మోదీ పేరిట మరో గుడి నిర్మాణం | Another temple constructed on name of PM Narendra modi | Sakshi
Sakshi News home page

మోదీ పేరిట మరో గుడి నిర్మాణం

Published Mon, Mar 23 2015 3:37 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మోదీ పేరిట మరో గుడి నిర్మాణం - Sakshi

మోదీ పేరిట మరో గుడి నిర్మాణం

న్యూఢిల్లీ: భారత దేశంలో దేశభక్తికి కొరత ఉండొచ్చుగానీ రాజకీయ నేతల పట్ల వారి అనుచరులకు, సినిమా యాక్టర్ల పట్ల అభిమానుల ప్రేమకు మాత్రం కొదవ లేదు. అందుకు  వారి పేరిట వెలస్తున్న గుళ్లూ గోపురాలే నిలువెత్తు సాక్ష్యం. గుళ్లలో కొలువుదీరిన నేతలు లేదా నటీనటులు వరమిచ్చినా ఇవ్వకపోయినా అభిమానులు మాత్రం వారికి నిత్యం పూజలు చేస్తూ పులకించిపోతారు. ఆ మొన్నటికి మొన్న గుజరాత్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరిట గుడి కట్టడం కోసం ఆయన భక్తులు ఆయన విగ్రహాన్ని తయారుచేసి పూజలు పునస్కరాలు ప్రారంభించారు. గుడి కట్టడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఆ మీడియా నోట, ఈ మీడియా నోట ఈ విషయం మోదీదాకా వెళ్లడంతో అందుకు ఆయన వారించారు. అంతటి అది ఆగిపోయిందకునుంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో మోదీ పేరిట మరో గుడి నిర్మాణానికి ఏర్పాట్లు జోరుగా జరిగిపోతున్నాయి.

కౌశాంబి జిల్లాలో వీహెచ్‌పీ నాయకుడు బ్రిజేంద్ర నారాయణ్ మిశ్రా ఇప్పటికే ‘నమో నమో టెంపుల్’ పేరిట మోదీకి ఓ గుడిని నిర్మించి పూజలు పునస్కారాలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు అలహాబాద్ జిల్లాలోని జలాల్‌పూర్‌లో శ్రీకృష్ణ సేన అధ్యక్షుడిగా చెప్పుకునే పుష్పరాజ్ సింగ్ శనివారంనాడు తన అనుచర వర్గంతో కలిసి మోదీ గుడికోసం భూమిపూజచేసి పునాది రాయి కూడా వేశారు. బ్రాహ్మణోత్తములను పిలిచి రెండు గంటలపాటు సకల విఘ్నాలు తొలిగిపోవాలంటూ పుణ్యవచనాలు చదువిస్తూ పూజలు చేయించారు. కోటిన్నర రూపాయలతో ఐదు నెలల కాలంలోనే మోది గుడి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పుష్పరాజ్ ప్రకటించారు. గుడిలో కృష్ణుడి విగ్రహంతోపాటు మోదీ విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్టిస్తామని అమిత్ షా లాంటి వారు పోటీ రాకుండా ముందే ప్రకటించారు.

 ఈ గుడి నిర్మాణానికయ్యే ఖర్చును బీజేవీ, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌తోపాటు అన్ని హిందూ సంస్థల నుంచి విరాళాలు వసూలు చేస్తామని పుష్పరాజ్ తెలిపారు. గుడికి కావాల్సిన డిజైన్‌ను తయారు చేయాల్సిందిగా కామ్తా ప్రసాద్ అనే ఆర్కిటెక్ట్‌ను అప్పుడే పురమాయించారు. గుడి నిర్మాణంలో మీర్జాపూర్ నుంచి మార్బుల్స్, ఇతర నాణ్యమైన రాళ్లను తెప్పిస్తామని చెప్పారు. ఇక్కడి వరకు బాగానే ఉందిగానీ గ్రామసభకు చెందిన స్థలాన్ని ఆక్రమించుకొని పుష్పరాజ్ గుడికడుతున్నారని ఆయనంటే గిట్టని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మోదీ పట్ల ప్రేమతో ఆయన గుడికట్టడంలేదని, కొంత స్థలంలో గుడికట్టి మిగతా స్థలాన్ని స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు కుట్రపన్నుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు రాజకీయ నేతలు, యాక్టర్ల పేరిట దేశంలో గుళ్లూ గోపురాలు చాలానే ఉన్నాయి. మరి అవి ఎవరి ప్రయోజనాల కోసం వెలిసాయో, ఎవరి ప్రయోజనాలను నెరవేరుస్తున్నాయో ఆ పరమాత్ముడికే తెలియాలి. దేశం మొత్తంమీద రాజకీయ నేతలు, సినీ నటీనటుల పేరిట దాదాపు వంద గుళ్లు ఉన్నాయి. వాటి అన్నింటికి కలిపి 35 కోట్ల రూపాయల ఖర్చుకావచ్చని ఓ అంచనా.

వాటిలో కొన్ని వివరాలు...
1.సోనియా గాంధీ పేరిట కరీంనగర్ జిల్లా మల్లిలియాలో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఇచ్చారనే కృతజ్ఞతతో 2014,జూన్‌లో గుడికట్టారు.
 2. సినీనటుడు రజనీకాంత్‌కు కర్ణాటకలోని కోలార్‌లో గుడి.
 3. దక్షిణ కోల్‌కతాలో అమితాబ్ బచ్చన్ పేరిట గుడి.
 4. సినీనటి కుష్బూ పేరిట తమిళనాడులోని తిరుచిరాపల్లిలో గుడి
 5., మాయావతి పేరిట యూపీలోని బుందేల్‌ఖండ్‌లో గుడి
 6, చెన్నై సమీపంలోని తిరునంద్రవూర్‌లో ఎంజీఆర్ పేరిట గుడి
 7. తమిళనాడులో మాజీ సీఎం జయలలిత పేరిట గుడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement