక్షల గ్రామాల నుంచి నాలుగున్నర లక్షల ఇటుకలు అయోధ్యకు చేరాయి. అయితే ఆలయాన్ని పూర్తి రాతి కట్టడంగా నిర్మిస్తున్నందున ఇటుకల వాడకం సాధ్యం కాదు. అలా అని మరోచోట ఈ ఇటుకలను వినియోగిస్తే.. భక్తులు అసంతృప్తికి లోనయ్యే అవకాశముంది. దీంతో వాటికి ప్రత్యేకస్థానం దక్కాల్సిందేని భావించిన ట్రస్టు, వాటిని ఆలయ పునాదుల్లో వినియోగించింది. ఇప్పుడు నాలుగున్నర లక్షల ఇటుకలు పునాది భాగంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. దిగువ అంతస్తులో బాలరాముడు ఆలయం మూడు అంతస్తులుగా ఉంటుంది. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. భూ ఉపరితలం నుంచి 20 అడుగుల ఎత్తుతో ప్రదక్షిణ పథ (పరిక్రమ్) నిర్మించారు. దాని మీద ప్రధాన ఆలయం దిగువ అంతస్తు ఉంటుంది. ఈ దిగువ అంతస్తులోనే బాల రాముడి విగ్రహం ఉంటుంది. రాముడు పుట్టినట్టుగా భావిస్తున్న చోటనే ఈ ఆలయం నిర్మిస్తున్నందున అక్కడే బాలరాముడు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ట్రస్టు నిర్ణయించింది. ఐదేళ్ల వయసులో ఉన్న రాముడి రూపం 51 అంగుళాల విగ్రహంగా భక్తజనానికి దర్శనమివ్వనుంది. ఎన్నో ప్రత్యేకతలు రాముడి సుగుణాలు అనేకం..ప్రతిఒక్కోటి విలక్షణమే. అలాంటి రాముడు పుట్టిన చోట నిర్మిస్తున్న మందిర నిర్మాణంలోనూ ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. అందుకే ఈ ఆలయాన్ని నభూతో న భవిష్యతిగా వర్ణిస్తున్నారు. ఆధునిక భారతావనిలో రాతితో నిర్మించిన అతి పెద్ద దేవాలయం కూడా ఇదే. సిమెంటు, స్టీలు, ఇతర అనుసంధాన రసాయనాలు లేకుండా పూర్తిగా రాతితోనే దీనిని నిర్మిస్తున్నారు. ఆలయం, పరిసరాలన్నీ కలుపుకొని 90 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు సంక్రమించినది 72 ఎకరాలు. మిగతా భూమిని ప్రైవేట్సంస్థలు, వ్యక్తుల నుంచి ట్రస్టు కొనుగోలు చేసింది. ఇందులో 2.7 ఎకరాల్లో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన దేవాలయం రూపుదిద్దుకుంటోంది. 2025 నాటికి మొత్తం ఆలయం సిద్ధం ప్రస్తుతానికి గర్భాలయంగా ఉండే ప్రధాన ఆలయ నిర్మాణమే జరుగుతోంది. మూడంతస్తులుగా ఉండే ఈ ఆలయంతోపాటు ఆ ప్రాంగణంలో పర్కోట (ప్రాకారం) ఆవల మరో ఎనిమిది మందిరాలు కూడా ఉంటాయి. శ్రీరాముడి జీవితంతో అనుబంధం ఉన్న భిన్నవర్గాలకు చెందిన వారి ఆలయాలు నిర్మిస్తారు. వాల్మీకి, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, శబరి, అహల్య, గుహుడు..లాంటి వారితో కూడిన ఎనిమిది గుళ్లుంటాయి. మర్యాద పురుషోత్తముడి సామాజిక దృష్టి కోణానికి నిదర్శనంగా ఇప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఈ ఆలోచన జరిగిందన్నది ట్రస్టు మాట. అయితే ప్రధాన ఆలయ ప్రాంగణాన్ని 2025 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ట్రస్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఆరంభమైన వేడుకలు బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఈనెల 16 నుంచే మొదలయ్యాయి. హోమాలు, జపాలు, ఇతర ప్రధాన క్రతువులతోపాటు బాలరాముడి విగ్రహానికి శోభాయాత్ర నిర్వహిస్తారు. తెల్లవారుజామునే సరయూ నదిలో విగ్రహానికి స్నానం నిర్వహించి నేత్రపర్వంగా శోభాయాత్ర ద్వారా పట్టణానికి తరలిస్తారు. అక్కడ అతి పురాతన ఆలయాల సందర్శన తర్వాత గర్భాలయంలో ప్రాణప్రతిష్ఠకు తరలిస్తారు. అప్పటి వరకు విగ్రహ నేత్రాలను కప్పి ఉంచుతారు. బాలరాముడు అప్పట్లో అయోధ్యలో స్నానపానాదులు చేస్తూ సంచరించిన తరహాలో ఈ వేడుక నిర్వహించనున్నారు. వాస్తుశిల్పి ‘సోమ్‌పురా’ సారథ్యంలో నిర్మాణ పనులు దేవాలయ ఆర్కిటెక్ట్‌గా ప్రఖ్యాత ‘సోమ్‌పురా’ కుటుంబమే వ్యవహరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆ కుటుంబం వందకుపైగా ఆలయాలను రూపొందించింది. ప్రఖ్యాత సోమ్‌నాథ్ ఆలయానికి కూడా వాస్తుశిల్పిగా పనిచేసిన ఆ కుటుంబం 15 తరాలుగా ఇదే పనిలో ఉంది. అయోధ్య రామాలయం కోసం చంద్రకాంత్ సోమ్‌పురా చీఫ్ ఆర్కిటెక్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన విఖ్యాత అక్షర్‌ధామ్‌ను రూపొందించారు. ఆయన ఇద్దరు కుమారులు నిఖిల్ సోమ్‌పురా, ఆశిష్ సోమ్పురాలు ఆర్కిటెక్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. ► ప్రధాన ఆలయం 235 అడుగుల వెడల్పు, 350 అడుగుల పొడవు, 161 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా చెప్పవచ్చు. ► ఆలయ నిర్మాణం ఆగమశాస్త్రం నాగర విధాన గుర్జర చాళుక్య శైలిలో రూపుదిద్దుకుంటోంది. ప్రధాన ఆలయం మూడు అంతస్తుల్లో ఉంటుంది. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఒక్కో అంతస్తులో నృత్య, రంగ, కుడు, కీర్తన, ప్రార్థన పేర్లతో ఐదు మండపాలుంటాయి. ► ప్రధాన ఆలయంలో 366 స్తంభాలుంటాయి. ఒక్కో దానిపై 30 వరకు శిల్పాలు, ఇతర నగిషీలు ఉంటాయి. ► స్తంభాలపై శివుడు, వినాయకుడు, దశావతారాలు, యోగినులు, సరస్వతి ఇతర దేవతా రూపాలను చిత్రీకరించారు. ► గర్భాలయం అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. ► దేవాలయాన్ని లేత గులాబీరంగు ఇసుక రాయితో నిర్మించారు. ఇందుకు రాజస్థాన్ లోని భరత్పూర్ జిల్లా బన్సీపహాడ్‌పూర్ క్వారీ నుంచి 5 లక్షల ఘనపుటడుగుల లేత గులాబీ రంగు రాయి, గర్భాలయం కోసం ఇదే రాష్ట్రంలోని మక్రానా నుంచి లక్ష ఘనపుటడుగుల తెలుపురంగు చలవరాతిని తెప్పించారు. ► రామ జన్మభూమికి సంబంధించి 2019 నవంబరులో సుప్రీం కోర్టు తీర్పు రాగా, 2020 ఫిబ్రవరిలో దేవాలయ కమిటీ ఏర్పాటైంది. ఆలయానికి ప్రధాని మోదీ 2020 ఆగస్టు 5న భూమి పూజ చేశారు. ► ఆలయ పనులు మూడు షిఫ్టుల్లో రేయింబవళ్లు కొనసాగిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 3500 మంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. ► ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థ కాగా, పనుల పర్యవేక్షణ బాధ్యత టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చూస్తోంది. ► శిల్పాలను తీర్చిదిద్దేందుకు ఒడిషా నుంచి ఎక్కువమంది శిల్పులు వచ్చారు. సిమెంట్ లాంటి బైండింగ్ మెటీరియల్ వినియోగిస్తున్నారు. ఇందులో రాళ్లు జోడించటం అనేది క్లిష్టమైన ప్రక్రియ, ఈ ప్రక్రియలో విశేష అనుభవం ఉన్న రాజస్థాన్ నిపుణులకు ఆ బాధ్యత అప్పగించారు. కాపర్ క్లిప్స్ మాత్రమే వాడి రాళ్లను అనుసంధానిస్తున్నారు. ► ఒడిషా, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సిబ్బంది పనుల్లో పాల్గొంటున్నారు. ఈ మందిరం భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీక ‘‘రాముడు జన్మించిన చోటే ఆయన దేవాలయం నిర్మితమవుతుందన్న విశ్వాసం పదేళ్ల క్రితం వరకు లేదు. కానీ అది సాధ్యమై ఇప్పుడు ఆ ఆదర్శ పురుషుడి దివ్య దర్శనానికి నోచుకోబోతున్నాం. అందుకే రామజన్మభూమి మందిరం నిర్మించాలన్న ఆకాంక్ష దైవ సంకల్పమని నేను నమ్ముతాను. అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య మందిరం ఓ సాధారణ దేవాలయం కాదు, అది భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీక. అందరూ ఆ అద్భుతాన్ని దర్శించుకోవాలి. దేవుడి ముందు అంతా సమానులే, అందరిపట్లా ఆ రాముడిది సమభావనే. అందుకే ఈ నిర్మాణం సామాజిక సామరస్యాన్ని ప్రతిబింబిస్తుంది. దేశ నలుమూలల ఆలయ నిర్మాణ సంప్రదాయాలను ప్రతిఫలిస్తుంది. దేశంలోని ప్రతి గ్రామ చొరవ అందులో కనిపిస్తుంది. దాదాపు రూ.2 వేల కోట్లతో నిర్మిస్తున్న ఈ ఆలయ ఖర్చులో ప్రభుత్వాలది నయా పైసా లేదు. అంతా భక్తుల విరాళమే. అందుకే మన దేవుడు, మన మందిరం.’’ – నృపేంద్ర మిశ్రా, శ్రీ రామజన్మభూమి దేవాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ . ప్రధానమంత్రి కార్యాలయ మాజీ ముఖ్య కార్యదర్శి ఆ తలుపుల తయారీలో తెలుగువారు... ప్రధాన ఆలయానికి తలుపులు అమర్చే అవకాశం హైదరాబాద్‌కు చెందిన అనురాధా టింబర్ డిపోకు దక్కింది. డిపో నిర్వాహకుడు శరత్ బాబు చదలవాడ గతంలో యాదాద్రి మందిరానికి తలుపు చేయించారు. అయోధ్య రామ మందిరానికి తలుపుల నమూనా కావాలంటూ ట్రస్టు సభ్యుల నుంచి పిలుపు రావటంతో ఆయన టేకుతో దాన్ని సిద్ధం చేయించారు. ఆ పనితనానికి సంతృప్తి చెందిన కమిటీ ఆయనతో చర్చించి తలుపులు సిద్ధం చేసే బాధ్యత అప్పగించింది. మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి తెప్పించిన మేలిమి రకం టేకు చెక్కతో తలుపులు రూపొందిస్తున్నారు. శరత్ బాబు చదలవాడ అయోధ్యలోని కరసేవక్ పురంలోని కార్యశాలలో ఈ తలుపులను నిపుణులు సిద్ధం చేస్తున్నారు. అక్కడి ఇన్ చార్జ్ ఆర్యన్ మిశ్రా ఆధ్వర్యంలో తమిళనాడుకు చెందిన నిపుణులు వాటిని రూపొందిస్తున్నారు. మొత్తం 44 తలుపులకుగాను ప్రస్తుతానికి 18 సిద్ధమయ్యాయి. వీటిని దిగువ అంతస్తులో వినియోగిస్తారు. బాలరాముడు ఉండే గర్భాలయానికి సంబంధించి రెండు జతలు పూర్తి చేసి ఆలయానికి చేర్చారు. 9 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో ఇవి రూపొందాయి. నెమలి పురి విప్పుకున్నట్టు వీటిపై నగిషీలద్దారు. ఇక అంతస్తులోని ఇతర ప్రాంతాల్లో వాడే తలుపులకు ఏనుగు అర్చిస్తున్నట్టుగా.. పద్మాలు విచ్చుకున్నట్టుగా... ఇలా పలు చెక్కడాలతో అద్భుతంగా రూపొందించారు. వెయ్యేళ్లపాటు వర్థిల్లే దేవాలయానికి తలుపులు సిద్ధం చేసే అవకాశం రావటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు చదలవాడ శరత్‌బాబు ‘సాక్షి’తో చెప్పారు. అన్నీ ఉచితమే... అందరూ సమానమే! రామ మందిరం దేశంలోనే ప్రముఖ దేవాలయాల జాబితాలో చేరబోతోంది. ఇలాంటి చోట దర్శనం, ప్రసాదాలకు రుసుము ఉండటం సహజం. కానీ, భక్తులు సమర్పించిన రూ.వేల కోట్ల విరాళాలతో రూపుదిద్దుకుంటున్న ఈ భవ్య మందిరంలో భక్తులపై దర్శన వేళ అదనంగా రుసుము భారం మోపొద్దని ట్రస్టు నిర్ణయించింది. ఎంతమంది భక్తులు వచ్చినా ఎలాంటి రుసుమూ లేకుండా దర్శనానికి అవకాశం కల్పించబోతున్నారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరికీ ఒకే తరహాలో దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి దర్శన అనంతరం ఎంతో భక్తిశ్రద్ధలతో స్వీకరించే ప్రసాదం కూడా ఉచితంగా అందించాలని నిర్ణయించారు. 60 కిలోల బంగారంతో తాపడం ఆలయంలోని తలుపులకు బంగారంతో తాపడం చేయించనున్నారు. అన్ని తలుపులకు కలిపి 60 కిలోల బంగారాన్ని వినియోగిస్తున్నట్టు సమాచారం. దిగువ అంతస్తు బాలరాముడి ఆలయ తలుపులకు తాపడం పనులు ప్రారంభించారు. అనంతరం తాపడం కోసం సిద్ధం చేశారు. తలుపులపై ఉన్న నగిషీల తరహాలోనే బంగారు తాపడంపై కూడా సిద్ధం చేస్తున్నారు. భారీ భూకంపాలను తట్టుకునేలా... రామమందిర ప్రత్యేకతల్లో పునాది కూడా ఒకటి. 161 అడుగుల ఎత్తుతో నిర్మితమవుతున్న దివ్యభవ్య మందిరానికి 50 అడుగుల లోతుతో పునాది నిర్మించారు. అయోధ్య పట్టణ శివారు నుంచి సరయూ నది ప్రవహిస్తోంది. అయితే 400 ఏళ్ల క్రితం సరయూ ప్రస్తుతం ఆలయం నిర్మిస్తున్న ప్రాంతానికి అతి చేరువగా ప్రవహించేది. దీంతో ఆ ప్రాంత భూగర్భం ఇసుక మేటలతో నిండి ఉంది. భారీ నిర్మాణానికి పునాది పడాలంటే ఆ ఇసుకనంతా తొలగించాలి. ఇందుకోసం ఐఐటీ, ఎన్ ఐటీ నిపుణులు, రిమోట్ సెన్సింగ్ సెంటర్ పరిశోధకులు కలిసి దీనికి ప్రత్యేక పునాది నిర్మాణానికి డిజైన్ చేశారు. 50 అడుగుల లోతు నుంచి ఇసుక, మట్టిని తొలగించి వాటికి రీయింజనీర్ ఇసుక, కొన్ని రసాయనాలు, 10 శాతం ఫైన్ సిమెంట్ కలిపి పొరలు పారలుగా వేసి వాటిని కాంపాక్ట్‌గా మార్చి 47 పొరలుగా పైవరకు నిర్మించారు. ఆ ఇసుక, మట్టి భాగం పూర్తిగా గట్టిబడి 50 అడుగుల ఏకశిలగా మారింది. దాని మీద రెండున్నర మీటర్ల మందంతో రాఫ్ట్ నిర్మించారు. ఆ పైన ఒకటిన్నర మీటరు మందంతో గ్రానైట్ రాతిని పరిచి దాని మీద ప్రధాన నిర్మాణం జరిపారు. ఇప్పుడు భూ ఉపరితలం నుంచి ప్రధాన నిర్మాణం 20 అడుగుల ఎత్తులో మొదలవుతుంది. అక్కడకు చేరాలంటే 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. పునాది డిజైన్ మార్చింది తెలుగు ఇంజినీరింగ్ నిపుణుడే..! అయోధ్య మందిరానికి ప్రస్తుతం ఏర్పాటు చేసిన పునాదికి డిజైన్ చేసింది తెలంగాణకు చెందిన ఇంజినీరింగ్ నిపుణుడే కావటం విశేషం. తొలుత ఐఐటీ మద్రాస్ నిపుణులు పునాది కోసం సిమెంటు కాంక్రీట్ పైల్స్ డిజైన్ ఇచ్చారు. ఆలయ ట్రస్టు దానికి సమ్మతించి పనులకు శ్రీకారం చుట్టింది. ఒక్కోటి మీటర్ వ్యాసం, 40 మీటర్ల లోతుతో సిమెంట్కాంక్రీట్పైల్స్ను పునాదిలో నిర్మించాలని నిర్ణయించారు. ఇలా 1200 పైల్స్ ఏర్పాటు చేసి దాని మీద ప్రధాన నిర్మాణం చేపట్టాలన్నది వారి ఆలోచన. కానీ, సిమెంటు కాంక్రీట్పైల్స్ వయసు కేవలం వందేళ్లలోపు మాత్రమే ఉంటుందని పేర్కొంటూ, వరంగల్ నిట్ మాజీ ప్రొఫెసర్ పాండురంగారావు ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. దాని బదులు కాకతీయులు అనుసరించిన శాండ్బాక్స్ టెక్నాలజీని వినియోగిస్తే వెయ్యేళ్ల జీవిత కాలం ఉంటుందని రామప్ప, వేయి స్తంభాల దేవాలయాలపై నిర్వహించిన పరిశోధన పత్రాలను జత చేశారు. దీంతో ఆయనకు ట్రస్టు నుంచి పిలుపు వచ్చింది. విశ్వహిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ ఆధ్వర్యంలో పాండురంగారావు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ప్రతినిధులతో పునాది నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక నిపుణుల కమిటీని నియమించారు. నిర్మాణ ప్రాంతం గుండా వందల ఏళ్ల కింద సరయూ నది ప్రవహించటంతో భూమి పొరల్లో ఇసుక మేటలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆ కమిటీ కూడా నాటి పునాది డిజైన్ ను తిరస్కరించింది. తర్వాత 50 అడుగుల మేర మట్టిని తొలగించి రీయింజనీర్డ్ ఇసుక, దానికి కొన్ని రసాయనాలు, స్వల్ప మొత్తంలో ఫైన్ సిమెంట్ కలిపి పొరలు పొరలుగా వేసి కంప్రెస్ చేయాలంటూ సిఫారసు చేసింది. అలా చేస్తేనే పునాది కనీసం వెయ్యేళ్లపాటు ఉంటుందని పేర్కొంది. పాండురంగారావు సూచన మేరకే కొత్త పునాది ప్రణాళిక అమలు చేసి, వెయ్యేళ్లపాటు నిలిచే రీతిలో ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం విశేషం. మందిర పునాది ప్రాంతాన్ని పరిశీలిస్తున్న నిట్ మాజీ ప్రొఫెసర్ పాండురంగారావు వేయేళ్లు ఉండేలా... అయోధ్య రామాలయం వేయి సంవత్సరాల వరకు పటిష్ఠంగా ఉండేలా నిర్మిస్తున్నారు. ఇది జరగాలంటే పెద్దపెద్ద భూకంపాలను కూడా తట్టుకుని నిలబడే నిర్మాణం అవసరం. ఇందుకోసం రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు నిర్మాణ డిజైన్ లో పాలుపంచుకున్నారు. నేపాల్నుంచి అయోధ్య వరకు గతంలో సంభవించిన భూకంపాల తీవ్రతను పరిశీలించి వాటికి 50 రెట్లు పెద్ద భూకంపాలను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. వరదలను తట్టుకునేలా... అయోధ్య నగరం మీదుగా సరయూ నది ప్రవాహం గతంలో ఉండేది. ఇప్పుడు నగర శివారు గుండా ప్రవహిస్తోంది. ప్రతి వేయి సంవత్సరాల్లో నదీ ప్రవాహ గమనం మారడం సహజం. భవిష్యత్‌లో ఎప్పుడైనా ఇప్పుడు గుడి నిర్మిస్తున్న ప్రాంతం మీదుగా వరద పోటెత్తినా, పెద్దపెద్ద వరదలు సంభవించినా నిర్మాణానికి ఇబ్బంది లేకుండా ఉండేలా దాని పునాది పైన పీఠం ప్లాన్ చేశారు. ఇందుకు సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తల సిఫారసులను అనుసరించారు. 25 వేల మంది సామర్థ్యంతో త్వరలో బస ఏర్పాట్లు... ఆలయానికి చేరువలో భక్తులకు వసతి మందిరం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి దీంట్లో 25 వేల మంది వరకూ ఉండొచ్చు. ఈ గదులను ఉచితంగా అందిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారు. లక్షమంది భక్తులకు వసతి ఉండేలా గదులు సిద్ధం చేయాలన్న ఆలోచనలో ట్రస్టు ఉంది. అయితే సొంతంగా ఏర్పాటు చేయాలా, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలా అన్న దానిపై ఆలోచన చేస్తున్నారు. ప్రతి శ్రీరామనవమీ ప్రత్యేకమే! ► నవమి నాడు బాలరాముడి నుదుటిపై సూర్య కిరణాలు ► ప్రధాని మోదీ కోరికకు తగ్గట్టుగా నిర్మాణం అయోధ్య రామమందిరంలో ప్రతి శ్రీరామనవమి ప్రత్యేకంగా నిలవబోతోంది. ఆ రోజు సూర్యోదయ వేళ ఆలయ దిగువ అంతస్తు గర్భాలయంలోని బాల రాముడి విగ్రహ నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఆకాంక్షను ట్రస్టు ముందర ఉంచారు. ఆ మేరకు నిర్మాణం జరుగుతోంది. కిరణాలు దిగువ అంతస్తులోని గర్భాలయంలోకి ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా గర్భాలయం ద్వారం ఎత్తు, విగ్రహ ఎత్తును ఖరారు చేశారు. చాలా విశాలమైన దేవాలయం కావటంతో సహజసిద్ధంగా సూర్యకిరణాలు లోనికి వచ్చే వీలు ఉండదేమోనన్న ఉద్దేశంతో ప్రతిబింబం రూపంలో సూర్యకాంతి లోపలకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పట్లో రోజుకు 2 వేల మంది.. ఇప్పుడు 50 వేల మంది.. రేపు లక్ష? అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి కాకముందే భక్తుల తాకిడి పెరిగింది. ఇక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభం కాకమునుపు రోజుకు సగటున 1500 నుంచి 2000 మంది వరకు వచ్చేవారు. ఆలయ పనులు మొదలయ్యాక ఆ సంఖ్య ఒక్కసారిగా పది వేలకు పెరిగింది. ఇప్పుడు నిత్యం 40 వేల నుంచి 50 వేల మంది భక్తులు అయోధ్యకు వస్తున్నారు. జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆ సంఖ్య లక్షకు చేరువవుతుందని అంచనా వేస్తున్నారు. అయోధ్య రాముడి విరాళాలు రూ.3500 కోట్ల పైమాటే... ఆలయ నిర్మాణానికి అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రపభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవటం లేదని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇప్పటికే ప్రకటించింది. పూర్తిగా భక్తులు సమర్పించిన విరాళాలతోనే పనులు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా రామభక్తుల నుంచి రూ.3500 కోట్లకు పైగానే విరాళాలు అందినట్టు సమాచారం. వాటి ద్వారా వస్తున్న వడ్డీ మొత్తంతోనే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. భక్తులు ఇప్పటికీ విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. అయోధ్య ఆలయ సమీపంలో ఉన్న కౌంటర్లు, తాత్కాలిక మందిరం వద్ద ఉన్న కౌంటర్లతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా భక్తులు విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. ప్రతినెలా రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు అవి సమకూరుతున్నట్టు సమాచారం. (అయోధ్య నుంచి ‘సాక్షి’ ప్రతినిధి గౌరీభట్ల నరసింహమూర్తి) ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి -
మైసూర్లో శ్రీహరి సన్నిధి ప్రతిష్టించిన దత్త పీఠాధిపతి
మైసూర్లో ప్రపంచంలోని అరుదైన రెండు వేల సాలగ్రామాలతో శ్రీహరి సన్నిధి ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అవధూత దత్త పీఠాధిపతి పరమ పూజ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. సాధారణంగా 100 సాలిగ్రామాలు ఉంటే ఆలయం నిర్మించాలని శాస్త్ర వచనం చెబుతుంది. తాజాగా రెండు వేల సాలిగ్రామాలతో శ్రీహరి సన్నిధి ఆలయం అత్యంత శోభాయ మానంగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి స్వర్ణ యంత్ర ప్రతిష్ట చేసి, శిఖరానికి కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని,శ్రీహరి సన్నిధిని దర్శించుకొని మొక్కుల చెల్లించుకున్నారు. -
రూ.2 కోట్లతో శనైశ్చర స్వామి ఆలయ నిర్మాణం
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కృష్ణా నదీ తీరాన ప్రత్యేక శనైశ్చరస్వామి వారి దేవస్థానం నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ సమీపంలో శనీశ్వరునికి శనైశ్చరస్వామి దేవస్థానం పేరుతో రెండున్నర దశాబ్దాల క్రితం ఆలయాన్ని నిర్మించారు. శనీశ్వరునికి పూజలు నిర్వహించే భక్తులు ఈ ఆలయానికి పోటెత్తుతుంటారు. అటువంటి ఆలయాన్ని కృష్ణా పుష్కరాల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కూలగొట్టింది. ఆ తరువాత ఆలయ నిర్మాణాన్ని విస్మరించింది. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు విజ్ఞప్తి మేరకు సీఎం జగన్ ఈ ఆలయాన్ని అక్కడే పునఃనిర్మాణం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా రూ. 2 కోట్లతో ధర్మదాయ శాఖ పరిధిలో ప్రభుత్వం భారీ నిర్మాణం పనులను చేపట్టింది. అలాగే నగరంలోని మరికొన్ని కూలగొట్టిన ఆలయాలను సైతం సీఎం ఆదేశాలతో పునఃనిర్మాణ పనులను మొదలుపెట్టారు. ముందుకు వచ్చిన దాత ఆలయ నిర్మాణం పూర్తిగా తానే చేపడతానని విజయవాడకు చెందిన వ్యాపారవేత్త చలవాది ప్రసాద్ ముందుకువచ్చారు. దేవదాయ శాఖ నిర్ణయించిన విధంగా ఆలయాన్ని పూర్తిగా తానే నిర్మాణం చేసి అప్పగిస్తానని తన సమ్మతిని తెలిపి పనులను ప్రారంభించారు. ఆలయంతో పాటుగా వంటశాల, గోశాల, ఆలయ కార్యాలయ నిర్మాణాలను అందులో చేపట్టనున్నారు. శనీశ్వరునితో పాటుగా అనుబంధంగా రాహుకేతువులను సైతం ఉపాలయంగా ఏర్పాటు చేయనున్నారు. 2 అంతస్తులుగా చేపట్టిన ఈ ఆలయ నిర్మాణంలో గర్భాలయాన్ని పూర్తిగా రాతితో చేపట్టనున్నారు. గర్భాలయం నుంచి గోపురం వరకు పూర్తిగా రాతితో నిర్మించనున్నారు. అత్యంత గట్టిగా దీని నిర్మాణం జరుగుతుంది.కాగా, ఆలయ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయటానికి కసరత్తు చేస్తున్నట్లు ఆలయ ఈవో ఘంటశాల శ్రీనివాసు తెలిపారు. -
15 లక్షల ఖాళీ బీరు సీసాలతో ఆలయం
ప్లాస్టిక్‌తోనే కాదు, గాజుతోనూ పర్యావరణానికి ముప్పే! ప్లాస్టిక్ ఎంతకాలమైనా మట్టిలో కలవదు. గాజు కొంతకాలానికి మట్టిలో కలిసిపోతుంది. ఆ లెక్కన ప్లాస్టిక్ కంటే గాజు మెరుగైనదే అయినా, గాజు తయారీ ప్రక్రియలో గాజును కరిగించడానికి అత్యధిక ఉష్ణోగ్రతలు అవసరమవుతాయి. ఫలితంగా పెద్దమొత్తంలో కర్బన ఉద్గారాలు గాలిలోకి విడుదలై, పరిసరాల్లోని వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. వాడేసిన గాజుసీసాలను పునర్వినియోగంలోకి తేవడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని కొంతవరకైనా అరికట్టవచ్చని థాయ్‌లాండ్ శాస్త్రవేత్తలు భావించారు. వారి ఆలోచనకు ప్రతిరూపమే ఈ ఫొటోల్లో కనిపిస్తున్న సీసాల ఆలయం. థాయ్‌లాండ్‌లోని సిసాకేత్ ప్రావిన్స్ ఖున్‌హాన్ ప్రాంతంలో ఉంది ఈ సీసాల ఆలయం. ఈ ఆలయ నిర్మాణం కోసం 1984 నుంచి ఖాళీ బీరుసీసాల సేకరణ మొదలుపెట్టారు. ఆలయ నిర్మాణానికి అంచనా వేసిన మేరకు 15 లక్షల ఖాళీసీసాలను సేకరించి, రెండేళ్లలో దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ ప్రాంగణంలో ఇదేరీతిలో 2009 నాటికి ఇరవై కట్టడాలను నిర్మించారు. వీటిలో ప్రార్థన మందిరాలు, శ్మశాన వాటిక, పర్యాటకుల కోసం స్నానపు గదులు, ఫౌంటెన్లు వంటివి ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా సీసాలతో నిర్మించినవే! ‘మిలియన్ బాటిల్ టెంపుల్’గా వార్తలకెక్కిన ఈ ఆలయం పేరు ‘వాట్ పా మహా చేది కేవ్’. సీసాలతో ఆలయం నిర్మించడానికి ముందు ఇక్కడ ఒక పురాతన బౌద్ధాలయం జీర్ణావస్థలో ఉండేది. దానిని ఇలా సీసాలతో జీర్ణోద్ధరణ చేశారు. ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించగానే, స్థానికులే కాకుండా థాయ్ ప్రభుత్వం కూడా తనవంతుగా లక్షలాది ఖాళీసీసాలను ఈ ఆలయానికి పంపింది. ఈ సీసాల ఆలయం థాయ్‌లాండ్‌లో పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారింది. థాయ్‌లాండ్‌కు వచ్చే పర్యాటకుల్లో చాలామంది ప్రత్యేకించి ఇక్కడకు వచ్చి, ఈ ఆలయం వద్ద నిలబడి ఫొటోలు దిగుతుంటారు. ఎందుకు నిర్మించారంటే..? పనిగట్టుకుని మరీ ఖాళీసీసాలతో ఆలయ జీర్ణోద్ధరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనుకుంటున్నారా? నిజానికి పర్యావరణాన్ని రక్షించుకోవలసిన అవసరం తీవ్రంగానే ఏర్పడింది. చుట్టూ సముద్రతీరం ఉండే థాయ్‌లాండ్ బీచ్‌లలో పర్యాటకుల కోలాహలం నిరంతరం ఉంటూనే ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణానికి ముందు– అంటే, 1984 నాటికి ముందు థాయ్ బీచ్‌లలో ఎక్కడ చూసినా వాడి పారేసిన ఖాళీ బీరుసీసాలు గుట్టలు గుట్టలుగా కనిపించేవి. సముద్రాన్నే మింగేసేంతగా ఖాళీ సీసాల గుట్టలు ఏర్పడటంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. థాయ్ ప్రభుత్వానికి కూడా ఇదో తలనొప్పి వ్యవహారంగా మారింది. సముద్రం కలుషితం కాకుండా ఉండేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టకుంటే పరిస్థితి చెయ్యిదాటిపోయే ప్రమాదం ఉందని గుర్తించింది. అయితే, ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. తీరంలో గుట్టలుగా పేరుకుపోతున్న ఖాళీసీసాలను ‘ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. ఈ సమస్య పరిష్కారానికి మీ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోండి’ అని ప్రజలను కోరింది. బౌద్ధభిక్షువులను కూడా ఇదే కోరిక కోరింది. ప్రభుత్వం పిలుపుతో బౌద్ధభిక్షువులు ముందుకొచ్చారు. ‘ఖాళీసీసాలను మాకిచ్చేయండి. మేము ఇక్కడ ఆలయం నిర్మించుకుంటాం’ అని అడిగారు. ‘ఇవ్వడమేంటి? తీరానికి వెళ్లి మీరే కావలసినన్ని సీసాలను తీసుకెళ్లండి’ అని బదులిచ్చింది ప్రభుత్వం. లక్షలాది సీసాలను తెచ్చుకోవడం కొద్దిమంది బౌద్ధభిక్షువుల వల్ల సాధ్యమయ్యే పనికాదు. దీంతో ఆలయ ధర్మకర్తలు బాగా ఆలోచించి, సీసాల సేకరణ కోసం ప్రజల సహాయాన్ని కోరారు. ఒక్కరూ స్పందించలేదు. కొన్నాళ్లు ఓపికగా ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో మరో ప్రకటన చేశారు. ‘పరిశుభ్రతే పరమాత్మ. అందువల్ల అందరూ తలా ఓ చెయ్యి వేసి, దైవకార్యానికి మీ వంతు సహాయం చెయ్యండి. ఆలయ నిర్మాణానికి కలసిరండి. పర్యావరణ పరిరక్షణకు సహాయపడండి’ అని ప్రకటించడంతో ప్రజల్లో నెమ్మదిగా స్పందన మొదలయ్యింది. ఒక్కొక్కరే సీసాలు సేకరించి, ఆలయానికి ఇవ్వసాగారు. థాయ్ తీరంలో నెమ్మదిగా సీసాల గుట్టలు తరిగిపోసాగాయి. అలాగే ఆలయ నిర్మాణం వేగం పుంజుకుంది. రెండేళ్ల వ్యవధిలోనే ఇలా చక్కని సీసాల ఆలయం తయారైంది. వనరుల పునర్వినియోగానికి ఈ ఆలయం ఒక అద్భుతమైన ఉదాహరణ. - దినేష్ రెడ్డి -
వాజ్‌పేయికి ఆలయం
సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి తమిళనాడులో ఆలయం నిర్మించనున్నారు. మహాకవి భారతియార్ ముని మనవరాలు, బీజేపీ అగ్రనేత ఉమాభారతి కలిసి ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పుదుకోటై జిల్లా వీరాలిమలై సమీçపంలో వాజ్‌పేయికి గుడి కట్టించాలని ఆయన అభిమానులు సంకల్పించారు. రూ.2 కోట్లతో 2,400 చదరపు అడుగుల్లో నిర్మాణ కమిటీ తెలిపింది. -
ఏడాదిలో 500 ఆలయాలు
తిరుమల: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రాంతాల్లో 500 ఆలయాలను నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ధర్మకర్తల మండలి నిర్ణయించింది. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో చేపట్టే ఈ నిర్మాణాలను ఏడాదిలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జమ్మూలో ఇటీవల భూమిపూజ చేసిన శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణ ట్రస్ట్ భూమి కేటాయిస్తే శ్రీవారి ఆలయం, భజన మందిరం, యాత్రికుల వసతి సముదాయాల్లో వారు ఏది కోరితే అది నిర్మించాలని తీర్మానించింది. ముంబై, వారణాసిల్లో కూడా శ్రీవారి ఆలయాలు, చెన్నైలో పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మించి భక్తులకు అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షుడిగా ఏర్పాటైన టీటీడీ ధర్మకర్తల మండలి బాధ్యతలు స్వీకరించి సోమవారానికి (జూన్ 21) రెండేళ్లయింది. ఈ రెండేళ్లలో పాలకమండలి దేశవ్యాప్తంగా అనేక అభివృద్ధి, హిందూ ధర్మప్రచార కార్యక్రమాలను చేపట్టింది. గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముక్కోటి ఏకాదశి పండుగకు శ్రీవారి ఆలయంలో ఉత్తరద్వార దర్శనాన్ని 10 రోజులపాటు అందుబాటులోకి తీసుకొచ్చింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో శ్రీవారి వైభవాన్ని ప్రచారం చేయడానికి 6 ప్రచార రథాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కరోనాను ఎదుర్కోవడానికి సమర్థమైన చర్యలు తీసుకుంటూనే భక్తులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రజలనుకరోనా బారిన పడకుండా కాపాడాలని శ్రీవారిని ప్రార్థిస్తూ సుందరకాండ, విరాటపర్వం, భగవద్గీత పారాయణ వంటి కార్యక్రమాలు చేట్టింది. గోవిందుడికి గో ఆధారిత నైవేద్యం కార్యక్రమం కింద సహజ ఆధారిత పంటలతో స్వామికి తయారు చేస్తున్న నైవేద్యాల కార్యక్రమాన్ని శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది. కాగా, కోవిడ్ లాక్డౌన్ సమయంలో వలసకూలీల కోసం సుమారు 35.50 లక్షల అన్నప్రసాదం ప్యాకెట్లను టీటీడీ పంపిణీ చేసింది. తిరుపతిలోని సత్రాలను కోవిడ్ కేర్ సెంటర్ల కోసం అప్పగించి, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా మార్చింది. వెంటిలేటర్లు, ఇతర పరికరాల కొనుగోలు కోసం జిల్లా యంత్రాంగానికి రూ.19 కోట్లు ఇచ్చింది. -
దేవాలయాలు ఎలా నిర్మిస్తారో తెలుసా?
ఆదిలో దేవాలయాల నిర్మాణం మట్టి, చెక్క వంటి పదార్థాలతో జరిగేది. అయితే ఇవి చాలా త్వరగా రూపుమాసిపోయేవి. కాలక్రమేణా గుహాలయాలు, శిల మీద చెక్కిన భగవంతుని మూర్తులు, ఇటుకలతో కట్టిన కట్టడాలు వాడుకలోకి వచ్చాయి. ఆ తరవాత కాలంలో పెద్ద పెద్ద శిలల మీద చెక్కినవి, ఏక శిలావిగ్రహాలు... వాస్తు శాస్త్రానుసారం దేవాలయ నిర్మాణం మార్పులు చెందింది. ఆ విధానమే నేటికీ ఆచరణలో ఉంది. ఈ నిర్మాణంలో వాస్తు పూర్తిగా శాస్త్రబద్ధంగా, మానవ ఆరోగ్యానికి, మనో వికాసానికి ఉపయోగపడేలా ఉండేది. మన దేశం చాలా సువిశాలమైనది. ఇక్కడ భిన్న ఆచారాలు, సంస్కృతులు, సంప్రదాయాలు నెలకొని ఉన్నాయి. ఆ భిన్నత్వం దేవాలయ నిర్మాణంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్లే ఆలయాల నిర్మాణం భిన్నభిన్న శైలుల్లో దర్శనమిస్తుంది. వీటి వెనుక వేదాంతం, ఆరోగ్య ప్రాధాన్యత ఇమిడి ఉన్నాయి. దేవాలయాల నిర్మాణం అన్ని ప్రాంతాలవారిదీ బయటకు చూడటానికి ఒకేలా కనిపిస్తున్నప్పటికీ, అనుసరించిన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ దేవాలయాలు ఉత్తరాది విధానం, దక్షిణాది విధానం అని రెండు విధాలుగా కనిపిస్తాయి. ఉత్తరాది వారి శైలి వక్రరేఖావృత్తమైన గోపురం ఉంటుంది. దక్షిణాది వారిది ద్రవిడశైలి. వీరి గోపురాలు తిర్యక్ చిహ్న సూచీ స్తంభంలా ఉంటాయి. నగర, ద్రవిడ నిర్మాణాలను మిళితం చేసిన వేసరశైలి కూడా అక్కడక్కడా కనిపిస్తుంది. ఉత్తర భారతదేశంలోను, మధ్య భారతదేశంలోను దేవాలయ నిర్మాణం గుప్తుల కాలంలో ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతోంది. ఉత్తర భారత దేశంలో.. సాంచి, తిగవా (మధ్యప్రదేశ్), జబల్పూర్, భూమారా (మధ్యప్రదేశ్), నాచ (రాజస్థాన్), దియోఘర్ (ఉత్తరప్రదేశ్), దక్షిణ భారతదేశ శైలి... తమిళనాడు, ఉత్తర కర్ణాటక ప్రాంతాలలో కనిపిస్తుంది. ద్రవిడ విధానం తమిళనాడులోనే పురుడు పోసుకుంది. శిలలను శిల్పాలుగా మలిచి బౌద్ధదేవాలయాల నిర్మాణం జరిగింది. ఆ తరవాత రాతి నిర్మితమైన దేవాలయాల నిర్మాణం ప్రారంభమైంది. ఇవి ముఖ్యంగా వైదిక సంబంధమైనవి కాని జైన సంబంధమైనవి కాని అయి ఉంటా యి. కాంచీపురానికి చెందిన పల్లవులు, బాదామీ చాళుక్యులు, రాష్ట్రకూటులు... వీరి కారణంగా అనేక దేవాలయాలు నిర్మితమయ్యాయి. వారంతా రాజులుగా పట్టాభిషిక్తులయ్యాక దక్షిణ భారతంలో ఆరోగ్యాన్నిచ్చే దేవాలయ వాస్తు ప్రసిద్ధిలోకి వచ్చింది. ఈ విధంగా దేవాలయాల నిర్మాణం ప్రారంభమై, అది మానవ ఆరోగ్య జీవితంలో భాగంగా మారిపోయింది. – వైజయంతి పురాణపండ చదవండి: Chaganti Koteswara Rao: కళ్ల ఎదుటే కైలాసం -
తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల నిర్మాణానికి శ్రీకారం
తిరుపతి ఎడ్యుకేషన్: హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో 500 ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో బుధవారం సమరసత సేవా ఫౌండేషన్, సంస్కృతి సంవర్ధిని సంస్థల ప్రతినిధులు, ధర్మప్రచార పరిషత్ అధికారులతో ఈవో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ సమరసత సేవా ఫౌండేషన్, సంస్కృతి సంవర్ధిని సంస్థల ద్వారా రెండో విడతలో 500 ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలిపారు. సమరసత సేవా ఫౌండేషన్ నిర్వహిస్తున్న బాలవికాస కేంద్రాలకు ఆధ్యాత్మికత, దేశభక్తిని పెంపొందించే పుస్తకాలు పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లకు శిక్షణ తరగతులు నిర్వహించాలని తెలిపారు. నూతనంగా నిర్మించే ఒక్కో ఆలయానికి టీటీడీ రూ.10 లక్షల వరకు సమకూర్చనున్నట్లు ఈవో తెలిపారు. -
తెలుగు రాష్ట్రాల్లో 500 ఆలయాల నిర్మాణం
కాకినాడ: హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 500 ఆలయాలను నిర్మించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. వీటిని గిరిజన, దళిత, బలహీన వర్గాల, మత్స్యకార గ్రామాల్లోని కాలనీల్లో నిర్మించనున్నట్లు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బాలాత్రిపురసుందరి అమ్మవారి ఆలయంలో ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వరకు 10 రోజుల పాటు తిరుమల ఆలయ వైకుంఠ ద్వారం తెరచి ఉంచి, సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. భక్తులు ఆన్లైన్ ద్వారా ముందుగా టికెట్లు రిజర్వు చేసుకుని తిరుమలకు రావాలని సూచించారు. టీటీడీ కార్యక్రమాలపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో మంత్రులు విశ్వరూప్, కన్నబాబు, చెల్లుబోయిన వేణు, ఎంపీ వంగా గీత తదితరులు పాల్గొన్నారు. -
మీరే నా దేవుళ్లు!
అన్నానగర్ : తంజావూరు జిల్లా పేరావూరని సమీపంలో తల్లిదండ్రులకు ఓ కుమారుడు ఏకంగా ఆలయాన్నే కట్టేశాడు. తంజావూరు జిల్లా పేరావూరని సమీపం కూప్పుక్కాడు గ్రామానికి చెందిన నటేషన్, రాజామణి దంపతులు. వీరిద్దరూ కొన్ని సంవత్సరాలకు ముందు మృతి చెందారు. వీరికి పెరమైయాన్, రాజాకన్ను, మారిముత్తు, సౌందరరాజన్, కరుప్పయ్యన్ అనే ఐదుగురు కుమారులు ఉన్నారు. వీరిలో ఐదో కుమారుడైన కరుప్పయ్యన తన తల్లిదండ్రుల మీద అధిక ప్రేమ కలిగినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులు చనిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన తల్లిదండ్రులకు ఆలయం కట్టి రోజూ పూజ చేయాలని సిద్ధమయ్యాడు. నాలుగేళ్లకు ముందు ఆలయం కట్టి కుంభాభిషేకం చేశాడు. అందులో తన తల్లిదండ్రుల ఫొటోలను పెట్టి ప్రతిరోజూ పూజ చేస్తూ వస్తున్నాడు. ప్రతి సంవత్సరం జూన్ 29న కుంభాభిషేకం చేయగా ఆ రోజున అన్నదానం కూడా చేస్తున్నాడు. ఈ ఏడాది కరోనా కల్లోలం కారణంగా జనం గుంపులుగా ఉండకూడదన్న నిబంధనతో ప్రజలు రాలేదు. తల్లిదండ్రుల ఆలయంలో పూజచేసి పొంగల్ పెట్టి స్థానికులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. నటేశన్, రాజామణి దంపతులకు కుమారులు, మనవళ్లు, మనవరాళ్లు అని కుటుంబ సభ్యులు 85 మంది ఉన్నారు. ఈ పూజలో అందరూ కలుసుకుంటారు. తల్లిదండ్రులు ప్రాణాలతో ఉండేటప్పు డే గమనించకుండా అనాథశ్రమాలలో చేర్పించే కుమారులు ఉన్న ఈ కాలంలో తల్లిదండ్రులకు ఆలయం కట్టి పూజ చేస్తూ వస్తున్న కరుప్పయ్యన్ చూసి ఆ ప్రాంత ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
దేవాలయ వ్యవస్థ
ఆలయాన్ని దర్శించే భక్తులు ఆలయవ్యవస్థ గురించి తెలుసుకోవడం కనీసధర్మం. అందులో ముందుగా.. ఆలయాన్ని నిర్మించే శిల్పులు, స్థపతుల గురించి తెలుసుకోవాలి. వీరి తోడ్పాటు లేనిదే ఆలయనిర్మాణం అసాధ్యం. విశ్వకర్మ సంప్రదాయ పరంపరలోని వీరు శాస్త్రం, సంప్రదాయం అనుసరించి ఆలయం నిర్మించి.. అందులో విగ్రహం స్థాపిస్తారు. అందుకే వారిని స్థపతి అంటారు. శిల్పాచార్యులనే పేరుతో కూడా వీరు ప్రసిద్ధులు. భక్తుడు ఆలయానికి చేసే ఒక ప్రదక్షిణ ఫలం శిల్పాచార్యుడికి చేరుతుందని మయుడు చెప్పాడు. ఆలయనిర్మాణం.. ప్రతిష్ఠ జరిగాక ఆలయాభివృద్ధికి తోడ్పడేవారిలో అర్చకులు ముందుంటారు. లోకహితం కోరి అర్చనాది కైంకర్యాలు జరుపుతూ అర్చకుడే దేవుడి ప్రతినిధి అని.. ప్రజలతో మన్ననలందుకునే అర్చకవ్యవస్థను.. అర్చకులను గౌరవించడం భక్తుల విధి. ఇంకా వేదపారాయణదారులు.. శాస్త్రవిద్వాంసులు.. స్థానాచార్యులు... జ్యోతిష విద్వాంసులు.. గాయకులు.. నృత్యకారులు.. వాద్యకారులు...వైద్యులు..అలంకారికులు.. పరిచారకులు మొదలైన ఎందరో ఆలయవ్యవస్థలో భాగస్వామ్యులు. – కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు, ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
సర్వతో 'ఛి'ద్రాలయం
సాక్షి, హైదరాబాద్: చుట్టూ భారీ బండరాయి.. దానిపై భారీ శిఖరంతో ఆలయం.. నాలుగు వైపులా నాలుగు ద్వారాలు.. ఒక్కో ద్వారం నుంచి వెళ్తే ఒక్కో రూపంలో స్వామి దర్శనం.. తూర్పు వైపు లక్ష్మీ నరసింహుడు, పశ్చిమాన నాగలి ధరించిన బలరాముడు, దక్షిణాన వేణుగోపాల స్వామి, ఉత్తరాన సీతారామలక్ష్మణులు.. చుట్టూ విస్తరించిన బండరాయి మధ్య భాగాన్నే విగ్రహంగా మలిచారు నాటి శిల్పులు.. వందల ఏళ్లనాటి ఈ అరుదైన కట్టడం ఇప్పుడు ప్రమాదంలో పడింది. దాని ప్రత్యేకత, గొప్పతనంపై అవగాహన లేని దేవాదాయ శాఖ.. అభివృద్ధి పేరుతో ధ్వంసరచన మొదలుపెట్టింది. వెలకట్టలేని ఆ నిర్మాణాలను అపురూపంగా మరమ్మతు చేయాల్సింది పోయి, నిర్మాణ ప్రత్యేకతలు నాశనమయ్యేలా అడ్డగోలు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. భూపాలపల్లి జిల్లా నయన్పాకలో సర్వతోభద్ర నమూనాలో నిర్మితమైన ఆలయ దీన గాథ ఇది. ‘సాక్షి’ కథనంతో.. బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియని ఈ ఆలయంపై గతేడాది నవంబర్‌లో ‘సాక్షి’ప్రత్యేక కథనం ప్రచురించింది. పురావస్తు శాఖ విశ్రాంత అధికారి రంగాచార్యులుతో కలసి అమెరికా ప్రొఫెసర్ వ్యాగనార్ ఈ ఆలయాన్ని సందర్శించి నిర్మాణ రహస్యాలను వెలుగులోకి తేవడాన్ని ఉటంకిస్తూ కథనం సాగింది. ఆలయాన్ని చూసి మంత్రముగ్ధుడైన వ్యాగనార్.. ఇది అత్యంత అరుదైన అద్భుత నిర్మాణంగా పేర్కొన్నారు. దీనికి అలనాటి పద్ధతిలోనే మరమ్మతు చేసి భావితరాలకు అందించాలని సూచించారు. దీంతో స్పందించిన స్పీకర్ మ ధుసూదనాచారి.. ఆలయ పురోభివృద్ధికి నిధులు మంజూరు చేయించారు. అయితే ఆలయాన్ని మరమ్మతు చేసి భావితరాలకు అందిం చాల్సింది పోయి ఆ ప్రత్యేకతల్నే నాశనం చేసేలా ప్రణాళికలు రూపొందించి పనులు మొదలుపెట్టారు అధికారులు. నిబంధనలు పక్కనబెట్టి.. పురాతన కట్టడాల మరమ్మతు, పునరుద్ధరణకు ప్రత్యేక నిబంధనలున్నాయి. అప్పట్లో పెద్ద రాళ్లు, ఇటుకలు, డంగు సున్నం, కరక్కాయ, నల్లబెల్లం, గుడ్డు సొన, రాతిపొడి మిశ్రమంతో నిర్మాణాలు చేపట్టారు. కాబట్టి వాటికి మరమ్మతును ఆ మిశ్రమంతోనే పూర్తి చేయాలి. చార్మి నార్, వేయిస్తంభాల గుడి, రామప్ప దేవాలయం సహా ఏ చిన్న నిర్మాణాలైనా ఇదే నిబంధన. కట్టడం నిర్మాణ విశిష్టత దెబ్బతినకుండా, పురావస్తు శాఖ నిపుణుల పర్యవేక్షణలోనే పనులు జరగాలి. కానీ ఇక్కడ పూర్తి విరుద్ధంగా పనులు జరుగుతున్నాయి. ఆలయాన్ని అప్పగించాలని ఏఎస్ఐ కోరుతున్నందున నిధులు దానికి మళ్లించి పనులు చేయించాలని చరిత్రకారులు కోరుతున్నారు. ఆలయ గోపురాన్ని 15.2 అడుగుల ఎత్తు భారీ రాయితో, ఆ పైన 30 అడుగుల ఎత్తు పెద్దపెద్ద ఇటుకలతో నిర్మించారు. కొంతభాగం తప్ప మిగతా ఇటుక నిర్మాణం ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఇప్పుడు ఆ రాతి నిర్మాణం వరకు ఉంచి, పైన ఉన్న ఇటుక నిర్మాణాన్ని తొలగించబోతున్నారు. కానీ నాటి ఇటుక నిర్మాణాన్ని ధ్వంసం చేయకుండా దెబ్బతిన్న భాగాన్ని ఆ నమూనా ఇటుకలు రూపొందించి అప్పట్లో వాడిన మిశ్రమంతో మరమ్మతు చేయాలి. ఏం చేస్తున్నారు? దేవాలయానికి నాలుగు వైపులా 25 అడుగుల వెడల్పుతో ప్రాకార మండపాలు నిర్మించనున్నారు. అయితే నాటి ఆలయ భాగం మూసుకుపోయేలా, దాన్ని ఆనుకుని కొత్త నిర్మాణం చేపట్టరాదు. ఇప్పటి నిర్మాణాలు సిమెంటుతో చేపడతారు కాబట్టి ఆలయ ప్రత్యేకత కోల్పోయే అవకాశం ఉంది. ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించనున్నారు. ఇందుకు జిల్లా నిధులు రూ.13 లక్షలు ఖర్చు చేయనున్నారు. అయితే ఆలయానికి సంబంధించి రెండున్నర ఎకరాల భూమి వరకు గోడ నిర్మించాల్సి ఉండగా, దాన్ని తగ్గించి ఆలయానికి చేరువగా నిర్మించాలని యోచిస్తున్నారు. దేవాలయానికి చేరువగా భారీ కమ్యూనిటీ హాలు కూడా నిర్మించనున్నారు. ఇందుకు సింగరేణి సంస్థ రూ.75 లక్షలు వెచ్చించనుంది. మండపం ఫ్లోరింగుపై పూర్తిగా టైల్స్ అమర్చనున్నారు. ఇందుకోసం బ్లాస్టింగ్ చేస్తూ రాయిని పగులగొడుతున్నారు. కానీ ఇక్కడే ఈ ఆలయ ప్రత్యేకత ఉంది. చుట్టూ విస్తరించిన భారీ అఖండ రాయిపైనే ఆలయం నిర్మించారు. మధ్యలో నాలుగున్నర అడుగుల ఎత్తుతో ఆ గుట్ట రాతి భాగాన్నే విగ్రహాలుగా మలిచారు. ఆలయం చుట్టూ ఉన్న రాయిని తొలగించి టైల్స్ వేస్తే ఆలయం అసలు ప్రత్యేకత నాశనం అయ్యే అవకాశం ఉంది. బ్లాస్టింగ్ వల్ల ఆలయ ఉనికికి ప్రమాదం పొంచి ఉంది. ఈ మరమ్మతులకు దేవాదాయ శాఖ రూ.2 కోట్లు వెచ్చిస్తోంది. -
ఆలయ నిర్మాణానికి భూమి పూజ
చౌటుప్పల్: ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని ధర్మోజిగూడెంలో సీతారామచంద్ర స్వామి దేవాలయ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొంతం రాంరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్ బత్తుల శ్రీహరి, కొంతం కృష్ణారెడ్డి, బుచ్చిరెడ్డి, సుశీల, పద్మ, పగిళ్ల నర్సిరెడ్డి, భూపాల్‌రెడ్డి, సామిడి అంజిరెడ్డి, రాంచంద్రారెడ్డి, కొంతం దామోదర్‌రెడ్డి, లింగారెడ్డి, రాఘవరెడ్డి, సింహాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాన్ని నిర్మిస్తున్న సర్పంచ్‌కే అందులో ప్రవేశం లేదు
గాంధీనగర్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరానికి సమీపంలో రహెమాల్‌పూర్ అనే ఓ చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామానికో శివాలయం కావాలని ఆ ఊరి ప్రజలంతా దళిత మహిళా సర్పంచ్ పింటూబెన్‌ను కోరారు. పెద్ద మనసు గల ఆ సర్పంచ్ ఆలయాన్ని నిర్మించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. సర్పంచ్ కార్యాలయం నుంచి కాకుండా వ్యక్తిగతంగా కూడబెట్టుకున్న పది లక్షల రూపాయలతో శివాలయ నిర్మాణానికి నడుంకట్టారు. ఆలయం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. దళిత కులానికి చెందిన మహిళ అవడం వల్ల ఆ ఆలయంలోకి తనకు ఎప్పటికీ అనుమతి ఉండదని ఆమెకు తెలుసు. అయినా గ్రామ ప్రజల కోరిక మేరకు ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చారు. తన 32 భీగాల వ్యవసాయ భూమి ద్వారా కూడబెట్టిన పది లక్షల రూపాయలను పింటూబెన్ ఆలయ నిర్మాణానికి వెచ్చిస్తున్నారు. ఈ విషయం తెల్సిన ఓ జాతీయ మీడియా ఇటీవల ఆ గ్రామానికి వెళ్లి పింటూబెన్‌ను కలుసుకుంది. ఆమె నిర్మాణంలో ఉన్న శివాలయాన్ని మీడియా ప్రతినిధులకు చూపించారు. ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన ఆమె ఆలయం లోపలికి రావడానికి నిరాకరించారు. అందుకు అగ్రవర్ణ హిందువులు ఒప్పుకోరని, గొడవ చేస్తారని చెప్పారు. ‘మీరు నిర్మిస్తున్న ఆలయంలోకి మీకు రావాలని లేదా?’ అని మీడియా ప్రశ్నించగా, ‘ఎందుకు లేదు. తరతరాలుగా మమ్మల్ని అంటరానివారుగానే చూస్తున్నారు. ఏ ఆలయంలోనికి మమ్మల్ని అనుమతించరు’ అని ఆమె చెప్పారు. ఆమె గ్రామానికి సర్పంచ్ అయినప్పటికీ ఆమెను అగ్రవర్ణాల వారు అంటరాని వ్యక్తిగా చూడటంతో మీడియాకు ఆశ్చర్యం వేసింది. రాజకీయాలు వేరని, సమాజంలో కుల పట్టింపులు వేరని ఆమె చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఆమె తెలిపారు. ఆమె మాటల్లోని వాస్తవం ఎంతో తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు రాష్ట్రంలోని పలు ఆలయాలను సందర్శించి అక్కడి ఆలయ నిర్వాహకులను, పూజారులను వాకబు చేసింది. కొన్ని ఆలయాల్లోకి దళితులను అసలు అనుమతించడం లేదు. మరికొన్ని ఆలయాల్లోకి దళితులను అనుమతిస్తున్నా, గర్భగుడిలోకి మాత్రం అనుమతించడం లేదు. కొంతవరకు అనుమతించే ఆలయాల్లో దూరం నుంచి దళితులు దేవుడికి మొక్కకోవాలి. పూజారులెవరూ వారిని తాకరు, నుదిటన తిలకం పెట్టరు. తీర్థ ప్రసాదాలు ఇవ్వరు. రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లోని స్వామి నారాయణ నూతన మందిరం, ఇక్కడ ప్రసిద్ధి చెందిన నాగాలయంలో కూడా దళితుల పట్ల ఇలాంటి వివక్షే కొనసాగుతోంది. ఈ కాలంలో కూడా ఈ వివక్ష ఎందుకని ప్రశ్నించగా పూజారులు ఖర్మ సిద్ధాంతాన్ని వల్లించారు. తాము దళితులను అడ్డుకోవడం లేదని, దేవుడే వారిని రావద్దని ఆదేశించారని వారన్నారు. చట్ట ప్రకారం ప్రవేశించేందుకు దళితులు ధైర్యంగా ముందుకొస్తే ఏం చేస్తారని ప్రశ్నించగా, వాటినీ అడ్డుకుంటామని, వీలుకాకపోతే దళితులు వెళ్లాక గంగా జలాన్ని తీసుకొచ్చి ఆలయాన్ని శుద్ధి చేస్తామని పూజారులు తెలిపారు. అనవసరమైన గొడవలెందుకని దళితులే ఆలయాలకు దూరంగా ఉంటున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ పుట్టిన గడ్డపైనే ఇంకా దళితుల పట్ల వివక్షత కొనసాగడం ఏమిటో! -
మోదీ పేరిట మరో గుడి నిర్మాణం
న్యూఢిల్లీ: భారత దేశంలో దేశభక్తికి కొరత ఉండొచ్చుగానీ రాజకీయ నేతల పట్ల వారి అనుచరులకు, సినిమా యాక్టర్ల పట్ల అభిమానుల ప్రేమకు మాత్రం కొదవ లేదు. అందుకు వారి పేరిట వెలస్తున్న గుళ్లూ గోపురాలే నిలువెత్తు సాక్ష్యం. గుళ్లలో కొలువుదీరిన నేతలు లేదా నటీనటులు వరమిచ్చినా ఇవ్వకపోయినా అభిమానులు మాత్రం వారికి నిత్యం పూజలు చేస్తూ పులకించిపోతారు. ఆ మొన్నటికి మొన్న గుజరాత్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరిట గుడి కట్టడం కోసం ఆయన భక్తులు ఆయన విగ్రహాన్ని తయారుచేసి పూజలు పునస్కరాలు ప్రారంభించారు. గుడి కట్టడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఆ మీడియా నోట, ఈ మీడియా నోట ఈ విషయం మోదీదాకా వెళ్లడంతో అందుకు ఆయన వారించారు. అంతటి అది ఆగిపోయిందకునుంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో మోదీ పేరిట మరో గుడి నిర్మాణానికి ఏర్పాట్లు జోరుగా జరిగిపోతున్నాయి. కౌశాంబి జిల్లాలో వీహెచ్‌పీ నాయకుడు బ్రిజేంద్ర నారాయణ్ మిశ్రా ఇప్పటికే ‘నమో నమో టెంపుల్’ పేరిట మోదీకి ఓ గుడిని నిర్మించి పూజలు పునస్కారాలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు అలహాబాద్ జిల్లాలోని జలాల్పూర్లో శ్రీకృష్ణ సేన అధ్యక్షుడిగా చెప్పుకునే పుష్పరాజ్ సింగ్ శనివారంనాడు తన అనుచర వర్గంతో కలిసి మోదీ గుడికోసం భూమిపూజచేసి పునాది రాయి కూడా వేశారు. బ్రాహ్మణోత్తములను పిలిచి రెండు గంటలపాటు సకల విఘ్నాలు తొలిగిపోవాలంటూ పుణ్యవచనాలు చదువిస్తూ పూజలు చేయించారు. కోటిన్నర రూపాయలతో ఐదు నెలల కాలంలోనే మోది గుడి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పుష్పరాజ్ ప్రకటించారు. గుడిలో కృష్ణుడి విగ్రహంతోపాటు మోదీ విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్టిస్తామని అమిత్ షా లాంటి వారు పోటీ రాకుండా ముందే ప్రకటించారు. ఈ గుడి నిర్మాణానికయ్యే ఖర్చును బీజేవీ, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌తోపాటు అన్ని హిందూ సంస్థల నుంచి విరాళాలు వసూలు చేస్తామని పుష్పరాజ్ తెలిపారు. గుడికి కావాల్సిన డిజైన్‌ను తయారు చేయాల్సిందిగా కామ్తా ప్రసాద్ అనే ఆర్కిటెక్ట్‌ను అప్పుడే పురమాయించారు. గుడి నిర్మాణంలో మీర్జాపూర్ నుంచి మార్బుల్స్, ఇతర నాణ్యమైన రాళ్లను తెప్పిస్తామని చెప్పారు. ఇక్కడి వరకు బాగానే ఉందిగానీ గ్రామసభకు చెందిన స్థలాన్ని ఆక్రమించుకొని పుష్పరాజ్ గుడికడుతున్నారని ఆయనంటే గిట్టని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మోదీ పట్ల ప్రేమతో ఆయన గుడికట్టడంలేదని, కొంత స్థలంలో గుడికట్టి మిగతా స్థలాన్ని స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు కుట్రపన్నుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాజకీయ నేతలు, యాక్టర్ల పేరిట దేశంలో గుళ్లూ గోపురాలు చాలానే ఉన్నాయి. మరి అవి ఎవరి ప్రయోజనాల కోసం వెలిసాయో, ఎవరి ప్రయోజనాలను నెరవేరుస్తున్నాయో ఆ పరమాత్ముడికే తెలియాలి. దేశం మొత్తంమీద రాజకీయ నేతలు, సినీ నటీనటుల పేరిట దాదాపు వంద గుళ్లు ఉన్నాయి. వాటి అన్నింటికి కలిపి 35 కోట్ల రూపాయల ఖర్చుకావచ్చని ఓ అంచనా. వాటిలో కొన్ని వివరాలు... 1.సోనియా గాంధీ పేరిట కరీంనగర్ జిల్లా మల్లిలియాలో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఇచ్చారనే కృతజ్ఞతతో 2014,జూన్‌లో గుడికట్టారు. 2. సినీనటుడు రజనీకాంత్‌కు కర్ణాటకలోని కోలార్‌లో గుడి. 3. దక్షిణ కోల్‌కతాలో అమితాబ్ బచ్చన్ పేరిట గుడి. 4. సినీనటి కుష్బూ పేరిట తమిళనాడులోని తిరుచిరాపల్లిలో గుడి 5., మాయావతి పేరిట యూపీలోని బుందేల్‌ఖండ్‌లో గుడి 6, చెన్నై సమీపంలోని తిరునంద్రవూర్‌లో ఎంజీఆర్ పేరిట గుడి 7. తమిళనాడులో మాజీ సీఎం జయలలిత పేరిట గుడి -
'కేసీఆర్‌కు గుడి కట్టిస్తా'
చిన్నశంకరంపేట: తెలంగాణ సాధించిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గుడి కట్టిస్తానని కాంగ్రెస్ మాజీ నాయకుడు ఆవుల గోపాల్‌రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో అమరవీరుల స్థూపం వద్ద మంగళవారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరవీరుల స్థూపం పక్కనే కేసీఆర్ గుడి నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. గుడి కోసం తన సొంత డబ్బు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. గోపాల్‌రెడ్డి రెండు రోజుల క్రితమే స్థానిక నేతల తీరుతో విసిగి పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.